Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

చైనా 'గోడ'కు బీటలు

* భారత్‌ ప్రగతికి కొత్త బాటలు!
ప్రపంచ విపణిలో ఇటీవల కల్లోలం చెలరేగింది. చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను ఒక్కసారిగా తెగ్గోయడంతో అన్ని దేశాల కరెన్సీలూ బలహీనపడ్డాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. భారతీయ రూపాయి సైతం బలహీనపడింది. అంతర్జాతీయ సమాజం ఎందుకింత గందరగోళానికి గురైంది? చైనా కరెన్సీ విలువ తగ్గితే అంతర్జాతీయ సమాజానికి వచ్చిన నష్టమేమిటి? ఇంతకూ చైనాలో ఏం జరుగుతోంది? దానివల్ల భారత్‌పై పడే ప్రభావం ఏమిటి? సమాధానాలు వెదకాల్సిన ప్రశ్నలివి. ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి స్థానంలోని అమెరికా 17లక్షల కోట్ల యూఎస్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. చైనా జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) మొత్తం విలువ 10లక్షల కోట్ల యూఎస్‌ డాలర్లు. ఎన్నో దేశాలకు చైనా అతిపెద్ద వర్తక భాగస్వామి. ఉత్పత్తి రంగంలో చరిత్రను తిరగరాసి, అతికొద్ది సమయంలోనే ప్రపంచ కార్ఖానాగా పేరొందిన ఘనత చైనా సొంతం. దాదాపు ప్రపంచ దేశాల్లో లభించే వస్తువులన్నీ చైనాలో తయారై ఉంటాయనడంలో సందేహం లేదు. అమెరికా, ఐరోపాలకు చెందిన అతిపెద్ద కంపెనీలు సైతం చైనాలో తమ ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. దీన్నిబట్టి ఉత్పత్తి రంగంలో ఆ దేశం ఏ స్థాయికి ఎదిగిందీ స్పష్టమవుతోంది. చురుకుగా ఆలోచించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అంతకు రెట్టింపు వేగంతో వాటిని అమలు చేయడం ద్వారా చైనా కేవలం రెండు మూడు దశాబ్దాల కాలంలోనే అనూహ్య వృద్ధి సాధించి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. వేల సంవత్సరాల క్రితమే మంగోలుల దండయాత్రలనుంచి దేశ సరిహద్దులను కాపాడుకోవటానికి అతి పొడవైన చైనా గోడ నిర్మించిన ఘనమైన వారసత్వం వారిది. ఏదైనా కార్యం తలపెడితే దాన్ని పూర్తి చేయటంలో చైనా చూపించే పట్టుదల ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఉన్నపళంగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇబ్బందుల్లో పడిందనేది ఆసక్తి కలిగించే అంశం.

ప్రపంచ కార్ఖానా...

గడచిన రెండు దశాబ్దాల్లో చైనా వృద్ధిరేటు పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా చైనాను అక్కడి ప్రభుత్వం విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ముడిపదార్థాలు, లోహాలు దిగుమతి చేసుకొని, వాటిని వస్తువులుగా మార్చి, ఇతర దేశాలకు చైనా ఎగుమతి చేసింది. ఆ క్రమంలో అక్కడ భారీస్థాయిలో కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వాటిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించాయి. అదే దానికి ఇప్పుడు ఇబ్బందికరం అవుతోంది. ప్రపంచ మార్కెట్లో చైనా వస్తువులకు గిరాకీ తగ్గింది. దీంతో చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా గతంలో మాదిరిగా అధిక వృద్ధి సాధించలేని పరిస్థితి ఏర్పడింది. ఆదాయాల తగ్గుదల, ఉద్యోగాల్లో కోత వంటి పరిణామాలు మొదలయ్యాయి. ఏ దేశం అయినా ఆర్థికంగా వేగంగా ఎదిగినంతకాలం బాగుంటుంది. ఎక్కడో ఒకచోట అది గరిష్ఠ స్థాయికి చేరి, అక్కడి నుంచి తిరోగమం మొదలవుతుంది. ఈ పరిస్థితిని ముందుగానే వూహించి అప్రమత్తంగా, ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోతేనే ఇబ్బంది. ఒక్కసారిగా ఆర్థికాభివృద్ధి క్షీణిస్తే, దానివల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. 1997-98 కాలంలో 'ఆసియా టైగర్స్‌' విషయంలో అదే జరిగింది. 1997 మధ్యభాగంలో థాయ్‌లాండ్‌ తన కరెన్సీ అయిన బట్‌ విలువ తగ్గించడంతో అప్పట్లో ఆసియా సంక్షోభం మొదలైంది. ఇప్పుడు చైనా స్థితి, నాటి ఆసియా టైగర్స్‌ మాదిరిగానే ఉందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండంకెల ఆర్థికాభివృద్ధిని సాధించిన చైనా ఇప్పుడు 7.5శాతం వృద్ధి అయినా నమోదు చేయలేని స్థితికి చేరింది. గడచిన అయిదేళ్లుగా చైనా వృద్ధిరేటు మందగిస్తోంది. ఎగుమతులు తగ్గిపోతున్నాయి. స్టాక్‌మార్కెట్‌, స్థిరాస్తి మార్కెట్‌ గాలిబుడగ చందాన కనిపిస్తున్నాయి. పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా ప్రభుత్వం తనదైన శైలిలో చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. స్టాక్‌మార్కెట్లో కొనుగోళ్లకు దన్నుగా నిలిచింది. ఎగుమతులు పెంచుకోవడానికి కరెన్సీ విలువ తగ్గించింది. వడ్డీరేట్లు తగ్గించింది. ఇవన్నీ చూసి ప్రపంచవ్యాప్తంగా భయాలు ఇంకా అధికం అయ్యాయి. చైనా ఆర్థిక వ్యవస్థ బాగాలేదనేందుకు ఇవి సంకేతాలు. అందుకే ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. మొత్తం మీద చైనా సమస్య- ప్రపంచానికి సమస్య అయి కూర్చుంది.

