Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఆర్థిక రంగం ఆపసోపాలు

* తగ్గుతున్న వృద్ధిరేటు

దేశ ఆర్థిక రథం కుదుపుల బాటలో సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంతకంతకూ కరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనం. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎనిమిది శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఇప్పుడు అయిదు శాతానికి క్షీణించడానికి మాంద్యమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. దేశాన్ని ఈ స్థాయిలో మాంద్యం ఎందుకు చుట్టుముట్టిందన్న ప్రశ్నకు భిన్న అంశాలను లోతుగా తరచి చూస్తే తప్ప సమాధానాలు బోధపడవు. పెట్టుబడుల ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంతగా కళకళలాడుతుందన్న విషయంలో మరో మాట లేదు. 2011-’12లో దేశంలో జీడీపీతో పోలిస్తే 34శాతంగా ఉన్న పెట్టుబడులు 2017-’18నాటికి 29శాతానికి కుదించుకుపోయాయి. కానీ, అప్పట్లో పెట్టుబడులు పడిపోతున్నా ఉత్పాదకత మాత్రం ఇనుమడించింది. దానివల్ల దేశంలో వినియోగం పెరిగింది. అందువల్లే పెట్టుబడులు క్షీణించి 2017-’18వరకు మాంద్యం పరిస్థితులు తారట్లాడినా సమస్య సంక్షోభం స్థాయికి దిగజారలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజల వినియోగం కొంతకాలంగా పడిపోతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) సమస్యల్లో కూరుకుపోవడంతో వినియోగదారులకు రుణ మంజూరు తగ్గిపోయింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రైవేటు పెట్టుబడులు మందగించాయి. వీటితోపాటు వ్యవస్థాగత ఆర్థిక సంక్లిష్టతలూ జీడీపీ వృద్ధి రేటు అయిదు శాతానికి పడిపోవడానికి కారణమయ్యాయి. ఆదాయాలూ, జీతాలకు సంబంధించి స్తబ్దత ఆవరించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుగూబొదుగూ లేకుండా మిగిలిపోయింది. వ్యవసాయోత్పత్తుల ధరల పెరుగుదల అంతంతమాత్రంగా ఉండటంతో రైతుల ఆదాయాల్లో ఎలాంటి ఊర్ధ్వముఖ కదలికా కనిపించలేదు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో కిందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం లోపే నిలిచిపోయింది. ప్రస్తుత ఖాతా లోటు జీడీపీలో ఒకశాతానికే పరిమితమైంది. ద్రవ్యలోటు 3.4శాతానికిలోపే ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు దీర్ఘకాలంలో జీడీపీ వృద్ధి రేటును ప్రభావితం చేసే వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు క్షీణముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంది.

