Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

చైనా సంద్రంలో అల్పపీడనం

* కరెన్సీ విలువకు కత్తెర
చైనా ఈ నెలలో తన కరెన్సీ విలువను వరుసగా మూడుసార్లు తగ్గించడం ప్రపంచ ద్రవ్య విపణుల్లో కలకలం రేపింది. చైనా కరెన్సీ సాధికార నామం రెన్‌మిన్‌బీ కాగా, వాడుకలో ఉన్న పేరు యువాన్‌. దీని మారక విలువ తగ్గింపునకు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులే కారణం. 1980నుంచి చైనా వార్షిక సగటు వృద్ధి రేటు పది శాతం ఉండగా ఇటీవలి కాలంలో అది ఏడు శాతానికి తగ్గింది. 2015లో అది 6.8శాతానికి తగ్గవచ్చు. కార్పొరేట్లకూ, స్టాక్‌ మార్కెట్‌ మదుపరులకూ, గృహ నిర్మాణ రంగాలకు భారీగా ఇచ్చిన రుణాలు చైనా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకు రుణాల పునాదిపైనే కంపెనీల పెట్టుబడులు పెరిగాయి. కానీ పెట్టుబడులు ఆశించిన మేరకు ఫలాలను ఇవ్వడం లేదు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు నేడు చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.4శాతానికి చేరడంతో బ్యాంకుల ఆర్థిక పునాది పట్ల ఆందోళన కలుగుతోంది. చైనాలో గృహ నిర్మాణ రంగం చాలా కాలం నుంచి ఆర్థికాభివృద్ధి రేటు, ఉపాధి అవకాశాలు పెరగడానికి చేయూతనిస్తోంది. కానీ, నిర్మాణ కార్యకలాపాల జోరు మూలంగా అవసరానికి మించి ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ గిరాకీ లేక గత మూడేళ్లలో దేశమంతటా ఖాళీ భవన సముదాయాలు దర్శనమిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగతి చైనా దూకుడుకూ బ్రేకులు వేసినా, 2014 మధ్య నాళ్ల నుంచి షేర్‌ మార్కెట్‌ విజృంభించడం దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరించారు. ఇంతకాలం ఇళ్ల కొనుగోలుపై డబ్బు వెచ్చించిన చైనీయులు ఇటీవలి కాలంలో స్టాక్‌ మార్కెట్‌ కు మళ్లడం వల్ల షేర్ల ధరలు చుక్కలను తాకాయి. కానీ, చైనా కంపెనీల ఆర్థిక పరిస్థితి అనుకున్నంత ఆశావహంగా లేదని తెలిసి షేర్ల ధరలు పతనమయ్యాయి. ఈ ఏడాది జులైలో కేవలం మూడు వారాల్లోపలే షేర్ల ధరలు 30శాతం పడిపోయాయి. వాటిని నిలబెట్టడం కోసం చైనా ప్రభుత్వం భారీ సంఖ్యలో షేర్లు కలిగి ఉన్న సంస్థలు, వ్యక్తులు, ఆరు నెలలపాటు వాటిని అమ్మకూడదనీ, కంపెనీలు కొత్త ఐపీఓలు జారీచేయకూడదని నిషేధం విధించింది. ఆ విధంగా షేర్ల ధరల పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించింది.

