Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మాంద్యానికి మౌలిక చికిత్స

* ఆర్థిక రంగం... మందగమనం

ఆర్థిక మందగమనం... ఇప్పుడు ప్రపంచ దేశాలతోపాటు భారత్‌నూ వణికిస్తున్న సమస్య. ఈ ఊబిలో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిళ్లూ పెరుగుతున్నాయి. విభిన్న వర్గాల నుంచి రకరకాల సూచనలూ అందుతున్నాయి. ఇప్పుడప్పుడే ఉద్దీపన పథకాలు వద్దని, తొందరపడితే దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటూ భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు బహిరంగ లేఖ సైతం రాశారు. ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వేగంగానే స్పందించింది. ఒక పర్యాయం ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఆర్థిక మంత్రి కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడం ద్వారా భారీ సంస్కరణలకే తెరతీశారు. ప్రభుత్వం విభిన్న రాయితీలు కల్పించే ప్రక్రియ నుంచి నెమ్మదిగా కదలడమే అత్యంత ముఖ్యమైన సంస్కరణగా చెప్పవచ్ఛు ఈ క్రమంలో ఎలాంటి రాయితీలు పొందని కొత్త ఉత్పత్తి యూనిట్లపై భవిష్యత్తులో ఏటా 15 శాతం పన్ను పడగా, రాయితీలు పొందేవి మాత్రం 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది చైనాతోపాటు చాలాదేశాల్లో ఉన్న పన్ను రేటుకు సమానమేనని చెప్పొచ్ఛు.

కారణాలు కోకొల్లలు
మందగమనం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, ఆర్‌బీఐ గణాంకాలు, ఆ సంస్థ వార్షిక నివేదిక- మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపైనా, ప్రస్తుత సమస్యలపైనా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం కీలకమైన వ్యవస్థీకృత మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆర్‌బీఐ వార్షిక నివేదిక పేర్కొనడం ఆనందకర అంశంకాగా- ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే, ప్రస్తుత మందగమనం మరింత తీవ్రరూపుదాల్చే ప్రమాదం ఉందని చెబుతుండటం మాత్రం ఆందోళనకరమే. భారత్‌లో వృద్ధి మందగించిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. సదరు వృద్ధి మందగమనం ఆందోళనకరమైన రీతిలో సాగుతోంది. దీనికి దేశీయంగా, అంతర్జాతీయంగా పలురకాల కారకాలు తోడవుతున్నాయి. ఆసియా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే- భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఎగుమతులపై ఆధారపడలేదు. ఎగుమతి ఆధార దేశంగా పేరొందిన జర్మనీ- ఏడాది కాలంగా ఉత్పత్తిలో తగ్గుదలను ఎదుర్కొంటోంది. కార్ల ఉత్పత్తి, జర్మనీ ఎగుమతులు గత ఏడాదిలో 17 శాతం తగ్గాయి. అయితే, దేశీయ వినియోగం ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థకూ కొన్ని పరిమితులు ఉంటాయి. అవే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంతకీ ప్రస్తుత సమస్య దీర్ఘకాలంపాటు ఉండిపోయే వ్యవస్థీకృత మందగమనమా? కొంతకాలంపాటు మాత్రమే కనిపించే కాలానుగుణమైన సమస్యా అనే సందేహం ఉంది. ప్రస్తుతానికైతే, గణాంకాలనుబట్టి చూస్తే, ఇందుకు రెండు రకాల అంశాలు తోడవుతున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థీకృతమైన, చక్రీయ సమస్యలకుతోడు వర్షాలు, వరదలు వంటి కాలానుగుణ అంశాలూ ఈ సమస్యకు కారణమవుతున్నాయి. సాధారణ చక్రీయ, కాలానుగుణంగా తలెత్తే మందగమనంకన్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేందుకు ఆర్థిక గణాంకాలొక్కటే సరిపోవు. రాబోయే పండగల సీజన్‌ ముగిస్తేగానీ ఈ విషయం తేటపడదు. జనవరి ముగిసిన తరవాతా మందగమనం ఇలాగే కొనసాగితే, అన్ని వైపులనుంచి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు భావించాలి. ఈ లోపే వాహనరంగంలో అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2020 మార్చి నాటికి కొత్త బీఎస్‌-6 ఉద్గార నియమాల్ని అమలు చేయాల్సి ఉండటం కూడా వాహన తయారీలో మందగమనానికి ఒక కారణం. ప్రస్తుతమున్న సరకును వదిలించుకునేందుకు ఉత్పత్తిని ఆపేశారా అనే సంగతి మనకి తెలియదు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యవిషయం.. కొంత నెమ్మదిగానైనా బ్యాంకులరుణ వితరణ పెరుగుతూనే ఉంది. పెట్రోలియం వినియోగానికి సంబంధించి వెలువడుతున్న గణాంకాలను ఆర్థిక వ్యవస్థపై ఆశలు రేకెత్తిస్తున్న వినియోగ సంకేతాలుగా భావించవచ్ఛు డీజిల్‌, ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయెల్‌(ఏటీఎఫ్‌) వినియోగం తీరును పరిశీలిస్తే నిరుటితో పోలిస్తే వినియోగం పెరిగింది. దీంతో మందగమనం అనేది కాలానుగుణంగా తలెత్తిన సమస్య అని స్పష్టమవుతోంది. సాధారణంగా ఏటా వర్షాకాలంలో వీటి వినియోగంలో తగ్గుదల కనిపిస్తుంటుంది.

