Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పేదరికంపై ‘ఉపాధి’ అస్త్రం

* దారిద్య్ర నిర్మూలన చర్యలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గ్రామీణ పేదలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకం గడచిన మూడేళ్లలో ఏటా 235 కోట్ల పని దినాల చొప్పున కల్పించింది. దీనిపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఇటీవల పార్లమెంటులో చేసిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదల కోసం ఉద్దేశించినదని, తమ ప్రభుత్వం దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది కాబట్టి ఇకపై ఈ పథకాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదని తోమర్‌ వివరించారు. ఏదైనా పాత పథకాన్ని కొనసాగించడమా, నిలిపి వేయడమా అన్న విషయాన్ని నిర్ణయించుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న మాట నిజం. ప్రభుత్వ విధానానికి సంబంధించి వివిధ వర్గాల్లో చర్చలు జరుగుతాయి. లోతైన విశ్లేషణలు వెలువడతాయి.

యాభై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ అని నినదించినప్పటి నుంచే పేదరిక నిర్మూలనకు విధానపరంగా ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వాలు ఆ లక్ష్య సాధనకు ఏదోవిధంగా పాటుపడుతూనే ఉన్నాయి. 2018 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అభివృద్థి సంస్థ (యూఎన్డీపీ), ఆక్స్‌ ఫర్డ్‌ పేదరిక నిర్మూలన, మానవాభివృద్ధి సంస్థ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి (ఎంపీఐ) నివేదికను ఇక్కడ ఉదహరించాలి. సామాన్య ప్రజలు ఆర్థికంగానే కాకుండా విద్య, వైద్యం, జీవన ప్రమాణాల రీత్యా పేదరికం అనుభవిస్తున్నారని ఎంపీఐ తెలిపింది. పేదలకు పారిశుధ్యం, తాగునీరు, పోషకాహారం, ప్రాథమిక విద్య అందుబాటులో లేకపోవడం వల్ల సంభవిస్తున్న విపరిణామాలను విశ్లేషించింది. అనేక పరామితుల ఆధారంగా పేదరికాన్ని విశ్లేషిస్తోంది కనుక ఎంపీఐని బహుముఖ పేదరిక సూచిగా వ్యవహరిస్తున్నారు. ఎంపీఐ పరామితుల్లో మూడో వంతు లోపించిన వారిని బహుముఖీన పేదరికం అనుభవిస్తున్న వారిగా పరిగణిస్తున్నారు. 2005-06 నుంచి 2015-16 మధ్య భారతదేశంలో 27.1 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని ఎంపీఐ నివేదిక ప్రశంసించింది. ఈ పదేళ్లలో దేశంలో పేదరికం 55 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందని తెలిపింది. 2030కల్లా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అన్ని రూపాల్లో రూపుమాపాలన్నది- ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో (ఎస్డీజీ) మొట్టమొదటిది. ఎస్డీజీ పత్రంపై భారత్‌ కూడా సంతకం చేసినందున 2030 కల్లా ఆ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. దాన్ని అందుకోవాలంటే చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచంలోని నిరుపేద బాలల్లో 30.3 శాతం భారత్‌ లోనే ఉన్నారు.