సాధారణంగా ఒక దేశ ఆర్థికవ్యవస్థ స్థితిగతులను స్టాక్‌మార్కెట్‌ ప్రతిబింబిస్తుంది. చైనా పరిస్థితి బాగాలేదని, ప్రపంచ దేశాలపై అది ప్రతికూల ప్రభావం కనబరచనుందనడానికి గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడం ప్రధాన సంకేతం. గడచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత అధికంగా ఆ రోజు భారత్‌లోనూ స్టాక్‌మార్కెట్‌ సూచీలు పతనాన్ని నమోదు చేశాయి. చైనాలో అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకూ షాంఘై ఎక్స్ఛేంజి సూచీ దాదాపు 40శాతం నష్టపోయింది. చైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోవటం సౌదీ అరేబియా, రష్యా, వెనిజువెలా వంటి దేశాలకు ఎంతో నష్టదాయకం. చైనా ఈ దేశాల నుంచి పెద్దమొత్తంలో ముడిచమురు కొనుగోలు చేస్తోంది. ఇకపై ముడిచమురు కొనుగోళ్లు తగ్గిపోవచ్చు. ఆ మేరకు ఆదాయాలు క్షీణించి వివిధ దేశాలు కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. చమురు ఒక్కటే కాదు, సహజవాయువు, లోహాలు, ఇతర సరకులు... వంటి వాటన్నింటి పరిస్థితీ ఇంతే. ఆస్ట్రేలియా, పెరు, ఇండొనేసియా, బ్రెజిల్‌, చీలీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి ఇనుప ఖనిజం, వివిధ లోహాలను చైనా పెద్దయెత్తున కొనుగోలు చేస్తుంది. అందువల్ల చైనాలో మాంద్యం ఈ దేశాలకు నష్టదాయకం. ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 10శాతం ఉంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో చైనా వాటా 17శాతం. అందువల్ల చైనా ఆర్థిక సమస్యలు ప్రపంచదేశాలన్నింటిపై ప్రభావం చూపనున్నాయి. మనదేశానికి అతిపెద్ద వర్తక భాగస్వామి చైనా. రెండు దేశాల మధ్య ఏటా దాదాపు 70బిలియన్‌ డాలర్ల వాణిజ్యం నమోదవుతోంది. ఇందులో చైనాదే పైచేయి. మనం దిగుమతి చేసుకునేది ఎంతో ఎక్కువ, ఎగుమతులు చాలా తక్కువ. చైనానుంచి భారత్‌కు 60బిలియన్‌ డాలర్ల దిగుమతులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మనం ఇనుప ఖనిజం, నూలు, మరికొన్ని ఇతర ముడిపదార్థాలు ఏటా 11బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతి చేస్తున్నాం. మొత్తం మీద చూస్తే వర్తక లోటు 49బిలియన్‌ డాలర్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంటుంది. అయితే దిగుమతి చేసుకునే దేశం కాబట్టి తాజా పరిస్థితులు మనదేశానికి కొంతవరకు అనుకూలమనీ చెప్పవచ్చు. కాకపోతే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందిపుచ్చుకోగలిగితే ప్రస్తుత పరిస్థితుల నుంచి లాభపడవచ్చు కూడా. మనది ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు, దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశం. ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో క్షీణించిన ఫలితంగా ఇప్పటికే భారత చమురు బిల్లు తగ్గింది. ఇప్పుడు చైనా దిగాలుతో అంతర్జాతీయ మార్కెట్లో లోహాలు, ఇతర సరకుల (కమాడిటీస్‌) ధరలు దిగివస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలనుంచి లభించే పెట్టుబడులను ఇంతకాలం చైనా ఆకర్షించింది. చైనా ఆర్థిక ప్రగతిపై అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నందువల్ల ఇకపై ఆ స్థానాన్ని మనదేశం సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా మనకు మూలధన లభ్యత పెరుగుతుంది. మెరుగైన ఆర్థికాభివృద్ధికి మూలధన లభ్యతే ఇంధనం. స్వతహాగా చైనాలో అధికంగా పెట్టుబడులు పెట్టే తైవాన్‌, జపాన్‌ సంస్థలు ఇప్పటికే భారత్‌వైపు చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు మనదేశంలో వచ్చే అయిదునుంచి పదేళ్లలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఐరోపా, అమెరికా కంపెనీలూ ఇదే బాట పట్టకమానవు. ఇలా చైనా కష్టాలు కొంతవరకు మనకు మేలు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

