Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

కొల్లబోతున్న ‘జాతీయ’ లక్ష్యం

బ్యాంకింగ్‌ వ్యవస్థపై సామాజిక నియంత్రణ కోసమన్న ఆకర్షణీయ నినాదంతో ఇందిర జమానా దేశంలో తొలిసారి 14 బ్యాంకుల్ని జాతీయీకరించి నిన్నటికి సరిగ్గా యాభై ఏళ్లు. దేశార్థిక జీవనాడుల్లో ఒకటైన పారిశ్రామిక రంగానికి పెట్టుబడి అవసరాలు తీర్చి, జాతికి తిండిపెట్టే అన్నదాతలకు రుణాలిచ్చి ఆసరాగా నిలిచేందుకంటూ చేపట్టిన భూరి కసరత్తు వాస్తవంలో ఏ మేరకు అక్కరకొచ్చిందో ఇన్నేళ్ల అనుభవ పరంపరే రుజువు! 1969 జులైలో తొలిదశ జాతీయీకరణ నాటికి సుమారు ఎనిమిది వేలున్న బ్యాంకు శాఖలు అనంతర కాలంలో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించి ప్రజానీకం ఆర్థిక లావాదేవీల స్వరూప స్వభావాల్ని గుణాత్మకంగా మార్చేశాయి. జాతీయీకరణ పర్యవసానంగా 80శాతం మేర బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ప్రత్యక్ష అజమాయీషీలోకి చేరడం తాలూకు నికర ప్రయోజనాలు ఏపాటి? రుణలభ్యత విశేషంగా పెరిగిందన్నది, బ్యాంకింగ్‌ అధికార శ్రేణులు ఏమాత్రం తడుముకోకుండా వెంటనే చెప్పే జవాబు! దేశంలో సేద్యం తరవాత అత్యధికంగా 12 కోట్లమందికి బతుకుతెరువు చూపుతున్నది లఘు పరిశ్రమల రంగమే. సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల్లో 60 శాతం దాకా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నాయి. వాటిలో అత్యధికం సకాలంలో తగినంత బ్యాంకు రుణాలకు నోచక కిందుమీదులవుతున్నాయి. వ్యవసాయ ప్రధాన దేశంలో రైతాంగం తరవాతే మరెవరైనా అంటే- బ్యాంకులు పైకి ఏమన్నా లోలోపల నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతాయనడానికి అవి విదిపే అరకొర పరపతే దృష్టాంతం. 1951-1968 సంవత్సరాల మధ్య బ్యాంకు రుణాల్లో పారిశ్రామిక రంగానికి దక్కిన వాటా 68 శాతం, సాగు రంగానికి లభించినది కేవలం రెండు శాతం. అయిదు దశాబ్దాల జాతీయీకరణ తరవాత గణాంకాల్ని ఎంతగా పెంచి చూపుతున్నా- వాస్తవిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయానికి వ్యవస్థాగత పరపతి సదుపాయం నేటికీ ఎండమావే!

ఏటికి ఎదురీదుతూ కడగండ్ల సేద్యంతో సహజీవనం చేస్తున్న అభాగ్య రైతుకు అభయ ముద్రగా అందిరావడంలో జాతీయ బ్యాంకుల దశాబ్దాల రికార్డు పేలవంగానే అఘోరించింది. పంటకాలం మొదలవుతున్నదంటే పెట్టుబడులకోసం బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు, అక్కడ అడిగినంత లభించక గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి తేరుకునే దారి కానరాక అప్పుల ఊబిలో కూరుకుపోవడం... ఆనవాయితీగా స్థిరపడ్డాయి. మెజారిటీ రైతాంగానికి సంస్థాగత రుణాలు దక్కడం లేదని రెండేళ్ల క్రితం కుండ బద్దలుకొట్టిన పార్లమెంటరీ స్థాయీసంఘం రుణాల మంజూరులో సుదీర్ఘ ప్రక్రియను సరళీకరించి ఎక్కువమందికి పరపతి ప్రసాదించాలని రిజర్వ్‌బ్యాంకుకు, ‘నాబార్డ్‌’కు సూచించింది. క్షేత్రస్థాయి స్థితిగతుల్లో ఇప్పటికీ ఎక్కడి గొంగడి అక్కడే. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో సేద్యపద్దు 18శాతానికి తగ్గరాదన్న రిజర్వ్‌బ్యాంక్‌ ఆదేశాల స్ఫూర్తి కొన్నేళ్లుగా నీరోడుతోంది. ఎన్నో సందర్భాల్లో పుస్తక సర్దుబాట్లకే ప్రాధాన్యమిస్తున్న బ్యాంకుల రుణ వితరణ 11శాతంలోపేనని అధికారిక గణాంకాలే లోగుట్టు బయటపెడుతున్నాయి. తాకట్టులేని పంట రుణాల పరిమితిని లక్షనుంచి లక్షా అరవై వేల రూపాయలకు పెంచిన ఆర్‌బీఐ ఔదార్యం ఎందరు రైతుల కంటనీరు తుడిచింది? సమాచార హక్కు చట్టం కింద రాబట్టిన వివరాల ప్రకారం 2016 సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చిన సేద్యరుణాల్లో రూ.59వేల కోట్లు కేవలం 615 ఖాతాల్లోనే జమపడ్డాయి! రుణమాఫీల మాటున దళారుల చేతివాటం, బ్యాంకు ఖాతా పుస్తకాల్లో కిరికిరీలు ముమ్మరించి అసంఖ్యాక రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. బ్యాంకుల జాతీయీకరణను ప్రేరేపించిన ప్రధానాంశం, గ్రామాల్లో రుణ లభ్యతను సమధికంగా పెంపొందించడం. అదిప్పటికీ నెరవేరని ప్రబల ఆకాంక్షగానే మిగిలిపోయింది!

