Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రోత్సాహకాలతో మెరుపు వేగం

* విద్యుత్‌ వాహనాలు-విక్రయాల వృద్ధికి మార్గాలు

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు, పరిశ్రమల్లో ఉత్కంఠ, ఉత్తేజం వ్యక్తమవుతున్నాయి. ఈ లక్ష్యసాధనకు భారత్‌లో ‘ఎలక్ట్రిక్‌ వాహనాల శీఘ్ర ఉత్పత్తి, వినియోగ పథకం’లో రెండో దశ (ఫేమ్‌ ఇండియా ఫేజ్‌ 2)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 ఏప్రిల్‌ నుంచి మూడేళ్లలో ఈ పథకంపై రూ.10,000 కోట్లు వెచ్చించి 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, అయిదు లక్షల త్రిచక్ర వాహనాలు, 55,000 నాలుగు చక్రాల వాహనాలు, 7,000 బస్సుల తయారీకి ఊతమివ్వదలచారు. ఈ వాహనాల కోసం ప్రధాన రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. ఎలక్ట్రిక్‌ వాహన ధరను కొనుగోలుదారు కోసం తగ్గించి, ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం వాహన ఉత్పత్తిదారుకు చెల్లించాలని ఫేమ్‌-2 సంకల్పిస్తోంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు కిలోవాట్‌ పై రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఈ విధమైన రాయితీ లభిస్తుంది. దాంతోపాటు కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్‌ వాహనాల (ఈవీల)పై జీఎస్టీని 12 నుంచి అయిదు శాతానికి తగ్గించారు. ఈవీలు కొనడానికి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో లక్షన్నర రూపాయలపై ఆదాయ పన్ను తగ్గింపు లభిస్తుంది కూడా.

కాలుష్యానికి కళ్లెం
ఈవీల వినియోగం పెరిగితే మన నగరాలు, పట్టణాల్లో కాలుష్యం తగ్గుతుంది. చమురు దిగుమతులు తగ్గి విదేశ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే నీతి ఆయోగ్‌ 2030కల్లా దేశంలో పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలనే విక్రయించాలని, అందరూ వాటినే వాడాలంటూ కేంద్ర మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పత్రం సమర్పించింది. అదే జరిగితే 5.4 కోట్ల టన్నుల చమురు దిగుమతులను నివారించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చునని, వినియోగదారులకు ఇంధన బిల్లులో రూ.17,200 కోట్లు ఆదా అవుతాయని ఆ పత్రం తెలిపింది. ఇంకా ఈవీల వినియోగం వల్ల 84.6 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలుగుతాం. ప్రభుత్వం విధానపరమైన ప్రోత్సాహకాలను ఇస్తే ప్రైవేటు కార్లలో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం 2030కల్లా ఈవీలుగా మారిపోతాయని నీతి ఆయోగ్‌ లెక్కగట్టింది. వాహన రంగంలో ఈ విధమైన రూపాంతరీకరణను సాధించాలంటే ప్రభుత్వం చేయాల్సింది చాలానే ఉంది. ప్రపంచంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య 2030కల్లా 12.5 కోట్లకు చేరుతుందని 2017లో అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసింది. 2018లో అమ్ముడైన ఈవీల సంఖ్య కేవలం 21 లక్షలని గుర్తుంచుకుంటే, ఆ అంచనా ఎంతవరకు నిజమవుతుందని సందేహం వస్తుంది. నేడు ప్రపంచంలో ఈవీ విక్రయాల్లో 56 శాతం వాటాతో చైనా అగ్రస్థానంలో ఉంది. తదుపరి మూడు స్థానాలను ఐరోపా, అమెరికా, జపాన్‌లు ఆక్రమిస్తున్నాయి. అన్ని దేశాల్లో కలిపి 56 లక్షల వాహనాలు ఉంటే, వాటిలో 26 లక్షలు ఒక్క చైనాలోనే తిరుగుతున్నాయి. మొత్తం ఈవీ విక్రయాల్లో 90 శాతం పైనచెప్పుకొన్న నాలుగు మార్కెట్లలోనే జరుగుతున్నాయి.

