Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

పోటీలో ఎక్కడున్నాం?

అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) వార్షిక ర్యాంకింగుల్లో భారత్‌కు చుక్కెదురైంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజా క్రోడీకరణ ప్రకారం- నిరుడు 58వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి 141 దేశాల జాబితాలో 68వ స్థానానికి పడిపోయింది. ‘బ్రిక్స్‌’ కూటమిలో అట్టడుగున నిలిచినవి బ్రెజిల్‌ (71), భారత్‌లే. ఉపఖండంలో ఇరుగుపొరుగు దేశాలైన శ్రీలంక (84), బంగ్లాదేశ్‌ (105), నేపాల్‌ (108), పాకిస్థాన్‌ (110)ల కన్నా ఇండియా కొంత మెరుగనిపించుకోవడం గుడ్డిలో మెల్ల! విపణి పరిమాణం ప్రాతిపదికన అగ్రపీఠిన కుదురుకున్న జన చైనా నిరుటి 28వ ర్యాంకును ఈ ఏడాదీ భద్రంగా కాపాడుకోగలిగింది. మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, శిక్షణ, సృజనాత్మకత, సాంకేతిక సన్నద్ధత సహా పన్నెండు భిన్నాంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన సూచీలో మూడేళ్ల క్రితం 39వ ర్యాంకుతో ఇండియా కాంతులీనింది. ఇప్పుడు విపణి పరిమాణం, కార్పొరేట్‌ పాలన, పునరుద్ధరించగల ఇంధన నియంత్రణల రీత్యా రాణించినా- ఇతర కీలకాంశాల్లో మందభాగ్యం ర్యాంకును దిగలాగింది. పోయిన సంవత్సరం అమెరికాను వెన్నంటి రెండో స్థానం పొందిన సింగపూర్‌ ఈసారి విశ్వవ్యాప్తంగా పోటీ తత్వంలో తనకు ఎదురే లేదని సగర్వంగా చాటుకున్న తీరు స్ఫూర్తిమంతం. రెండోస్థానానికి పరిమితమైన అగ్రదేశం తరవాత హాంకాంగ్‌ (3), నెదర్లాండ్స్‌ (4), స్విట్జర్లాండ్‌ (5) ర్యాంకుల్లో ధాటి కనబరచాయి. తనవంతుగా సృజన సామర్థ్యంలో మిన్న అనిపించుకుంటున్న భారత్‌- సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఆరోగ్య పద్దు, నైపుణ్యాలు, కార్మిక విపణి తదితరాలకు సంబంధించి వెనకబాటుతనంతోనే భంగపాటుకు గురైనట్లు స్పష్టమవుతోంది. మూడేళ్ల వ్యవధిలో దాదాపు ముప్ఫై స్థానాలు కిందకు జారిపోవడానికి కారణాలేమిటో, సత్వరం పూడ్చాల్సిన కంతలేమిటో లోతుగా సమీక్షించి సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ భుజస్కంధాలపైనే ఉంది.

పోయిన సంవత్సరం కార్మిక సంస్కరణలు, ద్రవ్య వ్యవస్థ, వాణిజ్య అభినివేశాల్లో తనను మించినవారు లేరని చాటుకున్న అమెరికా విశ్వ పోటీతత్వ సూచీలో మొట్టమొదటి ర్యాంకును ధీమాగా నిలబెట్టుకుంది. అప్పట్లో మౌలిక వసతుల రీత్యా 135 దేశాల్లో అమెరికాది తొమ్మిదో స్థానం! అత్యధిక ప్రాధాన్యం కలిగిన ఆ కీలక రంగాన నాడు విశ్వంలోనే మొదటిదనిపించుకున్న సింగపూర్‌ పటిష్ఠ పునాదే అయాచిత వరమై ఈసారి రేసులో ముందుకు దూసుకుపోయింది! అయిదేళ్ల క్రితం వాణిజ్య అనుకూలతల ప్రాతిపదికన 71వ స్థానానికి పరిమితమైన భారత్‌ దుస్థితికి మూలాలు మునుపటి యూపీఏ సర్కారు ఏలుబడిలో ఉన్నాయి. ఆనాడు విధానాల సరళీకరణ, ముఖ్య సంస్కరణలకు మందభాగ్యం దాపురించి లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెండింగులో పడిపోయాయి. అధికార పగ్గాలు ఎన్డీయే ప్రభుత్వానికి దఖలుపడిన దరిమిలా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి, కరెంటు ఖాతా లోటు తరిగి, వృద్ధిరేటు ఇనుమడించి- వెలుపలి పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. వ్యవస్థాగత సంస్కరణలకు పెద్దపీట వేసిన సత్ఫలితమే మూడేళ్లక్రితం పోటీతత్వ సూచీలో ప్రతిఫలించింది. అటువంటిదిప్పుడు ఎందుకిలా దెబ్బతిన్నట్లు? ఈ-కామర్స్‌ తరహా డిజిటల్‌ వాణిజ్య రీతుల్లో జపాన్‌, కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ వంటి దేశాలను ఇండియా తలదన్నుతోందని డబ్ల్యూఈఎఫ్‌ నివేదికే నిగ్గుతేల్చింది. మౌలిక వసతుల పరంగా డెబ్భయ్యో స్థానంలో ఉన్న భారత్‌ ప్రాథమికాంశాలపట్ల కనబరుస్తున్న అలసత్వమే పోటీ ప్రపంచాన వెనక్కి నెట్టేస్తోంది. సింగపూర్‌, హాంకాంగ్‌, నెదర్లాండ్స్‌ ప్రభృత దేశాలు అంతకంతకు స్వీయ అనుకూలతలకు మెరుగులు దిద్దుకుంటూ పురోగమిస్తుండగా- మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి చందంగా భారత్‌ ప్రగతి ప్రస్థానం దిగులు పుట్టిస్తోంది.