మనం సిద్ధంగా ఉన్నామా?

చైనా సంక్షోభాన్ని మంచి అవకాశంగా మలుచుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ఇప్పుడు ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి రంగానికి సంబంధించి ఇంతకాలం చైనా పోషించిన పాత్రను మనదేశం అందిపుచ్చుకోవచ్చని అనేవారూ ఉన్నారు. కానీ అధిక వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన రూపాయి, స్పష్టత లేని నిబంధనలు, నిర్ణయాలు తీసుకోవటంలో విపరీతమైన సాగతీత (వస్తు సేవల బిల్లు, భూ సేకరణ బిల్లు)- తగినంత శిక్షణ, నైపుణ్యం లేని మానవ వనరులు, అంతంత మాత్రంగానే ఉన్న పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు... ఇవన్నీ సవాళ్లే. వీటిని సరిదిద్దుకోలేని పక్షంలో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నట్లు అవుతుంది. గతంలోనూ ఇలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు అలా కారాదంటే, ప్రభుత్వం చురుగ్గా స్పందించి ఉత్పత్తి కార్యకలాపాలను అధికం చేయాలి. వాస్తవానికి చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే అయిదు రెట్లు పెద్దది. దాంతో మనల్ని పోల్చుకోవడం సరికాదు. మౌలిక సదుపాయాల కల్పనలో, కర్మాగారాల స్థాపనలో, ఉత్పత్తి సామర్థ్యాలను సమకూర్చుకోవడంలో చైనా ఎంతగానో ప్రగతి సాధించింది. దానితో పోలిస్తే భారత్‌ ఎక్కడో దిగువన కనిపిస్తుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాయి. ముడిచమురు ధర తగ్గడం, సబ్సిడీల భారాన్ని తగ్గించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని దిద్దుబాటు చర్యలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, రక్షణ ఉపకరణాల దేశీయ తయారీకి ప్రోత్సాహం వంటి చర్యలవల్ల వచ్చే ఏడాదికి మనదేశ కరెంటు ఖాతా లోటు నుంచి బయటపడి మిగులు సాధిస్తుంది. అదే జరిగితే డాలరుతో రూపాయి బలపడటంతోపాటు కరెన్సీ విలువ స్థిరంగా ఉంటుంది. అప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువవుతుంది. అదే సమయంలో దేశీయ పెట్టుబడులనూ సమీకరించగలిగితే, ప్రపంచంలో అత్యధిక వృద్ధిరేటు సాధించే దేశంగా ఎదగగలం. చైనా సంక్షోభాన్ని ఎదురీది, దాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నట్లు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం, పాలకవర్గాలు ముందుచూపుతో వ్యవహరించడం ఎంతో ముఖ్యం.

- గన్నవరపు సుబ్బారావు
Posted on 03-10-2015