ఈ ఆర్థిక సమస్యలు ఒక్కరోజులో తలెత్తినవి కావు! దేశ ఆర్థిక నమూనాలోనే సమస్య ఇమిడి ఉంది. భారత్‌ భారీ ఎగుమతి, ఉత్పత్తి ఆధార వ్యవస్థలు లేకుండానే దేశీయంగా వినియోగ చోదక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. ప్రభుత్వ రుణాలు భారీగా పెరగడం; పన్నులు పెరగడం (ఇప్పటికే పెద్దయెత్తున రుణాలబారిన పడిన వ్యాపారులు, కుటుంబాలకు ఏమాత్రం మిగులు దక్కకుండా ప్రభుత్వాలు పిండుకుంటున్నాయి), ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం అనే మూడు కారణాలు ప్రస్తుతం దేశ ఆర్థిక సమస్యలకు అంటుకడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ వడ్డీ రేట్లు ఉండగా- భారత్‌లో మాత్రం ఇప్పటికీ అధిక వడ్డీరేట్ల వ్యవస్థ కొనసాగుతుండటం మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు భారీయెత్తున రుణాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల రుణాలకు భారీ డిమాండ్‌ ఉండటంతో వడ్డీరేట్లు ఎక్కువగానే ఉండిపోతున్నాయి. ఫలితంగా ప్రైవేటు రంగం చౌకరుణాల్ని పొందే అవకాశాల్ని కోల్పోతోంది. భారత్‌ మూలధనం కొరత కలిగిన దేశం. కాబట్టి ప్రైవేటు రంగానికి చౌక వడ్డీలకు రుణ లభ్యత తగ్గడం సమస్యల్ని మరింతగా పెంచింది. గడచిన నాలుగేళ్లలో కుటుంబాల పొదుపు మొత్తాలు క్షీణిస్తున్నాయి. గత అయిదేళ్లలో ప్రభుత్వ రుణాలు రెట్టింపయ్యాయి. ఇది కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు 2013లో రూ.46,400 కోట్లు కాగా- 2019లో ఆ మొత్తం రూ.1.26 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌సీఐ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలనూ కలుపుకొంటే ఈ అప్పులు మరింతగా పెరుగుతాయి. ప్రభుత్వానికి పన్ను వసూళ్లు పెరగడం ముదావహమే. అయితే దాని రుణం పెరగడం మాత్రం సమస్యలను సృష్టించే అంశం. 2018-19లో రూ.39.68 లక్షల కోట్లకు చేరిన పన్ను వసూళ్లు 2020 మార్చి చివరి నాటికి రూ.44.12 లక్షల కోట్లకు చేరతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రభుత్వం ఇలా భారీయెత్తున పన్నులు పిండుకోవడం వల్ల కుటుంబ వ్యయాలపై ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమనం, రుణాలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది.

