Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అదుపు తప్పుతున్న విత్తలోటు

* ఆర్థికం ఆందోళనకరం

ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను విత్తలోటు ఆందోళనకర పరిస్థితుల్లోకి నెడుతోంది. భారత్‌ కొత్త అభివృద్ధి మార్గాలను కనుగొనలేకపోతోంది. - రఘురాం రాజన్‌ (రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌)

కరెన్సీ విలువ, విత్తలోటు, ద్రవ్యోల్బణాల గురించి పట్టించుకోవడం మాని, ప్రజల ఆదాయాలను పెంచి తద్వారా గిరాకీ ఇనుమడించేలా చేయాలి. - అభిజిత్‌ బెనర్జీ (నోబెల్‌ ఆర్థిక పురస్కార విజేత)

చర్యకు ప్రతిచర్య అనివార్యం. ఎన్డీయే ప్రభుత్వం వెనకాముందూ చూసుకోకుండా చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)తో నడ్డివిరిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. చిన్నాపెద్దా పరిశ్రమలు కుదేలై కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అడుగంటి, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గిపోయింది. ఒకప్పుడు ఏటా ఎనిమిది శాతం ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతంకన్నా తక్కువకు పడిపోయేట్లుంది. దీన్ని నివారించాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాలి. కానీ, పారు బాకీలతో కుంగిపోయిన బ్యాంకుల నుంచి పెట్టుబడులు వచ్చే ఆశ లేనందున మార్కెట్‌ రుణాలే శరణ్యం. చిక్కేమిటంటే, భారత్‌ విత్తలోటును తగ్గించుకోనిదే అంతర్జాతీయ విపణిలో నిధులు దొరకడం కష్టం. ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకుంటే తప్ప విత్తలోటు అదుపులోకి రాదు. కేంద్ర, రాష్ట్రాలు రాజకీయ అనివార్యతల వల్ల లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాయే తప్ప- పరిశ్రమలు, మౌలిక వసతులకు పెట్టుబడులు అందించడం లేదు. సంక్షేమ పథకాల అమలుకూ తగిన ఆదాయం లేక ఎడాపెడా అప్పులు చేసేస్తున్నాయి. 2019 జూన్‌ చివరకు కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణభారం రూ.88.18 లక్షల కోట్లకు చేరుకుందని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖే ప్రకటించింది. ఈ రుణాలు పెట్టుబడులుగా మారి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయా అంటే అదీ లేదు. ఏటా కేంద్ర బడ్జెట్లో నాలుగోవంతు పాత రుణాలపై వడ్డీ చెల్లింపులకే సరిపోతూ, ఉత్పాదక కార్యకలాపాలకు పెట్టుబడులు లభ్యం కావడం లేదు. అప్పులు చేసి కొత్త పరిశ్రమలు, మౌలిక వసతులను ఏర్పరిస్తే, మొదట్లో విత్తలోటు ఏర్పడినా తరవాత పరిశ్రమలు, ప్రజల నుంచి పన్నుల రూపేణా ఆదాయం పెరిగి లోటును అధిగమించవచ్చు.

