Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అరచేతిలో అంతర్జాల విప్లవం

* దేశం నలుమూలలకు బహుముఖ సేవలు

సాంకేతిక విప్లవం దేశమంతటా చాపకింద నీరులా విస్తరిస్తోంది. చేతిలో సెల్‌ఫోన్‌, అందులో అంతర్జాలం లేకుండా ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. ల్యాండ్‌లైన్‌ ఫోన్లు రాజ్యమేలిన తొమ్మిదో దశకంతో పోలిస్తే ఇరవయ్యేళ్ల కాలావధిలో ఎవరూ ఊహించలేని స్థాయికి సాంకేతిక విజ్ఞానం విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదో దశకం మలినాళ్లలో మూడు నిమిషాలపాటు అంతర్జాల సేవలు ఉపయోగించుకోవాలంటే రూ.1.20 చెల్లించాల్సి వచ్చేది. సెకండుకు 52 కిలోబైట్ల తాబేటి వేగంతో అప్పట్లో అంతర్జాలం సామాన్యులకు అందుబాటులో ఉంది. మూడేళ్ల క్రితం (సెప్టెంబరు 5) రిలయెన్స్‌ కంపెనీ ‘జియో’ పేరిట మొబైల్‌, అంతర్జాల సేవలను ప్రారంభించిన నేపథ్యంలో సాంకేతిక సదుపాయాలు దేశంలోని మూలమూలకూ విస్తరించాయి. ఇవాళ్టినుంచి మరో సంచలనానికి తెరలేపుతూ ఆ సంస్థ అంతర్జాల సదుపాయాన్ని, ల్యాండ్‌లైన్‌ సౌకర్యాన్ని, టెలివిజన్‌ ఛానళ్ల సేవలను గంపగుత్తగా ‘జియో గిగాఫైబర్‌’ పేరిట అందుబాటులోకి తీసుకురానుండటంతో దేశవ్యాప్త సాంకేతిక విస్తృతికి సంబంధించి కొత్త అధ్యాయానికి తెరలేచింది.

