Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రగతికి ప్రాతిపదికలేమిటి?

* గణాంకాల గారడి

దేశ ప్రగతి ప్రస్థానాన్ని అంచనా వేసేందుకు అనుసరించాల్సిన ప్రాతిపదికలేమిటి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు ఆధారంగా చేసుకొని దేశాభివృద్ధిని అంచనా వేయడం ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి. వృద్ధిరేటు గణాంకాలు ఎంత బాగుంటే దేశం అంతగా వెలుగులీనుతున్నట్లు ప్రభుత్వాలతోపాటు, విఖ్యాత ఆర్థికవేత్తలూ తీర్మానించేస్తున్నారు. జీడీపీ, వృద్ధిరేటును బట్టి దేశం గతిరీతులను తేల్చేసే విధానంలో కొన్ని లోపాలున్నాయి. దేశాభివృద్ధికి సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాలను జీడీపీ లెక్కలు ఎంతమేరకు ప్రతిఫలిస్తాయన్న విషయంలో అనుమానాలున్నాయి. దేశ ప్రజల వినియోగం, వస్తు సేవలు, ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతుల ద్వారా ఆర్జించిన ఆదాయాల ఏడాదికాల మొత్తం ద్రవ్య విలువను స్థూల దేశీయోత్పత్తిగా లెక్కగడుతుంటారు. జీడీపీ ఎంత ఎక్కువగా ఉంటే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అంత గరిష్ఠంగా దఖలుపడుతుందని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర పెట్టుబడులకోసం ప్రభుత్వం దగ్గర సమృద్ధిగా నిధులు పోగుబడతాయన్నది ఒక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలోని భిన్న రంగాల పనితీరును జీడీపీ గణాంకాలు ప్రతిఫలిస్తాయి కాబట్టి- వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవడం సులభమన్నది ఇంకో వాదన. దేశాభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థ పనితీరును జీడీపీ గణాంకాలు నిర్దిష్టంగా ప్రతిఫలించవు. ప్రగతి అంచనాకు జీడీపీని ఏకైక కొలబద్ధగా పరిగణించడం సరికాదు. ఏడాది కాలంలో ప్రజల వినియోగ స్థాయి ఎంత అన్న విషయాన్ని జీడీపీ గణాంకాలు వివరిస్తాయేగానీ- ప్రజల వినియోగం తీరుతెన్నుల్లోని అసమానతలకు ఆ గణాంకాలు అద్దం పట్టవు.

స్థూల దేశీయోత్పత్తి సంవత్సర కాల పరిమితిలో వినియోగ పరిమాణాన్ని వెల్లడిస్తుందిగానీ- ఆ క్రమంలో ఏయే వర్గాలు ఎంతెంత మొత్తం ఖర్చుపెడుతున్నాయన్న కీలక వివరాలను అందించదు. దేశంలో సుమారు 20శాతం ప్రజలు అంటే ఇంచుమించుగా 25 కోట్లకుపైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారనుకుంటే- రంగరాజన్‌ కమిటీ లెక్కల మేరకు ఆ జాబితాలోని ప్రతి ఒక్కరు రోజుకు 32 రూపాయలతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. ఆ రకంగా దేశంలోని పాతిక శాతం ప్రజల సగటు వ్యయం రూ.11,664 మాత్రమే! ఈ ప్రాతిపదికన పాతిక కోట్ల ప్రజల ఏడాదికాల సంచిత వినియోగం రూ.2,91,600 కోట్లుగా లెక్కతేలుతోంది. 2018-19 కాలానికి జీడీపీ పరిమాణం 140.78 లక్షల కోట్లు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పాతిక శాతం ప్రజల వినియోగం అందులో రెండు శాతానికి మాత్రమే సమానం కావడం గమనార్హం. తలసరి జీడీపీ రూ.105,688 కాగా అందులో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 25శాతం ప్రజల వ్యయం తొమ్మిది శాతానికి సమానం. వినియోగస్థాయుల్లో హెచ్చు తగ్గులు దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో అసమతౌల్యతకు కారణమవుతాయి. విలాసాలపై అత్యధిక వ్యయం చేస్తున్న వర్గం ఒకవైపు- కనీసావసరాలకూ దిక్కులేక సతమతమవుతున్న ప్రజానీకం మరోవైపు ఉన్న దేశం మనది. ఈ సూక్ష్మ వివరాలను పట్టించుకోకుండా ధనిక, మధ్యతరగతి, పేద వర్గాల వినియోగాన్నంతటినీ ఒకే గాటన కట్టి స్థూలంగా లెక్కలు చూపి- ‘ఆహా దేశం ఎంత గొప్పగా పురోగమిస్తోంది’ అని జబ్బలు చరచుకోవడం అహేతుకం. దేశం ప్రగతి దారుల్లో సాగుతోందని, ప్రజలంతా అత్యద్భుత జీవన ప్రమాణాలతో విలసిల్లుతున్నారని ప్రపంచానికి చాటుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమైతే ఈ తరహా జీడీపీ లెక్కలు బ్రహ్మాండంగా అక్కరకొస్తాయి. కానీ ఇలాంటి లెక్కలు భారతావని ఆర్థిక ఆరోగ్యాన్ని సమగ్రంగా ప్రతిఫలిస్తున్నాయా అని ప్రశ్నించుకుంటే మాత్రం లేదన్నదే సమాధానం.