రుణాలు కాని రుణాలు
భారత్‌లో పెట్టుబడుల కన్నా సంక్షేమ వ్యయం పెరుగుతున్నందున విత్తలోటు దిగివచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల అంతర్జాతీయ సంస్థలు భారత్‌ రేటింగ్‌ను తగ్గించేస్తాయి. అదే జరిగితే విపణిలో నిధులు లభ్యం కావు. ఈ దుస్థితిని తప్పించుకోవడానికి భారతదేశం తాను చేసే అప్పుల్లో గణనీయ భాగాన్ని ఆస్తి-అప్పుల పట్టీలో చూపకుండా జాగ్రత్తపడుతోంది. వివిధ సబ్సిడీల చెల్లింపును తదుపరి సంవత్సరానికి వాయిదా వేస్తూ, తన బదులు ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)లను అప్పులు తీసుకోవలసిందిగా కోరుతోంది. పీఎస్‌యూలు తీసుకునే రుణాలను ఆస్తి-అప్పుల పట్టీలో చూపకుండా తిమ్మిని బమ్మి చేస్తోంది. ఉదాహరణకు 2018-19లో ప్రభుత్వానికి రూ.24.5 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని బడ్జెట్‌ అంచనా వేసినా, చివరకు వసూలైంది రూ.23 లక్షల కోట్లు మాత్రమే. కేంద్రం సబ్సిడీల చెల్లింపును దాటవేయడం ద్వారా ఖర్చును తక్కువగా చూపింది. ఆహార భద్రతా చట్టం అమలువల్ల ఆహార సబ్సిడీ వ్యయం పెరిగినా ఆ భారాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) మీదకు తోసేసింది. ఎఫ్‌సీఐకి తాను చెల్లించాల్సిన ఆహార సబ్సిడీకి బదులు, జాతీయ చిన్న మొత్తాల పొదుపు సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి అప్పు ఇప్పించింది. ఆహార సబ్సిడీ చెల్లింపులకు 2017-18 బడ్జెట్‌లో రూ.1.6 లక్షల కోట్లను, 2018-19 బడ్జెట్‌లో రూ.1.7 లక్షల కోట్లను కేటాయించాల్సింది. కానీ, ఈ రెండేళ్లలో ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ద్వారా ఎఫ్‌సీఐకి ఏటా రూ.65,000 కోట్ల చొప్పున అప్పు ఇప్పించి, బడ్జెట్‌లో ఆహార సబ్సిడీ బిల్లును ఏటా లక్ష కోట్ల రూపాయలకు తగ్గించి చూపగలిగింది. ప్రభుత్వం రానురానూ నిధుల కోసం ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ మీద ఆధారపడటం ఎక్కువైపోతోంది. ఆరేళ్ల క్రితం విత్తలోటులో రెండు శాతం ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాల ద్వారా భర్తీ కాగా, 2019-20 వచ్చేసరికి అది ఏకంగా 20 శాతానికి పెరిగిపోయింది.

2019-20 బడ్జెట్లో ఆహార సబ్సిడీని రూ.1.84 లక్షల కోట్లుగా చూపినందువల్ల ఈ సంవత్సరం ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి ఎఫ్‌సీఐ ఎంత అప్పు చేయాల్సి వస్తుందో చూడాలి. పంటల కనీస మద్దతు ధర ఏటా పెరుగుతున్నందున ఆహార సబ్సిడీ భారమూ అధికమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ కిలో గోధుమలను రెండు రూపాయలకు, బియ్యాన్ని మూడు రూపాయలకు సరఫరా చేస్తోంది. సేకరణ, సరఫరా ధరలకు మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేయాల్సిన కేంద్రం ఆ పని చేయకుండా ఎఫ్‌సీఐని అప్పుల ఊబిలోకి నెడుతోంది. 2014 మార్చిలో రూ.91,409 కోట్లుగా ఉన్న ఎఫ్‌సీఐ రుణభారం, 2019 మార్చినాటికి రూ.2.65 లక్షల కోట్లకు పెరిగిందంటే ఆశ్చర్యమేముంది? ఈ అప్పులో రూ.1.91 లక్షల కోట్లు 2016-17 నుంచి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ దగ్గర తీసుకున్నవే. ఎఫ్‌సీఐకి సొంత ఆదాయం లేదు కాబట్టి, ఈ అప్పును తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే కానీ, ఇప్పటికే ఖర్చులు కొండలా పెరిగిపోయిన కేంద్రం ఆ పని చేయలేక అంకెల గారడీతో పొద్దుపుచ్చుతోంది. ప్రపంచం నుంచి ఆకలిని పారదోలాలన్న లక్ష్యంతో ఏటా అక్టోబరు 16నాడు ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నిర్వహించే ప్రపంచ ఆహార దినం నాడు ఎఫ్‌సీఐకి అప్పుల కొండే కానుకగా లభించడం విచారకరం. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలోనూ కేంద్రానిది ఇదే పంథా!