వడివడిగా విస్తరణ
గతంలో కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన అంతర్జాల సేవలు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని దేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేశాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం 2019 మార్చి నాటికి దేశంలో 63.67 కోట్ల అంతర్జాల చందాదారులు ఉన్నారు. వీరిలో 96.4శాతం పూర్తిగా మొబైళ్లు, వైర్‌లెస్‌ పరికరాలపైనే ఆధారపడి అంతర్జాల సేవలు పొందుతున్నారు. వీరిలో 40.97 కోట్లు (64శాతం) పట్టణ ప్రాంతాలకు చెందినవారు. గ్రామీణవాసుల సంఖ్య 22.7 కోట్లు (36 శాతం). దేశంలోని ప్రతి వంద మందిలో సగటున 48.48 మంది ఇంటర్నెట్‌ చందాదారులున్నారు. అంతర్జాల అందుబాటు విస్తరించడం ఆనందం కలిగిస్తున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల మధ్య అగాధం ఆందోళనకరంగానే ఉంది. పట్టణాల్లోని ప్రతి వంద మందిలో 97.94శాతం ప్రజలకు నెట్‌ సౌకర్యం ఉంది. గ్రామాల్లో మాత్రం ఆ సంఖ్య 25.36 శాతమే కావడం గమనార్హం. భారతీయులు నెలవారీగా 9.06 జీబీ చొప్పున అత్యధిక అంతర్జాల డేటాను వినియోగిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే అంతర్జాల వినియోగ ఛార్జీలు భారత్‌లో బాగా తక్కువ. ఒక్కో జీబీ అంతర్జాల సేవలు పొందేందుకు మన దేశంలో అవుతున్న ఖర్చు రూ.7.95. దేశంలోని చాలా నగరాల్లో ఆ మాత్రం ధరకు కప్పు కాఫీ కూడా దొరకదంటే అతిశయోక్తి కాదు! అయిదేళ్ల క్రితం అంటే 2014 మార్చిలో దేశంలో మొత్తం 25.15 కోట్ల మంది అంతర్జాల వినియోగదారులు ఉండగా- సగటున ఒక్కో మాసానికి వారు 66.66 ఎమ్‌బీ అంతర్జాల సేవలను వినియోగించారు. 2014లో ఒక నెల వ్యవధిలో ఒక్కొక్కరు సగటున 389 నిమిషాలపాటు ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించుకోగా- ఇప్పుడు ఆ సంఖ్య 692 నిమిషాలకు చేరుకోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో 2015లో ఇంటర్నెట్‌ విస్తృతి తొమ్మిది శాతం ఉండగా- ఇప్పుడు ఆ సంఖ్య 25శాతానికి చేరింది. దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో పదింట తొమ్మండుగురు భారతీయ భాషల్లోనే అంతర్జాల సేవలు వినియోగించుకుంటున్నారు. వీరిలో అత్యధికులు గ్రామాలు, చిన్న పట్టణాలకు చెందినవారే కావడం గమనార్హం. నిరుడు డిసెంబరు నాటికి దేశంలో 24.5 కోట్ల మంది ‘యూట్యూబ్‌’ వినియోగదారులున్నారు. ఇందులో 95శాతం మేర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే వీక్షిస్తున్నారు. దేశంలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండి అంతర్జాలం వినియోగిస్తున్నవారిలో 75శాతం మేర వీడియో సంబంధిత అంశాలవైపే మొగ్గుచూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘నెట్‌ ఫ్లిక్స్‌’, ‘అమెజాన్‌ ప్రైమ్‌’, ‘హాట్‌స్టార్‌’ వంటి అంతర్జాల వీడియో ఆధారిత కంపెనీలు ఈ కొత్తతరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకొనే తమ మార్కెట్‌ను క్రమంగా విస్తరించుకుంటున్నాయి. మూడేళ్ల క్రితం దేశంలో ఈ తరహా మార్కెట్‌ లేదు. అంతర్జాల డేటా వినియోగం ఒకవైపు పెరుగుతుంటే- ఫోన్‌ సంభాషణల పరిమాణం కోసుకుపోతుండటం గమనించాల్సిన ఒక సామాజిక పరిణామం. 2014లో 25.10 కోట్ల నిమిషాల కాలం ఔట్‌ గోయింగ్‌ ఫోన్‌ కాల్స్‌ మాట్లాడితే- 2019 నాటికి ఆ పరిమాణం 19.7 కోట్ల నిమిషాలకు కరిగిపోయింది. ప్రజలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోవడం తగ్గిపోయిందన్నది నిరూపిత వాస్తవం. కనీసం ఫోన్ల ద్వారా సైతం ఒకరితో మరొకరు సంభాషించుకునే కాలావధి తగ్గిపోవడం సామాజిక విశ్లేషకులు దృష్టి పెట్టాల్సిన అంశం. మరోవంక అంతర్జాల ఆధారిత అప్లికేషన్ల ద్వారా సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం విపరీతంగా పెరిగింది. దీని సామాజిక ప్రభావాల విశ్లేషణను పక్కనపెడితే అంతర్జాల సేవల విస్తృతి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక చోదకంగా అక్కరకొస్తోందన్నది మాత్రం వాస్తవం. మొబైల్‌, అంతర్జాల సేవల విస్తృతి పెరగడంవల్ల రాష్ట్ర స్థూలోత్పత్తి 1.2శాతం ఇనుమడించిందని గతంలో అధ్యయనాలు వెల్లడించాయి. మొబైల్‌ ఫోన్ల వాడకం 10శాతం పెరిగితే సగటున ఒక్కో రాష్ట్రంలో ఉత్పత్తి 1.9శాతం మేర ఇనుమడిస్తుందనీ అధ్యయనాలు చాటాయి.

