Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పన్ను పోట్లకు సమగ్ర వైద్యం!

కీకారణ్యాన్ని తలపిస్తున్న పన్నుల వ్యవస్థలో చెల్లించేవారిని చెండుకుతినే దుర్వినీత ధోరణి దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న దేశం మనది. పన్ను ఎగవేతదారులపై కొరడా ఝళిపించాల్సిన యంత్రాంగం- అందరినీ ఒకే గాటన కట్టి వరస నోటీసులతో తీవ్రాందోళనలోకి నెట్టేస్తున్న అతి పోకడలు నిజాయతీపరుల్ని కుపితుల్ని చేస్తున్నాయి. కేఫ్‌ కాఫీ డే అధిపతి సిద్ధార్థ ఆత్మహత్య దరిమిలా ‘పన్ను ఉగ్రవాదం’పై భయాందోళనలు దీర్ఘశ్రుతిలో చెలరేగిన దరిమిలా- నిజాయతీగా పన్ను చెల్లించేవారితో అనుమానాస్పదంగా వ్యవహరించరాదని ప్రధాని మోదీయే ఎర్రకోటనుంచి స్పష్టీకరించాల్సి వచ్చింది. పన్నుల యంత్రాంగం ‘మైండ్‌ సెట్‌’ మారాల్సి ఉందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో- చెల్లింపుదారులతో సమాచారాన్ని స్నేహపూర్వకంగా పంచుకొనే కొత్త విధానానికి తెరలేచింది. సమర్పించిన పన్ను పత్రాల్లో ఏదైనా ఖర్చునో, సమాచారాన్నో పేర్కొనని పక్షంలో ఐటీ విభాగంనుంచి ఆయా సెక్షన్లను ఉటంకిస్తూ ధాటిగా నోటీసులు దూసుకురావడం పరిపాటి. ఆ ఆనవాయితీకి చెల్లుకొట్టి మొట్టమొదటే వ్యక్తులను, సంస్థలను నోటీసులతో హడలకొట్టరాదని, టీడీఎస్‌ డిపాజిట్లపై సందేశాలు పంపినట్లుగానే సంక్షిప్త సమాచారం అందివ్వాలన్న నిర్ణయం సహర్షంగా స్వాగతించదగింది. చెల్లింపుదారుల సమస్త సమాచార నిధిని విశ్లేషించే యంత్రాంగాలు సిద్ధంగా ఉండటంతో భారీ నగదు డిపాజిట్లు, ఖరీదైన లావాదేవీల సమాచారాన్ని పన్ను పత్రాల సమర్పణ కంటే ముందే చెల్లింపుదారుల దృష్టికి తెచ్చే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. పన్ను ఎగవేతపై గట్టి రుజువులు, పన్ను పత్రాల్లో భారీగా తేడాపాడాలున్నప్పుడు మాత్రమే అధికారులు చెల్లింపుదారుల్ని సంప్రతించాలని, అప్పుడు కూడా నోటీసులతో హడావుడి చెయ్యకుండా, తప్పు సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వాలని తాజా నిర్దేశాలు చాటుతున్నాయి. దేశార్థిక స్థితి అధ్యయనంతోపాటు, పన్ను అధికారుల్లో పరివర్తన నిమిత్తం కేంద్రమంత్రి నిర్మల ఎనిమిది నగరాల్లో పర్యటించి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఏటికేడు రాబడి అంచనాల్ని అహేతుకంగా పెంచుకొంటూ పోవడమే అధికారుల ‘అతి’కి ప్రధాన హేతువన్న విశ్లేషణల్ని ఏమాత్రం విస్మరించే వీల్లేదు!

గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ నిర్దేశించిన రాబడుల లక్ష్యం రూ.12 లక్షల కోట్లు! మొన్న మార్చి 23నాటికి ఇంకా 14.9 శాతం రాబడి తరుగుపడిందంటూ- ‘వెంటనే సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకొని బకాయిల వసూళ్లపై దృష్టిపెట్టి లక్ష్యాన్ని సాధించా’లని సీబీడీటీ మార్చి 26న ప్రధాన ఆదాయ పన్ను కమిషనర్లకు చేసిన సూచన కలకలం రేపింది. ఈ తరహా ఉత్తర్వులు ఐటీ అధికారులపై ఒత్తిడి పెంచి అనుచిత వేధింపులకు కారణమవుతాయంటూ బాంబే, కర్ణాటక, లక్నో, సూరత్‌, అహ్మదాబాద్‌లకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంఘాలు ప్రధానికి, విత్తమంత్రికి లేఖ రాశాయి. దానికేపాటి మన్నన దక్కిందో తెలియదుగాని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడి లక్ష్యాన్ని సీబీడీటీ నిరుటికంటే 20శాతం పెంచింది! ఇలాంటి లక్ష్యాల ఛేదన ఐటీ అధికారుల్ని అక్షరాలా వేటగాళ్లుగా, అవినీతి ఆటగాళ్లుగా మార్చేస్తోంది. ముందు పన్నులు కట్టి దానిపై అప్పీలు ద్వారా తిరిగి సొమ్ములు రాబట్టుకోవాలని ఐటీ అధికారులే కార్పొరేట్లకు సలహాలిస్తున్న వాతావరణంలో, 2017-18లో వివాదంలో ఉన్న కార్పొరేట్‌ పన్ను మొత్తం రూ.3.99 లక్షల కోట్లకు చేరి, వివాద రహిత పన్నుకు 5.8 రెట్లుగా లెక్కతేలింది! 2018-19కి సంబంధించి సీబీడీటీ వెలువరించిన కేంద్రీయ కార్యాచరణ పథకం- ఆదాయ పన్ను కమిషనర్లు (అప్పీలు) నిర్ణీత కాలావధుల్లో కేసులు తేల్చేయాలని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులిస్తే ప్రోత్సాహకాలుంటాయనీ ప్రకటించింది. దానిపై దాఖలైన కేసులో- ఏమాత్రం న్యాయబద్ధంగాని ‘ప్రోత్సాహ ప్రతిపాదన’ను బాంబే హైకోర్టు మొన్న ఏప్రిల్‌లో తోసిపుచ్చింది. పై స్థాయినుంచీ పన్నుల వ్యవస్థ సక్రమంగా లేదనేందుకు సూచికలివి!

చెల్లించేవారిని వేధించే విధంగా పన్నుల వ్యవస్థ ఉండరాదన్న విఖ్యాత ఆర్థికవేత్త రాజా జె.చెల్లయ్య హితవాక్యం ప్రభుత్వాలకు ఏనాడో పరగడుపున పడిపోయింది. ఆదాయం, జవాబుదారీతనం, నైతిక ప్రవర్తన, సమాచారం, డిజిటలీకరణ అనే అయిదు స్తంభాలపై పన్నుల వ్యవస్థ కుదురుకోవాలన్న 2016 జూన్‌నాటి మోదీ సంకల్పం ఇంకా సాకారం కానేలేదు. ‘ప్రాజెక్ట్‌ ఇన్‌సైట్‌’ పేరిట సమాచార నిధిని మధించి పన్ను ఎగవేత అవకాశం ఉన్నవాళ్ల భరతం పట్టాలని ఐటీ విభాగం భావిస్తుంటే, సీబీడీటీ వెలువరించిన 32 పేజీల మార్గదర్శకాలు కొత్త భయాలు పెంచుతున్నాయి. అవినీతి అధికారుల చేతుల్లో అవి పీడనకు సాధనాలుగా మారే ప్రమాదం ఏమాత్రం తోసిపుచ్చలేనిది. రెండు నెలలనాడు కేంద్ర ప్రభుత్వం 27మంది సీనియర్‌ పన్ను అధికారుల్ని సాగనంపినా, ప్రక్షాళన పూర్తి అయిందని చెప్పే వీల్లేదు. 1961నాటి ఆదాయ పన్ను చట్టానికి అవసరానుగుణంగా సవరణలు చేస్తూ పోవడంతో చదువుకొన్నవారికీ ఒక పట్టాన అంతుపట్టని ప్రహేళికగా, అవినీతిపరులకు కామధేనువుగా అది భ్రష్టుపట్టిందనడంలో సందేహం లేదు. పన్నుల సరళీకరణ, హేతుబద్ధీకరణ, సమర్థ కార్యాచరణే లక్ష్యాలుగా ప్రత్యక్ష పన్నుల స్మృతిని పట్టాలకెక్కిస్తామన్న ప్రతిపాదనలు దశాబ్దకాలంగా నీరోడుతున్నాయి. చెల్లింపుదారుల పన్ను ఖాతాల తనిఖీ చెల్లింపుదారులతో ముఖాముఖి లేకుండా సాగడం, వివాదాల్ని పరిహరించడం, అప్పీళ్ల సత్వర పరిష్కారం వంటి కీలకాంశాల్నీ పరిశీలించి ప్రత్యక్ష పన్ను స్మృతి తెస్తామంటున్న మోదీ ప్రభుత్వం- అన్ని స్థాయుల్లోనూ దిద్దుబాటు చర్యల్ని వేగవంతం చెయ్యాలి. పన్ను రేట్ల హేతుబద్ధీకరణతోపాటు అధికారుల స్థాయిలో అవినీతి, దుర్విచక్షణల్ని రూపుమాపితే, ప్రగతిశీల సంస్కరణగా అది సన్నుతులందుకొంటుంది!

Posted on 19-08-2019