Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

కుదింపుతో పాటు మదింపు

* కేంద్రపథకాలపై కార్యాచరణ
కేంద్ర పథకాలను బాగా కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వాల వాదన నెగ్గే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి మొత్తం పథకాలు 147. ఇప్పడు వాటి సంఖ్య 72కు తగ్గింది. వీటిని 30కి పరిమితం చేసే అవకాశం ఉంది. అర్హతగల పథకాలకు సంబంధించి 25శాతం నిధుల్ని ఇతర కార్యక్రమాలకు వినియోగించుకొనే వెసులుబాటు కల్పించాలంటున్న సంబంధిత కార్యదళం(టాస్క్‌ఫోర్స్‌), ఈ మేరకు తన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించనుంది. రాష్ట్రాలు ఆ నిధులను సద్వినియోగం చేస్తేనే సత్ఫలితాలు సాధ్యం. అందుకు వీలుగా గట్టి అజమాయిషీ తప్పనిసరి అంటున్న వ్యాసమిది...

కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను బాగా కుదించాలని కేంద్రసర్కారును రాష్ట్రాలు గట్టిగా కోరుతున్నాయి. నీతి ఆయోగ్‌ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటైన కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) త్వరలో తన నివేదికను కేంద్రానికి అందజేయబోతోంది. కుదించిన పథకాల నిధులను నేరుగా అందజేస్తే, స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాలను చేపడతామని రాష్ట్రాలు చెబుతున్నాయి. రాష్ట్రాల వాదన బాగానే ఉన్నప్పటికీ, కేంద్ర పథకాలను రాష్ట్రాలు అంతే పటిష్ఠంగా అమలు చేస్తాయా అన్నదే సందేహం. రాష్ట్ర పథకాల నిధులను మంత్రిత్వశాఖలు ఎడాపెడా ఖర్చుపెట్టేస్తుంటాయి. కేంద్రపథకాలకు వచ్చేసరికి కొన్ని రకాల నిబంధనలను పాటించలేక అవి కళ్లు తేలేస్తుంటాయి. కేంద్ర పథకాలను కుదించిన తరవాత ఏ తరహా కార్యక్రమాలు చేపట్టాలో రాష్ట్రాలు ఇప్పటినుంచే మదింపు చేయాలి. మరోవైపు కేంద్ర పథకాల అంతర్ధానంతో నిధులు తగ్గిపోయాయంటూ తెలంగాణ సర్కారు ఇప్పుడు కేంద్రంపై అసంతృప్తితో ఉంది. పథకాలను కుదించిన తరవాత ప్రత్యామ్నాయాలపైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నట్లు తాజా అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి.

నిధులపై పూర్తి స్వేచ్ఛ

రాష్ట్రాలు అమలుచేసే కొన్ని కేంద్రపథకాలకు కేంద్రసర్కారే పూర్తిస్థాయిలో నిధులు అందజేస్తుంది. మరికొన్నింటికి సంబంధించి కొంత వాటా భరిస్తుంది. కేంద్రపథకాలు గతంలో 147 ఉండేవి. తాజాగా వాటి సంఖ్య 72కు తగ్గింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రపన్నుల్లో అన్ని రాష్ట్రాలకూ కలిపి ఇచ్చే వాటాను ఒక్కసారిగా 32నుంచి 42శాతానికి పెంచినందువల్ల కొన్ని పథకాలకు ఇచ్చే నిధులు నిలిపేయాల్సిన అవసరం ఏర్పడింది. మోదీ సర్కారు ఎనిమిది పథకాలను నిలిపేసింది. మరో 24 పథకాల వాటాల్లో మార్పులు చేసింది. 31 పథకాలకు పూర్తి నిధులు సమకూరుస్తోంది. నిలిపివేసిన వాటిలో వెనకబడిన ప్రాంతాల గ్రాంట్‌, పోలీసు దళాల ఆధునీకరణ, ఆదర్శ పాఠశాలల ఏర్పాటు, ఆహారశుద్ధి జాతీయ మిషన్‌, పర్యాటక మౌలిక వసతుల కల్పన, ఎగుమతుల మౌలిక వసతుల అభివృద్ధి, జాతీయ ఈ-పరిపాలన ప్రణాళిక, పంచాయతీ స్వశక్తికరణ్‌ అభియాన్‌ ఉన్నాయి. పన్నుల్లో వాటాలను పెంచినందువల్ల రాష్ట్ర అంశాలతో ముడివడి ఉండేవాటికి కేంద్ర ప్రణాళిక నిధులు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ స్పష్టీకరించారు. పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన కొన్ని పథకాలకు మాత్రం సాయం అందజేస్తామన్నారు. కేంద్ర పథకాల్లో పలు సంస్కరణలు అవసరమని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగారియా నేతృత్వంలో కొందరు ముఖ్యమంత్రులతో కార్యదళాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర పథకాలను 30కి పరిమితం చేయాలని, అర్హతగల పథకాల్లోని 25శాతం నిధులను ఇతర ఎటువంటి కార్యక్రమాలకైనా రాష్ట్రాలు వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్న కార్యదళం, తన నివేదికను త్వరలో కేంద్రానికి అందజేయనుంది.

