Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పోలవరానికి ని‘బంధనాలు’

* పనుల పురోగతిలో అడ్డంకులు

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేసింది. నవయుగ, బెకం వంటి నిర్మాణ సంస్థలను పనుల నుంచి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ నోటీసులు జారీచేసింది. పరస్పర అంగీకారంతో ఈ ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు జలవనరుల శాఖ నిర్ణయించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నవయుగ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది.

రద్దుకు కారణాలివీ...
ప్రభుత్వ వాదన ప్రకారం- పనులన్నీ నామ నిర్దేశ (నామినేషన్‌) పద్ధతిలో అప్పగించారు. ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌-కన్‌స్ట్రక్షన్‌ (ఇ.పి.సి) పనులను ఏకమొత్తం పద్ధతిలో ఇవ్వడం సరికాదు. ఒప్పంద నిబంధనలను మినహాయిస్తూ డీజిల్‌, స్టీల్‌, సిమెంట్‌లకు పనులతో కలిపి కాకుండా, ప్రత్యేకనిధి ద్వారా చెల్లింపులు జరపడం నిబంధనలకు విరుద్ధం- ఈ కారణాలను ఏకరవు పెడుతూ ఒప్పందాన్ని ముందస్తుగా ముగించుకునేందుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఒప్పందాన్ని రద్దుచేసుకొని, కొత్త టెండర్లను పిలవనున్నట్లు ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. అధిక విలువైన పనులకు టెండర్లు పిలవకుండా నామనిర్దేశ (నామినేషన్‌) పద్ధతిలో గుత్తేదారు సంస్థలకు అప్పగించడం సరైనది కాదని రాష్ట్రప్రభుత్వం చూపిన కారణాలు సబబైనవే. పనులను వేగంగా పూర్తి చేయకపోవడం వల్ల ఈ సంస్థలతో ఒప్పందాలను రద్దుచేయడం లేదని, మళ్లీ నవయుగ సంస్థ కొత్తగా టెండర్లలో పాల్గొనవచ్చునని వెసులుబాటు కల్పించింది. ఒప్పందాల రద్దు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఏటా నిర్మాణ సామగ్రి, శ్రామికుల కూలీ ధరలు పెరగడం తెలిసిందే. ఫలితంగా కొత్త టెండర్లలో గుత్తేదారులు ఊటంకించే పనుల విలువలు, ప్రస్తుతం రద్దుచేసే ఒప్పంద విలువల కంటే ఎంతోకొంత ఎక్కువగా ఉంటాయేగానీ, తక్కువగా ఉండటానికి ఆస్కారం లేదు. గతంలో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ నుంచి 60సి నిబంధన కింద కొత్త పనిని తప్పించి, అంచనాలపై 14 శాతం తక్కువ ధరలకే ప్రభుత్వం నవయుగ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు టెండర్లలో పాల్గొనే కొత్త గుత్తేదార్లుగానీ, చివరకు గతంలో పనిచేసిన నవయుగ సంస్థగానీ, పాత ధరలకు పనిచేయడానికి ముందుకు రాకపోవచ్చు. వారు కొత్త టెండర్లలో ఉటంకించే పనుల ధరలు ఇప్పుడు రద్దుచేసిన ఒప్పందాలలోని ధరల కంటే ఎక్కువగా ఉంటాయి. కొత్తగా పనులను దక్కించుకొనే గుత్తేదార్ల సంస్థలు పనులను ప్రారంభించి చురుకుగా సాగించడానికి కొంత సమయం పడుతుంది. ఈ విధంగా ప్రస్తుత గుత్తేదార్ల ఒప్పందాలను రద్దుచేయడం వల్ల, పనులను పూర్తిచేయడంలో విపరీతమైన జాప్యంతోపాటు, నిర్మాణ విలువలు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల అధికవ్యయంతోపాటు, ప్రాజెక్టు వల్ల కలిగే ఫలితాలు లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరుగుతుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ప్రస్తుత ఒప్పందాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.

2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రాజెక్టు సాగునీటి విభాగానికయ్యే ఖర్చును వంద శాతం భరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టడానికి పచ్చజెండా ఊపింది. పనుల సమన్వయం, నాణ్యత నియంత్రణ, ఆకృతి, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్టు అనుమతులు, బాధ్యతలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అప్పగించారు. ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం చేపట్టడంవల్ల, పనులు వేగంగా పూర్తయి, సాగునీటి సౌకర్యం కలుగుతుందని, దానివల్ల రాష్ట్రానికి పెద్దయెత్తున లబ్ధి చేకూరుతుందని కేంద్రం పేర్కొంది.