వాయిదాలతో మరిన్ని ఇబ్బందులు
ఆర్థిక వ్యవస్థ కీలక దశకు చేరింది. ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన సమయమూ ఆసన్నమైంది. లేనిపక్షంలో ప్రస్తుతం నెలకొన్న చక్రీయ, కాలానుగుణంగా తలెత్తిన మందకొడితనం కాస్తా, వ్యవస్థీకృత మందగమనంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, కుటుంబాలు చేదు గుళికలు మింగడానికి సిద్ధపడాలి. సులభతరమైన పరిష్కారాలేమీ లేవు. చేదు గుళికను ఇప్పుడే మింగుతారా, లేకపోతే పరిష్కారాల్ని వాయిదా వేయడం ద్వారా మరింత కష్టాల్ని భవిష్యత్తులో కొనితెచ్చుకుంటారా అన్న విషయాన్నే నిర్ణయించుకోవాల్సి ఉంది. కుటుంబాలకైనా, కంపెనీలకైనా భవిష్యత్‌ కోసం జాగ్రత్తపడే అత్యుత్తమ మార్గం వ్యయాల్ని తగ్గించుకోవడం, రుణాల్ని చెల్లించేయడం, నగదును కాపాడుకోవడమే. అంటే.. తెలివిగా ఖర్చు పెడుతూ మరింతగా పొదుపును పాటించాలి. ఆర్థిక వ్యవస్థలో అవకాశాల్ని కోల్పోయే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. భారత్‌ వంటి వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో అవకాశాలకు కొదవుండదు. ప్రభుత్వం వద్ద మౌలిక సౌకర్యాలపై వెచ్చించడానికి తగినంత పెట్టుబడి, వినియోగానికి అవసరమైన మేర డబ్బు ప్రజల చేతుల్లో ఉంటే చాలు.. అవకాశాలను ఒడిసిపట్టడం అసాధ్యమేమీ కాదు!

నోట్ల రద్దు, జీఎస్టీతో చిక్కులు
మందగమనం ఎందుకు తలెత్తింది; సమస్య నిర్దిష్టంగా ఎక్కడుంది అన్న ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవాల్సి ఉంది. నోట్ల రద్దుతోపాటు, సరిగా రూపొందించని, సక్రమంగా అమలు చేయని జీఎస్టీ (వస్తు సేవల పన్ను) నుంచే సమస్యలు మొదలయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ పరిణామాల అనంతరం ఆర్థిక వ్యవస్థలో కీలక వర్గాలైన కుటుంబాలు, చిన్న వ్యాపారులు పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయారు. తుది వినియోగానికి, పొదుపు చేయడానికి అందుబాటులో ఉండే స్థూల జాతీయ ఆదాయంలో స్థూల కుటుంబ పొదుపు 2014-15లో 19.2 శాతం ఉండగా, అది 2016-17నాటికి 16.9 శాతానికి తగ్గడమే ముప్పును సూచిస్తోంది. 2017-18లో ఇది స్వల్పంగా పెరిగి 17 శాతానికి చేరింది. గృహరంగంలో బాకీలు 2015-16లో 2.7శాతం నుంచి 2017-18నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వ్యక్తిగత రుణాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. ఇవి 2014 మార్చి చివరికి రూ.10.36 లక్షల కోట్లు ఉండగా, 2019 జూన్‌ చివరి నాటికి రూ.22.02 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది కాకుండా హోటళ్లలో తినడం, సెలవుల్లో యాత్రలు, వస్త్రాలు, ఇతరత్రా సామగ్రిపై దేశంలో భారీ స్థాయిలోనే వ్యయం జరుగుతోంది. ఈ వ్యయాల్లో ఎక్కువశాతం అవసరంకన్నా సామాజిక, మానసిక కోరికల్ని తీర్చుకోవడానికేనని చెప్పక తప్పదు. ఒకవైపు రుణాలు, అనవసరపు వ్యయాలు ఇనుమడిస్తున్నాయి. మరోవంక ఆదాయ వృద్ధి అంతవేగంగా పెరగడం లేదు. రుణాలు రెట్టింపుకన్నా పెరిగిపోవడమంటే, కుటుంబాల వినియోగ సామర్థ్యం గరిష్ట పరిమితులకు చేరుకున్నట్లుగా భావించాలి. అదేసమయంలో.. వ్యాపార రంగంలో రుణాలు ముఖ్యంగా సేవారంగంలో వేగంగా పెరిగాయి. ఉత్పత్తి రంగంలో రుణాలు 2014 మార్చి చివరి నుంచి 2019 నాటికి రూ.25.22 లక్షల కోట్ల నుంచి రూ.28.58 లక్షల కోట్లతో 15 శాతం మాత్రమే పెరిగాయి. అదే సేవారంగంలో రుణాలు 2014 నుంచి 2019 నాటికి రూ.13.27 లక్షల కోట్ల నుంచి రూ.24.15 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- బ్యాంకులు రుణవితరణ చేయడం లేదనే అంశంలో పూర్తినిజం లేదు.

 

Posted on 23-09-2019