Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

వట్టిపోతున్న ఉపాధి హామీ!

* వేతనాలు నామమాత్రం
* అమలు కాని వందరోజుల నిబంధన
* పేదరికం తగ్గుతోందంటున్న కేంద్రం
* పథకానికి చాపచుట్టే యోచన?

జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.67 వేలకోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ, బడుగు వర్గాలకు అది భరోసా ఇవ్వలేకపోతోంది. వేతనాన్ని లెక్కించే విధానం లోపభూయిష్ఠం కావడంవల్ల కూలీల చేతికొచ్చే పైకం చాలా స్వల్పంగా ఉంటోంది. ఆ నామమాత్ర వేతనాలను సైతం సకాలంలో చెల్లించకపోతున్నారు. చొరవగా ముందుకొచ్చినవారికి పనులూ చూపించలేకపోతున్నారు. అవినీతి, అక్రమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముసిరిన సమస్యలను పరిష్కరించి, పథకాన్ని గాడిలో పెట్టాల్సిన కేంద్రం ఉపాధి హామీ మనుగడనే ప్రశ్నార్థకం చేసే యోచనలో ఉన్నట్లు మాట్లాడుతోంది. పేదరికం అంతర్థానం అవుతున్నందువల్ల ఈ పథకం అట్టేకాలం ఉండనక్కర్లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అంటున్నారు. అసలు పేదలంటే ఎవరో ఇప్పటికీ సరైన నిర్వచనమే లేని పరిస్థితుల్లో, ఇలాంటి వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 26 కోట్ల బడుగు జీవులు మెరుగైన వేతనాల కోసం ఎదురుచూస్తున్నందువల్ల వారిని సాంత్వనపరచే చర్యలకు ఉపక్రమించాలి. నిర్వహణ యంత్రాంగాన్ని సరైన దారిలో నడిపిస్తూ, రాష్ట్రాలూ తమవంతు బాధ్యతలు నిర్వర్తించాలి. దేశంలో పెచ్చరిల్లిన దారిద్య్రం, అసమానతలపై వెల్లువెత్తిన ఆందోళనల ఫలితంగానే 2005లో ఉపాధి హామీ చట్టం అవతరించింది. జాబ్‌కార్డులు కలిగి ఉన్నవారు ముందుకొచ్చినప్పుడు చట్ట ప్రకారం 15 రోజుల్లో పనులు చూపాలి. పని పూర్తయిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలి. కుటుంబానికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాలి. ఏడాదికి రూ.67 వేలకోట్ల మేర ఖర్చుపెడుతున్నందువల్ల ఉపాధి హామీ పథకం బ్రహ్మాండంగా అమలవుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తరచూ చెబుతుంటారు. సునిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆశ్చర్యపరచే విషయాలు వెల్లడవుతాయి. మట్టి పనిచేసే కూలీలకు 2018-19లో దినసరి వేతనం దేశవ్యాప్తంగా సగటున రూ.179 అందగా, తెలంగాణలో రూ.148, ఆంధ్రప్రదేశ్‌లో రూ.198 లభించింది. వేతనాన్ని లెక్కగట్టేందుకు కేంద్రం పరిగణనలోకి తీసుకొనే విధానం సరైనది కాకపోవడం వల్లే ఇంతటి కనిష్ఠ మొత్తాలు చేతికొస్తున్నాయి.

