Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అప్పుల ఆర్థికం అభివృద్ధికి ఆటంకం

* రెండంచుల కత్తి - విదేశీ రుణాలు

సార్వభౌమ బాండ్ల రూపంలో విదేశీ రుణాలు సేకరించాలని ఈ ఏటి బడ్జెట్‌లో భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన భిన్న రాజకీయ వర్గాల విమర్శలకు గురవుతోంది. కొందరైతే ఈ పద్ధతిలో నిధులు సేకరించడం జాతి వ్యతిరేక చర్య అని విమర్శిస్తున్నారు. మరి కొందరు సార్వభౌమ బాండ్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని హితవు పలుకుతున్నారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం రుణం తీసుకోక తప్పదు కాని, రుణ దాతలు స్వదేశీయులా విదేశీయులా అన్నది ఇక్కడ ముఖ్యం. వెనకాముందూ చూసుకోకుండా ఎడాపెడా భారీ అప్పులు చేయడం మంచిదో కాదో తేల్చుకోవడం అంతకన్నా కీలకం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇంతవరకు మనం తీసుకున్న స్వదేశీ, విదేశీ రుణాలు రూ.84 లక్షల కోట్లను మించిపోయాయి. అందులో విదేశీ రుణాలు అయిదు లక్షల కోట్ల రూపాయలకు కాస్త ఎక్కువ. స్వదేశీ రుణాలు రూ.70 లక్షల కోట్ల పైచిలుకు. ఇకపై తన వార్షిక రుణ సేకరణలో 10 శాతాన్ని విదేశీ బాండ్ల మార్కెట్‌ నుంచి సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తడవకు 300-400 కోట్ల డాలర్ల చొప్పున ఈ ఏడాది మొత్తంగా 1,000 కోట్ల డాలర్లను (రూ.70,000 కోట్లను) సేకరించదలచింది. ఈ నిధులను 20 ఏళ్ల దీర్ఘకాలిక బాండ్ల రూపంలో సేకరిస్తుంది.

భద్రతకు ప్రమాదం
ఇంతవరకు భారత ప్రభుత్వం బాండ్ల రూపంలో తీసుకున్న రుణాల్లో 13.33 శాతాన్ని 20 ఏళ్లు, అంతకుమించిన కాలావధిలో, 28.37 శాతాన్ని 5-10 ఏళ్లలో తీర్చవలసి ఉంది. అంటే మొత్తం బాండ్లలో 42 శాతాన్ని పదేళ్లకు మించిన కాలావధితో తీసుకున్నారన్న మాట. ఇది కలవరపరచే అంశమే. ప్రస్తుతం భారత్‌ తీసుకున్న రుణాల్లో 93 శాతం రుణాలు స్వదేశీయుల నుంచి తీసుకున్నవే. 2018 మార్చి నాటికి మన విదేశీ రుణాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.9 శాతానికి సమానం. ఈ తరహా రుణాల్లో 68.4 శాతం బహుళపక్ష సంస్థలనుంచి తీసుకోగా, 31.6 శాతం ద్వైపాక్షిక సంస్థల నుంచి తీసుకున్నవి. ఇంతవరకు బాండ్‌ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలే లేవు. బహుళపక్ష, ద్వైపాక్షిక రుణాలను దీర్ఘకాలికంగా తక్కువ వడ్డీ రేట్లకు సేకరించారు. 34 శాతం విదేశీ రుణాలను ఐఎమ్‌ఎఫ్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్డీఆర్‌) రూపంలో తీసుకుంటే, 36 శాతాన్ని డాలర్‌ రుణాలుగా, 25 శాతాన్ని జపనీస్‌ యెన్‌లుగా, 4.8 శాతాన్ని యూరోలలో, 0.2 శాతం రుణాలను ఇతర కరెన్సీలలో తీసుకున్నారు. ఇవి చీటికి మాటికి వడ్డీ పెరిగిపోయేవి కావు కాబట్టి వాటితో ప్రమాదం లేదు. కానీ, ఇకపై బాండ్‌ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకుంటే భద్రతకు నీళ్లొదులుకోవలసి వస్తుంది.

