Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అవసరాలకు 'చెల్లింపు'

* బ్యాంకింగులో మరో అధ్యాయం
సమ్మిళిత వృద్ధిసాధన, అధిక ఆదాయానికి అవకాశాలు కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అట్టడుగు వర్గాల జీవితాలను బాగుచేయడం వంటివి దేశప్రగతిలో ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ లక్ష్యాల సాధనకు బ్యాంకింగు వ్యవస్థలు ఎంతగానో దోహదపడతాయి. 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. దేశ బ్యాంకింగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నిర్ణయమది. దానివల్ల ప్రభుత్వ బ్యాంకు శాఖలు దేశమంతటా విస్తరించాయి. అప్పట్లో దేశంలో 8,260 ప్రభుత్వ బ్యాంకు శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్య ఇప్పుడు లక్షకు పైమాటే. వివిధ ప్రాధాన్య రంగాలకు బ్యాంకులు ఇచ్చిన రుణం రూ.3,020కోట్ల నుంచి రూ.16.93లక్షల కోట్లకు పెరిగింది. గ్రామీణ భారతంలో స్వయంసహాయక సంఘాలు ఆవిర్భవించడంతో రుణాల మంజూరు అధికమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తొమ్మిది లక్షలకు పైగా మహిళా సంఘాలు ఉండేవి. సేవల ఆధునీకరణ, పలు పథకాల ద్వారా బ్యాంకింగు రంగం ప్రజలకు మరింత చేరువైంది. రకరకాల బ్యాంకులూ తెరపైకి వచ్చాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 'జన్‌ధన్‌ యోజన' కొత్త అధ్యాయానికి తెరతీసింది. స్వల్పవ్యవధిలో ఏకంగా 17.40కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరచిన పరిణామమిది. జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌(జామ్‌) అనుసంధానం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనను ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

స్మార్టు ఫోనుల పాత్ర...

మెరుగైన సమ్మిళిత వృద్ధి సాధనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతగానో దోహదపడుతుంది. అందుకోసం మూడు అంశాలపై దృష్టిసారించాలి. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగు వ్యవస్థను విస్తరింపజేయడం అందులో మొదటిది. ప్రజల జీవన, ఆదాయ అవసరాలకు తగిన సేవల కల్పన, బ్యాంకింగు విజ్ఞానం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయడం మిగిలిన రెండు అంశాలు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగు వ్యవస్థను విస్తరింపజేయడం పెద్ద సవాలే. అనేక వినూత్న విధానాల ద్వారా బ్యాంకులు ప్రజలకు చేరువ అవుతున్న రోజులివి. బిజినెస్‌ కరస్పాండెంట్ల(బీసీ) నమూనా అందులో ప్రధానమైంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, బ్లూటూత్‌ ప్రింటర్ల వంటి ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా బ్యాంకింగ్‌ పనులను సునాయాసంగా చక్కబెట్టుకోవచ్చు. నాలుగేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 65కోట్లకు పైగా పెరుగుతారన్న అంచనాలు బ్యాంకింగు రంగ విస్తృతికి అనుకూలించేవే! అన్ని రకాల ఆదాయ వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా బ్యాంకింగు పథకాలు, సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరం. ప్రధాని మోదీ చేస్తున్నదీ అదే. సమాచార విశ్లేషణ ద్వారా ఏ వర్గాలవారికి ఎలాంటి సేవలు అందజేయాలో తెలుసుకోవాలి. ఖాతాలు లేని అల్పాదాయవర్గాల రుణచరిత్రను బ్యాంకులు నిర్ధారించలేవు. కాబట్టి, అక్షరాస్యత స్థాయి, భవిష్యత్‌ ఆదాయ మార్గాలు, కనీస ఆస్తుల విలువలను పరిగణనలోకి తీసుకుని అర్హతలను రూపొందించాలి. తెరచిన ఖాతాల ద్వారా అందరూ లావాదేవీలు జరపగలగాలి. వెనకబడిన వర్గాలు, నిరక్షరాస్యుల విషయంలో ఇది సమస్యాత్మకమే. సంప్రదాయ పద్ధతుల ద్వారానే వీరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసే మార్గాలు అన్వేషించాలి. 2020నాటికి దేశ జనాభాలో 70శాతం మధ్య, అధికాదాయ వర్గాల పరిధిలోకి రానున్నారన్న అంచనాల నేపథ్యంలో దేశంలో స్మార్ట్‌ఫోన్లు ప్రజల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకురాబోతున్నాయి.

