Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పన్ను ఉగ్రవాదంపై మెరుపుదాడి

ఆర్థిక మాంద్యం తాలూకు అమాస చీకట్లు దట్టంగా కమ్ముకొస్తున్నాయని బెంగటిల్లుతున్న కార్పొరేట్ల ముంగిట్లోకి అక్షరాలా దీపావళి సంబరాల్ని తెచ్చింది మోదీ సర్కారు. దేశార్థిక ప్రగతి రథ చక్రాలు కుంగి, వస్తూత్పత్తులకు గిరాకీ క్షీణించి ఆటోమొబైల్‌నుంచి బిస్కెట్లదాకా పరిశ్రమలెన్నో బిత్తర చూపులు చూస్తున్న వేళ- కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు ప్రకటన అన్ని వర్గాలవారినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆరేళ్లలోనే అతి తక్కువ వృద్ధిరేటు, నాలుగున్నర దశాబ్దాల్లో అత్యధిక నిరుద్యోగిత పోటు జమిలిగా ప్రతాపం చూపుతున్న తరుణంలో- పారిశ్రామిక పెట్టుబడులకు కొత్త గవాక్షాలు తెరిచి, గిరాకీ చురుకందుకొనేలా కార్పొరేట్‌ పన్నుల్లో దాదాపు పదిశాతం తెగ్గోత- 28 ఏళ్లలోనే అతి పెద్ద సంస్కరణగా సన్నుతులందుకొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచే అమలులోకి వచ్చేలా ఆదాయ పన్ను చట్టంలో ప్రవేశపెట్టిన కొత్త అధికరణ అనుసారం- ఏ విధమైన ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందని పక్షంలో దేశీయ కంపెనీలు 22శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అక్టోబరు ఒకటి తరవాత నెలకొల్పే తయారీరంగ సంస్థలు 15శాతం పన్నునే చెల్లించగల వీలుంది. సర్‌ఛార్జి, ఇతర సుంకాలు కలుపుకొంటే అది 17.01శాతానికి పరిమితమవుతుంది. ఈ ఏడాది జులై అయిదో తేదీకి ముందు షేర్ల తిరిగి కొనుగోలు (బై బ్యాక్‌) ప్రకటించిన సంస్థలకు ఆ లావాదేవీపై పన్ను రద్దు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు డెరివేటివ్స్‌తోపాటు సెక్యూరిటీల్ని విక్రయించగా వచ్చే మూలధన లాభాలపై అధిక సర్‌ఛార్జి భారం ఉండబోదనడం, రాయితీలు, ఇతర ప్రయోజనాలు అందుకొంటున్న సంస్థలకూ కనీస ప్రత్యామ్నాయ పన్నులో మూడుశాతం మినహాయింపు వంటివన్నీ- దశాబ్దాల కార్పొరేట్‌ పన్నుల అవ్యవస్థపై అక్షరాలా మెరుపుదాడి. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియాను తీర్చిదిద్దే క్రమంలో, భారత్‌లో తయారీకి గొప్ప ఊతమిచ్చే చరిత్రాత్మక సంస్కరణగా మోదీ ప్రభుత్వ చొరవను స్వాగతించాలి!

