Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

గ్రామీణ ఉద్దీపనే ఆపద్బంధు

* మందగమనానికి సరైన మందు

దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు 45 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. జీడీపీ స్థూల మూలధన నిర్మాణ శాతం ఆధారంగా లెక్కించిన పెట్టుబడి రేటు 32.3 శాతానికి (2017-18) పతనమైంది. బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, విద్యుత్‌ రంగంలో ముసురుకున్న డిస్కమ్‌ల నష్టాలు, వ్యవస్థలో లోపిస్తున్న పోటీతత్వం, ఆర్థిక వ్యవస్థలో పాతుకుపోయిన వ్యవస్థీకృత సమస్యలను ఎత్తిచూపుతున్నాయి. వీటికి మించి దేశం ఎదుర్కొంటున్న విస్తృతమైన సమస్య- వినియోగ కుదింపు. కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రైవేటు తుది వినియోగ వ్యయ వృద్ధిరేటు 3.1 శాతానికి (18 త్రైమాసికాల కనిష్ఠస్థాయి) పడిపోయింది. జీడీపీలో దీనిశాతం ఏడు త్రైమాసికాల కనిష్ఠస్థాయికి (57.7 శాతం) చేరింది. అమాంతంగా కుదించుకుపోయిన వినియోగ వృద్ధిరేటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది పరిశ్రమలనే కాదు ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలపై సగటు భారతీయ పౌరుడి మనోభావాల్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలను నింపి, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది.

వ్యవస్థీకృత సమస్యలే కారణం
ద్రవ్యోల్బణం రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యానికంటే తక్కువగా ఉండి ఆర్థిక వృద్ధి పడిపోతున్నట్లయితే అది వినియోగపరమైన గిరాకీ (వినియోగ డిమాండ్‌) బలహీనతను సూచిస్తుంది. అది లక్ష్యానికంటే ఎక్కువగా ఉండి ఆర్థిక వృద్ధి తగ్గుతున్నట్లయితే వ్యవస్థలో సరఫరా సమస్యలు ఉన్నట్లు అర్థం. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మూడు శాతానికి దిగజారింది. ప్రస్తుత గడ్డు పరిస్థితికి ప్రధాన కారణం దేశంలో వినియోగ వస్తువులకు డిమాండు తగ్గిపోవడమేనని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ప్రజల నుంచి వినియోగ డిమాండు తగ్గడంతో ధరలను నిర్ణయించే శక్తిని పరిశ్రమలు కోల్పోయాయి. ఫలితంగా ఆహారేతర ద్రవ్యోల్బణమూ తగ్గుముఖం పట్టింది. సాధారణంగా ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీ రేట్లూ దిగివస్తాయి. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏడాది కాలంలో ఆర్‌బీఐ రెపోరేటును 110 పాయింట్లు తగ్గించి 5.4 శాతంగా నిర్ధారించింది. ఆ మేరకు బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించలేదు. 10-20 పాయింట్ల మేర మాత్రమే తగ్గించాయి. ఇప్పటికీ వ్యక్తిగత రుణంపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు సగటున 14 శాతానికి తగ్గడం లేదు. ఫలితంగా ప్రజలు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనికితోడు ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉండటంవల్ల ప్రజల వేతన ఆదాయాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు. అవసరాలకు మించి వస్తువులు కొనడానికి కావలసిన ద్రవ్యం తగ్గింది. కొంతమంది దగ్గర ద్రవ్యం తగ్గడం, మరికొందరు వినియోగాన్ని వాయిదా వేసుకొని ద్రవ్యాన్ని చేతిలో ఉంచుకోవాలనుకోవడం జరుగుతోంది. అంతిమంగా దేశంలో వినియోగ డిమాండు పడిపోయింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ, మూలధన వ్యయాలు, ప్రైవేట్‌ మూలధన వ్యయం 2010-11 నుంచి క్షీణించింది. 2010-11లో జీడీపీలో 15.4 శాతమున్న ప్రభుత్వ వ్యయం 2018-19 నాటికి 12.2 శాతానికి తగ్గింది. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పన్ను ఆదాయం 7.3 నుంచి 6.9 శాతానికి పడిపోవడమే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక సమస్యలూ వినియోగ డిమాండు తగ్గుదలకు ఒక కారణం. దేశంలో 52 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణాల ఊబిలో చిక్కుకున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (జాతీయ నమూనా సర్వే కార్యాలయం) చెబుతోంది. 25 శాతం గ్రామీణ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. గత నాలుగేళ్లలో వ్యవసాయ కుటుంబ ఆదాయం నెలకు రూ. 2,505 మేరకే పెరిగినట్లు నాబార్డ్‌ గణాంకాలు సూచిస్తున్నాయి. గ్రామ-పట్టణ ప్రాంతాల మధ్య ఆర్థిక అభివృద్ధిలో వృత్యాసాలు అధికంగా ఉన్నాయి. సగటు పట్టణ కార్మికుడి ఆదాయం, సగటు వ్యవసాయ కార్మికుడి రాబడి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక చెబుతోంది. అప్పుల్లో సైతం గ్రామ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య పెరుగుతున్న విభజన వారి వినియోగం, జీవన నాణ్యత, భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల లభ్యతలో అసమానతలకు కారణమవుతోంది. జనాభాలో దాదాపు 45శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వేరే ఉపాధి అవకాశాలు లేక బతుకుతెరువు కోసం అవసరానికి మించి వ్యవసాయంపై ఆధారపడినట్లు దీన్నిబట్టి బోధపడుతోంది. రవాణా వ్యవస్థ, పంపిణీ మార్గాలు అసమగ్రంగా ఉన్నాయి. ఈ ప్రతికూలతల వల్ల అంతర్జాతీయ విపణిలో ధరలు తగ్గినప్పుడు కలిగే ప్రయోజనాలను పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలు అందుకోలేకపోతున్నాయి.

