Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పల్లెకు చేరని ప్రాథమిక వైద్యం

* అరకొర నిధులు-అందని సేవలు

స్వతంత్ర భారతావనిలో నాణ్యమైన ప్రజావైద్యం అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. వైద్యరంగానికి నిధుల కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి. మొన్నటి బడ్జెట్‌లో వైద్యానికి దక్కింది (రూ.64,557 కోట్లు) కేవలం 2.3 శాతమే. నిధుల పరంగా నిరుటికన్నా ఎనిమిది శాతం ఎక్కువ మొత్తం కేటాయించినా, దేశ అవసరాల దృష్ట్యా అదేమాత్రం సరిపోదన్నది నిష్ఠుర సత్యం. దేశవ్యాప్తంగా ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కనీస వైద్య సిబ్బంది, మౌలిక వసతులు, మందులు అందుబాటులో లేక రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రాజ్యాంగంలోని అధికరణ 47 ప్రకారం ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అధికరణ 21 ప్రకారం పేద, ధనిక తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి చికిత్స అందించాలి. అధికరణ 42 మేరకు మాతాశిశువులకు ఆరోగ్య రక్షణ కల్పించాలి. కానీ, గతంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో, ఇటీవల బిహార్‌లోని ఆస్పత్రుల్లో పసిపిల్లల మరణాలను గమనిస్తే, ప్రభుత్వాలు పజావైద్యాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థమవుతుంది.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకానికి బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా దేశంలో 10.7 కోట్ల పేద కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్య సదుపాయం కల్పించనున్నారు. 2019 జులై మూడు నాటికి 4.01 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య కార్డులు అందించారు. వాటిలో సుమారు 31 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. రానున్న రోజుల్లో సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకానికి రూ.4,000 కోట్లు ప్రత్యేకించారు. ఇది దేశంలో ఆరోగ్య సేవల ప్రాంతీయ అసమానతలను సరిచేసేందుకు దోహదపడనుంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులు 2006-07లో రూ.11,366 కోట్లు. అది 2019-20 నాటికి రూ.62,659 కోట్లకు చేరుకుంది. అంటే 2006 నుంచి నేటి వరకు 13 శాతం మేర వార్షిక కేటాయింపుల వృద్ధిరేటు పెరిగింది. ఇది ఆశించిన దానికంటే తక్కువనే చెప్పాలి. కేటాయింపులు భారీస్థాయిలో కనిపించినా, ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది స్పష్టం అవుతుంది. 2010-15 మధ్యకాలంలో రూ.1,49,570 కోట్లు కేటాయించగా, 13 శాతం మేర నిధులు మురిగిపోయాయి. 2008-18 మధ్యకాలంలో కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం 1.5 శాతం, రాష్ట్రప్రభుత్వాలు 1.2 శాతం చొప్పున నిధులు ఆరోగ్య రంగంపై ఖర్చు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై వెచ్చించే ఖర్చు తక్కువేనని, 2025 నాటికి మొత్తం బడ్జెట్‌లో కనీసం 2.5 శాతమైనా కేటాయించాల్సిన అవసరం ఉందని జాతీయ ఆరోగ్య విధానం-2017 గతంలోనే స్పష్టం చేసింది. ఆ సూచనలను ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తున్నాయి.

దేశంలో మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో 3.8 శాతం నిధులు ఆరోగ్యరంగంపై ఖర్చు చేస్తున్నట్లు అంచనా! దీనిలో 1.5 శాతం ప్రభుత్వ వైద్యరంగంపై వ్యయం చేస్తుంటే, 2.3 శాతం నిధులను ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తున్నారు. భారత్‌ ప్రభుత్వవైద్యంపై చేస్తున్న వ్యయం 30 నుంచి 35 శాతమే. చాలా దేశాలు ఆరోగ్య రంగానికి చేసిన మొత్తం కేటాయింపుల్లో సింహభాగం ప్రభుత్వ వైద్యానికే ఖర్చు చేస్తున్నాయి. భారత్‌లోని ప్రతి పేద కుటుంబం తమ వార్షిక సంపాదన నుంచి ఆరోగ్యరంగానికి చేస్తున్న ఖర్చు 65 శాతం మేర ఉంటుందని అంచనా! దీని ప్రభావంవల్ల అనేక కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపోతున్నాయి. జాతీయ నమూనా సర్వే-2014 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతానికి చెందిన 86 శాతం, పట్టణ ప్రాంతానికి చెందిన 82 శాతం ప్రజలు ప్రభుత్వాలు అందించే బీమా సౌకర్యాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలకు రూ.1,350 కోట్లు కేటాయించారు. దీనిద్వారా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, లోక్‌సభ సభ్యుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ప్రజా వైద్య రంగంలో మంచి పురోగతి సాధించాయని 14వ ఆర్థిక సంఘం శ్లాఘించింది.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో ప్రాథమిక స్థాయిలో ఉండాల్సిన సదుపాయాలు అందుబాటులో లేవు. దేశంలో 2016 నాటికి 2,188 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 6,430 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 32,900 సబ్‌ సెంటర్ల కొరత ఉందని అధికార గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నవాటిని అరకొర వసతులతోనే నెట్టుకొస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజావసరాలకు తగినట్లు మౌలిక వసతులు లేవని విమర్శించింది. నిధుల కొరత అటుంచితే, మానవ వనరుల కొరత సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దేశంలో 2010-17 మధ్యకాలంలో రిజిస్టర్డ్‌ వైద్యుల సంఖ్య 2.14 లక్షలకు పెరిగింది. ప్రత్యేక నైపుణ్యాలున్న వైద్యుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2015 నాటికి 83.4 శాతం మేర సర్జరీ వైద్యుల కొరత ఉండగా, 76 శాతం వరకు స్త్రీ వైద్య నిపుణులు, 82 శాతం చిన్నపిల్లల వైద్యనిపుణులు, 83 శాతం దాకా ఫిజిషియన్ల కొరత ఉంది. దేశంలో 16 రాష్ట్రాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న వైద్యుల కొరత తీవ్రంగా ఉందనేది చేదునిజం. ప్రధానంగా గ్రామీణ వైద్య కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవు. ఖాళీలను సకాలంలో భర్తీ చేయడంలేదు. ఉన్నవారికి సరైన వేతనాలు లేకపోవడం ద్వారా అనేకమంది వైద్యులు ప్రైవేటు రంగ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గం దొరుకుతుంది. అందుకు వైద్యుల సహకారం ఎంతో అవసరం. మారుమూల పల్లెల్లో సేవలందించేందుకు యువ వైద్యులు ముందుకు రావాల్సిన తరుణమిది. పేదలకు సేవ చేయాలనే తపన, వృత్తికి న్యాయం చేయాలనే ఆకాంక్ష ఉంటే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కలలు నెరవేరతాయి.- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)
Posted on 03-08-2019