Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రగతిని పొదిగే వ్యూహం

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో భాగ్యనగర సదస్సు ముక్తకంఠంతో తీర్మానించినట్లు, చిన్న పరిశ్రమలు అసంఖ్యాక సవాళ్లతో కుంగుతున్నాయన్నది చేదునిజం. పేరుకవి లఘుపరిశ్రమలేగాని, దేశంలో సుమారు 12కోట్ల మేర ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఘనత వాటి సొంతం. తయారీరంగంలో 45శాతం, ఎగుమతుల్లో 40శాతం వాటా కలిగినా- అత్యధిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు నిరంతర సమస్యలు, సంక్షోభాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చిరు దివ్వెలెన్నో అర్ధాంతరంగా కొడిగడుతున్నాయి. దేశార్థిక రంగాన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు దక్కాల్సిన విశేష ప్రాధాన్యానికి, వాస్తవిక స్థితిగతులకు మధ్య భారీ అంతరం అనేకానేక ఇక్కట్లకు అంటుకడుతోంది. ఆర్థికమాంద్యం ఆవరిస్తున్న తరుణంలో లఘుసంస్థల సంక్షోభం ముమ్మరిస్తున్నదని భారతీయ చిన్నపరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) నివేదిక నెల్లాళ్లక్రితమే హెచ్చరించింది. చుట్టుముట్టిన దట్టమైన నిరాశా నిస్పృహల్ని చెదరగొట్టాలన్న పట్టుదలతో లఘుపరిశ్రమలు పోటీతత్వం అలవరచుకోవాలని, డిజిటల్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఇప్పుడు భాగ్యనగర సదస్సు ఉద్బోధిస్తోంది. నిజమే... కాలానుగుణంగా విధివిధానాలను, పోకడలను మార్చుకుని ఆధునికతను సంతరింపజేసుకోవడం అభిలషణీయమే. రుణలభ్యత సంక్షోభం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను వెన్నాడుతూనే ఉందని సాక్షాత్తు రిజర్వ్‌బ్యాంకు అధ్యయనమే ధ్రువీకరించింది. ఆ మౌలిక సమస్యకు సమర్థ పరిష్కారం లభించనిదే- లఘుపరిశ్రమలు పోటీతత్వాన్ని ఎలా అలవరచుకోగలుగుతాయి, డిజిటల్‌ సాంకేతికతను ఏ విధంగా ఒడిసిపట్టగలుగుతాయి?

లఘు పరిశ్రమలు స్థిరంగా నిలదొక్కుకుని గరిష్ఠ సామర్థ్యం కనబరచడానికి దాదాపు రూ.45 లక్షల కోట్ల వరకు రుణ పరపతి ఆవశ్యకమన్నది అంచనా. అందులో వ్యవస్థాగతంగా లభ్యమవుతున్న తోడ్పాటు 18 శాతమేనన్న గణాంకాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పట్ల అంతులేని కథగా సాగుతున్న దారుణ నిర్లక్ష్యానికి నిలువెత్తు దాఖలా. గృహ నిర్మాణాలకు, చిన్న పరిశ్రమలకు ఇతోధిక రుణాలు సమకూడేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గత జనవరిలో కేంద్ర విత్తమంత్రిగా పీయూష్‌ గోయల్‌ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపిచ్చారు. కీలక మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్మలా సీతారామన్‌కు దఖలుపడ్డాక, కొన్ని ఉదార చర్యలు ప్రకటించిన దరిమిలా- నిన్నటినుంచి నాలుగు రోజులపాటు దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో బ్యాంకుల రుణ మేళా ఆరంభమైంది. ఆమధ్య ప్రత్యేక పోర్టల్‌లో నమోదైన లఘు సంస్థలకు 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు రుణం మంజూరు చేస్తామంటూ ఇచ్చిన భరోసా నికరంగా ఎంతమందికి లబ్ధి చేకూర్చిందో ఇప్పటికీ నిర్దిష్ట గణాంక వివరాలు బహిర్గతం కాలేదు. పరిమిత స్థాయిలో కొన్ని రోజులపాటు నిర్వహించే రుణ మేళాలు మాత్రం చిన్న పరిశ్రమల వాస్తవ అవసరాలు తీర్చగలుగుతాయా? ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సెప్టెంబరు నాలుగో వారంలో రూ.40వేల కోట్లు చెల్లించామన్న ఆర్థికమంత్రి ఇటీవలి ప్రకటన, కేంద్ర ప్రభుత్వ ఔదార్యాన్ని చాటేది కాదు. ఆ చెల్లింపులు లఘు పరిశ్రమలనుంచి వివిధ మంత్రిత్వ శాఖలు పొందిన సరకు, సేవలకు సంబంధించిన బకాయిలు. అవి పోను మరో రూ.20 వేల కోట్ల బాకీ త్వరలో తీరుస్తామని అమాత్యులే వెల్లడించారు. అంత పెద్దయెత్తున బకాయిలు పేరుకుపోవడం ఎంత అనర్థదాయకమో గ్రహించిన కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పినట్లు- సరఫరాల తరవాత 45 రోజుల గడువులో చెల్లింపులు జరిగిపోయే విధాన సంస్కరణ ఎప్పటికి సాకారమవుతుందో చూడాలి.