వేడెక్కుతున్న వాణిజ్య యుద్ధం
ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావాలు ప్రసరిస్తున్నాయి. అమెరికా, చైనాల వాణిజ్య యుద్ధం అంతకంతకూ వేడెక్కుతోంది. 2018 జనవరి-మార్చి త్రైమాసికంలో పురోగమించిన ప్రపంచ ఆర్థికవ్యవస్థ, ఆ తరవాతి మాసాల్లో కుదుపులకు లోనై మందగమనం బారినపడింది. వాణిజ్య యుద్ధ భయాలు విస్తరించాయి. ముడి చమురు ధరలు ఎప్పుడెలా ఉంటాయో తెలియని స్థితికి చేరాయి. ‘బ్రెగ్జిట్‌’ సంక్షోభం ఎంతకీ తెమలకపోవడం ఐరోపా దేశాల ఆర్థికాన్ని అస్థిరపరుస్తోంది. ఉద్గారాల విడుదలకు సంబంధించి కఠిన నిబంధనలను పట్టాలకెక్కించడంతో జర్మనీలో వాహన రంగం కుదేలైంది. మహా మేరువులాంటి చైనా ఆర్థిక వ్యవస్థ మందగించి మాంద్యం ముంగిటికి చేరింది. అంతర్జాతీయంగా కొన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సైతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మాంద్యం ప్రభావం ప్రధానంగా ఉత్పత్తి, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార ప్రసార, నిర్మాణ, వ్యవసాయ రంగాలపై పడింది. ఉత్పత్తి రంగంలో వృద్ధి దారుణంగా 0.6శాతానికి మాత్రమే పరిమితమైంది. మాంద్యం ప్రభావాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. వాహన రంగంలో అమ్మకాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. సబ్బులు, బిస్కెట్లతోపాటు ఇతర ముఖ్యమైన వస్తువుల కొనుగోళ్లూ పతనాభిముఖం కావడం వినిమయం తీరుతెన్నులకు అద్దం పడుతోంది. ఈ ఏడాది జులైలో వాహనాల కొనుగోళ్లు 19 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయికి పడిపోయాయి. గడచిన 18 నెలల్లో 286 వాహన డీలర్లు దుకాణాలకు మూతపెట్టారు. తాజాగా ముగిసిన త్రైమాసికంలో దేశంలో 15వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. నిర్దిష్ట కాలావధిలో మార్కెట్లో పునరావృతమయ్యే చక్రీయ కారణాలవల్ల మాంద్యం సంభవించిందా లేక వ్యవస్థీకృత అంశాలు అందుకు దోహదపడ్డాయా అన్న చర్చ నడుస్తోంది. వాహన రంగంలో డిమాండు పడిపోవడానికి చక్రీయ కారణాలతోపాటు వ్యవస్థీకృత సమస్యలూ దోహదపడి ఉండవచ్చు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తరచి చూస్తే ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ‘నేను యువకుడిగా ఉన్న కాలంలో సొంత వాహనం కలిగి ఉండటాన్ని సమాజంలో గౌరవ చిహ్నంగా భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నా కుమారుడు సొంత వాహనం కొనుక్కోవడానికి ఇష్టపడటం లేదు. అంతకన్నా ‘ఓలా’ లేదా ‘ఉబెర్‌’ వంటి ట్యాక్సీ సేవలే మేలని భావిస్తున్నా’డన్న ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యలు మారుతున్న ఆలోచనాధోరణికి అద్దం పడతాయి. ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యల కారణంగా పెద్ద నగరాల్లో కొంతమంది ఇప్పుడు సొంత వాహనంవైపు మొగ్గుచూపడం లేదు. ప్రస్తుత మాంద్యానికి చక్రీయ, వ్యవస్థీకృత అంశాలు రెండూ కారణమేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ద్రవ్య, విత్త విధానాలకు కొత్త రూపును ఇవ్వడం ద్వారా పరంపరగా పునరావృతమయ్యే చక్రీయ సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యవస్థీకృత సమస్యలకు మాత్రం దీర్ఘకాలిక సంస్కరణలే పరిష్కారం.

పురోగామి పంథాలో ఒక దశ వరకూ చేరుకొని, నూతన వనరుల విస్తరణ ఆగిపోవడంతో, ఆ తరవాత ఇక అంతకంటే ముందుకు ప్రస్థానించలేక చతికిలపడే ‘మధ్యాదాయ ఉచ్చు’ (మిడిల్‌ ఇన్‌కమ్‌ ట్రాప్‌)లో చిక్కుకోవడంవల్లే దేశం మాంద్యం బారినపడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకున్న పదికోట్ల ప్రజలు చేస్తున్న వినియోగం కారణంగా- వారివల్ల మార్కెట్లో ఏర్పడుతున్న డిమాండ్‌ ఫలితంగా భారత్‌ ఊర్ద్వముఖంలో ప్రస్థానిస్తోందన్నది ఈ వాదన వినిపించేవారి అభిప్రాయం. ఈ పదికోట్ల ప్రజల డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకొందని, వారి ఆదాయాలు ఇంతకుమించి ఎదగని వాతావరణం అంటే ‘మధ్యాదాయ ఉచ్చు’ తరహా పరిస్థితులు తలెత్తడంతో దేశంలో మాంద్యం విస్తరిస్తోందన్నది ఈ ఆర్థికవేత్తల విశ్లేషణ. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ దేశాల్లో ఆర్థిక రంగం కొన్నేళ్లకాలం పెనువేగంతో విస్తరించింది. ఆర్థికాభివృద్ధి మాట ఎలా ఉన్నా ఆ దేశాల్లోని అత్యధిక ప్రజల జీవన విధానంలో మాత్రం కించిత్తు మార్పూ రాలేదు. వారి బతుకులు ఎక్కడివక్కడేగా మిగిలిపోయాయి. సాధ్యమైనంత సత్వరం అసమానతలకు అడ్డుకట్టవేయడమే ఇందుకు పరిష్కారం. దేశ జనాభాలో అట్టడుగున ఉన్న 50శాతంనుంచి 60శాతం ప్రజల ఆదాయాలు పెంచగలిగితే- మార్కెట్లకు చురుకుపుడుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త బాట పడుతుంది!

