Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సర్కారీ వ్యయంతోనే మాంద్యం మాయం

* ఆర్థిక రంగం... మందగమనం

ప్రతి దేశ ఆర్థిక రథం నాలుగు గుర్రాలతో పరుగులు తీస్తుంది. అవి- ప్రభుత్వ వ్యయం, ప్రైవేటు పెట్టుబడులు, స్వదేశంలో వస్తుసేవల వినియోగం, విదేశాలకు ఎగుమతులు. ఆర్థికాభివృద్ధి జోరందుకోవాలంటే ప్రైవేటు రంగం కొత్త ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలి. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల్లోకి పెద్దఎత్తున ప్రభుత్వ పెట్టుబడులు ప్రవహించాలి. స్వదేశంలో వస్తుసేవల వినియోగం ఊపందుకోవాలి. విదేశాలకు వస్తుసేవల ఎగుమతులు విస్తరించాలి. కానీ, నేడు ఈ నాలుగు జవనాశ్వాల్లో రెండింటి జోరు తగ్గిపోవడంతో, భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోతోంది. గతేడాది వరకు మౌలిక వసతుల్లో ప్రభుత్వ పెట్టుబడులు, స్వదేశంలో వస్తుసేవల వినియోగం పెరిగినా- ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు పడకేయడం మందగతికి కారణాలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనైంది. గత సంవత్సరం చివరి వరకూ మోటారు వాహనాలు, దీర్ఘకాల వినియోగార్హ వస్తువులు, శీఘ్ర వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాలు దాదాపు 16 శాతం వరకు వృద్ధి చెందాయి. పెరిగిన వినియోగం ఆర్థిక వ్యవస్థను కొంతవరకు ఆదుకొంది. మరోవైపు 2013-14లో 31,488 కోట్ల డాలర్ల రికార్డు స్థాయిని అందుకున్న ఎగుమతులు, 2017-18లో 30,330 కోట్ల డాలర్లకు తగ్గిపోయాయి. అదే సమయంలో ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయి ఆర్థిక రథానికి బ్రేకులు పడ్డాయి. 2006 నుంచి 2011 వరకు ఏటా రూ.25 లక్షల కోట్లుగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.9.5 లక్షల కోట్లకు పడిపోయాయి. ఒకప్పుడు మొత్తం పెట్టుబడుల్లో 66 శాతం ఉన్న ప్రైవేటు పెట్టుబడులు 2018-19లో 47 శాతానికి క్షీణించాయని ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) వివరించింది. స్వదేశీ వస్తుసేవల వినియోగమూ 2018-19 ద్వితీయార్ధంలో తగ్గిపోసాగింది. గతేడాది వరకు కనిపించిన కాస్తో కూస్తో వృద్ధి ప్రభుత్వ పెట్టుబడుల చలవే.

ఆశించిన మేరకు సమకూరని ఆదాయం
నాలుగు గుర్రాలతో నడవాల్సిన రథం ఒకే గుర్రంతో పరుగు తీయలేనట్లు, కేవలం ప్రభుత్వ పెట్టుబడులే వృద్ధికి ఊతమివ్వలేవు. పైగా గత ఆర్థిక సంవత్సరం చివరకు జీఎస్టీ, ప్రత్యక్ష పన్ను వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం సమకూర లేదు. విత్త లోటును 3.4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోక తప్పడం లేదు. కొత్తగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకాలకు నిధులు కేటాయించాక, ప్రభుత్వం వద్ద మిగిలే నిధులు అంతంతమాత్రమే. 2015-16లో ఎనిమిది శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), 2018-19లో 6.98 శాతానికి తగ్గిపోనుండటంతో, ప్రభుత్వం పెద్దగా పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు. స్థూల విలువ జోడింపు (జీవీఏ) శాతం సైతం 8.03 నుంచి 6.79 శాతానికి తగ్గిపోయింది. దీనికి తగ్గట్టు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా పడిపోతోంది. 2018 డిసెంబరులో ఐఐపీ వృద్ది రేటు 3.69 శాతం కాగా, ఈ ఏడాది జనవరిలో 1.79 శాతానికి, ఫిబ్రవరిలో 0.1 శాతానికి క్షీణించింది. గత 20 నెలల్లో ఎన్నడూ ఇంత తగ్గుదల కనిపించలేదు. గతేడాది మే నెలలో గనుల రంగం 5.8 శాతం వృద్ధి నమోదు చేయగా, ఈ ఏడాది మేలో 3.2 శాతానికి తగ్గిపోయింది. నిరుడు 3.6 శాతం వృద్ధి కనబరచిన పారిశ్రామికోత్పత్తి రంగం ప్రస్తుతం 2.5 శాతానికి క్షీణించింది. వినియోగ వస్తువుల తయారీకి ఉపయోగించే యంత్రాలు, భవనాల వంటి ఉత్పాదక ఆస్తుల ఉత్పత్తి గతేడాది మే నెలలో 6.4 శాతం వృద్ధి సాధించగా, ఈ ఏడాది 0.8 శాతానికి పతనమైంది. విద్యుదుత్పాదన వృద్ధి రేటూ మందగించడం బట్టి పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. ఉక్కు కడ్డీలు, రేకులు, చువ్వల వంటి వస్తువుల ఉత్పత్తీ తగ్గిపోయింది. 2018-19 లో కార్పొరేట్‌ రంగ విక్రయాలు, స్థూల స్థిరాస్తుల వృద్ధీ మందగించింది.

పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగావకాశాలు ఎలా పెరుగుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవక మానదు. 2018 అక్టోబరు నుంచి నెలసరి ఉపాధి కల్పన రేటు 26 శాతం క్షీణించిందని ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఏ) సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2013-14లో ఉద్యోగుల జీతభత్యాలు 25 శాతం పెరిగితే, 2017-18 వచ్చేసరికి ఈ వృద్ధి 8.4 శాతానికి పరిమితమైంది. ఫలితంగా ఉద్యోగులు, కార్మికులు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చుపెట్టలేకపోతున్నారు. దేశంలో విక్రయమవుతున్న కార్లలో సగాన్ని మారుతీ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి సంస్థ సైతం పట్టణాల్లో తమ విక్రయాలు తగ్గిపోతున్నాయని ప్రకటించింది. గ్రామాల్లో కార్ల అమ్మకాలు బాగానే ఉన్నా, వాటి జోరు మందగించింది. మొత్తం మీద ప్రయాణికుల కార్ల పరిశ్రమ కేవలం మూడు శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు చేయగలిగింది. గత అయిదేళ్లలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. కార్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గిస్తే కానీ విక్రయాలు మళ్లీ ఊపందుకోవు. ఇటీవలి వరకు ప్రపంచంలో కార్ల ఉత్పత్తి, అమ్మకాల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణం ఇలాంటి చర్యలు తీసుకోకతప్పదు. పైగా ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు అగ్ర ప్రాధాన్యమివ్వడంతో పాటు కఠిన కాలుష్య నియంత్రణ ప్రమాణాలను విధించడం వల్ల వినియోగదారులు సంప్రదాయ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గుముఖం పట్టడం సైతం ఆర్థిక మందగతికి సంకేతం. దేశంలో ప్రయాణికుల కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల కొనుగోలుకు 55 నుంచి 65 శాతం వరకు రుణాలు ఇచ్చే బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌.బి.ఎఫ్‌.సి.) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కుప్పకూలినప్పటి నుంచి రుణ మంజూరును తగ్గించాయి. ఆటో మొబైల్‌ పరిశ్రమ మందగమనానికి ఇదీ ఒక కారణం. ఇక ఆర్థిక సేవల పరిశ్రమా క్షీణ దశలో ఉంది. బ్యాంకుల రుణ వితరణలో లక్ష కోట్ల రూపాయల తరుగుదల కనిపించిందని రిజర్వుబ్యాంకు వెల్లడించడం గమనిస్తే, గిరాకీ మందగించడం వల్లనే కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను పెట్టడానికి రుణాలు తీసుకునేవారు కరవవుతున్నారని స్పష్టమవుతుంది.

