Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రతిభావంతులకు పట్టం

* అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాల వెల్లువ

ధనిక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువతీయువకుల సంఖ్య తగ్గిపోతున్నందు వల్ల ఉద్యోగుల కొరత ఏర్పడింది. మరోవైపు డిజిటల్‌ సాంకేతికత విస్తరించి నైపుణ్య సిబ్బందికి గిరాకీ అంతకంతకూ పెరిగిపోతోంది. స్థానిక విద్యాలయాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణుల సంఖ్య గిరాకీని తీర్చే స్థాయిలో లేదు. ఫలితంగా సాఫ్ట్‌వేర్‌ మొదలుకొని ఇతర ఇంజినీరింగ్‌ విభాగాలు, డిజైనింగ్‌, విక్రయాల వరకు అంతటా నిపుణుల కొరత ఏర్పడుతోంది. ఎనలిటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆరోగ్య సంరక్షణ సేవల వరకూ ఇదే తీరు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, త్రీడీ ముద్రణ రంగాలు పూర్తిస్థాయిలో విజృంభించాక పరిస్థితి ఎలా ఉంటుందోనని అమెరికా, కెనడా తదితర దేశాలు కలవరపడుతున్నాయి. ఈ ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యాలతోపాటు సంభాషణా సామర్థ్యం, నిరంతర అధ్యయనాసక్తి వంటి మెలకువలు సైతం అవసరం. అమెరికాలోని కళాశాల పట్టభద్రుల్లో సాంకేతిక అర్హతలు, ఇతరత్రా మెలకువలు కలిగినవారు కేవలం 35 శాతమేనని ఓ అంచనా. అందుబాటులో ఉన్న ఈ కొద్దిమందికి విపరీతమైన గిరాకీ ఏర్పడినందు వల్ల వారు ఒకే సంస్థలో కుదురుగా ఉండటంలేదు. అధిక వేతనాలు, సౌకర్యాలను ఇచ్చే సంస్థలకు త్వరత్వరగా మారిపోతున్నారు. దీనితో సమర్థులను తయారు చేసుకోవడానికి ఆయా సంస్థలు నైపుణ్య బోధన-అభివృద్ధి సంస్థలను, అభ్యసన సాధనాలను ఆశ్రయించడం ప్రారంభమైంది.

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, బ్రిటన్‌ సహా 22 అభివృద్ధి చెందిన దేశాలను ఇప్పుడు ఉద్యోగాల వరద ముంచెత్తుతోంది. 36 దేశాల ఆర్థిక సహకార-అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)లో సభ్యత్వం గల ఈ దేశాలు గడచిన అయిదేళ్లలో 4.3 కోట్ల ఉద్యోగాలు సృష్టించాయి. ఇటలీ, స్పెయిన్‌, గ్రీస్‌ తప్ప ఇతర సభ్యదేశాలన్నింటిలో నిరుద్యోగం నామమాత్రంగానే ఉంది. ధనిక దేశాల్లో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత కనీస స్థాయికి నిరుద్యోగ రేటు పడిపోయి, పనిచేసేవారికి గిరాకీ పెరిగింది. ఇంతటి ఆర్థిక వెల్లువలోనూ కార్మికులు, ఉద్యోగుల జీతాలు పెరగడం లేదని, ఉబర్‌ డ్రైవర్లు, పిజ్జా డెలివరీ సిబ్బంది వంటి పరిమిత కాల ఉద్యోగాలనూ కలిపేసి అద్భుత గణాంకాలను విడుదల చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇందులో నిజం లేకపోలేదు. ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాలు ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారినే వరిస్తున్నాయి. అలాగని తక్కువ నైపుణ్యం గలవారు రోడ్డున పడుతున్నారని కాదు. ప్రస్తుతానికి రెండు రకాల ఉద్యోగులకు గిరాకీ ఉండటంతో సంస్థలు క్రమంగా వేతనాలు పెంచుతున్నాయి.