అధిక వృద్ధిరేటు పాత మాట

1990లో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా కేవలం రెండు శాతం కాగా 2013లో అది 13శాతానికి పెరిగింది. ప్రపంచ కంప్యూటర్‌ సామగ్రి ఎగుమతుల్లో 56శాతం, ప్లాస్టిక్‌ బొమ్మల్లో 65శాతం చైనా నుంచే జరుగుతున్నాయి. మరోవైపు సంప్రదాయ ఉత్పత్తులతోపాటు అత్యాధునిక పరికరాలను కూడా స్వదేశంలోనే తయారుచేసుకొంటున్నందువల్ల చైనా దిగుమతులు తగ్గిపోయాయి. అందుకే చైనాకు భారీ వాణిజ్య మిగులు ఏర్పడింది. కానీ, ఎగుమతులలో చైనాకున్న ఆధిక్యం మున్ముందు తగ్గిపోనున్నది. గడచిన కొన్ని దశాబ్దాలుగా కార్మికులకు బాగా తక్కువ వేతనాలను చెల్లించడం ద్వారా చైనా పాదరక్షలు, ఫర్నిచర్‌, దుస్తులు, ప్లాస్టిక్‌ బొమ్మల వంటి సంప్రదాయ ఉత్పత్తులను చాలా చౌకగా తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ వస్తోంది. కానీ, ఈమధ్య చైనాలో కూడా కార్మికుల వేతనాలు పెరగడంవల్ల ఇకపైన చౌక ఎగుమతులకు కాలం చెల్లిపోవచ్చు. తన ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరచి విపణి ఆధారిత ద్రవ్య విధానాన్నీ, వడ్డీ రేట్ల సవరణ, ప్రభుత్వ యాజమాన్య సంస్థల సంస్కరణను చేపట్టాలనీ, తన కరెన్సీకి స్థిర విలువను కాకుండా విపణి స్థితిగతులనుబట్టి మారే విలువను చేపట్టాలనీ ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చైనాకు సూచించింది. చైనాలో కార్మిక వ్యయం తక్కువ కావడంతో పలు అమెరికా, ఐరోపా కంపెనీలు అక్కడికి తరలిపోయాయి. దీనికి తోడు చైనా చౌక ఉత్పత్తులు అమెరికా, ఐరోపా మార్కెట్లను ముంచెత్తడం వల్ల ఆ దేశాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. 2007నాటి ఆర్థిక సంక్షోభంతో సంపన్న దేశాల పరిస్థితి క్షీణించి చైనా వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది. ఫలితంగా 2007లో 10శాతంగా ఉన్న చైనా కరెంటు ఖాతా మిగులు 2014లో 2.1శాతానికి తగ్గిపోయింది. చైనా కరెన్సీ విలువ పెరగడమూ దీనికి కారణమే. కాబట్టి, మరి రెండు మూడేళ్లలో విపణిని బట్టి మారే కరెన్సీ మారక విలువకు మారాలని చైనా ఐఎంఎఫ్‌ సూచించింది. తమ ఎగుమతులు తగ్గిపోవడం, ఆర్థిక పరిస్థితి మందగించడం వల్ల చైనా యువాన్‌ విలువను తగ్గించక తప్పలేదు. చైనా విదేశీ ద్రవ్య నిల్వల పెరుగుదల రేటు కూడా ఈ మధ్య తగ్గిపోయింది. కొత్త ఇళ్లూ, అపార్ట్‌మెంట్ల ధరల పెరుగుదల మందగించింది. ఒకవేళ స్థిరాస్తి విపణి పతనమైనట్లయితే, గృహ రుణాలనూ, తనఖా రుణాలనూ తీర్చడం వినియోగదారులకు కష్టమవుతుంది. దానితో వారు వస్తు సేవల వినియోగాన్ని తగ్గించుకొంటారు. అది ఆర్థిక వృద్ధి రేటును కిందకు లాగుతుంది. అమెరికా, ఐరోపాలలో అరకొర ఆర్థిక వృద్ధి చైనా ఎగుమతులను నీరుగారుస్తుంది. దీనివల్ల చైనాలో పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతాయి. వాటి లాభాలు తగ్గి, నిరుద్యోగం పెరిగిపోతుంది. దానితో ప్రజలు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ప్రసరిస్తుంది. ప్రపంచ ఎగుమతుల్లో ఆరో వంతు చైనా ద్వారానే జరుగుతున్నాయి. యువాన్‌ విలువను 4.4శాతం తగ్గించడం వల్ల చైనా వస్తువులు మళ్ళీ చవకై, ఎగుమతులు పెరుగుతాయని అంచనా. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నియోగించి ఉత్పాదకతను పెంచినట్లయితే చైనా నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతుంది. కానీ టెక్నాలజీ వల్ల ఉత్పత్తిలో పెట్టుబడుల వాటా పెరిగి, కార్మిక వాటా తగ్గి, నిరుద్యోగం పెరుగుతుంది. చైనాలో ఇంతవరకు ప్రభుత్వ యాజమాన్య సంస్థలు అవసరానికన్నా ఎక్కువ సిబ్బందిని నియోగిస్తూ వచ్చాయి. ఈ సంస్థలు ఆధునిక టెక్నాలజీకి మారితే కార్మిక అవసరం తగ్గిపోయి సామాజికంగా ఉద్రిక్తతలకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికే చైనా కరెన్సీ విలువను తగ్గించినట్లుంది. అయితే, ఇది సమస్యకు అసలు సిసలు పరిష్కారం కాదు. అగ్ర రాజ్యంగా అవతరించాలనుకొంటున్న చైనా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించక తప్పదు. ఆర్థిక సంస్కరణలను చేపట్టడం అంతకన్నా విధాయకం. స్థిర విలువ కరెన్సీ విధానం నుంచి విపణి ఆధారంగా విలువ మారే విధానానికి మారాలి. అంటే చైనా ఆర్థిక వ్యవస్థలో మున్ముందు మార్కెట్‌ పాత్ర పెరగాలన్న మాట. యువాన్‌ విలువ తగ్గింపు విపణి ఆధారిత ఆర్థిక వ్యవస్థకు స్వాగత సూచిక. దీనికి పోటీగా అనేక దేశాలు తమ కరెన్సీ విలువను కూడా తగ్గిస్తాయనీ, ఇది కరెన్సీ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా త్వరలోనే వడ్డీ రేట్లు పెంచినట్లయితే వర్ధమాన దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు పోలోమంటూ అమెరికాకు తరలిపోతాయనే భయాలున్నాయి. ఇది చాలదన్నట్లు ఎగుమతులూ తగ్గితే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లవుతుంది.