కార్పొరేట్‌ పన్నును 30శాతంనుంచి క్రమానుగతంగా 25శాతానికి తగ్గించడమే లక్ష్యమని ఎన్‌డీఏ తొలి జమానాలో మొదటి బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రిగా అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. 2018 నాటి కేంద్ర బడ్జెట్లో రూ.250 కోట్ల దాకా వ్యాపార పరిమాణంగల సంస్థలకు 25శాతం పన్నును వర్తింపజేశారు. మొన్న జులై తొలివారం నాటి బడ్జెట్లో ఆ వెసులుబాటును రూ.400కోట్ల వార్షిక టర్నోవరుగల సంస్థలకూ విస్తరించిన విత్తమంత్రి సీతారామన్‌- 99.3శాతం పరిశ్రమలు 25శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, తక్కినవాటినీ త్వరలోనే తెస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.16.5 లక్షల కోట్ల పన్ను రాబడిని లక్షించిన మోదీ ప్రభుత్వం, విత్తలోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.3శాతానికి పరిమితం చేయాలని సంకల్పించింది. పాయింట్‌ ఏడు శాతంగా ఉన్న అత్యంత భారీ సంస్థలను పాతికశాతం పన్ను పరిధిలోకి తీసుకురాకపోవడానికి కారణం అది! రాబడి మార్గాలు కుంచించుకుపోతూ, విత్తలోటు ఉరుముతున్న పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపన పథకాలు వద్దంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ సారథి దువ్వూరి బహిరంగ సూచన చెయ్యడం తెలిసిందే. అయినప్పటికీ, లక్షా 45వేల కోట్ల రూపాయల రాబడి నష్టం అంచనాల్ని ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి సీతారామన్‌ చేసిన కార్పొరేట్‌ పన్నుల హేతుబద్ధీకరణ- మధ్య, దీర్ఘకాలంలో దేశ ప్రగతిని స్థిర కక్ష్యలో నిలబెట్టేదే! చెల్లించేవాడిని చెండుకుతినేలా పన్నుల వ్యవస్థ ఉండరాదని ఆర్థికవేత్తలు ఎంత మొత్తుకొన్నా పెడచెవిన పెట్టిన పాలకగణాల నిర్వాకాలు- ప్రతిష్ఠాత్మక దేశీయ సంస్థలూ వేరే దేశాలకు తరలిపోయే ప్రమాదకర యోచనలకు తావిచ్చాయి. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లోని అతి తక్కువ రేట్లతో పోల్చదగ్గ స్థాయిలో దిగివచ్చిన కార్పొరేట్‌ పన్నులతో ఇండియా పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఎదగడం- దీర్ఘకాల ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుంది!

మొన్నామధ్య పన్ను ఉగ్రవాదంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో- సంపద సృష్టించేవారికి సమధిక గౌరవం దక్కాలని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పిలుపిచ్చారు. సంపద సృష్టిలో నిమగ్నమైనవారు ‘దేశానికి సంపద’ అన్న ప్రధాని మాటల్లో అతిశయోక్తి లేదు! పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించి, ఉపాధి పెంచి బహుముఖాభివృద్ధికి దోహదపడే కార్పొరేట్లపై నిన్నమొన్నటి దాకా ఉన్న పన్ను రేట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్మక మానవు. ఉన్న పన్నులకు సర్‌ఛార్జి, సుంకాలు కలగలసి 48.3 శాతంగా లెక్కతేలుతోందని ఆర్థిక సహకారం అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) మూడు నెలల క్రితం విశ్లేషించింది. ఐరోపా సమాఖ్య దేశాల్లో 21.68 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్నురేట్లు, సంపన్న జి-7 దేశాల్లో 27.63 శాతం, అమెరికాలో 21 శాతం, చైనాలో 25 శాతంగా ఉన్నాయి. చైనాతో అమెరికా వాణిజ్య స్పర్ధ ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో తెలియని అయోమయంలో దాదాపు 200 బహుళజాతి సంస్థలు ఇండియాకు తరలివచ్చే అవకాశాలున్నట్లు ఆ మధ్య వార్తాకథనాలు వెలువడ్డాయి. కార్పొరేట్‌ పన్నులపరంగా తూర్పు ఆసియా, అమెరికాల స్థాయికి చేరిన ఇండియా- ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకట్టుకోవడం ద్వారా భారత్‌లో తయారీ స్వప్నాన్ని సాకారం చేయగలుగుతుంది. తాజా చర్యతో విత్తలోటు లక్ష్యాలు గతి తప్పి ఆర్థిక నావ తీవ్ర ఒడుదొడుకుల పాలయ్యే ప్రమాదం స్థూల దృష్టికి కనిపిస్తున్నా, ఇంతలంతలు కాగల పెట్టుబడుల ప్రవాహం, సరళీకృత పన్ను పరిధిలో కొత్త సంస్థలు చేరడం వంటి ప్రయోజనాలతో క్షేమంగా ఒడ్డున పడగలమన్న విశ్వాసం మోదీ ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వ్యాపార అనుకూలతను పెంచేలా సర్కారీ యంత్రాంగంలోని అన్ని స్థాయుల్లోనూ సంస్కరణల చికిత్సనూ జరిపితే, సత్వరం సత్ఫలితాల్ని ఒడిసిపట్టగల వీలుంది!

Posted on 21-09-2019