Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

నల్లధన రాజకీయం!

అవినీతి పంకిల రాజకీయాల్లో తరతమ భేదాలతో అందరూ గ్రంథసాంగులే. ‘అధికారం అవినీతిని మప్పుతోంది...అందుకు మా పార్టీ వాళ్లూ అతీతులు కా’రన్న భారతరత్న వాజ్‌పేయీ వ్యాఖ్యల సాక్షిగా- సమకాలీన రాజకీయాల్లో సచ్ఛరితుల్ని ఎంచడం, గొంగట్లో తింటూ వెంట్రుకలేరే వృథాయాసమే. నల్లధనమే ఇరుసుగా, ఇంధనంగా రాజకీయ పక్షాల రథాలు నడుస్తున్న వేళ ఇది. ఎన్నికల్లో విచ్చలవిడి వ్యయీకరణ మొదలు పార్టీ ఫిరాయింపుల వలలో చిక్కుకోకుండా అస్మదీయుల్ని కాచుకోవడం దాకా అన్నింటికీ నల్లధనంపైనే పార్టీలు ఆధారపడుతున్న దుస్థితి- దేశీయంగా ధనస్వామ్యం ఎంతగా ఊడలు దిగిందో కళ్లకు కడుతోంది. కాసుల రాజకీయాలకు పెట్టింది పేరైన కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద నిర్బంధించడం- కొన్ని సహేతుక సందేహాలకు తావిస్తోంది. నలుగురు అనుయాయులతో కలిసి శివకుమార్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, దిల్లీలో నాలుగు ఫ్లాట్లను నల్లధన స్థావరాలుగా వినియోగించారన్న ఆదాయపన్ను అధికారుల నివేదికల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 2017 ఆగస్టులో గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన సోనియా ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ను ఓడించడానికి భాజపా కంకణబద్ధమై ఉన్న తరుణంలో- హస్తం పార్టీ శాసనసభ్యులు 44 మందిని బెంగళూరు రిసార్టుకు తరలించి పటేల్‌ విజయానికి బాటలు పరచింది శివకుమారే. అదే సమయంలో శివకుమార్‌పై ఆదాయపన్ను శాఖ దాడి, దరిమిలా కేసు నమోదు, ఈడీ అభియోగాల్లో రాజకీయ కోణాలు దాచినా దాగనివే! రాజకీయ అవినీతిని మట్టగించడమే ఏకైక అజెండా అయితే పార్టీ భేదాలకు అతీతంగా ప్రజాధనం కైంకర్యం చేసిన ప్రతి ఒక్కరి మీదా ఉక్కుపాదం మోపాలి. రాజకీయాల్ని సాంతం క్షాళన చేయాలంటే, నల్లధనం రొంపి నుంచి వాటిని బయటపడేసే కార్యాచరణను పట్టాలకెక్కించేలా రాజనీతిజ్ఞత కనబరచాలి. ఆ రెండు లక్ష్యాలకూ దూరంగా సాగేది- అవినీతిపై పోరు ఎలా అవుతుంది?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది నాగరిక పాలనా సంవిధానం. చట్టసభ సభ్యులెవరూ లాభదాయక పదవులు చేపట్టరాదని రాజ్యాంగ నిర్మాతలు లక్ష్మణరేఖ గీస్తే- తమ సభ్యత్వాన్నే లాభదాయకంగా మార్చేయడంలో మన నేతాగణాల చేతివాటం అసామాన్యం. అన్నిరకాల అవినీతికీ తల్లివేరు రాజకీయ అవినీతి అని సూత్రీకరించే స్థాయిలో పార్టీల దివాలాకోరుతనం, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదన్నట్లుగా ప్రజాప్రతినిధుల దోపిడీ పర్వం- డెబ్భయ్యేళ్ల భారత గణతంత్ర ప్రగతిని దిగలాగుతున్నాయి. ‘అవినీతి వలన, నల్లధనం చేత, నేరగాళ్ల కొరకు’గా భ్రష్టుపట్టిన ప్రజాతంత్ర వ్యవస్థలోని చీకటి కోణాలపై సమాచార కాంతి పుంజాల ప్రసరణానికీ పార్టీలు మోకాలడ్డుతున్నాయి. అన్ని స్థాయుల్లో అవినీతిని కుళ్లగించే ఆర్టీఐ చట్టాన్ని తెచ్చింది తామేనని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్‌, దాని పరిధిలోకి పార్టీలు రానేరావంటూ నాలుక మడతేసింది. పార్టీల నిధుల సేకరణ, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాలు పాదుకోవాలని దశాబ్దాలుగా ఎన్నికల సంఘం మొత్తుకుంటుంటే, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్న భాజపా- ఎన్నికల బాండ్ల విధానం తెచ్చి అందులోనూ పారదర్శకతకు పాతరేసింది! బ్యాంకును మధ్యవర్తిగా వినియోగించి, రాజకీయ విరాళాలను క్రమబద్ధీకరించడమే లక్ష్యమన్న ఎన్‌డీఏ తొలి ఏలుబడి- అనామక బాండ్ల ద్వారా అవినీతికి కొత్త లాకులు ఎత్తిన వైనం ఆలోచనాపరుల్ని నివ్వెరపరచింది. రాజకీయ పక్షాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఓటర్లకు లేనేలేదని మొన్న ఏప్రిల్‌ రెండోవారంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వితండవాదం వినిపించింది. ఒకవంక నల్లధనం పడగనీడన రాజకీయాలు సాగాల్సిందేనంటూ, మరోవంక ప్రత్యర్థుల అవినీతి బాగోతాలపై కత్తి ఝళిపించడం ద్వారా సాధించదలచిన లక్ష్యం ఏమిటి?