నైపుణ్యాలలో వెనకబాటు
జాతీయ నమూనా సర్వే ఉపాధి గణాంకాల మేరకు- 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయంలో 44శాతం, పరిశ్రమల్లో 25శాతం, సేవల రంగంలో 31శాతం ఉపాధి సాధ్యపడింది. ఇందులో తయారీ రంగంలో ఉపాధి మాత్రం 12శాతానికే పరిమితం కావడం గమనార్హం. మౌలిక రంగంలో పెట్టుబడులు పెంచడంతోపాటు, భూసేకరణ విధానాల్లో సంస్కరణలు, ఎగుమతులకు ఊపునిచ్చే విధానాల రూపకల్పన ఇప్పుడు చాలా అవసరం. విద్య, ఆరోగ్య రంగాల్లో యుద్ధ ప్రాతిపదికన సంస్కరణలు తీసుకువస్తే తప్ప విస్తారంగా పోగుబడిన మానవ వనరుల సద్వినియోగం సాధ్యం కాదు. దేశంలోని బాలల్లో 40శాతం పౌష్టికాహార లేమితో సతమతమవుతుంటే మానవ వనరుల సద్వినియోగం సాధ్యమయ్యే పనికాదు. మరోవంక నైపుణ్యాలకు సంబంధించి నీతి ఆయోగ్‌ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ రంగానికి సంబంధించి అయినా దేశంలోని కేవలం 2.3శాతం ప్రజలే సాధికారికంగా శిక్షణ పొంది సంసిద్ధంగా ఉన్నారని- మిగిలిన దేశాల్లో ఈ సంఖ్య 70నుంచి 80శాతం దాకా ఉందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. సాంకేతికత, విజ్ఞానం ఆధారంగా ఆర్థిక వ్యవస్థలకు కొత్త పునాదులు నిర్మించుకోవాల్సిన తరుణంలో నైపుణ్యాల విషయంలో భారత్‌ వెనకబాటు కలవరపరచేదే. ఉత్పాదక రంగంలో మహిళల భాగస్వామ్యమూ అంతంతమాత్రంగానే ఉంది. ఈ సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల ద్వారా గ్రామీణుల ఆదాయాలను ఇనుమడింపజేస్తే తప్ప డిమాండ్‌కు చురుకుపుట్టదు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల పురోభివృద్ధిపైనా దృష్టి పెట్టాలి. గ్రామీణ మౌలిక సౌకర్యాల విస్తరణ, నీటి వనరుల సమర్థ నిర్వహణలనూ ప్రాథమ్యాంశాలుగా గుర్తించాలి. తక్షణ ఉపశమన చర్యలతోపాటు దీర్ఘకాలిక సంస్కరణలనూ చేపట్టి ప్రభుత్వం నిర్మాణాత్మకంగా అడుగులు కదిపితేనే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యపడుతుంది.

పునరుజ్జీవానికి ప్రయత్నాలు
దేశంలో వినియోగం, పెట్టుబడులు పెంచేందుకు గడచిన కొన్నివారాలుగా ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. 70వేల కోట్ల రూపాయలతో బ్యాంకులకు పునరుజ్జీవం పోసే ప్రయత్నాలతోపాటు ఎంఎస్‌ఎంఈలకు చేయూతనివ్వడం, గృహ రుణ వ్యవస్థలకు ఆర్థిక సత్తువ చేకూర్చడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులకోసం ప్రభుత్వం యథాశక్తి కృషి చేస్తోంది. ఇలాంటి విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థలో సాధ్యమయ్యే మార్పు పరిమితమే! పెట్టుబడి ఆధారిత ఆర్థిక వృద్ధిని సాధించాలంటే మాత్రం వ్యవస్థీకృతమైన దీర్ఘకాలిక సంస్కరణలకు శ్రీకారం చుట్టక తప్పదు. మౌలిక సౌకర్యాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదడం ద్వారా దీర్ఘకాలంలో 7-8శాతం వృద్ధి రేటును సాధ్యం చేయవచ్చు. గరిష్ఠ వృద్ధికి మౌలిక సౌకర్యాలే మూలాధారం అన్న విషయంలో భేదాభిప్రాయం లేదు. ఆగ్నేయాసియా దేశాలు, చైనాతో పోలిస్తే మౌలికవసతుల విస్తరణ విషయంలో భారత్‌ తీరు దిగనాసిగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను అధిక పెట్టుబడుల దిశగా కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. కార్పొరేట్‌, ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కదలిక కనిపిస్తోంది. వచ్చే అయిదేళ్లలో దేశంలో మౌలిక రంగ విస్తరణకు వంద లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన ముఖ్యమైనది. ఈ ప్రకటన ఆశావహంగానే వినిపిస్తున్నా ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదు. మౌలిక రంగం విస్తరిస్తే ఉపాధికి ఊతం దొరుకుతుంది.

Posted on 09-09-2019