Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

విలీనంఎంత ప్రయోజనం?

* మారనున్న బ్యాంకింగ్‌ రంగ ముఖచిత్రం

బ్యాంకింగ్‌ చరిత్రలో అతి పెద్ద విలీన ప్రక్రియకు మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తెరతీసింది. ఈ రంగంలో సంస్కరణలను మరింత వేగవంతం చేసింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల విలీనాలను ప్రకటించి బ్యాంకింగ్‌ రంగ ముఖచిత్రానికి కొత్తరూపునిచ్చారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయాబ్యాంక్‌, దేనాబ్యాంక్‌ల విలీనానికి నాంది పలికి ఏడాదైనా పూర్తికాకముందే అతిపెద్ద పీఎస్‌బీల విలీనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా సంస్కరణల దిశగా మరో ముందడుగు వేసింది. పీఎస్‌బీల మధ్య పెద్దయెత్తున విలీనాలు చోటుచేసుకోవడం అనివార్యమన్న సంకేతాలు కొంతకాలంగా వెలువడుతున్నాయి. తిరుగులేని ఆధిక్యంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మాంద్యం బారినపడకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగా సంస్కరణల వేగం పెంచింది. పీఎస్‌బీల విలీనాలతోపాటు ఆ బ్యాంకుల బోర్డులను మరింత బలోపేతం చేసే దిశలో నిర్మలా సీతారామన్‌ కొన్ని కీలక సంస్కరణలు ప్రకటించారు. ఫలితంగా విలీనానంతరం బ్యాంకు బోర్డులకు మరిన్ని అధికారాలతో, మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు కలుగుతుంది. విలీనానంతరం బ్యాంకుల పనితీరు మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విలీన ప్రక్రియ సజావుగా సాగేందుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి ఉన్నతాధికారిని నియమించే అధికారాన్ని ఆయా బ్యాంకుల బోర్డులకు కట్టబెట్టడం కొసమెరుపు. బ్యాంకుల ‘రిస్క్‌ మేనేజ్‌మెంట్‌’ విధానాలను మరింత పటిష్ఠంగా, పకడ్బందీగా తీర్చిదిద్దేందుకు తొలిసారిగా చీఫ్‌ రిస్క్‌ అధికారులను నియమించుకొనే వెసులుబాటు కల్పించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పీఎస్‌బీల స్థిరీకరణకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలీనాలకు పచ్చజెండా ఊపడంతోపాటు, పది పీఎస్‌బీలకు రూ.55,250 కోట్ల మూలధనాన్ని అందించే ప్రతిపాదన చేశారు. దేశంలో మూడంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థ (అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు, జాతీయస్థాయి బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు) ఉండాలని, పీఎస్‌బీలను విలీనం చేసి, వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించాలని 1998లోనే నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం భారీ విలీనాలతో ఆ కమిటీ సిఫార్సులకు చెవొగ్గినట్లయింది.

నూతన శకారంభం
విలీనాలతో పీఎస్‌బీల ముఖచిత్రం పూర్తిగా మారడంతోపాటు, బ్యాంకింగ్‌ చరిత్రలో కొత్త శకం ఆరంభం కానుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల విలీనం తరవాత రూ.17.94 లక్షల కోట్ల వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు కలిపి)తో ఇది దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా ఎదుగుతుంది. గతంలో విజయాబ్యాంక్‌, దేనా బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.16.13 లక్షల కోట్ల వ్యాపారంతో మూడోస్థానంలో ఉండగా సిండికేట్‌ బ్యాంక్‌ విలీనానంతరం రూ. 15.20 లక్షల కోట్ల వ్యాపారంతో కెనరా బ్యాంక్‌ నాలుగో స్థానంలో ఉంటుంది. ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకుల విలీనంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.14.59 లక్షల కోట్ల వ్యాపారంతో అయిదో స్థానానికి చేరుతుంది. అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనంతో ఇండియన్‌ బ్యాంక్‌ వ్యాపారం రూ.8.08లక్షల కోట్లకు పెరుగుతుంది. విలీనానంతరం ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంకులు ఉనికి కోల్పోనున్నాయి. ఒకప్పటి మేటి బ్యాంకులు ఇకముందు కనుమరుగు కానున్నాయి. ఉదాహరణకు గతంలో పటిష్ఠమైన బ్యాంకుల్లో ఒకటిగా పేరొందిన, (అప్పట్లో) నిరర్థక ఆస్తుల రహిత బ్యాంకుగా వెలుగొందిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ తన ఉనికి కోల్పోనుంది. గతంలో ఇదే బ్యాంకు పలు సహకార బ్యాంకులను, ప్రైవేట్‌ బ్యాంకులను విలీనం చేసుకొని ఆ బ్యాంకుల డిపాజిటర్లను ఆదుకొంది. 2004లో తీవ్ర సంక్షోభంలో చిక్కుకొన్న గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకునూ ఇది విలీనం చేసుకొంది. తొమ్మిదిన్నర దశాబ్దాల చరిత్ర కలిగి, కోట్లాది తెలుగు ప్రజలకు విస్తృత సేవలు అందించిన ఆంధ్రాబ్యాంక్‌ ఇక ఖాతాదారులకు, వినియోగదారులకు వీడ్కోలు పలకనుంది. అత్యంత బలహీనమైన అతి చిన్న బ్యాంకులై, విలీనానికి అన్ని అర్హతలు ఉన్న యూకోబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులు ఈ విలీన ప్రక్రియ పరిధిలోకి రాకపోవడం వెనక ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకం!

