Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అంతరాల అంతానికి అభివృద్ధి అస్త్రం

* నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం

హింసకు అత్యంత హీనరూపం పేదరికం అనేది మహాత్మాగాంధీ మాట. పేదరిక నిర్మూలన పేరిట ప్రత్యేకంగా ఏటా ఓ రోజును కేటాయించి జరుపుకొంటూనే ఉన్నాం. అక్టోబర్‌ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం. పేదరికం కనుమరుగయ్యేలా చిన్నారులు, వారి కుటుంబాలు, సామాజిక వర్గాలకు సాధికారత కల్పించడం ఈ ఏడాది ప్రత్యేకాంశంగా నిర్ణయించారు. నేటికీ లక్షల మంది చిన్నారుల బాల్యం దోపిడికి గురవుతోంది. పేదరికంలో మగ్గుతున్న చిన్నారులు తమ హక్కుల్ని, ఆరోగ్యాన్ని, పోషకాల్ని, విద్యావకాశాలను కోల్పోతున్నారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు కృషి చేసిన భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య ఎస్తేర్‌ డఫ్లో, మైకేల్‌ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వీరి కృషి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాల్లో ఎంతో ప్రభావం చూపింది. పేదరికాన్ని అర్థం చేసుకునే తీరును, ఆలోచనల్ని సమూలంగా మార్చివేసింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఈ ఏడాది జులైలో పలు అంశాల ఆధారంగా పేదరికాన్ని గణించే ‘గ్లోబల్‌ మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎమ్‌పీఐ)’ ద్వారా ఓ నివేదికను విడుదల చేశాయి. ఇందులో వందకుపైగా దేశాల స్థితిగతులను పరిశీలించారు. జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన పదికిపైగా అంశాల ఆధారంగా ఎమ్‌పీఐని రూపొందించారు. 101 దేశాల్లో 23.1 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఇందులో సగం 18 ఏళ్లలోపువారే. ప్రపంచంలోని పేదల్లో 83 శాతం సబ్‌సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లోనే ఉన్నారు. అధ్యయనం జరిపిన దేశాల్లో 17.5 శాతం వయోజనులు పేదరికంలో మగ్గుతుండగా, 33.8 శాతం చిన్నారులు ఆ దురవస్థలో కూరుకుపోయి ఉన్నారు. పెద్దలతో పోలిస్తే చిన్నారులే రెట్టింపు సంఖ్యలో పేదరికం బాధలతో అలమటిస్తుండటం ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అంశం!

పోరులో భారత్‌ పురోగతి
పేదరికాన్ని తగ్గించే విషయంలో భారత్‌ పురోగతి ఆశావహంగానే ఉంది. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే మాత్రం తక్కువగా ఉన్నట్లేనని చెప్పాలి. భారత్‌లో బహుళవిధ పేదరికం నిష్పత్తి 28 శాతంగా ఉంది. 2017లో పేదల సంఖ్య 37.3 కోట్లుగా తేలింది. చైనాలో ఈ సంఖ్య 5.4 కోట్లు మాత్రమే. బహుళవిధ పేదరిక నిష్పత్తి చైనాలో నాలుగు శాతం, ఇండొనేసియాలో ఏడు, వియత్నామ్‌లో అయిదు, థాయ్‌లాండ్‌లో 0.8, ఫిలిప్పీన్స్‌లో ఆరు శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. భారత్‌లో 38 శాతం చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతుండగా, చైనాలో కేవలం ఎనిమిది శాతం చిన్నారుల్లోనే ఈ సమస్య ఉంది.

మనదేశం నుంచి పేదరికాన్ని పారదోలేందుకు ఏం చేయాలి, ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అనుభవ పాఠాలేమిటి? ఈ విషయంలో తూర్పు, ఆగ్నేయాసియా దేశాల నుంచి భారత్‌ ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. హాంకాంగ్‌, సింగపూర్‌ వంటివి తప్పించి, విజయవంతమైన దేశాలన్నీ పారిశ్రామికీకరణకు ముందు ప్రాథమికంగా వ్యవసాయాధారితాలే. 20 ఏళ్ల కాలవ్యవధిలోనే అవన్నీ పూర్తిస్థాయిలో మార్పు సాధించాయి.

