Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సంక్షేమానికేనా కోతల వడ్డన?

* లోటు బడ్జెట్‌ కష్టాలు

ప్రతి సంవత్సరం బడ్జెట్‌ సమర్పించేటప్పుడు ఏయే రంగాలకు ఎంతెంత మొత్తాలు కేటాయించినదీ కేంద్ర ఆర్థికమంత్రులు ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి ఆ సంప్రదాయాన్ని నిర్మలా సీతారామన్‌ పాటించలేదు. ఆమె వెల్లడించిన ఓ కీలక సంఖ్య మాత్రం ఈ బడ్జెట్‌ దశ దిశలను పట్టిచ్చింది. విత్తలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించాలని నిశ్చయించినట్లు ప్రకటించడంతో, ఈ ప్రభుత్వం ముఖ్యమైన రంగాలపై వ్యయాన్ని తగ్గించనుందని అర్థమైంది. జీడీపీలో 3.3 శాతం విత్తలోటు అంటే అది రూ.7,01,760 కోట్లుగా లెక్కతేలుతుంది. నేడు జీడీపీలో ఆరు శాతాన్ని విద్యకు, మూడు శాతాన్ని ఆరోగ్యానికి కేటాయిస్తే కాని, అంతర్జాతీయంగా ఆమోదనీయ స్థాయులను అందుకోలేం. ఈ బడ్జెట్‌లో విద్యావైద్య రంగాలకు కేటాయింపులు ఆ మేరకు లేవు. నిజానికి అవి తగ్గాయి కూడా. 2014-15 బడ్జెట్‌లో 4.6 శాతం నిధుల్ని విద్యా రంగానికి కేటాయించగా, 2019-20 బడ్జెట్‌లో అవి 3.4 శాతానికి తగ్గిపోయాయి. ఈ ఏడాది రూ.27,86,349 కోట్లకు చేరుకున్న బడ్జెట్‌ పరిమాణం చాలా పెద్ద మొత్తంలా కనిపిస్తున్నా- దేశ జీడీపీలో అది 13.20 శాతమే. అయిదేళ్లుగా వార్షిక బడ్జెట్లు దాదాపుగా ఇదే శాతంలో ఉంటున్నాయి. 2009-10లో జీడీపీలో 17.43 శాతంగా ఉన్న బడ్జెట్‌ 2013-14 వచ్చేసరికి 14.64 శాతానికి తగ్గింది.

బడ్జెట్‌లో రూపాయి రాక పోకల పటాలను బాగానే ఇచ్చారు కాని, అది సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించలేదు. రూపాయి పోక పటంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 23 శాతంగా చూపినా, మొత్తం బడ్జెట్‌ చిత్రంలో దాని జాడ లేదు. దాంట్లో నుంచి రాష్ట్రాల వాటాను తీసివేస్తే రూపాయల్లో బడ్జెట్‌ పరిమాణం కుంచించుకుపోతుంది. ఆపైన మిగిలిన బడ్జెట్‌లో 23 శాతం వడ్డీ చెల్లింపులకు, 12 శాతం రక్షణ రంగానికి, ఏడు శాతం పింఛన్లకు పోగా, మిగిలిన 58 శాతాన్నే అన్ని రంగాలకూ కేటాయించాలి. అది జీడీపీలో కేవలం 7.66 శాతంగా లెక్కతేలుతుంది. ప్రభుత్వం కొత్త పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి, ఈ కొద్ది మొత్తంతోనే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలన్నీ సరిపెట్టుకోవాలి. బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన రూ.94,853 కోట్లు జీడీపీలో 0.45 శాతానికి సమానం. ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ. 64,999 కోట్లు 0.30 శాతానికి, వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు కేటాయించిన రూ.1,51,518 కోట్లు 0.72 శాతానికి సమానం.

