Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

విలీనంతో ఉనికికి ముప్పు

* కనుమరుగు కానున్న ఆంధ్రాబ్యాంక్‌

బ్యాంకుల విలీన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన, ఉద్విగ్నతలు చోటుచేసుకున్నాయి. నిజాం నవాబు స్థాపించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ను తొలుత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు. దీనితో హైదరాబాద్‌లోని ఆ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం కనుమరుగైంది. తాజాగా బ్యాంకుల విలీన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ఒకే ఒక జాతీయ బ్యాంకు ఆంధ్రాబ్యాంకు సైతం అదృశ్యం కానుంది. ఇందుకు గల కారణాలను పరిశీలించే ముందు బ్యాంక్‌ 96 సంవత్సరాల చరిత్ర తెలుసుకోవడం అవసరం.

గాంధీజీ పిలుపుమేరకు దేశంలో నిర్మాణాత్మక కార్యకలాపాలకు అనేకమంది ముందుకొచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహాలు, నిరసనలు చేయటంతో పాటు, సంపాదనతో కూడిన వృత్తులను, ఉద్యోగాలను, చదువులను త్యజించి దేశ ఆర్థిక పరిపుష్టికి నిర్మాణాత్మక కార్యకలాపాలు చేపట్టడం అవసరమని గాంధీ పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే డాక్టరుగా మంచి సంపాదన ఉన్నా దానిని వదిలిపెట్టి స్వాతంత్య్ర ఉద్యమంలోకి అడుగుపెట్టిన డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును స్థాపించారు. అంతకు ముందే కొన్ని విద్య, ఆర్థిక సంస్థలు స్థాపించినా 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపన అన్నింటిలోకి ఆణిముత్యమని ఆయనే ఒక సందర్భంలో చెప్పారు.

రుణాల మంజూరులో సమతుల్యత
ఆ రోజుల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ దేశవ్యాప్తంగా బ్రిటిషువారికి చెందిన ఇంపీరియల్‌ బ్యాంక్‌ నిర్వహించేది. స్వదేశీ బ్యాంక్‌ రావడం వారికి ఇష్టంలేదు. అందువల్లే ఆంధ్రాబ్యాంకులో వాటాదారులుగా, డైరెక్టర్లుగా ఎవరూ చేరవద్దని వ్యాపారుల మీద వారు ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికి భయపడి అభిమానమున్నా ముందుకు రావడానికి కొందరు తటపటాయించగా, తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్‌ భోగరాజు మేనేజింగ్‌ డైరెక్టరు పదవిని తీసుకోవలసి వచ్చింది. జాతీయోద్యమంలో పాల్గొంటూనే ఆయన 1931 దాకా ఆ పదవిలో కొనసాగారు. ఇంపీరియల్‌ బ్యాంక్‌ కల్పించిన అడ్డంకులను అధిగమించుకుంటూ ఓ స్థాయికి తీసుకొచ్చిన తరవాత ఆ పదవి నుంచి తప్పుకొని డైరెక్టరుగా పది సంవత్సరాలు ఉన్నారు. అటు వ్యాపారులకు, ఇటు రైతులకు సమతుల్యంగా రుణాలు ఇవ్వాలని బ్యాంక్‌ నిబంధనలలోనే చేర్చిన ఘనత పట్టాభిదే. దేశ బ్యాంకింగ్‌ చరిత్రలో అటువంటి నిబంధన చేర్చిన ఏకైక బ్యాంక్‌ ఆంధ్రాబ్యాంక్‌ కావడం విశేషం. అప్పట్నుంచి బ్యాంక్‌ గ్రామాల్లో ఎక్కువగా శాఖలు ప్రారంభించింది. జాతీయబ్యాంకులు ఏదైతే సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయో ఆ పని భోగరాజు అప్పుడే ఆంధ్రాబ్యాంక్‌ ద్వారా ప్రారంభించారు. తద్వారా దానిని ప్రజాబ్యాంకుగా మార్చారు. అందుకే అది తెలుగువాళ్ళ గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకోగలిగింది.