వ్యయానికి రెక్కలు
ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశముంది. నవయుగ సంస్థ పనితీరు బాగుందని, ఒప్పందాల రద్దుతో జాప్యం తప్పదని, వ్యయం పెరిగితే కేంద్రం భరించబోదని, నైపుణ్యం, ఆకృతుల పరంగా సమన్వయానికి పూచీ ఎవరని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ ఇటీవల ప్రశ్నించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగ సంస్థకు పనులను అప్పగించినప్పుడు మూడు నెలల సమయం వృథా అయిందని, ఇప్పుడు మరో మూడు నెలలు వృథా అయితే ఒక సీజను పోతుందని పీపీఏ పేర్కొంది. మొదట్లో మధుకాన్‌ కంపెనీ పనులు చేస్తున్నప్పుడు వాటిని రద్దుచేసి, ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు ఇవ్వడానికి నాలుగేళ్ళు పట్టిన విషయాన్ని పీపీఏ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా జాప్యం జరగదన్న పూచీ ఏమిటని పీపీఏ ప్రశ్నించింది. నవంబరు ఒకటో తేదీ కల్లా పనులు ప్రారంభిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాధికారుల వాదనతో పీపీఏ అధికారులు ఏకీభవించడం లేదని తెలుస్తోంది.

ప్రాజెక్టు విశిష్టత
ప్రాజెక్టు వల్ల దాని పరివాహక ప్రాంతంతో సంబంధం లేకుండా, ఉత్తరాంధ్ర నుంచి దిగువన అనంతపురం వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల కృష్ణాడెల్టాకు సకాలంలో నీరందుతుంది. ఆ మేరకు నీటిని శ్రీశైలం జలాశయంలో ఉంచుకొని, రాయలసీమకు కృష్ణా జలాలు అందించవచ్చు. స్పిల్‌వే, రాతి-మట్టి డ్యాములను (ఎర్త్‌కమ్‌ రాక్‌ అండ్‌ లోడ్యామ్స్‌) ఒకే వరుసలో నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. రాతి-మట్టి డ్యామ్‌ కింద నదీగర్భంలో 150 అడుగుల లోతు నుంచి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మిస్తున్నారు. ఈ రాతి-మట్టి కట్ట పొడవు 175 మీటర్లు. కింది భాగంలో కట్టవెడల్పు 300 మీటర్లు. ఈ కట్ట గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకోగలదు. ప్రధానమైన స్పిల్‌వేకి 48 గేట్లుంటాయి. ఒక్కొక్క గేటు సైజు 16 మీటర్లు × 20 మీటర్లు. ఈ గేట్లను ప్రాజెక్టు సమీపంలోనే తయారు చేస్తున్నారు. ప్రాజెక్టు పనులలో గతంలో రోజుకు సుమారు నాలుగు వేల మంది కార్మికులు శ్రమించారు. పనుల్లోని సాంకేతిక సంక్లిష్టతల దృష్ట్యా కొన్ని విదేశీ సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేర్చుకున్నారు. ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న భారీక్రేన్లు, టిప్పర్లు, టెలీబెల్ట్‌ యంత్రాలను విదేశాల నుంచి తెప్పించారు. గట్టు మీద నుంచే 250 మీటర్ల పరిధిలో కాంక్రీటు వేయగల టెలీబెల్ట్‌లను వినియోగిస్తున్నారు. విభజన హామీల్లో భాగంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దీనికయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ వ్యయాన్ని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ద్వారా ఇప్పిస్తామని భరోసా ఇచ్చింది. పోలవరానికి ప్రాధాన్యం ఇస్తూ, 2018 నాటికే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని నాటి కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొనడం గమనార్హం!

ప్రాజెక్టుకు 1981లో శంకుస్థాపన చేశారు. 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న తెలంగాణలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో ఒక సమస్య పరిష్కారమైంది. మొత్తం 30 లక్షల ఘన మీటర్ల కాంక్రీటు పనుల్లో 2018 జనవరి ఒకటి వరకు అయిదు లక్షల ఘన మీటర్ల పని మాత్రమే చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ను తప్పించి, మిగిలిన 25 లక్షల ఘన మీటర్ల కాంక్రీటు పనిని 2019 మార్చి నాటికి పూర్తిచేయాలన్న షరతుతో రాష్ట్రప్రభుత్వం నవయుగ నిర్మాణ సంస్థకు అప్పగించింది. అనంతరం కాంక్రీటు పనులు వేగం పుంజుకున్నాయి. 2018 నవంబరు 25న ఒక్కరోజులో 11,248 ఘన మీటర్ల కాంక్రీటు వేశారు. చైనాలోని త్రీగార్జెస్‌ డ్యాములో గతంలో ఒక్క రోజులో వేసిన 13,000 ఘన మీటర్ల కాంక్రీటు ఇప్పటివరకు ప్రపంచరికార్డుగా ఉంది. దీనిని అధిగమించడానికి పోలవరంలో ఏర్పాట్లు జరుగుతూ వచ్చాయి. ఇంతలో పనులు ఆపివేశారు. మళ్ళీ ఎప్పుడు కొత్త టెండర్లను పిలుస్తారో, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో, వేగం పుంజుకొని అవి ఎప్పటికి పూర్తవుతాయో వేచి చూడాల్సిందే. నిబంధనలు ప్రాజెక్టుల పురోగతికి దోహదపడాలి తప్ప, వాటిని అడ్డుకోవడానికి కాదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలి!

Posted on 26-08-2019