Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ఉపాధికి ఆశా కిరణం

* సౌర విద్యుత్‌ రంగంలో అపార అవకాశాలు

ఆర్థిక మందగమనంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఎన్నో సంస్థలు ఉద్యోగ నియామకాలను కుదించుకుంటున్నాయి. మరికొన్ని నష్ట నివారణకు ఉద్యోగుల తొలగింపు దిశగా కార్యాచరణకు ఉపక్రమించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చే రంగాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. మాంద్యం అలముకుంటున్న దశలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు. గత నాలుగు దశాబ్దాల్లో నిరుద్యోగిత గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఇప్పుడు నిరుద్యోగులకు ఉపాధి ఎలా కల్పించాలన్న అంశంపైనే పాలకులు తర్జనభర్జనలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా విద్యాసంస్థల నుంచి లక్షలాది విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. ఎంతోమంది ఉపాధిని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. చేసిన డిగ్రీలతో సంబంధం లేకుండా రూ.8,000 మొదలుకొని రూ.15 వేల వరకు వేతనాలతో డేటాఎంట్రీ ఆపరేటర్‌, రిసెప్షనిస్ట్‌, ప్రి-స్కూల్‌ నర్సరీ టీచర్‌, హోమ్‌గార్డు, ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థల వస్తువులు బట్వాడా ఉద్యోగాలు చేయడానికీ సిద్ధపడుతున్నారు. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఈ పరిస్థితి మన మానవ వనరుల విధానం ఎంత నిరుపయోగంగా ఉందో కళ్లకు కడుతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించాలని, ఉపాధికి ఊతమిచ్చే కోర్సులను పాఠ్యప్రణాళికలో ప్రవేశపెట్టాలని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సుస్థిరాభివృద్ధికి ఊతం
పొదుపు, పర్యావరణ హితం, సామాజిక ప్రయోజనాలతో కూడిన సుస్థిరాభివృద్ధిలో సౌరవిద్యుత్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరులవైపు మన పరివర్తన- తక్కువ వ్యయంతో కూడిన అభివృద్ధితో పాటు అపారమైన ఉద్యోగావకాశాలనూ సృష్టిస్తుంది. పలు దేశాలు సౌరవిద్యుత్తుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అది పర్యావరణ హితకరం. కాలుష్య ఉద్గారాల సమస్య ఉండదు. ఈ పరిణామాలు ఆర్థికాభివృద్ధికీ ఎంతగానో దోహదపడతాయి. అందుకే ఎన్నో దేశాలు శిలాజ ఆధారిత పరిశ్రమల స్థానంలో సౌర విద్యుత్‌ ఉత్పాదనను ప్రోత్సహిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాల పరంగా చూస్తే సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌ (సౌర ఫలకాల) పరిశ్రమ అగ్రస్థానంలో ఉంది. మొత్తం పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 36 లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, సామాజిక, ఆర్థిక సుస్థిరతా ఇనుమడిస్తుంది. సౌర ఫలకాల పరిశ్రమ విస్తరణకు పన్నుల్లో రాయితీలు, వాణిజ్య, శ్రామిక విధానాలు అనివార్యం. అంతర్జాతీయంగా సున్నితమైన ఈ రంగంలో విపణిలో నెలకొనే మార్పులు ప్రాజెక్టు అంచనా వ్యయాలను వేగంగా ప్రభావితం చేస్తాయి. దేశీయంగా సౌర విద్యుత్‌ యూనిట్ల విపణి విస్తరణతో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. లోతైన సరఫరా గొలుసు వ్యవస్థ అభివృద్ధి చెందితే పరికరాలు, విడిభాగాల దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు కనిష్ఠస్థాయిలో ఉంటాయి. సౌర కేంద్రాల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరా, నిర్వహణ, తదితర విభాగాల్లో ఉద్యోగాలకు అవకాశం ఎక్కువ. అమ్మకాలు, రవాణా, సాంకేతిక విభాగాల్లోనూ ఉపాధి మార్గాలు అందివస్తాయి.

