Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రయోజనం లేని ‘ప్రాయోజితం’

పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసలపై కలివిడిగా పోరాడాలని, 2022 నాటికి నూతన భారత్‌ నిర్మాణమే కేంద్రం రాష్ట్రాల ఉమ్మడి లక్ష్యం కావాలని మొన్న జూన్‌ నాటి నీతిఆయోగ్‌ పాలక మండలి భేటీలో ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 2024 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియాను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యాన్ని కలిసికట్టుగా భారత జట్టుగా సాధించాలని ఉద్బోధించారు. రాష్ట్రాలనే సశక్త ఆర్థిక జవనాశ్వాలుగా కూర్చి దేశ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తామన్న మాటల్లో పోటెత్తిన సమాఖ్యస్ఫూర్తి వాస్తవ కార్యాచరణలో నీరోడుతున్న వాతావరణం కళ్లకు కడుతోంది. ప్రజలకు రాష్ట్రానికి ప్రయోజనకరం కాని కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌)ను అమలు చేయబోమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన- ఆ విషయంలో పలు రాష్ట్రాల అసంతృప్తికి ప్రతిధ్వని! గతంలో సీఎస్‌ఎస్‌ పద్దు కింద రాష్ట్ర ఖజానాకు అయిదారు వేలకోట్ల రూపాయలు జమపడేవని, ఈ ఏడాది ఇప్పటికి వచ్చినవి వెయ్యి కోట్లేనంటూ ఆ పథకాల అమలు ప్రయాస రాష్ట్రాలదైతే, పేరు కేంద్రానిది కావడం పట్ల కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తీకరిస్తున్నారు. పద్నాలుగో ఆర్థిక సంఘం ‘వితరణ’ పుణ్యమా అని కేంద్ర పథకాలకు నిధులు వెచ్చించలేక రాష్ట్రాలు కిందుమీదులవుతున్నాయని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నీతిఆయోగ్‌ సమావేశంలోనే నిష్ఠుర సత్యం పలికారు. సీఎస్‌ఎస్‌ను నిలిపేసి స్వీయ ప్రాధాన్య పథకాలను కేంద్రసర్కారు స్కీములుగా నూరుశాతం సొంత నిధులతో మోదీ ప్రభుత్వమే చేపట్టాలని, రాష్ట్రాలు తమ పరిధిలో అవసరమైనవాటిని సొంత ఖర్చుతో నిర్వహించుకోగలవనీ స్పష్టీకరించారు. ఈ ఏడాది చివరిలోగా నివేదిక సమర్పించనున్న పదిహేనో ఆర్థిక సంఘం ఎదుట పలు రాష్ట్రాలు సీఎస్‌ఎస్‌ తలకుమించిన భారమవుతున్న వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టాయి. మెరుగైన వ్యయీకరణతో సత్ఫలితాలు రాబట్టాలంటే కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్యను తగ్గించాల్సిందేనని ఆర్థిక సంఘం సారథిగా ఎన్‌కే సింగ్‌ సైతం అభిప్రాయపడుతున్న తరుణంలో- దిద్దుబాటు చర్యలకు కేంద్రం సిద్ధం కావాలి!