తీవ్ర పర్యవసానాలు...

ఈ పరిస్థితిలో వివిధ దేశాలు తమ కరెన్సీ విలువలనూ తగ్గించి, తమ ఉత్పత్తులను విదేశాలకు చౌకగా అమ్మడం అనివార్యమవుతుంది. ఈ విధంగా ఎగుమతులను పెంచుకోవడం ఏ దేశానికీ మంచిది కాదు. కరెన్సీ విలువ తగ్గించడమంటే ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వడమన్న మాట. ఆ మేరకు ఇతర రంగాలకు, ముఖ్యంగా సాంఘిక సంక్షేమ రంగాలకిచ్చే సబ్సిడీలను తగ్గించుకోవలసి వస్తుంది. అసలే లోటు బడ్జెట్లతో సతమతమవుతున్న దేశాలకు ఇంతకన్నా వేరే మార్గం లేదు. అపారమైన విదేశీ ద్రవ్య నిల్వలున్న చైనాకు కరెన్సీ యుద్ధాన్ని తట్టుకునే శక్తి దండిగా ఉంది. కానీ, ఇతర దేశాలకు ఆ స్తోమత లేదు. చైనా ఇంతకుముందూ ఎగుమతులకు సబ్సిడీ ఇచ్చింది. ఇకపైనా ఇస్తుంది. ఈ విషయంలో ఇతర వర్ధమాన దేశాలు చైనాతో పోటీపడలేవు. ఏతావతా ఎగుమతి మార్కెట్లలో తన ఆధిక్యాన్ని నిలుపుకోవడానికే చైనా యువాన్‌ విలువ తగ్గించిందనే వాదన ఉంది. అయితే, ఇది వర్థమాన దేశాలతోపాటు సంపన్న దేశాలకూ నష్టదాయకంగా పరిణమించవచ్చు. ఇప్పటికే డాలర్‌ విలువ బలపడిన దృష్ట్యా యువాన్‌ విలువ తగ్గింపు వల్ల చైనా నుంచి మరింతగా చవక ఎగుమతులు తమ మార్కెట్లలోకి వచ్చిపడతాయని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఇది స్వదేశీ పరిశ్రమలను దెబ్బతీసి అమెరికన్ల ఉపాధి అవకాశాలను హరించేస్తుందని భయపడుతున్నారు. జపాన్‌తో సహా అనేక చైనా ప్రత్యర్థి దేశాలతో అమెరికా కుదుర్చుకోబోతున్న విశాల పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందానికి, యువాన్‌ విలువ తగ్గింపు ద్వారా చైనా అడ్డుపుల్ల వేస్తోందని ఆగ్రహిస్తున్నారు. కానీ, ఇటీవల యువాన్‌ విలువను రెండు దఫాలుగా మూడున్నర శాతమే తగ్గించారు. చైనా మున్ముందు మరిన్నిసార్లు తగ్గింపునకు పాల్పడితే కరెన్సీ యుద్ధం విరుచుకుపడవచ్చు. భారతదేశ మార్కెట్లను చైనా ఉత్పత్తులు మరింతగా ముంచెత్తి తమను దెబ్బతీస్తాయని స్వదేశీ పరిశ్రమలు ఆందోళన చెందుతున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం యువాన్‌ విలువ తగ్గింపు గురించి అతిగా ఆందోళన చెందనక్కర్లేదంటోంది. యువాన్‌ మారక రేటు సరళీకరణలో భాగంగా ఈ ఒక్కసారికి దాని విలువ తగ్గించామనీ, ఇది పదేపదే పునరావృతమవుతుందన్న భయాలు అక్కర్లేదని చైనా కేంద్ర బ్యాంకు ప్రతినిధి భరోసా ఇచ్చారు. యువాన్‌ విలువను తగ్గించడం ఎగుమతి, దిగుమతులపై ప్రభావం చూపదన్నారు. ఆర్థిక సరళీకరణలో భాగంగా యువాన్‌ మారక రేటు తగ్గించామన్న చైనా వాదనను ఐఎంఎఫ్‌ అంగీకరించింది. దీనివల్ల ఐఎంఎఫ్‌ రిజర్వు ద్రవ్యమైన ఎస్‌డీఆర్‌లో యువాన్‌నూ కలుపుకొనే అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం డాలర్‌, యూరో, బ్రిటిష్‌ పౌండ్‌, జపనీస్‌ యెన్‌లు, ఎస్‌డీఆర్‌ ద్రవ్య గుచ్ఛంలో అంతర్భాగాలుగా ఉన్నాయి. ఈ గుచ్ఛంలో యువాన్‌ చేరినప్పుడు అది అంతర్జాతీయ కరెన్సీగా మారుతుంది.

చ‌ర‌ణ్ సింగ్‌
(ర‌చ‌యిత - బెంగళూరులోని ఐఐఎంలో ఆర్‌బీఐ ఛైర్ ప్రొఫెస‌ర్‌)
Posted on 22-08-2015