చైనా, భారత్‌ 1950ల్లో అభివృద్ధి స్థాయుల విషయంలో దాదాపు సమంగానే ఉన్నాయి. 1970 దశకం ముగిసేంతవరకూ అదే పరిస్థితి. ఆపై వాటి అభివృద్ధి మార్గాలు భిన్నరీతుల్లో సాగాయి. తరవాతి మూడు దశాబ్దాల్లో చైనా వృద్ధి వేగంగా సాగడమే కాకుండా, భారత అభివృద్ధి భావనకు దూరంగా నడిచింది. భారత్‌లో నిర్మాణాత్మక మార్పులు సేవల ఆధారిత వృద్ధితో ముందుకు సాగాయి. దీనికి భిన్నంగా చైనాలో ఉత్పత్తి ప్రాధాన్య వృద్ధితో కూడిన నిర్మాణాత్మక మార్పులు వృద్ధిని మరింత పెంచేలా, ఉద్యోగ సృష్టితో కూడిన అభివృద్ధి దిశగా సాగాయి. 2019లో భారత్‌తో పోలిస్తే, చైనా తలసరి ఆదాయం అధికమే కాకుండా, ఉద్యోగ కల్పన పరిస్థితులూ చాలా మెరుగ్గా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- చైనా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది. ఈ పరిస్థితులు తలెత్తడానికి రెండు కారణాలున్నాయి. ప్రాథమిక పరిస్థితుల్లోనే తేడాలుండటం ఒక కారణంగా గుర్తించాలి. 1955 నుంచి 1978 మధ్య ఇరుదేశాల్లో వృద్ధివేగం తీరు ఒకేలా ఉండేవి. పెట్టుబడుల సమీకరణ, మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవడంలో చైనా చాలా పురోగతి సాధించింది. ఈ కారణంగానే 1970 దశాబ్దం చివరి నాటికి ఉత్పత్తి ఆధారిత వృద్ధి దిశగా దూసుకెళ్లేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంది. భారత్‌ పెట్టుబడుల పరంగా సామర్థ్యం సంతరించుకోలేకపోవడంతోపాటు, మానవ వనరుల్ని సరైన రీతిలో తీర్చిదిద్దుకోలేకపోయింది. ఫలితంగా, చైనా తరహాలో అభివృద్ధి దిశగా సరైన స్థాయిలో దూసుకెళ్లలేకపోయింది. 1980, 1990ల కాలంలో ఇరుదేశాలు అమలు చేసిన ఆర్థిక సంస్కరణల స్వభావం, లక్ష్యాల్లో వైవిధ్యాలు భారీ తేడా చూపడం రెండో కారణంగా చెప్పాలి. చైనా సంస్కరణలు- వ్యవసాయ వృద్ధి, గ్రామీణ పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత పారిశ్రామికీకరణ వంటి నిర్దిష్ట లక్ష్యాలతో, అభివృద్ధి పరంగా స్పష్టమైన విధానాలతో ఉన్నాయి. మరోవైపు ప్రైవేటు వ్యాపారవేత్తలకు స్వేచ్ఛ కల్పించడం, ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య, పెట్టుబడి ప్రవాహాలకు అనుగుణంగా అవకాశాలు సృష్టించడం వంటివాటితో కూడిన భారత ఆర్థిక సంస్కరణల్లో అభివృద్ధి సంబంధ లక్ష్యాల్ని గుర్తించడం క్లిష్టతరంగా మారింది. చౌక నైపుణ్యాలతో కూడిన కార్మికుల ద్వారా అందివచ్చిన సేవారంగ ఆధారిత వృద్ధి అదృష్టవశాత్తు దక్కినట్లుగానే భావించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్తగా వచ్చిన సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానాలతో కొత్త తరహా నైపుణ్యాధారిత సేవారంగం వేగంగా వృద్ధి చెందింది.