ఉదాహరణకు దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దిగువ, మధ్యాదాయ వర్గాలు ఏడాదికాలంలో 40 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారనుకుందాం. ఇందులో గణనీయ ఆదాయానికి ప్రాతినిధ్యం వహించే కొద్దిమంది వాటా 35 లక్షల కోట్ల రూపాయలు అయితే- మిగిలిన వర్గమంతా అయిదు లక్షల కోట్ల ఖర్చుకే పరిమితమైనట్లు లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం 40 లక్షల కోట్ల రూపాయల వినియోగాన్ని యావత్‌ మధ్యతరగతికీ సమాన వాటాగా పంచితే జీవన ప్రమాణాలు గొప్పగానే లెక్కతేలతాయి. దేశ ఆర్థిక పురోగతికి ఈ తరహా అంచనాలు సరైన ప్రాతినిధ్యం వహిస్తాయా? ప్రభుత్వ వ్యయాన్నీ జీడీపీ లెక్కల్లో అంతర్భాగంగా గణిస్తారు. సర్కారీ పెట్టుబడులు ఎంతగా ఇనుమడిస్తే అంతగా దేశం పురోగమిస్తుందన్న వాదనలున్నాయి. అత్యవసర రంగాలను ఎంపిక చేసుకొని, నిర్దిష్ట ప్రాథమ్యాల మేరకు ప్రభుత్వం పెట్టుబడులు పెడితే ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వాల ప్రాథమ్యాల విషయంలోనే అనేక అనుమానాలున్నాయి. జీడీపీ వృద్ధిరేట్లు, లక్షల కోట్ల రూపాయలకు ప్రాతినిధ్యం వహించే గణాంకాలే పురోభివృద్ధికి ప్రాతిపదిక అయితే ఇప్పటికీ దేశంలో ఆరోగ్య రంగం ఎందుకు ఇంత దారుణంగా కునారిల్లుతోంది? ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ఇన్నేళ్ల స్వాతంత్య్రానంతరమూ ‘103’వ స్థానంలో ఎందుకు మగ్గుతోంది? ప్రాథమిక విద్యకు సంబంధించి అనేక దేశాలతో పోలిస్తే పరిస్థితి ఎందుకింత దిగనాసిగా ఉంది? పారిశ్రామిక రంగ సామర్థ్యం ఎందుకు అంతకంతకూ కొడిగడుతోంది? జీడీపీ లెక్కలనే జాతి అభివృద్ధి సంకేతాలుగా ప్రచారం చేస్తున్న ఆర్థికవేత్తలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తే మంచిది!


- సత్యపాల్‌ మేనన్‌
Posted on 30-08-2019