దేశంలో ఇక 12 ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు మాత్రమే మిగలనున్నాయి. సాధారణంగా ఏ రంగంలోనైనా విలీనాలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. స్వచ్ఛందంగా, పరస్పర అంగీకారంతో వ్యాపారాభివృద్ధే లక్ష్యంగా జరిగే విలీనం ఒకటి. అనివార్య కారణాలవల్ల, విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు జరిగే బలవంతపు విలీనం రెండోది. ప్రైవేట్‌ రంగంలో విలీనాలకు, ప్రభుత్వ రంగంలో విలీనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతాయి. విలీన ప్రక్రియలో ఆయా బ్యాంకుల బోర్డుల పాత్ర ఉన్నప్పటికీ తుది నిర్ణయాలన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో వాటి అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ 2008లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రతో ప్రారంభమైంది. మిగిలిన అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు విలీనం 2017లో జరిగింది. కిందటేడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీనంతో పీఎస్‌బీల మధ్య విలీన ప్రక్రియ జోరందుకుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి (అయిదు శాతం) దిగజారి, ఆర్థిక మాంద్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ ప్రభుత్వం బ్యాంకుల విలీనాలకు తెరతీసింది. పీఎస్‌బీల నిర్వహణ వ్యయాలను తగ్గించి, రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచి భవిష్యత్తులో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కోగల సత్తా ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం విలీనాలను ప్రకటించింది. పీఎస్‌బీల ఆస్తి అప్పుల పట్టికల ప్రక్షాళన (ఎటువంటి దాపరికాలు లేని, వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టే విధంగా పారు బకాయిలను గుర్తించి, నిబంధనల మేరకు వాటికి కేటాయింపులు జరపడం) దాదాపు పూర్తయిన నేపథ్యంలో పీఎస్‌బీల స్థిరీకరణకు ఇది సరైన సమయం.

పారు బాకీలతోనే తంటా
కేవలం విలీనంతో పీఎస్‌బీలన్నీ బలోపేతమై దేశ ఆర్థిక వ్యవస్థ అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందని అనుకోవడం పొరపాటే. ప్రస్తుత పరిస్థితుల్లో విలీనం ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాలి. ప్రధానంగా పీఎస్‌బీలన్నీ (విలీనమైన, విలీనం చేసుకొన్న బ్యాంకులు) భారీ నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి వాటి పారుబాకీలు స్వల్పంగా తగ్గినప్పటికీ మొత్తంమీద స్థూల నిరర్థక ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. పారుబాకీలు తగ్గించేందుకు పెద్దయెత్తున చర్యలు చేపట్టాలి. ఒకవైపు పారుబాకీలను తగ్గించుకొంటూ మరోవైపు రుణవితరణ పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ దిశలో బ్యాంక్‌ యాజమాన్యాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. రుణవితరణ విధానాలు సమీక్షించుకోవడంతోపాటు భవిష్యత్తులో పారుబాకీలు పెరగకుండా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా విలీనానంతరం ఏర్పడనున్న పెద్ద బ్యాంకుల పనితీరును పర్యవేక్షించే దిశలో రిజర్వుబ్యాంక్‌ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేసినంత మాత్రాన, భవిష్యత్తులో అవి ఎటువంటి సంక్షోభంలోనూ చిక్కుకోవన్న నమ్మకం ఏమీ లేదు. అమెరికాలో 2008 నాటి ‘సబ్‌ప్రైమ్‌’ సంక్షోభంలో ప్రపంచ దిగ్గజ బ్యాంకులు సైతం కుప్పకూలాయి. దేశంలో విలీనానంతరం ఏ ఒక్క బ్యాంకు విఫలమైనా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌బ్యాంక్‌ పటిష్ఠ నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంది.

విలీనప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌ ఆయా బ్యాంకుల యాజమాన్యాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ సమయంలో, అతి తక్కువ సమస్యలతో విలీన ప్రక్రియ పూర్తి చేయడం ఎంతో అవసరం. విలీనంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు, వినియోగదారులు ఎటువంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా యాజమాన్యాలు తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణవితరణ నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టడం అత్యంత కీలకం. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం అవసరం. విలీన ప్రక్రియలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మారే క్రమంలో వినియోగదారుల ఖాతాల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విలీనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వాలంటే ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌, బ్యాంకుల యాజమాన్యాలు సమన్వయంతో, సమష్టిగా ముందుకు సాగాలి!

Posted on 01-09-2019