జాతీయీకరణ చేపట్టేనాటికి 1969లో 14 బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.5.7 కోట్లు. నేడు వాటి ఉమ్మడి నష్టాల పద్దు రూ.49,700 కోట్లు! ఇటీవల కొంత తగ్గుముఖం పట్టాయని రిజర్వ్‌ బ్యాంక్‌ సారథి శక్తికాంత దాస్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా, ప్రభుత్వ రంగ సంస్థల మొండిబకాయిలు ఎకాయెకి రూ.10లక్షల కోట్ల మేర పోగుపడ్డాయి. తిరిగి చెల్లించే సామర్థ్యం, లక్షణం ఏ కోశానా లేవని తెలిసీ రకరకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోబడి ఘరానా ఆర్థిక నేరగాళ్లకు కోట్లు దోచిపెట్టిన మకిలి బాగోతాలు దేశీయ బ్యాంకింగ్‌ చరిత్రలో లెక్కకు మిక్కిలి. విధిద్రోహులు, ఇంటి దొంగల నిర్వాకాలే బ్యాంకులను ఈ దుస్థితికి ఈడ్చుకొచ్చాయి. 2008-09 ఆర్థిక సంవత్సరం లగాయతు పదకొండేళ్లలో 53వేలకు పైబడిన మోసాల్లో బ్యాంకులు రెండు లక్షల కోట్ల రూపాయలకు మించి నష్టపోయాయని రిజర్వ్‌ బ్యాంకే ధ్రువీకరించింది. బ్యాంకుల్లో అంతర్గత లోటుపాట్లు ఎన్నో ఉన్నట్లు లోగడ అంగీకరించిన ఆర్‌బీఐ, రెండేళ్లలోనే 5,200మంది పీఎస్‌బీల ఉద్యోగులు వివిధ మోసాలకు పాల్పడినట్లు అధికారికంగా నిర్ధారించింది. ఇంటిదొంగల కారణంగా రాజస్థాన్‌లో గరిష్ఠ నష్టం దాపురిస్తోందన్న విశ్లేషణల ప్రకారం- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో సిబ్బంది లోపాయికారీ తోడ్పాటుతో మోసాలు జోరెత్తుతున్నాయి. 54 మంది సిబ్బంది కాసుల కక్కుర్తి సుమారు రూ.15వేల కోట్లను వెలుపలి వ్యక్తులకు దోచిపెట్టి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పుట్టి ముంచింది. భోపాల్‌లో బ్యాంకు అధికారులు, పంచాయతీ కార్యదర్శుల గూడుపుఠాణి పంట రుణ కుంభకోణానికి తెరతీసింది. సిబ్బంది చేతివాటం కారణంగానే ప్రతి నాలుగు గంటలకొక బ్యాంకు మోసం చోటు చేసుకుంటున్నదన్న లెక్కాడొక్కలకు పరిమితం కావడమేనా ఆర్‌బీఐ పని? బడా చోరులకు ఇంటిదొంగలు జతపడి గుల్లబారుతున్న బ్యాంకులు- జాతికి ఆహార భద్రత ప్రసాదించగల రైతులకు అక్కరకు రాని చుట్టాలే అవుతున్నాయి. జవాబుదారీతనం మప్పే సమగ్ర ప్రక్షాళన ఒక్కటే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరువు నిలపగలిగేది!


Posted on 20-07-2019