కొద్ది పెట్టుబడితో ప్రారంభమైన బ్యాంక్‌ ఇప్పుడు సుమారు నాలుగు లక్షల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. 2009లో లక్ష కోట్లున్న వ్యాపారాన్ని పది సంవత్సరాల్లో నాలుగు రెట్లకు పెంచింది. దాదాపు మూడు వేల శాఖలు, 21 వేలకు పైగా సిబ్బందితో అలరారుతోంది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం 1963లో ప్రధాన కార్యాలయాన్ని మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు మార్చారు. అనంతరం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ శాఖల్ని విరివిగా ప్రారంభించింది. తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు వెయ్యి, తెలంగాణలో దాదాపు ఆరువందల పైచిలుకు శాఖలు ఉన్నాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటం వలన ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రత్యక్షంగా ఉన్నతాధికారులతో సంప్రదింపులకు అవకాశం ఉండేది. ఇక నుంచి ఆ సదుపాయం ఉండదు. ప్రతి చిన్న పనికీ ముంబయి ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి 1984 నుంచి ఆంధ్రాబ్యాంక్‌ కన్వీనర్‌గా ఉంటూ ప్రభుత్వ రుణ ప్రణాళికను రూపొందిస్తూ అటు బ్యాంకులకు, ఇటు ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ వచ్చింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరవాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బ్యాంకర్ల స్థాయీ సంఘానికి సంధానకర్తగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాలకు లీడ్‌ బ్యాంకుగా బాధ్యతలు నెరవేరుస్తోంది. రైతాంగం అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సమాజ పురోభివృద్ధిలో తనవంతు పాత్ర నిర్వహిస్తోంది. ఆంధ్రాబ్యాంకు గ్రామీణ అభివృద్ధి ట్రస్టు ద్వారా సొంతంగా, వ్యాపారవేత్త గ్రంధి మల్లిఖార్జునరావు భాగస్వామ్యంతో ఎంతోమంది సొంత కాళ్ళమీద నిలబడేటట్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతు సేవా సహకార సంఘాలు స్థాపించి డాక్టర్‌ భోగరాజు స్పూర్తితో పనిచేస్తోంది.

ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు గత నెలాఖరులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అదేసమయంలో దక్షిణాదిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, తూర్పున యూకో బ్యాంక్‌, ఉత్తరాన పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌, పశ్చిమాన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలను ప్రాంతీయ అస్తిత్వానికి గుర్తింపుగా, వాటిని ఏ ఇతర బ్యాంకుల్లో కలపకుండా యథాతథంగా ఉంచుతున్నామని ప్రకటించారు. అదే సమయంలో తెలుగు వారి కోసం ఆంధ్రాబ్యాంక్‌ ప్రాంతీయ ఉనికిని గుర్తించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థికంగా చూస్తే ఆంధ్రాబ్యాంక్‌ పైన పేర్కొన్న బ్యాంకుల కంటే మెరుగైన స్థితిలో ఉంది. వ్యాపార పరిమాణం చూసినా ఆ నాలుగు బ్యాంకులకన్నా ఎక్కువగానే ఉంది. ఆ ప్రాతిపదికన చూస్తే ఆంధ్రాబ్యాంకును యథాతథంగా కొనసాగించడానికి అన్నివిధాలా అర్హత ఉంది.

ఇక ముంబయికి పరుగులు
డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్‌ రజతోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సంస్థలకు ప్రారంభం మాత్రమే ఉంటుందని అంతం ఉండదని పేర్కొన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఇంకో నాలుగు సంవత్సరాల్లో శత వసంతాన్ని జరుపుకొంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో బ్యాంక్‌ ఉనికి కోల్పోనుంది. తాజా విలీనాలతో మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు 12కు తగ్గాయి. ఈ 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో నాలుగు ముంబయిలో, రెండు దిల్లీలో, రెండు చెన్నైలో, కోల్‌కత్తా, బెంగళూరు, పూణె, బరోడాల్లో ఒక్కొక్కటి ఉంటాయి. బెంగళూరుతో సమానస్థాయిలో ఉన్న హైదరాబాద్‌లో ఒక్కటీ ఉండదు. ఆంధ్రాబ్యాంక్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. దీంతో ఇక ప్రతి పనికీ ముంబయికి వెళ్లాల్సి వస్తుంది. విలీనం తరవాతా ఆంధ్రాబ్యాంక్‌ మొత్తం 9,800 శాఖల్లో 2,100 శాఖలు (21 శాతం) తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఇన్ని ఎక్కువ శాఖలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఏ ప్రాతిపదికన చూసినా హైదరాబాద్‌లో బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం కొనసాగించవచ్చనడంలో సందేహం లేదు!


- కె. రామకోటేశ్వర రావు
(రచయిత - సామాజిక విశ్లేషకులు)
Posted on 09-09-2019