ప్రస్తుతం స్వదేశంలో కుటుంబాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పొదుపు చేస్తున్న మొత్తంలో 80 శాతాన్ని ప్రభుత్వమే రుణాలుగా తీసుకొంటూ, అతిపెద్ద రుణ గ్రహీతగా నిలుస్తోంది. దీంతో ప్రైవేటు రంగ సంస్థలకు రుణాలు అందక కొత్త పరిశ్రమలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయి. కొన్నేళ్ల నుంచి ప్రైవేటు పెట్టుబడులు క్షీణించడానికి దారి తీస్తున్న కారణమిదే. పారు బాకీలతో పుట్టి మునిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు మౌలిక వసతుల రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా జీడీపీ వృద్ధి రేటు మందగిస్తోంది. అందువల్ల ప్రభుత్వ అవసరాలకు విదేశీ రుణాలు తీసుకుంటే, స్వదేశంలో ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని సర్కారు భావిస్తోంది.

ప్రస్తుతం విదేశాల్లో చాలా స్వల్ప వడ్డీకి రుణాలు దొరుకుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవడం మంచిదనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికితోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వు తనకు వడ్డీరేట్లను పెంచే ఉద్దేశం లేదని ప్రకటించడంతో చౌకగా డాలర్‌ రుణాలు లభిస్తున్నాయి. కాబట్టి సార్వభౌమ బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు ఇదే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తోంది. నేడు 3.5 నుంచి నాలుగు శాతం వడ్డీపై పదేళ్ల కాలానికి బాండ్ల ద్వారా రుణ సమీకరణ చేయవచ్చు. కరెన్సీ రేటు హెచ్చుతగ్గులపై హెడ్జింగ్‌ (నష్టభయ నివారణ) చేస్తే మరి రెండు శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఏతావతా భారత ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విపణిలో విడుదల చేసే బాండ్లపై ఆరు శాతం దాకా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌ ఇంతవరకు తీసుకున్న అప్పులపై సగటున 7.85 శాతం వడ్డీ చెల్లిస్తోంది కనుక సార్వభౌమ బాండ్ల జారీకి ఇదే తగిన సమయమనే వాదన ఉంది. కానీ, విదేశీ రుణాలపై వడ్డీ రేట్లు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం. మరో విషయమేమంటే, విదేశీ రుణాలను తీసుకోవడంలో భారత్‌ మొదటి నుంచీ పాటిస్తూ వచ్చిన సంయమనం ఇటీవల సడలింది. ఉదాహరణకు 2011-12 నుంచి 2015-16 వరకు విదేశీ రుణ పరిమాణం పెద్దగా పెరగలేదు. 2011-12లో 3.22 లక్షల కోట్లకు పైగా ఉన్న విదేశీ రుణాలు 2014-15నాటికి రూ.3.66 లక్షల కోట్లకు మాత్రమే పెరిగాయి. రఘురాం రాజన్‌, ఉర్జిత్‌ పటేల్‌ వంటివారు రిజర్వు బ్యాంకు గవర్నర్లుగా నియమితులైనప్పటి నుంచి ఈ రుణ పరిమాణం పెరగసాగింది. వారికి ముందు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకులలోని విధానకర్తలు విదేశీ రుణాలకు దూరంగా ఉండేవారు. ముఖ్యంగా విదేశీ రుణాల వల్ల 1991లో ఆగ్నేయాసియాలో, 1997-98లో రష్యాలో విరుచుకుపడిన ఆర్థిక సంక్షోభాలను చూశాక స్వదేశంలోనే రుణ సేకరణకు అంకితమయ్యారు. ప్రైవేటు కంపెనీలు విదేశాల్లో తీసుకునే వాణిజ్య రుణాలనూ కట్టడి చేశారు. భారీ కంపెనీలనూ చాలా కొద్ది శాతం విదేశీ రుణాలు తీసుకోవడానికి అనుమతించేవారు. దానికీ ఎన్నో షరతులు విధించేవారు. విదేశీ కరెన్సీ మారక విలువల్లో హెచ్చుతగ్గుల వల్ల అనేక దేశాలు అతలాకుతలమైనా భారత్‌ మాత్రం ఆ దుస్థితి నుంచి తప్పించుకుందంటే కారణం- మన ప్రభుత్వం, సంస్థలు రూపాయల్లో రుణాలు తీసుకోవడమే. ఏదిఏమైనా విదేశీ వాణిజ్య రుణాల వల్ల దుష్ప్రభావం ఏదైనా ఉంటే, అది అయిదు నుంచి ఏడేళ్ల వరకు కనిపించదు. ఆలోపే మన ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం 30 ఏళ్లకు మూడు శాతం వడ్డీపై మార్కెట్‌ నుంచి రుణాలు సేకరిస్తోంది. ఇతర ప్రధాన దేశాలూ అంతే. భారత్‌ ఇంతకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది కాబట్టి, మన బాండ్లను విదేశీ సంస్థలు జోరుగా కొనుగోలు చేయవచ్చు.