పదేళ్లుగా కేంద్ర రాష్ట్రాలు విద్యపై చేస్తున్న మొత్తం ఖర్చు జీడీపీలో మూడు శాతాన్ని మించడం లేదు. విద్యకు జీడీపీలో ఆరు శాతం కేటాయించాలని 1966లో కొఠారి కమిషన్‌ చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించినా, వాస్తవ కేటాయింపు ఎన్నడూ మూడు శాతం మించలేదు. ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్రాలు రెండూ కలిపి చేస్తున్న వ్యయం మరీ అధ్వానంగా 1.2 శాతంగా ఉంది. సార్వజన ఆరోగ్య రక్షణకు సిఫార్సు చేసినదానిలో ఇది కనీసం సగమైనా లేదు. కేవలం నిధులు గుమ్మరిస్తేనే విద్యావైద్యాలు మెరుగుపడతాయని ఆశించలేం. నాణ్యమైన సేవలు అందించాలన్న లక్ష్యం పెట్టుకుని, దాన్ని సమర్థంగా ఆచరణలోకి తీసుకురావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు కనుకనే భారత్‌లో విద్యావైద్యాలు కునారిల్లుతున్నాయి. ఆ పరిస్థితిని మార్చడానికి బడ్జెట్‌ ఏం చేస్తుందని అందరూ ఉత్సుకతతో ఎదురుచూసి చివరకు నిరాశ చెందారు.

తాజా బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.1,51,518 కోట్లు కేటాయించారు. 2018-19 సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం వ్యవసాయానికి కేటాయించిన రూ.86,602 కోట్లకన్నా ఈసారి కేటాయింపు రూ.64,916 కోట్లు ఎక్కువ. ఇది పెద్ద మొత్తం లానే కనిపించినా, వాస్తవంలో కేటాయించినది జీడీపీలో కేవలం 0.72 శాతంగా లెక్కతేలుతుంది. ఎన్నికలకు ముందు సమర్పించిన అనామతు బడ్జెట్‌లో రైతుబంధు తరహా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి కేటాయించిన రూ.75,000 కోట్లనూ తాజా బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులో కలిపి చూపారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా అందజేసే ఆఉ వేల రూపాయలు నెలకు రూ.500గా లెక్కతేలుతుంది. ఇది ఏ మూలకూ చాలదు. ఈ అరకొర సొమ్ముతో రైతుల ఉత్పాదకత, ఆదాయాలు ఏ విధంగా పెరుగుతాయో అర్థం కాదు.

బడ్జెట్‌లో పంటల బీమా పథకానికి రూ.14,000 కోట్లు కేటాయించారు. కేంద్ర రాష్ట్రాలు బీమా ప్రీమియాలు చెల్లించడానికి గణనీయ మొత్తాలు వెచ్చిస్తున్నా, ఆ సొమ్ము రైతులకన్నా బీమా కంపెనీలకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోంది. ఉదాహరణకు 2016-17, 2017-18 సంవత్సరాల్లో 11 బీమా సంస్థలకు ప్రీమియాల రూపంలో అందినది- రూ.47,407 కోట్లు. రైతులకు చెల్లించిన క్లెయిములు రూ.31,612 కోట్లు మాత్రమే. పంటల బీమా పథకం వల్ల బీమా సంస్థలకు చిక్కిన లాభం రూ.15,795 కోట్ల పైచిలుకు. 2022కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే ప్రభుత్వం పంథా మార్చుకోవాలి. నేడు రైతుల ఆదాయాలు చాలా తక్కువగా ఉండటమే కాదు- భిన్నవర్గాల రైతుల ఆదాయాల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయి కూడా. నాబార్డ్‌ సర్వే ప్రకారం రైతుల సగటు ఆదాయం రూ.8,931. కానీ, రైతులందరికీ ఇంత ఆదాయం రావడం లేదు. రైతాంగంలో కింది అంచెవారి ఆదాయం రూ.1,000కన్నా తక్కువ. వారికన్నా ఎగువ అంచెలో ఉన్న 20శాతం సగటు ఆదాయం రూ.2,500 మాత్రమే. ఉన్నత శ్రేణిలోని 20శాతం ఆదాయం రూ.22,375 నుంచి రూ.48,333 వరకు ఉంది. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడమనే ప్రభుత్వ లక్ష్యం దిగువ అంచెలవారికి ఎక్కువ లబ్ధి చేకూర్చాలి. ప్రభుత్వం ఆ మేరకు తన విధానానికి దిశానిర్దేశం చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత 2.7 లక్షల కోట్ల డాలర్ల నుంచి అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్షిస్తున్న ప్రభుత్వం, ఆదాయ అసమానతలకు తావివ్వకూడదు. సంపద వృద్ధిలో అన్ని వర్గాలకూ న్యాయమైన వాటాలు లభించేట్లు చూడాలి.

- డాక్టర్‌ పీఎస్‌ఎం రావు
Posted on 20-07-2019