పథకాల కుదింపు తరవాత, రద్దు చేసినవాటిపై కేంద్రం వినియోగించే మొత్తాలను తమకే ఇవ్వాలనేది రాష్ట్రాల డిమాండ్‌. మిగిలిన 30రకాల పథకాల్లో కేంద్రం వాటా బాగా పెంచడం ద్వారా అదనపు నిధుల్ని సర్దుబాటు చేయాలని అవి కోరుతున్నాయి. కేంద్రం వాటా ఎక్కువైనప్పుడు సహజంగానే రాష్ట్రాల వాటా తగ్గుతుంది. ఆ మేరకు మిగిలిన నిధులతో రాష్ట్రాలు ఇతర పథకాలు చేపడతాయి. జాతీయ ఉపాధి హామీ వంటి చట్టపరమైన పథకాల్లో తప్ప, మిగిలినవాటిలోగల 25శాతం నిధుల వినియోగంలో తమకు స్వేచ్ఛ ఉండాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 'ఫ్లెక్సి ఫండ్‌' రూపేణా ఇలా 10శాతం ప్రత్యేకించుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్రం తెలియజేసింది. సంబంధిత మార్గదర్శకాలు మాత్రం గందరగోళంగా ఉన్నాయి. పది శాతం మొత్తాన్ని ఆయా పథకాలకే వినియోగించాలని, నిధుల మళ్లింపు ఉండరాదని అవి స్పష్టీకరిస్తుండటంతో 'ఫ్లెక్సి ఫండ్‌' అంతరార్థం రాష్ట్రాలకు బోధపడటంలేదు. తెలంగాణలో కేంద్ర పథకాల ద్వారా నాలుగు వేలకోట్ల రూపాయలు వచ్చాయి. వాటిలో చట్టపర పథకాలు మినహా మిగతావాటిలో 'ఫ్లెక్సి ఫండ్‌' రూపేణా రూ.200కోట్ల మేర ప్రత్యేకించుకోవచ్చు. వాటిని ఎలా ఖర్చుపెట్టాలన్న విషయమై స్పష్టత లేకపోవటంతో, ఆర్థిక శాఖ పాత విధానంలోనే నిధుల్ని వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 'ఫ్లెక్సి ఫండ్‌'ను కేంద్రం పదిశాతం నుంచి 25శాతానికి పెంచినా, వాటి వినియోగ విధానాలపై స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు వ్యక్తంచేస్తున్న సందేహాలనూ నివృత్తి చేయాలి. పథకాల కుదింపు తరవాత మిగిలిన నిధులతో ప్రారంభించే కొత్త కార్యక్రమాలను రాష్ట్రాలు ఎంతవరకు విజయవంతంగా అమలుచేయగలవన్న దానిపైనా పరిశీలన అవసరం. ఇప్పటికే రాష్ట్ర పథకాలు అసంఖ్యాకంగా ఉంటున్నాయి. వాటివల్ల ఒనగూరుతున్న ఫలితాలేమిటన్నదీ బోధపడదు. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు కొత్త పథకాలు చేపడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర పథకాలపై తరచూ సమీక్షలు నిర్వహించి, నిధుల వ్యయాన్ని పెంచాలని సూచిస్తుండేవారు. ఇచ్చిన నిధులకు సంబంధించిన వ్యయం గురించి ధ్రువీకరణ పత్రాలు(యూసీలు) కేంద్రానికి సమర్పించిన తరవాతే మలివిడత నిధులు మంజూరు అవుతాయి. దానివల్ల కేంద్రనిధుల వినియోగం బాగా తక్కువగా ఉంటూ, చివరికి అది వార్షిక ప్రణాళికలో భారీ కోతలకు కారణమయ్యేది. కేంద్ర పథకాలు బాగా తగ్గిపోతే, ఇలాంటి బాదరబందీ రాష్ట్రాలకు పెద్దగా ఉండదు. అందుబాటులోకి వచ్చే సొమ్ముతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం వరకు బాగానే ఉన్నా, అవన్నీ సక్రమంగా అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర కార్యక్రమాల్లో మాదిరిగా 'యూసీ'లను ఇవ్వాల్సిన అవసరం ఉండదు కనుక పథకాల అమలులో నిర్లిప్తతకు చోటులేకుండా పకడ్బందీ చర్యలు అవసరం.

ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటైన నీతి ఆయోగ్‌ గతంలో మాదిరి కాకుండా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునే ఏ కార్యక్రమాన్నైనా చేపడుతోంది. కేంద్రం పెత్తనం ఉండబోదు గనక, వచ్చే నిధుల్ని స్థానిక అవసరాల కోసం వినియోగించుకోవచ్చునన్న భావనతో రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర పథకాల్లో కొన్ని అంతర్ధానమవుతాయి కనుక ఇది కొంత ఇబ్బందికరంగానూ ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గ్రాంటుతో సహా పలు పథకాలకు నిధులు నిలిచిపోయాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తపరచారు. కేంద్రం ఇప్పటికే నిలిపేసిన ఎనిమిది పథకాల్లో ఆయన పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల గ్రాంటూ ఉంది. పన్నుల్లో వాటాను బాగా పెంచినందువల్ల ఆ మేరకు అందే నిధులతో రాష్ట్రాలు ఆయా కార్యక్రమాలను కొనసాగించుకోవాలనేది కేంద్రం ఉద్దేశం. రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకే 14వ ఆర్థిక సంఘం ఈ మాదిరి సిఫార్సులు చేయగా, కేంద్రం వాటిని అమలులోకి తెచ్చింది. కేంద్రం నిధులు అందజేసే పథకాలు మధ్యలో నిలిచిపోతే ప్రజల నుంచి విమర్శలు వస్తాయి కనుక వాటికి అవసరమైన మేర రాష్ట్రాలు తమ ఖజానా నుంచి సొమ్మును భరించకతప్పదు. ఇప్పుడు వాటికి అదే ఇబ్బందిగా మారింది. అందువల్ల ఇటువంటి అంశాల్లో కేంద్రం సమీక్ష అవసరం. రాష్ట్రాలు కోరుతున్నట్టుగా 'ఫ్లెక్సి ఫండ్‌'ను 25శాతానికి పెంచి, ఆ మొత్తాన్ని రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో వినియోగించుకొనేలా ఏర్పాట్లు ఉండాలి. అప్పుడు నిలిచిపోయినవాటిని కొనసాగించుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం 'ఫ్లెక్సి ఫండ్‌' రూపేణా ప్రత్యేకించిన 10శాతం మొత్తంపై ఏర్పడిన గందరగోళాన్ని కేంద్రం తొలగించగలిగితే రాష్ట్రాలకు కొంత భరోసా లభిస్తుంది. అది కొరవడుతున్నందువల్లే కేంద్రం చేపడుతున్న సంస్కరణలపై రాష్ట్రాలకు నమ్మకం కలగడం లేదు. ఇప్పుడు కోరుతున్నట్టుగా 'ఫ్లెక్సి ఫండ్‌'ను 25శాతానికి పెంచినా దాన్ని తమకు తోచిన రీతిలో వినియోగించుకోగలిగే సౌలభ్యం లేకపోతే పెంపు వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండబోదన్న భావన పాలకుల్లో ఏర్పడింది.

