Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పెట్టుబడులకు ఊతం

* జీఎస్టీ మండలి సమావేశం

గడచిన రెండేళ్లలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) లో మౌలికంగా, నిర్వహణపరంగా అనేక మార్పులు వచ్చాయి. 2017 జులై ఒకటి నుంచి అమలులోకి వచ్చిన ఈ పన్ను రేట్లను తరచూ మారుస్తూ వచ్చారు. దీని పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమాణం (టర్నోవర్‌) పరిమితిని పెంచడం, రిటర్నుల దాఖలు ప్రక్రియను సరళీకరించడం, దాఖలుకు కాలపరిమితిని సవరించడం వంటివి ముఖ్యమైన మార్పుల్లో కొన్ని. జీఎస్టీ మండలి నిర్దిష్ట కాలావధిలో సమావేశమవుతూ పన్ను సాధకబాధకాల గురించి పరిశీలిస్తోంది. దీని 37వ సమావేశం ఈ నెల 20న జరిగింది.

జీఎస్టీని 0,5,12,18,28 శాతం పన్నురేట్లతో ప్రారంభించారు. కొన్ని వస్తువులపై సుంకంతో కలుపుకొని 28 శాతం పన్ను విధించారు. తరవాత వజ్రాలపై 0.25, బంగారంపై మూడు శాతం పన్ను ప్రవేశపెట్టారు. కోటిన్నర రూపాయల వ్యాపార పరిమాణం ఉన్న వస్తూత్పత్తిదారులు, పంపిణీదారులు (మద్యం విక్రయించని) సాధారణ భోజనశాలల (రెస్టారెంట్లు)పై కాంపోజిషన్‌ పథకం కింద ఒక శాతం, అయిదు శాతం పన్ను రేట్లు వర్తింపజేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి సుంకాలు విధించసాగారు. తరవాత 28 శాతం విభాగంలో ఉన్న వస్తువులను క్రమంగా 18, 12శాతం విభాగాల్లోకి మార్చారు. ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులు, విలాస వస్తువులు మినహా అత్యధిక సరకులపై విధించే పన్నులు ఈ రెండు విభాగాల్లోనే ఉంటున్నాయి. ఆర్థిక పరిస్థితులు మారుతున్నందున నేడు వాహన, ఎఫ్‌ఎంసీజీ, హోటల్‌ రంగాలు జీఎస్టీ తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వాహన విక్రయాలు పడిపోయిన దరిమిలా ఈ రంగంపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థన వినిపించింది. 37వ జీఎస్టీ మండలి సమావేశం వాహన పరిశ్రమకు పన్ను తగ్గించలేదు. కానీ, పరిహార సుంకాన్ని మాత్రం తగ్గించింది. 1500 సీసీ డీజిల్‌ ప్రయాణికుల వాహనాలపైన, 1200 సీసీ పెట్రోలు వాహనాలపైనా గతంలో 15 శాతం పరిహార సుంకం విధించేవారు. ఇప్పుడు వాటిని వరుసగా మూడు శాతం, ఒక శాతానికి తగ్గించారు. దీని వల్ల కేంద్ర, రాష్ట్రాలకు భారీ ఆదాయ నష్టం సంభవిస్తుంది. ఇప్పటికే జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇటీవలి కాలంలో ఈ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటలేదు. జీఎస్టీ మండలి పర్యాటక రంగానికి బాగా ఊతమిచ్చింది. హోటళ్లలో రూ.7500కన్నా ఎక్కువ అద్దె వసూలు చేసే గదులపై జీఎస్టీని 18 శాతానికీ, అంతకన్నా తక్కువ అద్దె గదులపై 12 శాతానికీ తగ్గించారు. రూ.1000కన్నా తక్కువ అద్దె వసూలు చేసే గదులపై జీఎస్టీని ఎత్తివేశారు. బాహ్య భోజన వ్యాపారంపై 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. పాలీ ప్రొపైలిన్‌ సంచులపై 12 శాతం ఏకరూప పన్ను విధించనున్నారు. కొన్ని రకాల వ్యవసాయోత్పత్తుల నిల్వ, గిడ్డంగి సౌకర్యాలపై జీఎస్టీ మినహాయించడం చిన్నకారు రైతులకు మేలు చేకూరుతుంది.

