Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

సాంకేతికతతో సమూల మార్పులు

* బ్యాంకింగ్‌ వ్యవస్థకు నూతనోత్తేజం

* విలీనాల అనంతరం కొత్త పుంతలు

ఆర్థిక మాంద్యం అలముకున్న దశలో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంధించిన విలీనాస్త్ర పర్యవసానాలు ఎలా ఉంటాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్యాంకుల విలీన ప్రకియ కొత్తేమీ కాకపోయినా, ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకే పరిమితమై ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సంచలనమే. పది బ్యాంకులను ఈ ప్రక్రియ ద్వారా నాలుగు బ్యాంకులుగా మార్చడం పీఎస్‌బీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

పరిణామక్రమం
భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ 1786లో ఉద్భవించింది. కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. 1947లో స్వాతంత్య్రం వచ్చేటప్పటికి బ్యాంకులన్నీ ప్రైవేటు రంగంలోనే ఉండేవి. 1949లో ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)’ని జాతీయం చేయడం ద్వారా భారత ప్రభుత్వం యావత్‌ బ్యాంకింగ్‌ రంగాన్ని తన అదుపులోకి తీసుకోవడానికి తొలి అడుగు వేసింది. తరవాత ‘ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ను జాతీయం చేసి, దానికి ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని నామకరణం చేసింది. రాష్ట్రాలకు సంబంధించిన ఎనిమిది బ్యాంకులను 1960లో ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అధీనంలోకి తీసుకొచ్చారు. తరవాత దేశమంతటికీ సమానంగా సేవలను విస్తరించి, సమాజంలో అన్ని వర్గాల బ్యాంకింగ్‌ అవసరాలు తీర్చడం కోసం 1969లో 14 బ్యాంకులను, 1980లో ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. మలి అంచెగా 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వం నెలకొల్పింది. 1990లలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యూటీఐ, ఐడీబీఐ వంటి సంస్థాగత రుణ వితరణ సంస్థలు సొంత బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఇటీవలి కాలంలో చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులను ప్రారంభించడానికి ఆర్‌బీఐ సమ్మతి తెలిపింది. ప్రజానీకంలో మరింతమందికి బ్యాంకింగ్‌ సేవలను విస్తరించడమే అప్పటి లక్ష్యం. 1969లో దేశమంతటా 8,261 వాణిజ్య బ్యాంకు శాఖలు ఉండగా, రిజర్వు బ్యాంకు విధానాలు, బ్యాంకు యాజమాన్యాల నిరంతర కృషి వల్ల 2019 మార్చికల్లా వాటి సంఖ్య 1,41,756కు పెరిగింది. నేడు ప్రపంచంలో అత్యధిక బ్యాంకు శాఖలు ఉన్న దేశం ఇండియానే. చైనా రెండో స్థానంలో నిలిచింది. వాణిజ్య బ్యాంకుల ఆస్తులూ బ్రహ్మాండంగా పెరిగాయి. 2018 మార్చిలో వాటి విలువ రూ.1,52,53,300 కోట్లు. ఆస్తులపరంగా చూస్తే ప్రపంచంలోని వంద అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో కేవలం భారత్‌కు చెందిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు మాత్రమే చోటు దక్కింది. అంతర్జాతీయ బ్యాంకులతో మన బ్యాంకులు పోటీ పడలేకపోతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం ప్రభుత్వరంగ బ్యాంకులను సంఘటితం చేయడానికి నడుంకట్టి, 2017లో ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’తో దాని అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకునూ విలీనం చేసింది. తరవాత 2019 ఏప్రిల్‌ ఒకటిన విజయ, దేనా బ్యాంకులను ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’తో కలిపింది. తాజాగా ఆగస్టు 30న పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా ఏర్పరచి, అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా పునాది వేసింది. 2017లో దేశంలో మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, తాజా విలీనాలతో వాటి సంఖ్య 12కు తగ్గింది. ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ అండ్‌ సింధ్‌’ బ్యాంకులు ప్రాంతీయ అవసరాలను తీర్చడంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి కాబట్టి వాటిని స్వతంత్రంగా కొనసాగనిచ్చారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్వహణ సామర్థ్యం నానాటికీ దిగజారిపోవడం వల్లనే వాటి విలీనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ల వార్షిక వృద్ధిరేటు 2017 జూన్‌లో 12.8 శాతం ఉండగా, 2019 మార్చికల్లా అది 9.4 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరీ దారుణంగా 11.1 శాతం నుంచి ఆరు శాతానికి పడిపోయింది. ప్రైవేటు బ్యాంకుల్లో వార్షిక డిపాజిట్ల వృద్ధిరేటు 19.7 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ఈ తగ్గుదలను రెండు కోణాల నుంచి చూడవచ్చు. ఒకటి- బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తమ డిపాజిట్లను వాణిజ్య బ్యాంకుల నుంచి వెనక్కు తీసుకోవడం. రెండు- ఆర్థిక మందగమనం వల్ల జనం చేతిలో డబ్బు లేకపోవడం. అందుకే వారు బ్యాంకుల్లో పొదుపు చేయడం తగ్గించుకొంటున్నారని భావించవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోకన్నా ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి ఎక్కువగా ఉండటం చూస్తే, ఖాతాదారుల దృష్టి మారిందని అవగతమవుతోంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఆస్తులపై రాబడి 2017-18లో మైనస్‌ 0.8 శాతం ఉండగా, ప్రైవేటు బ్యాంకుల్లో అది 1.1 శాతంగా ఉంది. ఇక నిధులపై రాబడికి, నిధుల సేకరణ ఖర్చుకు మధ్య వ్యత్యాసం ప్రభుత్వ బ్యాంకుల్లో 2.5 శాతమైతే, ప్రైవేటు బ్యాంకుల్లో 3.6 శాతం. 2017-18లో ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన మొత్తం అడ్వాన్సుల్లో 14.6 శాతం పారు బాకీలుగా తేలితే, ప్రైవేటు బ్యాంకుల్లో అవి 4.7 శాతంగా ఉన్నాయి. 2016-17లో అవి వరసగా 11.7, 4.1 శాతంగా ఉన్నాయి. దీనర్థం- ప్రైవేటు బ్యాంకులకన్నా ప్రభుత్వ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తు(ఎన్‌పీఏ)లు ఎక్కువన్నమాట. పెరిగిన నష్టాలు, తరిగిన ఆస్తుల విలువ ప్రభుత్వ బ్యాంకులను ఊబిలోకి లాగుతున్నాయి. సాధారణంగా ప్రజలు తమ డబ్బు దాచుకోవడానికి, బదిలీ చేయడానికి, రుణాలు పొందడానికి బ్యాంకులను ఆశ్రయిస్తారు. అక్కడైతే తమ డబ్బు భద్రంగా ఉంటుందని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చనే భరోసాతోనే డిపాజిట్లు చేస్తారు. అవసరమైనప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చని భావిస్తారు. వ్యక్తులకు, సంస్థలకు డబ్బు చెల్లింపులను బ్యాంకుల ద్వారా జరుపుతారు. ఇటీవల ఈ మూడు అంశాల్లో జనానికి బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామందికి సమీపంలో బ్యాంకు శాఖలు లేకపోవడం వల్ల వాటి నుంచి ఆర్థిక సేవలు పొందలేకపోవడం మరో అసౌకర్యం. ఆధునిక సాంకేతికత ఈ అసౌకర్యాన్ని తొలగిస్తోంది. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ బ్యాంకు సేవలు పొందే సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తోంది. కృత్రిమ మేధ, ‘డేటా ఎనలిటిక్స్‌’, ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’, స్మార్ట్‌ ఫోన్లు ఖాతాదారులకు కరదీపికలవుతున్నాయి. శాఖల నుంచి బ్యాంకు సేవలు పొందలేనివారికి తక్షణ సేవలు అందిస్తున్నాయి. ఇవాళ స్మార్ట్‌ ఫోన్‌ను తాకి లేదా బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసి అంతర్జాలం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపే సౌలభ్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. నేడు స్వరం (మాట్లాడటం) ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరపొచ్చు. అలెక్సా, సిరి వంటి ‘వర్చువల్‌ అసిస్టెంట్లు’ దీనికి తోడ్పడుతున్నాయి. వాటికి మాటమాత్రంగా చెబితే చాలు ఆర్థిక జమలు, చెల్లింపులు చేసేస్తాయి. ఈ సాంకేతిక మార్పుల వల్ల కరెన్సీ, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, చెక్‌ బుక్‌లు, వైర్‌ ట్రాన్స్‌ఫర్లకు కాలం చెల్లిపోతోంది. ‘పేటీఎం, మనీగ్రామ్‌’ వంటి నవ బ్యాంకింగ్‌ వేదికలు సంప్రదాయ బ్యాంకింగ్‌ రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. చైనాలో జనం ఇలాంటి యాప్‌(అలీపే, యాంట్‌ ఫైనాన్షియల్‌, టెన్సెంట్‌)ల సాయంతో స్మార్ట్‌ ఫోన్ల ద్వారా వస్తుసేవలు పొందుతున్నారు. చైనాలో మొబైల్‌ చెల్లింపుల విపణి ఏటా 50 శాతం చొప్పున పెరుగుతోంది. చైనా జనాభాలో మూడో వంతుకు పైగా యాంట్‌ ఫైనాన్షియల్‌ చెల్లింపు సేవలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే యాంట్‌ సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన ‘ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌ టెక్‌) కంపెనీ’గా నిలుస్తోంది. 2030కల్లా యాంట్‌ విపణి విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరవచ్చు. ఇది నేడు ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీబీసీ విలువకన్నా నాలుగు రెట్లు అధికం. కాబట్టి, సంప్రదాయ బ్యాంకుల మనుగడకు ఇలాంటి ‘ఫిన్‌ టెక్‌ కంపెనీ’లు ఎసరు తెస్తున్నాయని అవగతమవుతోంది.