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే రాష్ట్రాలు ఇనుమడించిన విత్త సత్తువ, స్వయంప్రతిపత్తితో పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకొని ప్రగతిపథంలో పయనించేలా చూడాలన్నదే తమ విధానమని 2015 ఫిబ్రవరిలో ప్రధాని మోదీయే ఘనంగా చాటారు. దశాబ్దాలుగా రాష్ట్రాలను పెద్ద సైజు మున్సిపాలిటీలుగా మార్చేసి, ఆర్థిక పుష్టిని ఇచ్చే ఆదాయ వనరులన్నింటినీ తన పెరట్లోనే కట్టేసుకొని, పేరు గొప్ప ప్రణాళిక సంఘం ద్వారా కేంద్రం సాగించిన అత్తపెత్తనం దేశానికెంత చెరుపు చేసిందో చెప్పనలవి కాదు. మోదీ తొలి జమానాలోనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతిఆయోగ్‌ను ప్రతిష్ఠించినా, మెరుగైన ప్రత్యామ్నాయంగా అది రుజువు చేసుకోలేకపోతోందన్న రుసరుసలు శ్రుతిమించుతున్నాయి. ఏ పథకాల అమలు బాధ్యత అయినా రాష్ట్రాలదే అయినప్పుడు, స్థానిక అవసరాలు, అభివృద్ధి లక్ష్యాల మేరకు పని చేయగల సామర్థ్యం రాష్ట్రాలకు ఉన్నప్పుడు- సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రస్థాయిలో పథకాలు రూపొందించడంలోని ఔచిత్యం ఏమిటి? యూపీఏ తొలి ఏలుబడిలో 150 దాకా కేంద్ర ప్రాయోజిత పథకాలుండేవి. 2013 జూన్‌లో వాటిని 66కు కుదించారు. సీఎస్‌ఎస్‌ హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపబృందం సూచనల మేరకు 2016 ఆగస్టులో వాటిని 28కి తగ్గించారు. పద్నాలుగో ఆర్థిక సంఘం విభాజ్య నిధుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచిన నేపథ్యంలో, ఆ ప్రయోజనం హళ్ళికి హళ్ళి సున్నకు సున్న అయ్యేలా కేంద్రం సీఎస్‌ఎస్‌లో రాష్ట్రాల వాటాను రెట్టింపు చేసింది. కొన్ని పథకాల్ని రాష్ట్రాలకే బదిలీ చేసింది! రైతుబంధు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని ఆయా రాష్ట్రాలే సమర్థంగా నిర్వహించగలుగుతున్నప్పుడు పైయెత్తున అరకొరగా అవే ప్రణాళికలతో కేంద్రం చేస్తున్న హడావుడి- పరిమిత ఆర్థిక వనరుల్ని అక్షరాలా గాలికిపోయే పేలపిండిగా మార్చేస్తున్నది!

పేదరిక నిర్మూలన, తాగునీరు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి పది కీలకాంశాల్ని జాతీయాభివృద్ధి అజెండాగా నిర్ధారించి సీఎస్‌ఎస్‌ ద్వారా ఆ లక్ష్యాల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని 2016 ఆగస్టులో నీతిఆయోగ్‌ నిర్దేశించింది. తదనుగుణంగా తీర్చిన 28 పథకాల్లో ఆరు అతిముఖ్యమైనవిగా, 20 స్కీములు ముఖ్యమైనవిగా గుర్తించి మరో రెండింటి అమలును రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది. అంటే, తక్కిన 26 పథకాల్నీ రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. సీఎస్‌ఎస్‌ మీద కేంద్రం చేసే వ్యయం రూ.3.55 లక్షల కోట్లు అంటే, రాష్ట్రాల వాటానూ కలుపుకొంటే- అది సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలన్న మాటే! లోగడ సీఎస్‌ఎస్‌ల కాలావధి పంచవర్ష ప్రణాళికతో ముడివడి ఉండేది. ప్రణాళిక సంఘం కాలగర్భంలో కలిసిపోయాక వాటి ఉనికి మనికి ఆర్థిక సంఘంతో జత కలిసింది. కేంద్రం నిధుల వ్యయీకరణ ఏడొందలకు పైగా భిన్న పద్దులకు, 150కి పైగా ప్రాయోజిత పథకాలకు మళ్ళుతోందన్న ఆర్థిక సంఘం- మెరుగైన ఖర్చుల నిమిత్తం వాటికి కోత పడాల్సిందేనంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు కుదురుగా లేనప్పుడు దేశార్థికం కుదుపులకు లోనుకారాదంటే, కేంద్రీకరణ విధానాల్ని విడనాడాలని పద్నాలుగో ఆర్థిక సంఘం ఛైర్మన్‌ వైవీ రెడ్డి సూచిస్తున్నారు. కేంద్రంలో రూపొంది రాష్ట్రాలపై రుద్దిన పథకాలేవీ సత్ఫలితాలు సాధించిన దాఖలాలు ఎక్కడా లేవు. భిన్నత్వం, బహుళత్వం విలక్షణతలుగా గల భారతావనిలో రాష్ట్రాలను ఆర్థికంగా పరిపుష్టం చేసి, వాటి ప్రగతి కాంక్షలకు గొడుగుపట్టి, మార్గదర్శక పాత్రలో కేంద్ర సర్కారు రాణిస్తేనే- నయాభారత్‌ స్వప్నం సాకారమవుతుంది!


Posted on 12-09-2019