Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

‘మూలధనం’పై మధ్యే మార్గం

* నిధుల బదిలీపై జలాన్‌ కమిటీ సిఫార్సు

రిజర్వ్‌బ్యాంకు దగ్గర అవసరానికి మించి మూలధన నిల్వలు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలనే విషయంపై ఇటీవల వాడివేడి చర్చ జరిగింది. ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులు ఉన్నాయన్న వాదనతో ఏకీభవిస్తూ, ఆ డబ్బుతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధనం సమకూర్చవచ్చని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలయ్యాయి. ఆయన అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. ఆ నేపథ్యంలోనే నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిష్క్రమణకు బాటలు పడ్డాయన్న వాదనలున్నాయి. శక్తికాంత దాస్‌ ఆర్‌బీఐ గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ అంశంపై అధ్యయనం చేయడానికి మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఆర్‌బీఐ నుంచి రూ.1,76,051 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. ద్రవ్యలోటును ఎదుర్కోవడం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉద్దీపన చర్యలు తీసుకోవాల్సిన స్థితిలో నిధుల బదిలీ కేంద్రానికి పెద్ద ఉపశమనమే. ఆర్‌బీఐ లక్ష్యాలను నెరవేర్చడానికి అనువుగా తగిన నిల్వలు దాని వద్ద ఉండాలనడం ద్వారా జలాన్‌ కమిటీ రిజర్వుబ్యాంకు, కేంద్ర ప్రభుత్వాల మధ్య కొంత సమతుల్యత సాధించిందనే చెప్పాలి!

రిజర్వ్‌బ్యాంకు తన దగ్గర ఉన్న మూలధనాన్ని ప్రధాన మూలధనం, సంఘటిత నిధి, నగదు-బంగారు రీవాల్యుయేషన్‌ ఖాతా, బాండ్లు తదితరాల మదింపులో వచ్చే పెరుగుదల అనే నాలుగు రూపాల్లో ఉంచుతుంది. 2018 జూన్‌ నాటికి ఆర్‌బీఐ దగ్గర ఉన్న మొత్తం మూలధన నిల్వలు రూ.9.69 లక్షల కోట్లు. ఇందులో కరెన్సీ-గోల్డ్‌ రీవాల్యుయేషన్‌ ఖాతాలో దాదాపు రూ.6.91 లక్షల కోట్లు, సంఘటిత నిధిలో సుమారు రూ.2.55 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ రెండు ఖాతాలను కలిపి చూడాలా, వేర్వేరుగా చూడాలా అన్న అంశంపై ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రీవాల్యుయేషన్‌ ఖాతాలో ఉన్న నిల్వలను సైతం మూలధన నిల్వలకు జతచేసినప్పుడు అది ఆర్‌బీఐ మొత్తం ఆస్తుల్లో (రూ.36.17లక్షల కోట్లు) 27 శాతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల కేంద్ర బ్యాంకుల్లో సగటున 8.4 శాతం నిల్వలే ఉన్నాయి. నార్వే, రష్యా, మలేసియా తరవాత అతిపెద్ద మొత్తంలో నిల్వలున్నది ఆర్‌బీఐ దగ్గరే!

వాస్తవిక దృక్పధమే ప్రాతిపదిక
ఈ నిల్వలు ఏ ఒక్కరోజులోనో, సంవత్సరంలోనో సమకూరినవి కావు. కొన్నేళ్లుగా ఆర్‌బీఐ కార్యకలాపాల ఫలితమిది. ఈ నిల్వల్లో కొంతభాగాన్ని ప్రభుత్వానికి బదిలీ చేయడం సాంకేతికంగా కష్టం కాదని జలాన్‌ కమిటీ నివేదిక స్పష్టీకరించింది. మిగులు మూలధనాన్ని ఆర్‌బీఐ ఎక్కడో దాచిపెట్టుకోవడం సాధ్యమయ్యే పనికాదు. మరోవంక దాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు ఉపయోగపడకుండా, ప్రభుత్వానికి అందకుండా చేయడమూ కుదరని పని. ఆర్‌బీఐ ప్రధాన ఆర్థిక వనరు ఈ మూలధనం. ఈ మొత్తాన్ని అది వివిధ విదేశీ, స్వదేశీ ఆస్తుల రూపంలో ఉంచింది. అదనపు మూలధనంగా పిలిచే నిల్వలను ఆర్‌బీఐ- ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రుణంగా ఇచ్చింది. ఇలా రుణంగా ఇచ్చిన నిధులు ‘డివిడెండ్ల’ రూపంలో ప్రభుత్వానికి కొంత కాలంలోనే చేరతాయి. ఏ రుణమైనా ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయడం ద్వారా ఇస్తే అది వాస్తవంగా ప్రభుత్వానికి వడ్డీలేని రుణంగా ఇచ్చినట్లే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఆర్‌బీఐకి యజమాని! తన బాండ్లపై ప్రభుత్వం చెల్లించే వడ్డీ ఆర్‌బీఐ నుంచి ‘డివిడెండ్ల’ రూపంలో తిరిగి వస్తుంది. ఈ విధంగా ఆర్‌బీఐ తన దగ్గరున్న మూలధనాన్ని ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్‌బీఐ ద్రవ్యాన్ని సృష్టిస్తుంది.