భారత్‌ సౌర విద్యుత్తుకు అవసరమైన పరికరాలకోసం అత్యధికంగా దిగుమతులపై ఆధారపడింది. దీంతో దిగుమతి సుంకాలు, లెవీలు భారమయ్యాయి. భారత్‌లో 2017తో పోలిస్తే 2018లో పరిశ్రమ విస్తరించింది. సౌర విద్యుత్‌ ఛార్జీల ధరలు రికార్డు స్థాయిలో తగ్గడంతో ఫలకాల ఏర్పాటు పెరిగింది. 2018లో 28 గిగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పే సమయానికి దేశీయ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 7.5 గిగావాట్లు మాత్రమే. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన ఏజెన్సీ (ఐఆర్‌ఈఎన్‌ఏ) అంచనాల ప్రకారం 2018లో భారత్‌లో గ్రిడ్‌ అనుసంధానిత సౌర పరిశ్రమలో ఉద్యోగాల కల్పన 1.15 లక్షలకు పెరిగింది. 2017తో పోలిస్తే ఈ సంఖ్య 20 వేలు ఎక్కువ. ఆఫ్‌గ్రిడ్‌ పరిశ్రమలోనూ ఉద్యోగ వృద్ధి సాకారమైంది. భారత్‌కు సౌర పరికరాలు సరఫరా చేసే తొలి పది సంస్థల్లో ఏడు చైనాకు చెందినవే ఉన్నాయి. భారత్‌లో తయారీదారులు చైనా పరికరాలతో పోటీ పడలేని పరిస్థితి ఉంది. చైనా ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తడంతో, భారత్‌లో దేశీయ విపణి వాటా కేవలం ఏడు శాతంగానే ఉంది.

ప్రభుత్వ కర్తవ్యం
ఇంధన వనరుల బదిలీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను, భారత సౌర విద్యుత్‌ పరిశ్రమ ఒడిసిపట్టుకోవాలంటే నాయకులు, విధాన నిర్ణయాలు తీసుకునే పాలకులు సామాజిక, ఆర్థిక లబ్ధి గురించి ఆలోచించాలి. కర్బన ఉద్గారాల తగ్గింపు, పర్యావరణ లక్ష్యాల సాధనకు అనువుగా ఉండటంతో పాటు ఉద్యోగావకాశాలనూ కల్పించే ఈ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కృషి జరగాలి. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 40 శాతం విద్యుదుత్పత్తి లక్ష్యం. దీన్ని చేరుకోవడంలో సౌర విద్యుత్‌ పరిశ్రమ కీలకపాత్ర పోషించనుంది. ఇందుకోసం భారత్‌ పునరుత్పాదక ఇంధన వనరుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగావకాశాలు, నైపుణ్యాల పెంపునకు నిపుణుల విశ్లేషణల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మానవ వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు, కంపెనీ వ్యవహారాలు, కామర్స్‌ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్‌, యూజీసీ, విద్యాసంస్థలు కలిసి ఓ వేదికను ఏర్పాటు చేయాల్సి ఉంది. సౌర విద్యుత్‌ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించే దిశగా ప్రణాళిక రూపొందించాలి. భారత యూనివర్సిటీలు సౌర విద్యుత్‌ రంగంలో కీలకంగా ఉన్న చైనా, జర్మనీ తదితర దేశాలతో కలిసి, పాఠ్యప్రణాళిక, బోధన, పరిశోధన తదితర అంశాల్లో పరస్పరం సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఇక్కడి విద్యార్థులను అధ్యయనంకోసం విదేశాలకు పంపాలి. మరోవైపు సౌర విద్యుత్‌ రంగానికి ఊతమిచ్చే మెరుగైన పారిశ్రామిక విధానాలను రూపొందించాలి.

Posted on 17-09-2019