అంతర్జాల సేవల అందుబాటు పెరిగే కొద్దీ ప్రజల జీవన విధానంలోనూ అంతే వేగంగా మార్పులు పొడగడుతున్నాయి. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉండే ప్రజలు ఒకరితో మరొకరు సంభాషించుకొనే విధానాన్ని, పనితీరును, సమాచారం ఇచ్చిపుచ్చుకొనే పద్ధతిని, మొత్తంగా వారి జీవన శైలిని అంతర్జాల వినియోగం పెద్దయెత్తున ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాల వివరాలూ మెరుపు వేగంతో ప్రజలకు చేరువవుతున్నాయి. మరోవంక అంతర్జాల ఆగమనంతో దేశ బ్యాంకింగ్‌ రంగం రూపురేఖలే మారిపోయాయి. భారతావని ఆర్థిక, వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నుల్లోనూ గుణాత్మక మార్పు స్పష్టమవుతోంది. దేశంలోని చిన్న వ్యాపారస్తులకు ఇంటర్నెట్‌ సేవలు అనుకోని వరంలా అందివచ్చాయి. డిజిటల్‌ చెల్లింపులు విస్తృతమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ధరల మధ్య వ్యత్యాసాలను వారు చిటికెలో తెలుసుకోగలుగుతున్నారు. ఆ మేరకు వారు తమ వ్యాపారాలను నేర్పుగా తీర్చిదిద్దుకుంటున్నారు. గతంలో ఏదైనా సమాచారం కోసం ఒక చోటనుంచి మరో చోటుకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెలికమ్యూనికేషన్‌ సదుపాయాల విస్తరణతో వ్యాపారులకు రవాణా వ్యయాలు ఆదా అవుతున్నాయి. ఏదైనా నగరంలోని వస్తువులున్న పెద్ద గిడ్డంగికి వెళ్ళి చిన్న వ్యాపారులంతా ఎప్పటికప్పుడు సరకులు తెచ్చుకునే ఒకప్పటి పరిస్థితులు మారిపోయాయి. అంతర్జాల సమాచారం, డిజిటల్‌ చెల్లింపుల సాయంతో వారు సరకు రవాణాను సమన్వయం చేసుకోగలుగుతున్నారు. తద్వారా ఒక్కో ట్రిప్పునకు వారికి కనీసం రూ.500 మిగలడంతోపాటు ఎంతో విలువైన కాలమూ ఆదా అవుతోంది. ఉపాధి కోసం పల్లెలు వదిలి పట్టణాలకు తరలుతున్నవారు సైతం అంతర్జాల సహకారంతో మెరుగైన అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకొని- కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. వినియోగదారుల వస్తు, సేవల కొనుగోలు తీరుతెన్నులూ ఊహాతీతంగా మారిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కొత్త జవసత్వాలు తొడుక్కుంది.

అభివృద్ధికి ఆయువుపట్టు
అంతర్జాల విస్తృతి పెరగడం దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందనడంలో మరో మాట లేదు. ఇంటర్నెట్‌ సేవలను సక్రమంగా వినియోగించుకోవడం తెలిసినవారు ఈ కొత్త విజ్ఞానంవల్ల ఎంతగానో లబ్ధి పొందుతారు. అంతర్జాల సేవల అందుబాటు, ఆ సాంకేతికతను సక్రమంగా వినియోగించుకొనే విజ్ఞానం రెండూ వేర్వేరు అంశాలు. ఈ రెండింటి మధ్య అగాధం పెరుగుతుండటమే కలవరపరుస్తోంది. దేశంలో పెద్దయెత్తున నిరక్షరాస్యులున్నారు. చాలీచాలని జీత భత్యాలకు పనిచేస్తున్న వారిలో ఎంతోమందికి స్మార్ట్‌ ఫోన్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఇలాంటివారు ఏదో రకంగా కష్టపడి సొంతంగా స్మార్ట్‌ఫోన్‌ను సమకూర్చుకోగలిగినా- దాన్ని సానుకూలంగా వినియోగించుకునే విధానం తెలియక బోల్తాపడుతున్నారు. సాంకేతిక విజ్ఞానం అందిస్తున్న అపూర్వ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు. తద్వారా జాతి ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములు కాలేకపోతున్నారు. అంతర్జాలం ద్వారా పొందే సమాచారం రకరకాలుగా ఉంటుంది. విలువైన సమాచారం అందించే క్రమంలో వివిధ అంతర్జాల సంస్థలకు ప్రత్యేకంగా నెలవారీ చందాలు కట్టాల్సి వస్తోంది. అందించే సమాచారం ఎంత విలువైనదైతే చందా రుసుము అంత ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ఈ తరహా ప్రత్యేక చందా రుసుములు చెల్లించగలవారు, చెల్లించలేనివారు అని రెండు స్పష్టమైన వర్గాలు ఏర్పడే అవకాశం కొట్టిపారేయలేనిది. దేశ ఆర్థిక వ్యవస్థను ఏదో స్థాయిలో ప్రభావితం చేయగల పరిణామమది. అంతర్జాల అక్షరాస్యతను సాధ్యమైనంతగా విస్తరించి, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోగల అవగాహనను పెంచడమే ఇప్పుడు ముందున్న కర్తవ్యం!


Posted on 05-09-2019