ఒక దార్శనిక పత్రం విడుదల చేసి, ఏవో కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించగానే పని జరగదు. వాహన వినియోగ సంస్కృతిలో మార్పు రావాలి. వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం ముందుకు కదలాలి. ప్రస్తుతం భారతదేశంలో ఈవీల విక్రయం చాలా స్వల్పం. 2018-19లో మొత్తం ఆటోమొబైల్‌ విక్రయాలు 2.62 కోట్లయితే, వాటిలో 2.11 కోట్లు ద్విచక్ర వాహనాలే. ప్రయాణికుల వాహనాలు 33.77 లక్షలు, వాణిజ్య వాహనాలు 10.07 లక్షలు, త్రిచక్ర వాహనాలు ఏడు లక్షలు. భారత్‌లో అమ్ముడయ్యే ప్రయాణికుల కార్లలో 99 శాతం చిన్న, మధ్య రకాలకు చెందినవి. 2018-19లో భారత్‌లో 7,59,600 ఈవీలు విక్రయమవగా అందులో 1,26,000 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, 6,30,000 త్రిచక్ర వాహనాలు, 3,600 ఎలక్ట్రిక్‌ ప్రయాణికుల వాహనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు విజృంభించాలంటే ప్రజల అలవాట్లు, అభిరుచులు మారాలి. పెట్రోలు, డీజిల్‌ వంటి కాలుష్య కారక శిలాజ ఇంధనాలను వదలి ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్ళాలి. అందుకు అందుబాటు ధరలు, వినియోగ సౌలభ్యం, ప్రోత్సాహక యంత్రాంగం, వాహన వినియోగ సంస్కృతిలో మార్పు వంటివి ఎంతో దోహదం చేస్తాయి. భారతీయ వినియోగదారులకు ధర గురించి పట్టింపు జాస్తి. కానీ, దేశంలో ఇప్పటికీ ఈవీ ధరలు వారికి అందుబాటులోకి రాలేదు. మామూలు మోటారు వాహనాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తారు కాబట్టి, వాటి ఉత్పత్తి వ్యయం తద్వారా అమ్మకం ధరలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీల) ఉత్పత్తి ఇంకా అంతటి భారీస్థాయిని అందుకోలేదు కాబట్టి, ధరలు దిగిరావడం లేదు. ఈవీలు రోడ్లపైకి వచ్చాక వాటికి తరచూ ఛార్జింగ్‌ చేస్తుండాలి. కానీ, భారత్‌లో విద్యుత్‌ ప్రసార, పంపిణీలు సక్రమంగా ఉండవు కనుక ఈవీల ఛార్జింగ్‌లో తేడాలు వచ్చి మొత్తం వాహనమే దెబ్బతినిపోవచ్చు. ఈ వాహనదారుల కోసం సరైన ఓల్టేజీతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసే ఛార్జింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈవీల విక్రయానంతర సేవలకు సర్వీసు కేంద్రాలను విరివిగా నెలకొల్పాలి. ఈవీల వాడకం విస్తరించకపోవడానికి ప్రధాన కారణం రీఛార్జింగ్‌ సౌకర్యాల కొరతే.

అధిగమించాల్సిన సమస్య
నేడు మహా ఖరీదైన ఎలక్ట్రిక్‌ కారు మాత్రమే ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 460 కిలోమీటర్లు తిరుగుతుంది. జర్మనీలో 600 కిలోమీటర్లు తిరిగే కారును తయారు చేశారు కానీ, దాని ధర చుక్కల్లోనే ఉంది. భారతీయ విపణిలో అంతటి ఖరీదైన కార్లు కొనగలిగేవారు చాలా తక్కువమంది ఉంటారు. అదీకాకుండా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీల ధర చాలా ఎక్కువ. ఈవీల వినియోగం భారీగా పెరిగితే వీటి ధర దిగివస్తుంది. ఆ రోజు రావాలంటే ప్రభుత్వం రీఛార్జింగ్‌ కేంద్రాల్లో ఛార్జింగ్‌ ఖాళీ అయిన బ్యాటరీలను తీసుకుని పూర్తిగా ఛార్జి చేసిన బ్యాటరీలను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించాలి. అప్పుడు ఈవీలు ఛార్జింగ్‌ కేంద్రాలకు వచ్చి పాత బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలు అమర్చుకుని శీఘ్రంగా ముందుకు కదలగలుగుతాయి. అందుకు వీలుగా ప్రభుత్వం సరైన ప్రమాణాలతో బ్యాటరీల తయారీ, పంపిణీ జరిగేలా పూచీకత్తు వహించాలి. ఈవీ బ్యాటరీల తయారీకి ముడిసరకులు సమీకరించడమూ సమస్యాత్మకమే. ఈ బ్యాటరీల్లో లిథియం, కోబాల్ట్‌, నికెల్‌, రాగి లోహాలు వాడతారు. వీటిలో లిథియం లేనిదే బ్యాటరీ తయారుకాదు. ప్రతి ఈవీ ధరలో 40-50 శాతాన్ని లిథియం అయాన్‌ బ్యాటరీలే ఆక్రమిస్తాయి. ఈ లోహాలను చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే. లిథియం నిక్షేపాలు ప్రధానంగా ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా, చైనా, జింబాబ్వేలలోనే దొరుకుతున్నాయి. అమెరికాలో కేవలం రెండు శాతం లిథియం నిక్షేపాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి భారత్‌ లిథియం కొనుగోలు చేద్దామనుకున్నా అది అంత సులువు కాదు. కారణం- చైనా ఇతర దేశాల్లోని లిథియం నిక్షేపాల కొనుగోలుకు ఇప్పటికే రూ.30,000 కోట్ల పెట్టుబడి పెట్టడమే. 2030 కల్లా ప్రపంచ లిథియం సరఫరాలో 60 శాతాన్ని చైనా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని అంచనా. ప్రపంచ కోబాల్ట్‌ నిక్షేపాల్లో 60 శాతం కాంగోలో ఉన్నాయి. ఆ దేశం నిరంతరం అంతర్గత కల్లోలంలో మునిగితేలుతోంది. స్వదేశంలో, విదేశాల్లో లిథియం, కోబాల్ట్‌ నిక్షేపాల నికర సరఫరాకు భారత్‌ ఏర్పాట్లు చేసుకోకపోతే, ఇప్పుడు చమురు దిగుమతి చేసుకొంటున్నట్లు రేపు చైనా నుంచి ఈవీ బ్యాటరీలను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. చైనాతో మనకు ఉన్న సమస్యల రీత్యా అది ఎంతమాత్రం అభిలషణీయం కాదు.