ఆటబొమ్మలనుంచి జౌళి ఉత్పత్తుల దాకా, బల్క్‌ డ్రగ్స్‌ మొదలు సైకిళ్ల వరకు పెద్దయెత్తున చౌక ఉత్పత్తులతో ప్రపంచ విపణులను చైనా ముంచెత్తుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు కోరిందే తడవుగా రుణాలివ్వడానికి వెయ్యి గ్రామీణ వాణిజ్య బ్యాంకులకు అక్కడ ఈ మధ్యే 28వేల కోట్ల యువాన్లు (ఇంచుమించు రెండు లక్షల 80వేల కోట్ల రూపాయలు) అందుబాటులోకి తెచ్చారు. చిన్న పరిశ్రమలకు సృజనాత్మక డిజిటల్‌ సాంకేతికతను మప్పడంలో ముందున్న సింగపూర్‌, వాటికి సైబర్‌ భద్రతను పెంపొందించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తమ దేశార్థికానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ సంస్థల ఉత్పత్తుల మార్కెటింగ్‌, వాటినుంచి ప్రభుత్వమే సులభరీతిలో అధిక ఉత్పాదనలు సమీకరించడానికి- ఆస్ట్రేలియా పెట్టింది పేరు. న్యూజిలాండ్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 28శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న సంస్థల్ని అక్కడి ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ‘మిటిల్‌ స్టాండ్‌’ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) సంస్థలకు జర్మనీ కల్పిస్తున్న అపరిమిత ప్రాధాన్యం కారణంగా, అవి అక్కడ 60శాతం ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతున్నాయి. అయిదు దశాబ్దాల క్రితమే లఘు పరిశ్రమలకోసం మౌలిక చట్టం రూపొందించిన జపాన్‌ నమూనా అభివృద్ధి వ్యూహాన్ని ఆవిష్కరించింది. నిధుల లభ్యత మొదలు మార్కెటింగ్‌వరకు సకల విధ తోడ్పాటు చేకూరుతున్న జపాన్‌లో చిన్న సంస్థలు పెద్దపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం భారత జీడీపీలో 29శాతంగా ఉన్న లఘు పరిశ్రమల వాటా ఏడేళ్లలోగా 50శాతానికి విస్తరించాలన్న కేంద్ర ప్రవచిత లక్ష్యాన్ని అక్షర సత్యం చేయగలిగితే- నిరుద్యోగంపై అది రామబాణమవుతుంది. చిన్న పరిశ్రమల ఆర్థిక కడగండ్లు బాపి, సాంకేతికంగా వాటిని రాటు తేల్చడం- ప్రగతిని పొదిగే గొప్ప వ్యూహమవుతుంది!


Posted on 04-10-2019