ముందుకు కదలని దస్త్రం
గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులు ఉపయోగించే వస్తువుల ధరల్లోని వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర గణాంక శాఖ ఏటా వినియోగదారుల సూచీ (సీపీఐ-ఏఎల్‌) రూపొందిస్తుంది. దాని ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలవారీగా ఉపాధి కూలీల కనీస వేతనాన్ని ప్రకటిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేంద్రం నిర్ణయించిన కనీస వేతనం ప్రస్తుత 2019-20కి రూ.211. 2018-19లో అది రూ.205. ఏడాది తిరిగేసరికి తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెంచింది ఆరు రూపాయలు మాత్రమే. కేంద్రం వెల్లడించే కనీస వేతనం ఆధారంగానే రాష్ట్రాలు తమవద్ద ఏ తరహా పనికి ఎంత మొత్తం చెల్లించాలనేది నిర్ణయిస్తాయి. తెలంగాణలో చెరువులో పూడికతీతకు ప్రస్తుతం ఒక క్యూబిక్‌ మీటర్‌కు రూ.137 రేటు ఉంది. అంటే ఒక కూలీ ఓ ఘనపు మీటరు తవ్వితే ఆ మొత్తమే ఇస్తారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం అందుకోవాలంటే ఆ కూలీ 1.50 ఘనపు మీటర్ల మేర తవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ పనిచేసే సత్తువ లేనందువల్ల కూలీలు తమకు చేతనైన మేర మాత్రమే పనులు చేయగలుగుతున్నారు. అందువల్లే తెలంగాణలో సగటు దినసరి వేతనం రూ.148కి పరిమితం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది రూ.198గా ఉంది. కేంద్రం అనుసరించే పద్ధతుల్లో మార్పులు వస్తే బడుగు జీవులకు కొంత ఎక్కువ వేతనం లభించే అవకాశం ఉంది. కేంద్రం అనుసరిస్తున్న సీపీఐ-ఏఎల్‌ స్థానే గ్రామీణ వినియోగదారుల ధరల సూచీని (సీపీఐ-గ్రామీణ) పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసి చాలా కాలమైంది. వ్యవసాయ కార్మికులే కాకుండా గ్రామీణులంతా ఉపయోగించే వస్తువుల ధరల్లోని వ్యత్యాసాలను గమనంలోకి తీసుకొంటే అది ప్రస్తుత సీపీఐ-ఏఎల్‌ కంటే మెరుగైన రీతిలో ఉంటుంది. ప్రస్తుతం ఏటా డిసెంబరులో అంచనావేసే సీపీఐ-ఏఎల్‌ను మాత్రమే లెక్కలోకి తీసుకొంటున్నారు. ఇకపై సీపీఐ-గ్రామీణను అనుసరిస్తూ ఏడాదిలోని అన్ని నెలల సగటును గమనంలోకి తీసుకోవాలని కేంద్ర కమిటీ స్పష్టీకరించింది. ఈ సిఫార్సులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించి సంబంధిత దస్త్రాన్ని ఆర్థిక శాఖకు పంపగా అక్కడది రెండేళ్లకు పైగా పడిఉంది. కొలమానాలు మారితే కేంద్రం ఏటా నిర్ణయించే కనీస వేతనం, దానికి అనుగుణంగా రాష్ట్రాలు ప్రకటించే పనులవారీ రేట్లలో మార్పులు వస్తాయి. అప్పుడు కూలీలకు మెరుగైన వేతనం లభిస్తుంది. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల నిర్ణయానికి మాత్రమే సీపీఐ-ఏఎల్‌ను ఉపయోగిస్తుంటారు. కనుక ఉపాధి హామీ కూలీలకు దాన్ని వర్తింపజేయడం ఎంత మాత్రం తగదు!

ఉపాధి హామీ పథకాన్ని సరైన రీతిలో నడిపించేలా తెలుగు రాష్ట్రాలు నడుంకట్టాలి. వేతనాలు సకాలంలో అందని కారణంగా జాబ్‌కార్డులు ఉన్నవారిలో పలువురు ఉపాధి పనులకు వెళ్ళకుండా వలసపోతున్నారనేది వాస్తవం. తెలంగాణలో మొత్తం 1.18 కోట్లమంది పేర్లు నమోదు చేయించుకోగా, 58 లక్షలు (49శాతం) మాత్రమే పనులకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 73 శాతం ఉన్నారు. చట్ట ప్రకారం వేతనాలను 15 రోజుల్లో ఇచ్చితీరాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఇస్తున్నామని కేంద్ర, రాష్ట్రాలు చెబుతున్నా, వాస్తవం మరోలా ఉంది. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా నెలల తరబడి పైకం అందడంలేదని వాపోయే బడుగుజీవులే కనిపిస్తారు. పనులను ఆలస్యంగా నమోదు చేయడం, అసలు నమోదే చేయకపోవడం, పనిచేయనివారిని చేసినట్లు చూపడం వంటి అవకతవకలెన్నో సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. తనిఖీల్లో వెల్లడయ్యే అక్రమాలపైనైనా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమిస్తే అవకతవకలు పునరావృతం కావు. తప్పుడు పనులకు పాల్పడినవారిని స్వల్ప జరిమానాలతో విడిచిపెట్టడం వల్ల పెడధోరణులకు అడ్డుకట్ట పడటంలేదు. అడిగినవారికి 15 రోజుల్లో పని చూపకపోతే 16వ రోజు నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వడం, వేతన బకాయిలపై వడ్డీ చెల్లింపు వంటి నిబంధనలు ఆచరణలో ఎక్కడా కనిపించవు. వాటిపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలూ కానరావు.