భారత్‌ 7.3-7.4శాతం మేర వృద్ధి చెందగలదని నిరుడు అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మదింపువేసింది. సరిగ్గా సంవత్సరం తరవాత అదే సంస్థ భిన్నమైన అంచనాలు వెలువరించింది. ఈ ఏడాది 90శాతం దేశాల వృద్ధిరేటులో క్షీణత కనిపిస్తోందని, భారత్‌వంటి వర్ధమాన శక్తులపై అంతర్జాతీయ మాంద్యం తాలూకు దుష్ప్రభావం ప్రస్ఫుటమవుతోందని ఐఎంఎఫ్‌ నూతన సారథి క్రిస్టాలినా గియోగేవా చెబుతున్నారు. ఇప్పటికే దేశీయంగా వాహన, ఆతిథ్య, రవాణా, సమాచార ప్రసార, వ్యవసాయ తదితర రంగాల్ని మాంద్యం పట్టి పీడిస్తోంది. ఈ దశలో విద్యుత్తు, బ్యాంకింగేతర ఆర్థిక రంగాల సమస్యల్ని చురుగ్గా పరిష్కరించి, దీర్ఘకాలిక సంస్కరణలతో ప్రైవేటు పెట్టుబడుల్ని సూదంటురాయిలా ఆకట్టుకుంటేనే వృద్ధిరేటు తేటపడుతుందన్నది రఘురాం రాజన్‌ వంటి నిపుణుల ఉద్బోధ. ఆ వృద్ధిమంత్రంతో పోటీతత్వాన్నీ కూడగట్టుకునే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలుపై మోదీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది! వచ్చే దశాబ్దకాలంపాటు దేశంలో పనిచేయగల వయసున్న వ్యక్తుల జనాభా ఏటా 97 లక్షల చొప్పున పెరగనుందని, ఆ మేరకు ఉద్యోగ సృష్టికి వీలుగా కార్మిక చట్టాల సవరణ అత్యావశ్యకమని మూడు నెలల క్రితం ఆర్థిక సర్వే హితవు పలికింది. దిద్దుబాటులో అదొక పార్శ్వమే. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరవాతా నాసి చదువులు, ఆగని శిశు మరణాలు, ఆశించినంతగా విస్తరించని నైపుణ్యాలు... అంతర్జాతీయంగా దేశాన్ని నగుబాటుకు గురిచేస్తున్నాయి. ఈ దురవస్థను అంతమొందించేందుకు ప్రజాప్రభుత్వాలు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. ఫోర్బ్స్‌ నివేదిక గతంలోనే సూటిగా చెప్పినట్లు- అవినీతి, విద్యుత్‌ పంపిణీ, రవాణా వసతులపరంగా సవాళ్లను ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చక్కదిద్దాలి. విద్య, నైపుణ్యాల్లో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన స్పర్ధకు దోహదపడే విధాన రచన- సమర్థ మానవ వనరుల ఆవిష్కరణకు, పోటీతత్వ సూచీలో మేటి అనిపించుకోవడానికి మేలుబాటలు పరుస్తుంది!


Posted on 11-10-2019