ఈ పరిస్థితులను సరిదిద్దడానికి అర్థవంతమైన వ్యవసాయ సంస్కరణలు చేపట్టడం అవసరం. సమగ్రాభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి, విలువలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులను సృష్టించి, రైతులకు మెరుగైన ఫలితాన్ని అందించే వ్యవసాయ-సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి పెట్టాలి. పెద్దయెత్తున సూక్ష్మ పారిశ్రామికవేత్తలను సృష్టించడంతోపాటు, వ్యవసాయ ఆర్థిక సమూహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు, విద్యుత్‌, నీటిపారుదల సౌకర్యాలు విస్తరించాలి. ఉపాధి హామీ పథకాన్ని తాత్కాలిక ఉపాధినిచ్చే కార్యక్రమంగా కాక గ్రామీణ ప్రాంత ప్రజల్లో నైపుణ్యాలు పెంచే పథకంగా తీర్చిదిద్దితే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రజల కోరిక, అవసరాలనుబట్టి శిక్షణనివ్వాలి. శిక్షణ కాలంలో కనీస వేతనం అందించాలి. రాబోయే అయిదేళ్లలో మౌలిక రంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వంద లక్షల కోట్ల రూపాయల్లో సింహ భాగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే కేటాయించాలి. దాదాపు మూడింట రెండొంతుల దేశజనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. కనీస మద్దతు ధరలను (ఎమ్‌ఎస్‌పీ) పెంచడం ద్వారా 2022-23 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాలను రెండింతలు చేయవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. క్షేత్రస్థాయిలో లోపాల వల్ల ఎమ్‌ఎస్‌పీ నేరుగా రైతులకు అధిక ఆదాయం ఇచ్చే విధంగా రూపాంతరం చెందడం లేదని వివిధ పరిశోధనల్లో తేలింది. అధిక ఎమ్‌ఎస్‌పీల వల్ల మార్కెట్లు వక్రీకరణకు గురవడమే కాక, ధరలు పెరిగి ప్రపంచ విపణుల్లో మన వస్తువులు పోటీతత్వాన్ని తగ్గిస్తాయి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి సాగుపై వచ్చే ఆదాయమేకాక వ్యవసాయేతర ఆదాయ వనరులనూ పెంచాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ సంస్థాగత సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి ఆదాయాలను పెంచగలం. తద్వారా వారి వినియోగ డిమాండు ఇనుమడిస్తుంది. ఈ అంశాలు దేశంలో అధిక ఆర్థిక వృద్ధికి దోహదపడటమే కాక, ఆ వృద్ధిని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి కావలసిన తోడ్పాటు అందిస్తాయి.

తక్షణ చర్యలు అవసరం
తగ్గిపోయిన వినియోగ డిమాండును పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఉద్దీపన చర్యలను ప్రకటించింది. నూరు లక్షల కోట్ల రూపాయలను రాబోయే అయిదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. బేసిక్‌ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22 శాతానికి (సెస్‌, సర్‌ఛార్జీలు మినహాయించి) తగ్గించింది. అక్టోబరు ఒకటి తరవాత ఏర్పాటు చేసి, 2023 మార్చికి ముందు ఉత్పత్తిని ప్రారంభించే కొత్త తయారీ సంస్థలకు కార్పొరేట్‌ పన్ను రేటును 25 నుంచి 15 శాతానికి కుదించింది. పరిశ్రమలకు ఇచ్చిన ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు రూ.1.4 లక్షల కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా. ఆతిథ్య రంగానికి ప్రోత్సాహాన్నిచ్చే చర్యల్లో భాగంగా హోటల్‌ గదులపై పన్ను రేటును తగ్గించింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. జాతీయ రహదారి కార్యక్రమాన్ని సమగ్రంగా పునర్‌ వ్యవస్థీకరించడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విమాన ఫైనాన్సింగ్‌, లీజింగులోనే కాక వాటి సమగ్ర నిర్వహణలోనూ దేశాన్ని కేంద్రంగా మార్చడం వంటివి వాటిలో కొన్ని. సంప్రదాయ పరిశ్రమల అభివృద్ధి, పునరుత్పత్తి కోసం సంప్రదాయ కార్మికులు ఎక్కువగా గల పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో వ్యాపారం చేయడానికి అనువైన పరిస్థితులను కల్పించడం కోసం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) కార్మిక నిబంధనలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. తాజా చర్యలు దేశ ఆర్థిక వృద్ధిని, ముఖ్యంగా వినియోగ డిమాండును ప్రభావితం చేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వినియోగ డిమాండును తట్టిలేపే చర్యలు అవసరం. వినియోగ డిమాండును ప్రత్యక్షంగా, వేగంగా ప్రభావితం చేసే శక్తి గ్రామీణ భారతానికి ఉంది. ఉపాధిహామీ పథకానికి కేటాయించిన నిధులను, పనిదినాలను పెంచి తక్షణమే పనులు ప్రారంభించవచ్చు.పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో దాదాపు 50 నుంచి 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులే ఉన్నాయి. వీటిపై విధించే పన్నుల్లో కోత పెట్టి ధరలను తగ్గించవచ్చు. అయిదు లక్షల రూపాయలకు పైబడి ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం తగ్గించవచ్చు. ఈ చర్యలు వ్యవస్థలో తక్షణమే ద్రవ్యత్వాన్ని పెంచుతాయి. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది వినియోగ డిమాండును పెరగడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది!


Posted on 15-10-2019