మిగులు మూలధనాన్ని జలాన్‌ కమిటీ రియలైజ్‌డ్‌ క్యాపిటల్‌ (వాస్తవంగా చేతికందిన మూలధనం), ఆర్థిక మూలధనం అనే రెండు అంశాలపై ఆధారపడి నిర్ణయించిందని అర్థమవుతుంది. ఊహించని నష్టం ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ లాభాల నుంచి సంఘటిత నిధిలో పోగుచేసిన మొత్తమే రియలైజ్‌డ్‌ క్యాపిటల్‌. దీన్ని జలాన్‌ కమిటీ ఆర్‌బీఐ ఆస్తుల్లో దిగువ పరిమితి 5.5 శాతంగా, ఎగువ పరిమితి 6.5 శాతంగా నిర్ణయించింది. సాధారణంగా నష్టాన్ని అంచనా వేసేటప్పుడు కనీస నష్టాన్ని, దానివల్ల గరిష్ఠంగా కలిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కమిటీ ఇందులో దిగువ పరిమితిని పరిగణనలోకి తీసుకొని రూ.52,637 కోట్లు మిగులుగా తేల్చింది. అంతేకాక మొత్తం ఆర్థిక మూలధనం ఆర్‌బీఐ మొత్తం ఆస్తుల్లో 20 నుంచి 24.5 శాతం మధ్య ఉంటే చాలని అంచనా వేసింది. ఈ విధంగా బదిలీ చేయాల్సిన మొత్తం రూ.1,76,051 కోట్లకు చేరింది. మిగులు మూలధనాన్ని అంచనా వేయడంలో జలాన్‌ కమిటీ వాస్తవిక దృక్పథంతో వ్యవహరించింది. ఆర్‌బీఐ తాను ఆర్జించిన లాభాలతో సృష్టించిన మూలధనాన్ని మాత్రమే బదిలీ చేయాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. మార్కెట్‌ ఒడుదొడుకుల మూలంగా విదేశీ కరెన్సీ, బంగారం, ఇతర ఆస్తుల విలువల్లో వచ్చిన పెరుగుదలను పరిగణనలోకి తీసుకోరాదని, ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ దగ్గరే ఉంచాలని కమిటీ నిర్ణయించడం శుభ పరిణామం.

గతంలోని నిపుణుల కమిటీలు సంఘటిత నిధి మొత్తం ఆర్‌బీఐ ఆస్తుల్లో 12శాతంగా ఉండాలని సూచించాయి. వాటికి భిన్నంగా సంఘటిత నిధి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉందని జలాన్‌ కమిటీ భావించింది. ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని బదిలీ చేయడంపై ఆర్థికవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. మిగులు మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వానికి బదిలీ చేయకుండా, దాన్ని కొన్ని భాగాలుగా విభజించి కొంత కాలపరిమితి లోపల బదిలీ చేసినట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉండేదన్నది కొంతమంది వాదన. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఆర్‌బీఐ నుంచి నిర్దిష్టకాలంలో, నిర్ణీత నిధులు అందుతాయన్న స్పష్టత ఉండేది. దానికనుగుణంగా తన ప్రణాళికలను రూపొందించుకునే అవకాశం కలిగేది. మిగులు నిధుల బదిలీని బాండ్ల కొనుగోలుకు ఉపయోగిస్తే బాగుండేదన్న వాదనా ఉంది.

వివాదం సమసిపోతుందా?
ఆర్‌బీఐ నుంచి అందిన ఈ నిధులను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందన్న దానిపై వివిధ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జీడీపీ వృద్ధిరేటు (ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికం) ఆరు సంవత్సరాల కనిష్ఠస్థాయికి పడిపోయింది. పెట్టుబడి రేటు తగ్గుతోంది. నిరుద్యోగిత రేటు మూడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరింది. వీటివల్ల వినియోగ డిమాండ్‌ తగ్గి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో పక్క ద్రవ్యలోటు జీడీపీలో 3.4 శాతానికి (2018-19 సంవత్సరానికి) చేరి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి అందిన నిధుల వల్ల ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలుగుతుంది. వీటి ద్వారా ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించుకోవచ్చు. ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా బదిలీ అయిన మొత్తాన్ని మౌలిక రంగంలో ఖర్చు పెట్టి ఆస్తుల సృష్టికి ఉపయోగిస్తే దీర్ఘకాలిక ప్రయోజనం పొందవచ్చు. నిధుల బదిలీతో ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్య వివాదాలు తొలగిపోతాయని ఆశించలేం. ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలనుంచి రూ.4 లక్షల కోట్ల మేర ఆశించింది. అంతకన్నా తక్కువ మొత్తాన్నే జలాన్‌ కమిటీ సిఫార్సు చేసింది. ప్రతి సంవత్సరం ఆర్‌బీఐకి లాభాలు వస్తాయని చెప్పలేం. అంత పెద్ద మొత్తంలో సంఘటిత నిధి సమకూరుతుందన్న పూచీ సైతం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐకి అవసరమైన మూలధనం అందుబాటులో ఉంచడం అత్యంత కీలకం. కాబట్టి రీవాల్యుయేషన్‌ ఖాతా జోలికి పోకుండా ప్రభుత్వం- ఆర్‌బీఐల మధ్య జలాన్‌ కమిటీ సమతుల్యత సాధించిందనే చెప్పాలి!


Posted on 06-09-2019