Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

స్వయంకృతమీ సంక్షోభం

* ఆదాయానికి మించి వ్యయాలు

అమెరికా-చైనా వాణిజ్య వైరం వల్ల ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అది భారత్‌కూ సోకే ప్రమాదం ఉన్న మాట నిజమే కానీ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక కడగండ్లకు కొన్ని దశాబ్దాల క్రితమే బీజం పడింది. తప్పులతడక విధానాలు, నిధుల వినియోగంలో అవకతవకలు, అధికార యంత్రాంగం అసమర్థత, పట్టపగ్గాల్లేని అవినీతి, చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకత్వం కలగలసి దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. నేడు నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల) బెడదతో, నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్యాంకులను, పరిశ్రమలను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు గుమ్మరిస్తామంటోంది. అంత ఆర్థిక స్తోమత సర్కారుకు లేదనేది చేదు నిజం. ప్రజల వినియోగం తగ్గడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని సూత్రీకరిస్తున్న ఆర్థికవేత్తలు కొందరు, వ్యవస్థలోకి భారీగా నిధులు ప్రవహింపజేయడం ద్వారా కొత్త జవజీవాలు తీసుకురావచ్చని సిఫార్సు చేస్తున్నారు. అందుకు తగినన్ని నిధులు లేకపోవడం వల్లనే ఎన్డీయే ప్రభుత్వం బ్యాంకుల్లో సామాన్య ప్రజలు దాచుకున్న పొదుపు మొత్తాలను బ్యాంకుల పారుబాకీలు చెల్లువేయడానికి ఉపయోగిస్తామంటోంది. రిజర్వు బ్యాంకు మిగులు నుంచి రూ.1,76,000 కోట్లను మళ్లించి, వాటిలో రూ.70,000 కోట్లను బ్యాంకులకు ఇస్తామంటోంది. కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు ఈ నిధులను వెచ్చించాలట. ఇదంతా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక మందగతికి కారణం కేవలం వస్తుసేవల వినియోగం తగ్గిపోవడం కాదు. అధిక నిరుద్యోగం, నష్టాల పాలవుతున్న పరిశ్రమలు, పలు రంగాల్లో చొరవ, సామర్థ్యాలు లోపించడం ప్రస్తుత దుస్థితికి కారణాలయ్యాయి. నిధులు, మౌలిక వసతుల కొరతను ఎదుర్కొనే ఏ ఆర్థిక వ్యవస్థా అభివృద్ధి పథంలో పరుగులు తీయలేదు. నీటి పారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాకపోవడం వల్ల ప్రాజెక్టు వ్యయం ముందనుకున్నదానికి ఎన్నో రెట్లు మించిపోవడం భారత్‌లో సర్వసాధారణం. ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి ఉంటే వ్యవసాయోత్పత్తి, దానితోపాటు గ్రామీణ ఆదాయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగేవి. వ్యవసాయం సహా ఇతర రంగాల్లో ప్రాజెక్టుల నిర్మాణం సగటున అయిదు నుంచి 20 ఏళ్లు ఆలస్యమవుతోంది. దీనికి అవినీతి తోడై గిట్టుబాటు కానిస్థాయికి ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతోంది. పరిస్థితి ఇలా ఉంటే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కాదు కనుకే మన ఆర్థిక రథం కుంటి నడకన సాగుతోంది.