సమీక్షలు అవసరం

విధానపర నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నందువల్ల రాష్ట్రాలు క్రియాశీలంగా వ్యవహరించగల అవకాశం లభించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి చొరవ కనబడటం లేదు. పేదరిక నిర్మూలనకు కొత్త కార్యక్రమాలు అమలు చేయాలనే సంకల్పంతో కేంద్రం నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలనుంచి నివేదికలు కోరింది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో రాష్ట్రాలు చెబితే, జాతీయస్థాయిలో కొత్తవాటికి రూపకల్పన చేయాలనేది కేంద్రం భావన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా పలు రాష్ట్రాలు నివేదికలను పంపకపోవటంతో ఆ గడువును నీతి ఆయోగ్‌ పెంచింది. ఉదారంగా నిధులిస్తే స్వీయపథకాలు రూపొందించుకుంటామనే రాష్ట్రాలు, అతి ప్రధానమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ఎలా చేపట్టాలన్న దానిపై తమ ప్రతిపాదనలను ఎందుకు పంపలేకపోతున్నాయి? తాజా మార్పుల నేపథ్యంలో రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగిందనే వాస్తవాన్ని పాలకులు గుర్తెరగాలి. పథకాల కుదింపు తరవాత కేంద్రమే వాటి సంఖ్య తగ్గించివేసిందనే భావన రాకుండా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజావసరాల మేరకు రాష్ట్ర పథకాలను విస్తరించుకోవాల్సిందే. అదే సమయంలో వాటి అమలుతీరుపై క్రమం తప్పకుండా సమీక్షలూ అవసరం. కేంద్ర, రాష్ట్ర కార్యక్రమాలకు కలిపి ప్రణాళిక పద్దుల కింద ప్రస్తుత 2015-16లో తెలంగాణ రూ.52,383కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.34,412కోట్లు ఖర్చుపెడుతున్నాయి. ఇవన్నీ పన్నులు, అప్పుల రూపంలో సమకూరినవే. ప్రతి రూపాయీ విలువైనదే. ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఫలితం లభించేలా పాలకులు విధివిధానాలు రూపొందించాలి. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా 'ఆడిట్‌' వ్యవస్థలను పటిష్ఠపరచాలి. ఈ విధానం ద్వారానే రుణమాఫీలో అయిదు శాతం మేర అక్రమాలు, స్థానిక సంస్థల్లో నిధుల దుర్వినియోగాలను తెలంగాణ ప్రభుత్వం వెలికితీసింది. రుణమాఫీ అక్రమాలు బయటపడటంతో సర్కారుకు రూ.850కోట్ల మేర నిధుల ఆదా కానుంది. ప్రభుత్వ పథకం అనేసరికి నిధులు దుర్వినియోగమైనా ఏమీకాదన్న భావన కొంతమంది సిబ్బందిలో ఉంది. జవాబుదారీ లేకుండా ఎడాపెడా నిధులు ఖర్చుచేస్తారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పథకాల్లో అలాంటి ఉదాసీనత ఉండదు. ఇచ్చిన నిధుల మేరకు పనులు పూర్తయితేనే తదుపరి విడత మొత్తాలు మంజూరు అవుతాయి. భవిష్యత్తులో రాష్ట్రప్రభుత్వాలు అమలుచేయబోయే పథకాల్లో ఇలాంటి నియంత్రణ ఉండాలి. ఆజమాయిషీ కొరవడితే కేంద్రపథకాలూ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది! కాబట్టి, రాష్ట్రప్రభుత్వాలు తగిన నిఘా పర్యవేక్షణ వ్యవస్థలతో కార్యక్రమాల అమలుతీరును తరచూ సమీక్షిస్తుండాలి.

- పిళ్లా సాయికుమార్‌
Posted on 16-09-2015