కమిటీలు... తీరుతెన్నులు
దేశంలో పేదరికం స్థాయి ఎంత అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. అది తేలనిదే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. పేదరిక స్థాయిని ఖరారు చేసే బాధ్యతను గతంలో యూపీఏ ప్రభుత్వం సురేశ్‌ టెండూల్కర్‌ కమిటీకి అప్పగించింది. గ్రామాలు, పట్టణాల్లో పేదరిక స్థాయుల నిర్ధారణకు ఆ కమిటీ తలసరి ఆదాయాలను ప్రాతిపదికగా తీసుకుంది. గ్రామాల్లో ఒక వ్యక్తి దినసరి ఆదాయం రూ.27.2గా, పట్టణాల్లో రూ.33.3గా ఉంటే, దాన్ని పేదరికంగా పరిగణించాలంది.కమిటీ నివేదిక ప్రకారం 2011-12లో దేశ జనాభాలో 22 శాతమే పేదరికంలో ఉన్నట్లు లెక్క. టెండూల్కర్‌ కమిటీ లెక్కలపై దుమారం రేగడంతో పేదరికానికి కొత్త నిర్వచనమివ్వడానికి డాక్టర్‌ సి.రంగరాజన్‌ నేతృత్వంలో మరో కమిటీని వేశారు. ఇది గ్రామీణ, పట్టణ పేదరిక స్థాయులను రూ.32.4, రూ. 46.9లుగా నిర్ణయించింది. ఆ లెక్కన 2011-12లో దేశ జనాభాలో 29.5 శాతం (36.3 కోట్లమంది)పేదలని నిర్ధారించింది.ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే 2014 జూలైలో రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా లేదా అనేది ఇంతవరకు తెలియదు. అది తేలేవరకు టెండూల్కర్‌ కమిటీ సిఫార్సులే చెలామణిలో ఉంటాయి. పేదరిక నిర్మూలన విధానాల రూపకల్పన, అమలుకు ఆ కమిటీ నివేదిక మీదనే ఆధారపడే స్థితి ఉంది. ఒకవేళ కేంద్రం రంగరాజన్‌ కమిటీ నివేదికను ఆమోదించినా, అది కూడా టెండూల్కర్‌ కమిటీలానే 2011-12నాటి పేదరికం స్థాయులనే ప్రాతిపదికగా తీసుకుందని గమనించాలి. రెండింటి మధ్య వైరుధ్యాలను సమన్వయించే విధానాలను కేంద్రం రూపొందించాల్సి ఉంటుంది. అది ఒక పట్టాన తెమిలే పని కాదు. ఈ సందిగ్ధత వల్ల ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు బడ్జెట్‌లో ఎంత కేటాయించాలో తేల్చుకోవడం కష్టమై, పకడ్బందీ పథకాలను రూపొందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నివారించాలంటే పేదరికానికీ, పేదలకు సర్వామోదనీయ నిర్వచనాలను రూపొందించుకోవాలి. ఆ తరవాత కానీ, కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో దారిద్య్ర నిర్మూలన పథకాలకు ఊపు రాదు.

ప్రాతిపదిక ఏదీ...
రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు, హక్కులు, విధుల గురించి స్పష్టంగా వివరించింది. పేదరికాన్ని తగ్గించడంలో ఉత్తర, తూర్పు రాష్ట్రాలకన్నా దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. అంటే, కేంద్ర సహకారాన్ని, నిధులనూ చక్కగా ఉపయోగించుకుని లక్ష్య సాధనకు గట్టిగా పాటుపడే రాష్ట్రాలు మాత్రమే పేదరిక నిర్మూలనలో ముందడుగు వేస్తాయని తేలుతోంది. అసలు పేదరికాన్ని పూర్తిగా ఆదాయ ప్రాతిపదికపైనే నిర్ధారించాలా అన్నది కీలక ప్రశ్న. దీనికి ఆర్థికవేత్తలు, విధానకర్తలు అవుననే సమాధానమిస్తారు. అందుకే వారు రూపొందించే పథకాలన్నీ పేదల ఆదాయ స్థాయులను పెంచడం మీదే దృష్టిపెడతాయి. దీనికోసం రాష్ట్రాల జీడీపీలను పెంచి రాష్ట్ర సంపదలో పేదలకు సముచిత వాటా దక్కేలా చూసే విధానాల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఎన్నికలకు ముందు పార్టీలు విడుదల చేసే ఎన్నికల ప్రణాళికలు పేదల ఆదాయాలను పెంచే పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. కానీ, కేవలం ఆదాయ లేమి లేదా అల్పాదాయాల కోణం నుంచి మాత్రమే పేదరికాన్ని అంచనా వేయకూడదు. అలాగని రాష్ట్రాల జీడీపీని పెంచడానికీ, సంపద పునఃపంపిణీకీ కృషి చేయకూడదని కాదు. పేదరిక నిర్మూలనకు ఇవి మాత్రమే చాలవని గుర్తించాలి. వ్యవస్థాగతమైన, సంస్థాగతమైన లోపాలను సరిదిద్దకుండా కేవలం ఆదాయాలను పెంచినంత మాత్రాన పేదరికం సమసిపోదు. చిల్లు బకెట్‌లో ఎంత నీరు పోసినా నిలవనట్లు కేవలం నిధులు ధారపోసినంత మాత్రాన పేదరికం అదృశ్యమైపోతుందని ఆశించలేం.