అధికారం కోసం రాజకీయాలను ఆదర్శం కోసం రాజకీయాలుగా, అవకాశవాద రాజకీయాలను సైద్ధాంతిక కట్టుబాటు రాజకీయాలుగా, మోసపూరిత రాజకీయాలను శీలవర్తనం గల రాజకీయాలుగా మార్చడమే లక్ష్యమని భాజపా సంస్థాపన దినోత్సవ వేళ వాజ్‌పేయీ ఘనంగా చాటారు. రాజకీయ విరాళాల్లో పారదర్శకత తెచ్చి ఎన్నికల వ్యయాలకు కత్తెర వేయాలని ప్రధాని నరేంద్రమోదీ లోగడ అభిప్రాయపడ్డారు! సమగ్ర ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఈసీ సమర్పించిన విపుల ప్రతిపాదనలు పదిహేనేళ్లుగా అటకెక్కాయి. వాటి బూజు దులిపి జాతి విశాలహితకరంగా రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనాలను పెంచగలిగే శక్తి సామర్థ్యాలు నేడు మోదీ ప్రభుత్వానికి ఉన్నాయి. పారదర్శకత పేరిట ఎన్నికల బాండ్ల విధానంపై కోర్టు వేటు వేయరాదని కేంద్రం కోరిన నేపథ్యంలో- బాండ్ల రూపేణా వచ్చిన విరాళాల రసీదుల్ని, దాతల వివరాల్ని ఎన్నికల సంఘానికి సీల్డ్‌ కవర్లో సమర్పించాలని ఏప్రిల్‌ రెండోవారంలో సుప్రీంకోర్టు పార్టీలను ఆదేశించింది. నల్ల ధనస్వామ్యం విష పరిష్వంగం నుంచి పార్టీలు బయటపడాలన్న సమున్నత లక్ష్యం ఇలాంటి ఉత్తర్వులతో ఎలా సాకారమవుతుంది? నిరుడు మార్చి నుంచి మొన్న మే నెల 10దాకా పార్టీల విరాళాల నిమిత్తం దాతలు కొన్న మొత్తం బాండ్ల విలువ రూ.5,851 కోట్లు! అందులోనూ నాలుగోవంతుపైగా అనామక దాతలు ఇచ్చినవే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయాన్ని తలదన్నేలా ఇక్కడ పార్టీలు వెదజల్లుతున్న వేల కోట్ల నిధులు భారత ప్రజాతంత్రాన్ని సంతలో సరకుగా మార్చేశాయి. రాజకీయ అవినీతి, నల్లధన ప్రవాహాలపై మోదీ ప్రభుత్వం లక్షిత దాడి జరిపితే, దేశానికది మహోపకారమవుతుంది!


Posted on 09-09-2019