భారతీయ వినియోగదారులు హోదా కోసం, అవసరం కోసం మోటారు వాహనాలను కొంటారు. మహా ఖరీదైన వాహనాలను కొనడం చాలామందికి ఒక ఫ్యాషన్‌. ఎలక్ట్రిక్‌ కార్లు, ద్విచక్ర వాహనాలను కొనడం ఒక అవసరంగా, హోదా చిహ్నంగా జనం భావించేట్లు చేస్తే- ఈవీల వినియోగం ఊపందుకొంటుంది. దీనికి ప్రభుత్వం, పరిశ్రమ, అడ్వర్టయిజింగ్‌ రంగాలు సమన్వయంగా పనిచేయాలి. చివరగా ఈవీల వినియోగం పెరిగితే మామూలు మోటారు కార్లు, స్కూటర్లు, మోటారు సైకిళ్ల అమ్మకాలు పడిపోతాయి. అది మోటారు వాహన పరిశ్రమలో భారీ ఉపాధి నష్టానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ పరిశ్రమలో 20 లక్షలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. చమురు మార్కెటింగ్‌ కంపెనీల్లో మరో రెండు లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, నిర్వహణకు సంబంధిత నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అవసరపడతారు. అంటే, సంప్రదాయ ఆటో పరిశ్రమలో ఉపాధి విచ్ఛిత్తి జరగవచ్చు. కాబట్టి, ఆటో కార్మికులకు కొత్త నైపుణ్యాలు అబ్బించాలి. ఆధునిక ఈవీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తే, పాత ఆటో పరిశ్రమలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. రెండింటినీ సమతూక పరచడానికి కొత్త ఈవీ కార్మికుల సరసన పాత ఆటో కార్మికులకూ ఉపాధి అవకాశాలు పెంచాలి.

రీఛార్జింగ్‌తో తంటాలు
ఒకసారి కారు ట్యాంకులో పూర్తిగా పెట్రోలు కానీ, డీజిల్‌ కానీ నింపితే సుమారు 250-400 కిలోమీటర్ల దూరం పయనించవచ్చు. అంత పెట్రోలు నింపడానికి కేవలం అయిదు నుంచి 10 నిమిషాలు పడుతుంది. అదే ఎలక్ట్రిక్‌ వాహనానికి రీఛార్జి చేయాలంటే సగటున మూడు గంటల సమయం పడుతుంది. రీఛార్జి చేశాక అది కేవలం 160 కిలోమీటర్ల దూరం తిరుగుతుంది. కొన్ని ఈవీలకు వేగంగా రీఛార్జి చేయడానికి 35-40 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా రీఛార్జి చేయాలంటే ఎనిమిది గంటలు పడుతుంది. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతివారు కారులో రోజుకు 50 కిలోమీటర్లు తిరుగుతారనుకొందాం. వారి కారులో ఒకసారి పెట్రోలు లేక డీజిల్‌ను నింపితే 7-10 రోజులు తిరగవచ్చు. అదే ఎలక్ట్రిక్‌ వాహనమైతే ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి రీఛార్జి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు 250 నుంచి 400 కిలోమీటర్ల దూరం తిరిగే ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాల రీఛార్జింగ్‌ ఎంత వ్యయప్రయాస భరితమో అర్థం చేసుకోవచ్చు.Posted on 21-08-2019