పరిష్కారమేమిటి?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరచూ మాంద్యానికి గురవుతూనే ఉంటుంది. అది సహజ పరిణామం కూడా. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలు ఒక సరళ సూత్రాన్ని పాటించి విజయం సాధించాయి. ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడమే ఈ సూత్రం. 1929లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు అమెరికా మౌలిక వసతుల నిర్మాణంపై పెద్దయెత్తున నిధులు గుమ్మరించింది. అనుబంధ రంగాల్లో భారీ వ్యయం చేసింది. దీంతో జనం చేతిలో, పరిశ్రమల చేతిలో బాగా డబ్బు ఆడి వస్తుసేవలకు గిరాకీ పెరిగింది. ఆ గిరాకీని తీర్చడానికి మరిన్ని వ్యాపారాలు, పరిశ్రమలు పుట్టుకొచ్చి, ఉపాధి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలకెక్కింది. ప్రభుత్వం ఈ విధానాన్ని కొన్నేళ్లపాటు కొనసాగిస్తే స్పష్టమైన ఫలితాలు కనబడతాయి. భారత్‌ కూడా ఈ ఉద్దీపన విధానాన్ని చేపట్టాలి. గడచిన మూడు నాలుగు త్రైమాసికాలలో గిరాకీ క్షీణించడం వల్ల కొన్ని రంగాలు తమ సామర్థ్యం మేరకు ఉత్పత్తి సాగించలేకపోయాయి. ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచితే ఆర్థిక వ్యవస్థలోకి ధన ప్రవాహం, దానితోపాటే గిరాకీ పెరిగి, పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా వినియోగించుకుంటాయి. అప్పటికీ ఆర్థిక రంగం కోలుకోకపోతే ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించక తప్పదు. ఆ దశ రావడానికి ఇంకా సమయం ఉంది. ఆలోగా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తే పరిశ్రమలకు కొత్త పెట్టుబడులు అంది ఉత్పత్తి, వినియోగాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారూ ముందుకొస్తారు. సాధారణంగా బ్యాంకులకు తాను ఇచ్చే నిధులపై వడ్డీ (రెపో) రేటును రిజర్వుబ్యాంకు 0.25 శాతం తగ్గిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ నెల 7న 0.35 శాతం తగ్గించడం విశేషం. శక్తికాంత దాస్‌ గవర్నర్‌ అయినప్పటి నుంచి రిజర్వుబ్యాంకు రెపో రేటు తగ్గించడం ఇది నాలుగోసారి. వాణిజ్య బ్యాంకులు ఈ రాయితీని వినియోగదారులకు, పెట్టుబడిదారులకు బదిలీ చేయడం మీదనే ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ప్రజలు, పరిశ్రమలు, ప్రభుత్వం ఎక్కువ మొత్తాలను పొదుపు చేసి, ఆ నిధులను పెట్టుబడులుగా ఉపయోగించి, వస్తుసేవల ఉత్పత్తినీ, ఎగుమతులనూ వృద్ధి చేసినప్పుడే స్థిరమైన ప్రగతిని సాధించగలం!

ఎగుమతులపై ప్రతికూల ప్రభావం
ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున భారతదేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడింది. గతంలో అయిదేళ్లపాటు ప్రపంచ వాణిజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లి ఏటా మూడు నుంచి నాలుగు శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు భారత్‌ ఆ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 2013-14లో భారత ఎగుమతులు 31,440 కోట్ల డాలర్లకు చేరాయి. ఆ తరవాత మళ్లీ ఆ స్థాయి ఎగుమతులను అందుకోలేకపోయాం. 2017-18 వరకు అంతకన్నా తక్కువగానే ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది మాత్రం ఎగుమతులు 2013-14 కన్నా అయిదు శాతం ఎక్కువగా 33,100 కోట్ల డాలర్లకు చేరనున్నాయి. దీనికి ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్య విలువల్లో వ్యత్యాసాలే ప్రధాన కారణం తప్ప, ఎగుమతుల రంగంలో అద్భుత విజయం సాధించడం వల్ల మాత్రం కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచి కాస్త ఊరటనిచ్చాయి. ఉదాహరణకు స్థిరాస్తి రంగంలో వాణిజ్య విభాగం స్థితి దివ్యంగా ఉంది. నివాస గృహాల నిర్మాణంలోనూ గిరాకీ పుంజుకొంటోంది. గతంలో కుదేలైపోయిన స్థిరాస్తి రంగం క్రమంగా మెరుగుపడుతోందని ఇది సూచిస్తున్నా దీన్ని ఘనమైన అభివృద్ధిగా పరిగణించలేం.

Posted on 16-08-2019