పేదలపాలిట వరం
పేదలంటే ఎవరన్న విషయంలో సరైన నిర్వచనం ఇప్పటికీ లేదు. దీనిపై కమిటీలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. పేదరికం అంతర్థానం అవుతున్నందువల్ల పేదల పథకాలు అక్కర్లేదన్న అంచనాకు ప్రభుత్వం రావడం విడ్డూరం. రాష్ట్రాల అభీష్టాలతో నిమిత్తం లేకుండా కేంద్రం బీఆర్‌జీఎఫ్‌ (వెనకబడిన ప్రాంతాల గ్రాంట్‌ ఫండ్‌) వంటివాటిని రద్దు చేసుకొంటూ రావడం, మరికొన్ని పథకాల్లో రాష్ట్రాలు భరించాల్సిన వాటాల పెంపుదల వంటి కారణాల వల్ల ఉపాధి హామీ రాష్ట్రాలకు ప్రధాన కార్యక్రమంగా మారింది. సీసీ రోడ్ల నిర్మాణం, కందకాల తవ్వకం వంటి పనులను అవి చేపట్టగలుగుతున్నాయి. ఉపాధి హామీని సంస్కరించి వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ రాష్ట్రాలు ఏళ్ల తరబడి చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఏకంగా పథకాన్నే ప్రశ్నార్థకం చేసే రీతిలో కేంద్రమంత్రి మాట్లాడటం సహేతుకం కాదు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసినట్లయితే కష్టాల్లో ఉన్న రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. నాట్లు తదితర పనులకయ్యే ఖర్చులో కొంతమేర రైతు, మిగతా మొత్తాన్ని సర్కారు భరించడమే ఈ అనుసంధానంలోని ప్రధాన ప్రక్రియ. ఆ మేరకు నీతి ఆయోగ్‌ మూడేళ్ల క్రితమే సిఫార్సు చేసినా, కేంద్రంలో స్పందనే కొరవడింది. రాష్ట్రాల్లో ప్రస్తుతం చేస్తున్న పనుల్లో అత్యధికం వ్యవసాయానికి చెందినవి కాబట్టి ఇక ప్రత్యేకంగా అనుసంధానం ఎందుకనే ప్రశ్న అర్థం లేనిది. కష్టాల నుంచి రైతు గట్టేక్కెందుకు అనుసంధానం ఎంతగానో తోడ్పతుంది. పొలంపనులకు కూలీలు దొరకడంలేదంటూ రైతులు వాపోయే దుస్థితి తప్పుతుంది. వలసలనూ నివారించవచ్చు. ఒక కుటుంబానికి ఏడాదిలో వంద రోజుల పని కల్పించాలనే చట్ట నిబంధన ప్రస్తుతం అపహాస్యం పాలవుతోంది. 2018-19లో జాతీయ స్థాయిలో సగటున ఒక్కో కుటుంబానికి 50 రోజులు, తెలంగాణలో 46, ఆంధ్రప్రదేశ్‌లో 59 రోజులు మాత్రమే పనులు లభించాయి. పని చేసేందుకు బడుగు జీవులు ముందుకువస్తున్నా చట్ట నిబంధనల ప్రకారం ఉపాధిని ఎందువల్ల చూపించలేకపోతున్నారో రాష్ట్రాలు సమీక్షించుకోవాలి. వంద రోజులపాటు పని చూపించని క్షేత్ర సహాయకులపై చర్యలు తీసుకొంటామంటూ ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాబోదు. సకాలంలో వేతనాలు అందజేయడం చాలా ముఖ్యం. కేవలం కరవు ప్రకటించిన ప్రాంతాలకే పనిదినాల సంఖ్యను కేంద్రం 150కి పెంచుతోంది. అలా కాకుండా ఒక్కో కుటుంబానికి ఏడాదిలో పనిదినాల సంఖ్యను 100 నుంచి 150కి పెంచాలి. అప్పుడు కనీసం వంద రోజులపాటైనా కూలీలకు ఉపాధి చూపడానికి అధికార గణాలు నడుంబిగిస్తాయి. సామాజిక తనిఖీల్లో వెలుగుచూసే అక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించి, అందుకు బాధ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. కనీస వేతనాన్ని లెక్కగట్టే విధానంలో సత్వర మార్పులూ తేవాలి!

- పిళ్లా సాయికుమార్‌
Posted on 08-08-2019