సింగపూర్‌ వంటి చిన్న దేశం ముందుచూపుతో సమగ్ర విధానాలను అనుసరించడం ద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అధిగమించింది. మిగతా దేశాలకు ఆదర్శనీయమైంది. జనాభాలో, విస్తీర్ణంలో, రాజకీయ వ్యవస్థల్లో భారత్‌కూ, సింగపూర్‌కూ పోలిక లేదు. అయినప్పటికీ అక్కడ విజయవంతమైన విధానాలను స్థానిక పరిస్థితులకు అనుకూలంగా మలచుకొని భారత్‌లోనూ అమలు చేయవచ్చు. ఒకప్పుడు నిరుపేద దేశమైన సింగపూర్‌ నేడు ప్రపంచంలో ఆర్థికంగా అగ్రశ్రేణిలో ఉందంటే, ఆ దేశ అనుభవాల నుంచి మనం నేర్చుకోదగినది చాలా ఉందని అర్థమవుతుంది. సింగపూర్‌లో మాదిరిగా దృఢమైన రాజకీయ సంకల్పం, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, క్రమశిక్షణగా మెలిగే పౌరులు ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు.

బహుముఖ పోరు...
ఇప్పటికే పేదరికంలో ఉన్నవారు మరింత పేదలుగా మారకుండా, కొత్తగా పేదలు పుట్టుకు రాకుండా చూసే విధానాలను అవలంబించడం తక్షణ అవసరం. గృహవసతి, పారిశుధ్ధ్యం, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ, వాటితోపాటు ఆదాయాన్ని పెంచే విధానాలను అనుసరిస్తే కానీ, పేదరికంపై పోరులో గెలవలేం. ఆ లక్ష్యం నెరవేరడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తొలిమెట్టు. దీని ద్వారా కొత్తగా పేదలు పుట్టుకురాకుండా చూడవచ్చు. ఉత్పాదకత పెంచడానికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలి. తద్వారా ఆదాయాలు పెరిగి పేదరికాన్ని అధిగమించే సత్తా వ్యక్తులకు చేకూరుతుంది. ఇవన్నీ వ్యవస్థాగతమైన ఏర్పాట్ల కిందకు వస్తాయి. తరవాత సంస్థాగతమైన సవాళ్లపై దృష్టి పెట్టాలి. న్యాయపాలనను స్థిరపరచడం, ప్రభుత్వ యంత్రాంగ సామర్థ్యాన్ని పెంచడం, అవినీతిపై పోరాటం, సుస్థిర విధానాలను అమలు చేస్తూ ఆర్థికాభివృద్ధి రేటును పెంచడం అంతిమంగా పేదరిక నిర్మూలనకు తోడ్పడతాయి. జీడీపీ వృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ లక్షలు, కోట్లమంది పేదరికం నుంచి బయటపడతారు. దేశం ఆర్థికంగా పురోగమిస్తున్న కొద్దీ పెట్టుబడుల ప్రవాహమూ పెరిగి ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి ఊపందుకొంటాయి.Posted on 31-07-2019