అన్ని వ్యాపార సంస్థలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక రిటర్నులు దాఖలు చేయాలని ప్రస్తుత జీఎస్టీ చట్టం నిర్దేశిస్తోంది. వాటి ఆధారంగా పన్ను లెక్కింపు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ గణన జరుగుతాయి. అయిదు కోట్ల రూపాయలకన్నా తక్కువ వ్యాపార పరిమాణం ఉన్న సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవి త్రైమాసిక రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాంపోజిషన్‌ పథకాన్ని ఎంచుకున్న సంస్థలు సైతం త్రైమాసిక రిటర్నులు (జీఎస్టీఆర్‌4) సమర్పించాలి. అన్ని సంస్థలు తప్పనిసరిగా వార్షిక రిటర్నులు దాఖలు చేయాల్సిందే.

ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థలో జీఎస్టీఆర్‌ ఒకటి నుంచి జీఎస్టీఆర్‌ 11 వరకు 9 రకాల పత్రాలు ఉన్నాయి. (ప్రస్తుతానికి జీఎస్టీఆర్‌ 2, 3 పత్రాల అమలును తాత్కాలికంగా నిలిపేశారని గమనించాలి). పన్ను చెల్లింపుదారులకు సౌకర్యవంతంగా ఉండటానికి ఈ ఏడాది అక్టోబరు నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావాలని జూన్‌లో జరిగిన జీఎస్టీ మండలి 31వ సమావేశం నిర్ణయించింది. ఇటీవల జరిగిన 37వ సమావేశం దీన్ని 2020 ఏప్రిల్‌కు వాయిదా వేసింది. కొత్త విధానానికి పన్ను చెల్లింపుదారులు అలవాటుపడేందుకు గడువు పెంచారు. ఈ ఏడాది మేలో కొత్త రిటర్ను పత్రం నమూనాను ఆఫ్‌లైన్‌లో పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంచారు. దీనిలో బిల్లులను ఎలా అప్‌లోడ్‌ చేయాలో తెలుసుకోవడానికి వీలు కల్పించారు. కొత్త రిటర్ను విధానంలో జీఎస్టీ-రిట్‌ ఒకటి అనే ప్రధాన రిటర్ను పత్రం, జీఎస్టీ ఎనెక్స్‌ 1,2 అనే అనుబంధ పత్రాలు ఉంటాయి. జీఎస్టీ ఎనెక్స్‌ ఒకటిని ఉపయోగించి ఇన్వాయిస్‌లను అప్‌లోడ్‌ చేయవచ్ఛు తమకు వచ్చే ఇన్వాయిస్‌లను జీఎస్టీ ఎనెక్స్‌ 2 ద్వారా వీక్షించి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు కొత్త జీఎస్టీ రిటర్ను విధానం పూర్తిగా అమలులోకి రాగానే జీఎస్టీఆర్‌ 1, జీఎస్టీ రిటర్న్‌ 1 ఫారాల స్థానంలో జీఎస్టీ ఎనెక్స్‌ 1, జీఎస్టీఆర్‌ 3బీలు రంగప్రవేశం చేస్తాయి. వార్షిక రిటర్ను, రీకన్సిలియేషన్‌ ప్రకటన ఫారాలను సరళీకరించడానికి ఒక కమిటీని వేశారు.

జీఎస్టీ విధానంలో రిఫండ్‌లను పొందడంలో విపరీత జాప్యం జరుగుతోందని పన్ను చెల్లింపుదార్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని పరిష్కరించడానికి సెప్టెంబరు 24 నుంచి సమగ్ర రిఫండ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని కింద ఒక్క దరఖాస్తుతోనే రిఫండ్‌ పొందవచ్ఛు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు రిఫండ్‌ కోసం వేరే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కచ్చితంగా సరిచూడటానికి సమర్థ సాంకేతిక చట్రాన్ని ఏర్పరచడం అవసరం. జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించినందున జీఎస్టీ చట్టాలను సవరించక తప్పదు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్య భయాలు ముప్పిరిగొంటున్న సమయంలో ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకురావడానికి జీఎస్టీ మండలి కొన్ని ముఖ్యమైన చర్యలు ప్రకటించింది. వాటిలో కార్పొరేట్‌ పన్ను రేటు తగ్గింపు కీలకమైనది. దీనివల్ల స్వదేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం బాగా ఉంది!


- ఎ. శ్రీహరి నాయుడు
Posted on 27-09-2019