నష్ట భయాలు
కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు రేపు అప్పులను తీర్చాల్సివచ్చేటప్పటికి గుదిబండలై, మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ ముప్పు సరిగ్గా ఎప్పుడు వచ్చిపడుతుందో అంచనా వేయడం కష్టం. భారత్‌ ప్రతి ఏటా కరెంటు ఖాతా లోటును ఎదుర్కొంటూనే ఉండటం, చమురు దిగుమతులపై భారీగా విదేశ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థకు నిత్య సమస్యలుగా తయారయ్యాయి. ఫలితంగా దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాం. 2018-19లో అన్ని రకాల పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై భారత్‌ దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది. చమురు ధర పెరిగినప్పుడల్లా భారత్‌ కరెంటు ఖాతా కూడా మిన్నంటుతుంది. మన దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని చమురు ధరలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇది విదేశీ రుణాల చెల్లింపు స్థోమతను అనిశ్చితం చేస్తోంది.

స్వదేశంలో జరిగిన పరిణామాలు కావచ్చు, విదేశీ పరిణామాలు కావచ్చు- ఏవైనా సరే రూపాయి విలువ పడిపోవడానికి దారితీయవచ్చు. అదే జరిగితే సార్వభౌమ బాండ్ల రూపంలో మనం తీసుకున్న అప్పు భారం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం మన జీడీపీలో అప్పుల శాతం తక్కువే అయినా, ఇది ఎల్లకాలం కొనసాగకపోవచ్చు. మన ఆర్థికాభివృద్ధి రేటు మందగించినప్పుడు స్థానిక కరెన్సీ విలువ పతనమై జీడీపీలో రుణాల శాతం కట్టుతప్పుతుంది. 1997లో ఆగ్నేయాసియా దేశాల్లో జరిగింది ఇదే. చేసిన అప్పులు తీర్చలేక ఎగవేసే దేశాలు అంతర్జాతీయంగా ఆంక్షలకు గురవుతాయి. 2010లో అర్జెంటీనాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాబట్టి మోదీ సర్కారు ఎడాపెడా అప్పులు చేయడం మాని, క్రమంగా వాటిని తగ్గించే మార్గం చూడాలి. కేవలం ఓట్ల కోసం రాయితీలు ఇచ్చే అలవాటు వదిలించుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలూ గ్రహించాలి. ఏ దేశమూ అప్పులతో అభివృద్ధి సాధించలేదు. అప్పులను ఆస్తులుగా మార్చుకున్నప్పుడు మాత్రమే విజయం సిద్ధిస్తుంది.

కఠిన నిబంధనలతో కష్టాలు
అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు తమ సొమ్ము విషయంలో చాలా కరాఖండీగా ఉంటారు. బాండ్ల రూపంలో తమ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వాలు విత్త లోటును గట్టిగా నియంత్రించి తమ బాకీని చెల్లించాలని పట్టుబడతారు. ప్రభుత్వాలు సామాజిక సంక్షేమంపై, మౌలిక వసతులపై వ్యయాన్ని తగ్గించైనా విత్తలోటును అదుపు చేయాలంటారు. పౌరులను మాడ్చి అయినా తమ అప్పు తీర్చాలని డిమాండ్‌ చేస్తారు. గడచిన ఇరవై ఏళ్లలో అర్జెంటీనా, గ్రీస్‌, ఇటలీలు ఇలాంటి చేదు అనుభవాలను చవిచూశాయి. భారత్‌ దీన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి.Posted on 27-07-2019