ఉపాధికి కొత్త చిగుళ్లు
కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ వల్ల కోల్పోతున్న ఉద్యోగాలకన్నా కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాలే ఎక్కువ. ఇప్పుడు అమెరికాలో ఏఐ, రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను సృష్టించగల డిజైనర్లకు, వాటికి పనులు నేర్పించేవారికి ఎంతో గిరాకీ ఉంది. ఏఐ సిస్టమ్స్‌, రోబోల విక్రయం, మరమ్మతు సేవల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వాటి సాయంతో సమాచారాన్ని విశ్లేషించి, విక్రయాలు పెంచగల డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణల కోసం సంస్థలు పోటీపడుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక స్వయంచలిత యంత్రాల (ఆటొమేషన్‌) వాడకం పెరిగిపోతోంది. సంబంధిత సాంకేతికత పరిజ్ఞానం ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఈ మార్పులను వెనువెంటనే అందిపుచ్చుకోవడానికి సంస్థలు పరుగు తీయక తప్పడంలేదు. ఈ పోటీలో నెగ్గడానికి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను అమర్చుకోగానే సరిపోదు. వాటిని సమర్థంగా నడపగలవారి కోసం వెతుక్కోవలసి వస్తోంది. సాధారణ సిబ్బంది ఈ ఉద్యోగాలకు పనికిరారు. అన్ని అర్హతలు ఉన్నవారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. నిపుణులు ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతున్నారు. కానీ, అంతలోనే వేరే అవకాశాలు వస్తుండటంతో ముఖాముఖీలకు రావడం లేదు. ఇది ప్రధానంగా సేవారంగంలో కనిపిస్తోంది. సంప్రదాయ కర్మాగారాల్లో వేరే పరిస్థితి నెలకొంది. గతంలో అమెరికా నుంచి చైనాకు పరిశ్రమలు తరలిపోయినా, అవి హైటెక్‌ పరిశ్రమల రూపంలో తిరిగి అమెరికాకు వస్తున్నాయి. వాటిలో మానవ సిబ్బంది కన్నా స్వయంచాలిత యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రేపటి 5జీ యుగంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వచ్చి పరిశ్రమల్లో కార్మికుల అవసరం మరింత తగ్గిపోతుంది. ఇప్పుడూ అప్పుడూ సేవారంగం మాత్రం భారీ సంఖ్యలో సిబ్బందిని వినియోగిస్తుంది. అయితే ఆ రంగం అత్యంత ప్రతిభావంతులకే ఎర్రతివాచీ పరుస్తుంది. గడచిన పదేళ్లలో అంతర్జాలం ద్వారా సిబ్బంది నియామకాలు వేగం పుంజుకొన్నా, అర్హులకు కొరత ఏర్పడటంతో ఇప్పుడు నియామకాలు నల్లేరు మీద నడకలా సాగడం లేదు. నేడు అమెరికాలో ఇదివరకటిలా పత్రికల్లోనో, అంతర్జాలంలోనూ ‘ఉద్యోగార్థులు కావలెను’ అని ప్రకటన ఇచ్చి కూర్చుంటే సరిపోదు. సంస్థలకు కావలసిన అర్హతలుండి దరఖాస్తు చేసేవారి కన్నా చేయని అభ్యర్థులే ఎక్కువైపోతున్నారు. వారి ముంగిట ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సాధారణ పని వారికి అంతర్జాలం వల్ల తేలిగ్గా పని దొరుకుతోంది. గతంలో నీటి కుళాయిల మరమ్మతుకు, ఫ్యాన్లు, ఎలక్టిక్ర్‌ సామాన్లను బిగించడానికి ఇంటి దగ్గర్లోని ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లను, ఇంటికి చిన్న మరమ్మతులు చేయాల్సి వస్తే పరిచయస్తులైన తాపీమేస్త్రీలను పిలిచేవారు. ఇప్పుడు అంతర్జాలంలో ఒక్కసారి క్లిక్‌ చేస్తే చాలు, ఎక్కడెక్కడి నుంచో పనివారు ఇంటిముంగిట వాలిపోతున్నారు. పెద్దగా నైపుణ్యాలు లేనివారికీ సులువుగా వేగంగా పని దొరకడంతో ఓఈసీడీ దేశాల్లో చిన్నాచితకా పనులు చేసేవారికి కొరత ఏర్పడింది.

విదేశీ నిపుణులకు అవకాశాలు
మరోవైపు నవీన ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చగల సంఖ్యలో ప్రతిభావంతులు లభ్యం కాక, వారికి గిరాకీ ఎక్కువై అధిక జీతభత్యాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి పరిశ్రమలు స్వయంచాలిత యంత్రాలను (ఆటొమేషన్‌) ఆశ్రయించినా, వాటిని నిర్వహించగల ప్రతిభావంతులకు కొరత ఏర్పడుతోంది. సంపన్న దేశాల ప్రజలు తక్కువ పని గంటలు, ఎక్కువ వేతనాలు డిమాండ్‌ చేస్తున్నారు. అధిక ఆదాయంతోపాటు విద్యావైద్య సౌకర్యాలు, పింఛన్లను ప్రభుత్వమే సమకూర్చాలని ఒత్తిడి పెంచుతున్నారు. వారి కోరికలను తీర్చాలంటే ప్రభుత్వ ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరగాలి. హైటెక్‌ పరిశ్రమలు, సేవల వల్ల మాత్రమే రాబడి పెరుగుతుంది. వాటిని నడపగల నిపుణులకు ఓఈసీడీ దేశాల్లో కొరత ఏర్పడినందువల్ల విదేశీ నిపుణులకు ద్వారాలు తెరవాల్సి వస్తోంది.