చిన్నబ్యాంకులు, చెల్లింపు బ్యాంకుల ప్రవేశానికి రిజర్వు బ్యాంకు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇవి ప్రజల నుంచి పొదుపు మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరిస్తాయి. చిన్న వ్యాపారులు, రైతులు, అసంఘటిత వ్యాపార సంస్థలకు విరివిగా రుణాలు ఇస్తాయి. తక్కువ నిర్వహణ వ్యయంతో సేవలు అందించి, సమ్మిళిత వృద్ధికి వూతమిస్తాయి. అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చిన రుణాలపై హార్వర్డు విశ్వవిద్యాలయం 2014లో అధ్యయనం నిర్వహించింది. చిరువ్యాపారులకు ఇచ్చిన రుణాలు 51శాతం, వ్యవసాయ అప్పులు 71శాతం చిన్న బ్యాంకులే ఇచ్చాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. దేశ ఆర్థిక ప్రగతిలో చిన్న బ్యాంకులే పెద్దపాత్ర పోషిస్తున్నాయనడానికి హార్వర్డు అధ్యయనమే దాఖలా. సాధారణ బ్యాంకులకు చెల్లింపు బ్యాంకులు భిన్నమైనవి. ఇవి డిమాండు డిపాజిట్లు, అంతర్జాల బ్యాంకింగు వంటి ప్రత్యేక సేవలనే అందిస్తాయి. లక్ష రూపాయలకు మించి డిపాజిట్లు సేకరించడానికి ఈ బ్యాంకులకు అనుమతి లేదు. క్రెడిట్‌ కార్డులు జారీచేయడానికి, రుణసేవలకు, ప్రవాసుల కోసం ఖాతాలు తెరవడానికి సైతం అనుమతి ఉండదు. ఇంతకాలం దూరంగా ఉంటున్న సామాన్యులను సేవల పరిధిలోకి తీసుకువచ్చి, అవకాశాలు కల్పించడమే చెల్లింపు బ్యాంకుల ఏర్పాటు పరమార్థం. పెద్దపెద్ద టెలికాం సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో బ్యాంకులు లేనిచోట మొబైళ్ల ద్వారా బ్యాంకింగు లావాదేవీలు వూపందుకోవడం ఖాయం. దీనివల్ల ఖాతాదారులు ప్రతి చిన్న పనికి బ్యాంకులకు పరుగులెత్తాల్సిన అగత్యం ఉండదు. సమయం, ప్రయాణ ఖర్చులూ కలిసి వస్తాయి. చెల్లింపు బ్యాంకు విధానంలో లక్ష రూపాయల అప్పు వరకు వాయిదాలు చెల్లించలేకపోతే, రుణగ్రహీతకు జరిమానా విధించరు. ప్రైవేటు వ్యక్తులు నడిపే ఈ బ్యాంకులు నిబంధనలకు ఎంతవరకు కట్టుబడి ఉంటాయో వేచిచూడాలి. ఖాతాదారులు దాచుకున్న సొమ్ముపై అధికంగా వడ్డీ ఇవ్వడం ఈ బ్యాంకుల ప్రత్యేకత. చిన్న మొత్తాలే అయినా ఎక్కువమంది పేద, సామాన్య ప్రజలకు రుణాలు అందిస్తాయి. అందువల్ల రాని బాకీల నష్టం తీవ్రస్థాయిలో ఉండదు

ఖాతాలో నేరుగా డబ్బు జమ

1990లో ఆర్థిక సంస్కరణల ఆరంభం తరవాత ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు రంగప్రవేశం చేసినా అవేవీ రైతులకు, కులవృత్తులవారికి అందుబాటులో లేకుండా పోయాయి. లాభాపేక్షే లక్ష్యంగా అవి పనిచేస్తాయి. మరోవైపు- ప్రభుత్వ బ్యాంకులు లక్షల కోట్ల మొండిబకాయీల సమస్యలతో సతమతమవుతూ, పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. రెండు సమస్యలకు పరిష్కార మార్గంగా చెల్లింపు బ్యాంకులు తెరపైకి వచ్చాయి. వరదలు, కరవుల వంటి ప్రకృతి విపత్తుల బారిన పడుతున్న రైతుల కష్టనష్టాలను తీర్చడంలో ప్రభుత్వ, సహకార బ్యాంకులు ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికవడ్డీవల్ల రుణాలు తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి చెల్లింపు బ్యాంకులు తోడ్పడతాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా రైతుల ఖాతాల్లోకే చెల్లింపులు నేరుగా జమ అవుతాయి. దేశవ్యాప్తంగా 1.5లక్షల శాఖలతో విస్తరించి ఉన్న తపాలాశాఖ సైతం బ్యాంకింగు కార్యకలాపాలు ప్రారంభించబోతోందని సమాచారం. ప్రైవేటు వ్యక్తులు గ్రామాల్లో బ్యాంకులు ప్రారంభించడానికి భవనాలు నిర్మించాలి. లేదా అద్దెకు తీసుకోవాలి. తపాలా శాఖకు ఆ బెడద ఉండదు. చెల్లింపు బ్యాంకులైనా అంతోఇంతో లాభాపేక్షతో పని చేయాల్సిందే. లాభాలు రాకపోతే రిజర్వుబ్యాంకు నిబంధనలను అవి ఎంతవరకు పాటిస్తాయన్నదీ సందేహాస్పదమే. మారుమూల గ్రామాల్లో బ్యాంకింగు కార్యకలాపాలు అంత లాభసాటిగా ఉండవు. కాకపోతే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. అంతకాలం ప్రైవేటు వ్యక్తులు వేచిచూస్తారా అన్నదీ అనుమానమే. చెల్లింపు బ్యాంకుల రాకతో ప్రభుత్వరంగ బ్యాంకులకు పోటీ పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ బ్యాంకుల వాటా తగ్గవచ్చు. ప్రభుత్వ బ్యాంకులో ఉండే ఉద్యోగ భద్రత చెల్లింపు బ్యాంకుల సిబ్బందికి ఉండదు. వేతన పరిమితులూ ఉన్నాయి. తక్కువ ప్రతిఫలంతో ఎక్కువ పని ఉంటుంది. వీటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి!

- ఆచార్య బి. రామ‌కృష్ణారావు
(ర‌చ‌యిత - ఆర్థిక, వాణిజ్య రంగ నిపుణులు)
Posted on 17-10-2015