డిజిటల్‌ శకం
భారత్‌లోనూ యువతరం ఇప్పటికే ‘డిజిటల్‌ జీవనశైలి’లో తలమునకలవుతోంది. మొబైల్‌ సాధనాలు, ఇంటర్నెట్‌ ద్వారా లావాదేవీలు జరపడానికి అనువైన బ్యాంకులనే వారు ఎంచుకొంటున్నారు. తమ ఇష్టాయిష్టాలు, భావి ప్రణాళికలకు సరితూగే బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు. అంతర్జాలంలో ఎప్పటికప్పుడు మారిపోయే ఖాతాదారుల ఆసక్తులు, అభీష్టాలను గమనిస్తూ, తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి బ్యాంకులు ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌ (ఐఓఈ)’ని ఆశ్రయిస్తాయి. ‘ఇంటరాక్టివ్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌’ సాయంతో ఖాతాదారులకు వినూత్న బ్యాంకింగ్‌ అనుభవాన్ని అందించనున్నాయి. అసలు డిజిటల్‌ లావాదేవీలు ఇప్పటికే సాధారణ బ్యాంకింగ్‌ లావాదేవీలను మించిపోతున్నాయి. రానురానూ 24 గంటలూ ‘వర్చువల్‌ బ్యాంకింగ్‌’ సేవలు అందించడానికి బ్యాంకులు హైటెక్‌ కేంద్రాలుగా రూపాంతరం చెందకతప్పదు. మున్ముందు ఖాతాదారుల సంతకాల అవసరం లేకుండా ‘వేలి ముద్రలు, కనుపాపలు, స్వరాల’తోనే పని జరిగే రోజు ఎంతో దూరంలో లేదు. బ్యాంకింగ్‌ రంగంలో ఇలా బయోమెట్రిక్‌ పరిజ్ఞానంతోపాటు కృత్రిమ మేధ, ‘బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌’ వినియోగం విరివిగా పెరగనుంది. బ్యాంకు రుణాల కోసం వచ్చే ఖాతాదారుల బలాబలాలను ఈ సాంకేతికతలు కచ్చితంగా అంచనా వేసి, రుణం ఇవ్వవచ్చో, లేదో సలహాలు ఇస్తాయి. ‘బ్లాక్‌ చెయిన్‌’ సాంకేతికతలు ‘క్రిప్టో కరెన్సీ’లకు ప్రాచుర్యం కల్పించనున్న దృష్ట్యా బ్యాంకులు తగు కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది. చైనా ఇటీవల సొంత క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వమూ ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవలసిన రోజు దగ్గరపడుతోంది. బ్యాంకుల విలీనం వల్ల వాటి నిధుల రాశి పెరుగుతుంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులను పంచుకోగలుగుతాయి. విలీన ప్రక్రియలో ఒడుదొడుకులు ఎదురైనా, అధునాతన సాంకేతికతతో వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి!

- డాక్టర్‌ టి. సిద్ధయ్య
(రచయిత- తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యుడు, మాజీ రిజిస్ట్రార్‌)
Posted on 18-09-2019