ప్రాజెక్టులను పూర్తిచేయడంలో అలసత్వం, బాధ్యతారాహిత్యాలను కేంద్ర గణాంక శాఖకు చెందిన మౌలిక వసతులు, ప్రాజెక్టుల పర్యవేక్షణ విభాగం నివేదిక కళ్లకు కట్టింది. రూ.150 కోట్లకు మించిన వ్యయంతో చేపట్టిన 1,453 ప్రాజెక్టులు ఆలస్యమైపోవడంతో మొత్తం ఖర్చు ముందనుకున్నదానికన్నా రూ.3,28,734 కోట్లు ఎక్కువైందని ఆ నివేదిక వివరించింది. ఈ ప్రాజెక్టులను రూ.18,32,579 కోట్ల వ్యయంతో చేపట్టాలని తలపెట్టగా, అనవసర జాప్యాల వల్ల ఇప్పుడా వ్యయం రూ.21,61,313 కోట్లకు చేరింది. అంటే అంచనా వ్యయంకన్నా 18శాతం ఎక్కువ. వీటిలో 388 ప్రాజెక్టులు గడువు మించినా పూర్తికాలేదు. మరో 345 ప్రాజెక్టుల అంచనా వ్యయం మొదట అనుకున్నదానికన్నా పెరిగిపోయింది. 2019 ఏప్రిల్‌ నాటికి ఈ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు రూ.8,84,906 కోట్లు. ఇది అంచనా వ్యయంలో 41 శాతానికి సమానం. ఈ లెక్కన అవి ఎప్పటికి పూర్తయ్యి ఫలాలను అందిస్తాయో చెప్పలేం. సత్వర నీటిపారుదల లబ్ధి కార్యక్రమం (ఏఐబీపీ) కింద 16 జాతీయ సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి, రైతులకు, రాష్ట్రాలకు శీఘ్రంగా లబ్ధి చేకూర్చాలని కేంద్రం సంకల్పించినట్లు 2018 ‘కాగ్‌’ నివేదిక వివరించింది. పై కార్యక్రమాన్ని చేపట్టి దశాబ్దం కావస్తున్నా ఏ ప్రాజెక్టూ వేగంగా పూర్తయిన దాఖలా లేదు. అయిదు ప్రాజెక్టులపనులు మాత్రం జరుగుతున్నాయంతే. 2017 మార్చి వరకు ఈ అయిదు ప్రాజెక్టులపై రూ.13,299 కోట్లు వ్యయీకరించినా, కనీసం ఒక్కటీ పూర్తి కాలేదు. వాటి నుంచి రైతుల పొలాలకు నీరు పారలేదు; రాష్ట్రాలకు విద్యుత్‌ పంపిణీ కాలేదు. ఈలోపు ప్రాజెక్టు వ్యయం 2,341 శాతం పెరిగిపోయింది. వాటివల్ల రాగల లబ్ధి మాత్రం ఆ స్థాయిలో ఉండబోవడం లేదు.

దురదృష్టవశాత్తు, ఏ ప్రభుత్వమూ నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో, అనుకున్న వ్యయానికి పూర్తి చేయలేకపోయింది, అడ్డంకులను తొలగించలేకపోయింది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాలకులు ఏవేవో సాకులు చెబుతూవచ్చారు. ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోవడానికి ప్రధాన కారణం అవినీతే. ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే రాజకీయ నాయకులు, అధికారుల ఆమోద ముద్ర కావాలి. వారికి భారీగా ముడుపులు చెల్లిస్తేనే అది లభిస్తుంది. దీనికితోడు ఆస్తులవిలువను ఉన్నదానికన్నా ఎక్కువగానో, తక్కువగానో చూపే జాడ్యం మరీ ఎక్కువ. బ్యాంకులను బురిడీ కొట్టించేది ఈ చిట్కాతోనే. 2జీ వేలం, బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతి దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. గాలి జనార్దన రెడ్డి అక్రమ గనుల తవ్వకం, పలు రక్షణ ఒప్పందాల్లో భారీగా ముడుపులు చేతులు మారడం- అన్నీ కలిసి దేశాన్ని ఆర్థికంగా గుల్లచేశాయి. మరోవైపు వివిధ జనాకర్షక పథకాలపై కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత వ్యయాలకు తగ్గట్టు ఖజానాకు ఆదాయం పెరగడం లేదు. ఈ పరిస్థితిలో ఆర్థిక మాంద్యం ముంచుకురావడం ఆశ్చర్యం కలిగించదు. దీన్ని అధిగమించడానికి ఉద్దీపన చర్యలు మాత్రమే సరిపోవు. ప్రస్తుత ఆర్థిక అస్తవ్యస్తతకు మూలాలు క్రమశిక్షణ రాహిత్యంలో, జవాబుదారీతనం లోపించడంలో, పనులు సత్వరం పూర్తి చేయలేకపోవడంలో ఉన్నాయి. ఈ తీవ్ర లోపాలను సరిదిద్దుకోకుండా ఎంత డబ్బు గుమ్మరించినా- అది బూడిదలో పన్నీరు పోసిన చందమే!


- సత్యపాల్‌ మేనన్‌
Posted on 12-09-2019