గ్రీన్‌కార్డుల విధానంలో మార్పులు...
నైపుణ్యాలున్న విదేశీయులకు శాశ్వత నివాస హక్కు కల్పించడానికి గ్రీన్‌ కార్డుల విధానాన్ని అమెరికా మార్చదలచింది. ఇటీవల అమెరికా ప్రజా ప్రతినిధుల సభ హెచ్‌-1బి వీసాపై పనిచేస్తున్న లక్షలమంది విదేశీ సాంకేతిక నిపుణులకు త్వరగా గ్రీన్‌కార్డులు ఇవ్వడానికి ఉద్దేశించిన బిల్లును అత్యధిక మెజారిటీతో ఆమోదించింది. ప్రస్తుతం అమెరికా ఏటా 12 లక్షలమంది విదేశీయులకు గ్రీన్‌కార్డులు ఇచ్చి శాశ్వత నివాస హక్కు కల్పిస్తోంది. వాటిలో ఎనిమిది లక్షల గ్రీన్‌కార్డులు కుటుంబ సంబంధాల ఆధారంగా ఇస్తున్నవే. అంటే అమెరికా పౌరులు సిఫార్సు చేసిన రక్తసంబంధీకులకు, జీవిత భాగస్వాములకు అత్యధిక గ్రీన్‌కార్డులు ఇస్తున్నారు. ఉపాధి ఆధారంగా ఇచ్చే ఈబీ వీసాలు 1,40,000 మాత్రమే. ఈబీలో అయిదు విభాగాలున్నాయి. అవి- అద్వితీయ విద్యార్హతలు కలిగిన ఆచార్యులు, పరిశోధకులకు ఇచ్చే ఈబీ-1, వైద్యులు, న్యాయవాదులు, మేనేజర్లకు ఇచ్చే ఈబీ-2, సాంకేతిక ఉద్యోగాలు చేసే పట్టభద్రులకు ఇచ్చే ఈబీ-3, మతపరమైన వలసదారులకు, అటువంటి ప్రత్యేక తరహా వలసదారులకు ఇచ్చే ఈబీ-4, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఈబీ-5... ఇవన్నీ కలిపి ఏడాదికి కేవలం 1,40,000 గ్రీన్‌ కార్డులు ఇస్తున్నారు. వీటిపై రెండు పరిమితులు విధించారు. ఒకటి- దేశాలవారీగా ఏడు శాతం కోటాలు, రెండు- కుటుంబ ప్రాతిపదికపై గ్రీన్‌కార్డులు మంజూరు చేయడం. ఈ పద్ధతిలో భారతదేశానికి అన్ని ఈబీ విభాగాల్లోనూ కలిపి ఏటా దక్కుతున్నవి-కేవలం 9,800 వీసాలే. వాటిని మళ్లీ కుటుంబ ప్రాతిపదికపై మంజూరు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక భారతీయ హెచ్‌-1బి వీసాదారుడికి గ్రీన్‌కార్డు లభించింది అంటే, అతడి భార్య, ఇద్దరు పిల్లలకూ అదే క్రమంలో గ్రీన్‌ కార్డులు వస్తాయి. ఈ పరిమితుల వల్ల ఇతర భారతీయ హెచ్‌-1బి వీసాదారులు గ్రీన్‌కార్డుల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అమెరికా ప్రజా ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లు ఈ ఏడు శాతం కోటాను ఎత్తివేసింది. దీనివల్ల భారతీయులు, చైనీయులు లబ్ధి పొందనున్నారు. విదేశీ నిపుణులకు ఇచ్చే గ్రీన్‌కార్డులను 1,40,000 నుంచి 6,65,000కు పెంచాలంటున్నారు ట్రంప్‌. ఏటా ఇచ్చే 12 లక్షల గ్రీన్‌కార్డుల్లో 57శాతాన్ని ప్రతిభ ఆధారంగా ఇవ్వాలంటున్నారు. ఈ మేరకు ట్రంప్‌ అల్లుడు, అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు జారెడ్‌ కుష్నర్‌ వలస విధాన ముసాయిదాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిభ ఆధారంగా ఇస్తున్న గ్రీన్‌కార్డులు 12శాతం వలసదారులకే లభిస్తున్నాయని, కెనడాలో ఆ సంఖ్య 53 శాతమని కుష్నర్‌ వివరించారు. ఇది న్యూజిలాండ్‌లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్‌లో 52శాతంగా ఉంది. అమెరికా సైతం ఇదే బాణీలో 57శాతం గ్రీన్‌కార్డులను ప్రతిభావంతులకు ఇచ్చే విధంగా వలస విధానాన్ని మార్చాల్సి ఉంది. సంపన్న దేశాల్లో నిపుణుల కొరత భారతీయ ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తోంది!

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 30-08-2019