పనితీరూ తీసికట్టు
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల వాటా విక్రయాల ద్వారా సేకరించదలచిన రూ.1.05 లక్షల కోట్లలో అత్యధిక భాగాన్ని కేవలం అయిదు పీఎస్‌యూల ద్వారా కేంద్రం సంపాదించదలచింది. అవి- భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్‌ కార్‌, ఈశాన్య ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌, టీహెచ్‌డీసీ సంస్థలు. ఒక్క బీపీసీఎల్‌లో కేంద్రానికి ఉన్న 53.29 శాతం వాటాలను విక్రయిస్తేనే రూ.56,400 కోట్లు లభ్యమవుతాయి. కానీ, ఈ వాటాలను ప్రైవేటు రంగానికి విక్రయిస్తే ఆ సంస్థ రేటింగును తగ్గిస్తామని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. ఈ చిక్కు నుంచి బయటపడటానికి కేంద్రం బహుశా పీఎస్‌యూల వాటాలను ఇతర పీఎస్‌యూలకు విక్రయించవచ్చు. ఈ సందర్భంగా కొన్ని హేమాహేమీ పీఎస్‌యూల పరిస్థితి దయనీయంగా ఉందని గమనించాలి. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఎయిరిండియాలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితిలోకి జారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈ సంస్థలను ఆదుకోలేక చేతులు ఎత్తేస్తున్నట్లుంది. జీడీపీ వృద్ధి మందగించి ప్రభుత్వ ఆదాయం తగ్గడమే ఈ దుస్థితికి మూలకారణం. ఆదాయం కోసుకుపోయినప్పుడు ఖర్చులు తగ్గించడం అవసరమే కానీ, ఆర్థిక మందగతిలో ఆ పని చేస్తే అభివృద్ధి మరింత కుంటువడుతుంది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌, ఫసల్‌ బీమా యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి సంక్షేమ పథకాలకు నిధులు కత్తిరిస్తే, జీడీపీ వృద్ధిరేటు అయిదు శాతంకన్నా దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. సంక్షేమం, అభివృద్ధి చెట్టపట్టాల్‌గా సాగాలి. ఆర్థికాభివృద్ధి ద్వారా లభించే నిధులను సంక్షేమానికి వెచ్చించాలి. ఆర్థికాభివృద్ధి సిద్ధించాలంటే స్వదేశీ, విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాలి. అది జరగాలంటే కార్మిక సంస్కరణలు తీసుకొచ్చి, కొన్ని పీఎస్‌యూలను ప్రైవేటీకరించాలని, పరిశ్రమల స్థాపనకు భూమి బ్యాంకులు ఏర్పరచాలని నీతిఆయోగ్‌ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం పీఎస్‌యూల అధీనంలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు స్థాపించాల్సిందిగా విదేశీ సంస్థలను ఆహ్వానించవచ్చని నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ అంటున్నారు. రైతులు, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించిన భూములు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటున్నందున ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల చేతిలో ఉన్న భూములు కొన్నింటితో భూబ్యాంకులను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఎన్‌టీపీసీ, సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వంటి పీఎస్‌యూలకు చెందిన 50కి పైగా స్థిరాస్తులను అమ్మకానికి పెట్టాలని నీతిఆయోగ్‌ సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌యూ వాటాలు, ఆస్తుల విక్రయానికి కేంద్ర ఆర్థిక శాఖ కింద పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఏర్పాటైంది. రాబోయే నెలల్లో 42 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని లేదా వాటిలో కొన్నింటిని మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. మొత్తం మీద స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. కానీ, దీనివల్ల ఏర్పడే రాజకీయ, ఆర్థిక పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి!

చిక్కుల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కూడా ఎఫ్‌సీఐ మాదిరిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆరేళ్ల క్రితం రూ.40 వేలకోట్లుగా ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ అప్పు ఇప్పుడు రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఎరువుల సబ్సిడీ చెల్లించడానికి కేంద్ర సర్కారు కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి ప్రధాన ఎరువుల కంపెనీలకు రుణాలు ఇప్పించింది. భారతీయ రైల్వే ఫైనాన్సింగ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మార్కెట్‌ రుణాలు సేకరించాలని సూచించింది. సదరు రుణాలు ఆయా కంపెనీల బ్యాలన్స్‌ షీట్లలో అప్పులుగా కనిపిస్తాయితప్ప కేంద్ర బడ్జెట్‌లో వాటి ఊసే ఉండదు. ఇలాంటి పనుల ద్వారా కేంద్రం 2019-20 బడ్జెట్‌లో విత్తలోటును జీడీపీలో 3.3 శాతానికి తగ్గించి చూపగలిగింది. 2017-18లో విత్తలోటును 3.4 శాతంగా చూపినా, బ్యాలన్స్‌ షీట్లలో చూపని అప్పులను కలుపుకొంటే అసలు లోటు 5.86 శాతంగా లెక్కతేలుతుందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది. మరోవైపు ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గించినందువల్ల రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుంది. ఆదాయం తరిగి ఖర్చులు పెరిగి కట్టుతప్పుతున్న విత్తలోటును తగ్గించడానికి ప్రభుత్వం పీఎస్‌యూల్లో వాటాలను విక్రయించనుంది.


- ఏఏవీ ప్రసాద్‌
Posted on 16-10-2019