భారత్‌ ప్రజాస్వామిక దేశమని, తూర్పు ఆగ్నేయాసియా దేశాలు నియంతృత్వంలో ఉన్నాయి కాబట్టి మనం వెనకంజ వేశామన్నది కొందరి వాదన. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా- పురోగతి సాధనకు మంచి అవకాశాలే భారత్‌ ముందున్నాయి. ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, మలేసియా వంటి దేశాలు కార్మికశక్తిలో నైపుణ్యాల్ని పెంపొందించే దిశగా మెరుగైన పురోగతి సాధించగలిగాయి. బంగ్లాదేశ్‌ సైతం వస్త్ర రంగంలో బలమైన అభివృద్ధి సాధించింది. అంతర్జాతీయ విపణులతో పోటీపడగల స్థాయికి చేరింది. వేగవంతమైన, సుస్థిర, పారదర్శక వృద్ధి ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరిస్తుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడుతుంది. కొన్ని నిర్మాణాత్మక సమస్యల్ని పరిష్కరించకపోతే ఇదంతా సాధ్యం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, మానవ వనరులకు నైపుణ్యాలు అలవరచడం, కొన్ని చట్టాల్ని సంస్కరించుకోవడం, ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపరచుకోవడం, వాణిజ్యరంగంపై అనుమానాస్పద, దండన తరహాతో కూడిన వైఖరుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాణిజ్య యుద్ధాలు, ఇతర పరిస్థితుల మధ్య ఎగుమతి ఆధారిత ఉత్పత్తి రంగం దిశగా సాగడం- ప్రస్తుతం భారత్‌కు కష్టసాధ్యమైనదే.

గ్రామీణ ఆధారిత వృద్ధే మేలు
గ్రామీణ ఆధారిత వృద్ధి దిశగా ప్రయత్నించడమే భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. కొన్నేళ్లుగా గ్రామీణ జనాభా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉపాధి హామీ, ప్రజాపంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పింఛన్ల వంటి విభిన్న ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు జరిగే ప్రయోజన బదిలీలను కేవలం పేదరిక నిర్మూలన పథకాలుగానే చూడరాదు. వస్తుసేవలకు గిరాకీ సృష్టించే అంశాలుగా వీటిని పరిగణించాలి. మార్కెటింగ్‌ సంస్కరణల ద్వారా రైతులకు దక్కే ధరల్ని పెంచాలి. రైతులు తమ ఉత్పత్తుల్ని పట్టణ ఆర్థిక వ్యవస్థలకు, విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇదంతా సాధించేందుకు వారు పండ్లు, కూరగాయలు, పూలు, కోళ్లు, పాడి పరిశ్రమల దిశగా సాగేలా చూడాలి. వారికి శీతల గిడ్డంగులు, రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. గ్రామీణ ఆధారిత వ్యూహం- పర్యావరణానికి హాని తలపెట్టకుండానే సుస్థిరంగా సాగే అవకాశం ఉంది. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యాలున్న భారత్‌ వంటి దేశానికి ఈ వ్యూహం మేలు చేకూర్చగల వీలుంది. పేదరికం వేగంగా తగ్గడానికి దారితీసే అధిక వృద్ధిరేటు వాంఛనీయమే. వృద్ధిరేటులో పెరుగుదల ఎంత మేర ప్రభావం చూపుతుందనేది, అది సాధించే వృద్ధి తీరునుబట్టి ఉంటుంది. ఇతరత్రా వ్యూహాలతోపాటు, తూర్పు, ఆగ్నేయాసియా దేశాల తరహాలో అధిక మానవ మూలధనంతో కూడిన గ్రామీణ ఆధారిత అభివృద్ధి వ్యూహం అధిక వృద్ధిని అందించే అవకాశం ఉంది. అంతేకాదు, చిన్నారుల సంక్షేమంతోపాటు పేదరికంపైనా గణనీయ ప్రభావం చూపే అవకాశముంది. పేదరిక నిర్మూలనతో మహాత్మాగాంధీ కలలుకన్న అంత్యోదయా పరిపూర్ణమవుతుంది.

ప్రపంచ సమస్య
ప్రపంచ పోషణ నివేదిక-2018 ప్రకారం ఇప్పటికీ 15.1 కోట్ల చిన్నారులు వయసుకు తగినంత ఎత్తు, 5.5 కోట్ల పిల్లలు ఎత్తుకు తగిన బరువు లేకుండా ఉన్నారు. 3.83 కోట్ల చిన్నారులు తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. 200 కోట్లకుపైగా వయోజనులు అధిక బరువుతో, స్థూలకాయులుగా ఉన్నట్లు గుర్తించారు. చాలా దేశాల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. ఇందులో కొంతపాపం చిరుతిళ్ల సంస్కృతిదే. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కింద తొమ్మిది ప్రపంచ పోషణ లక్ష్యాల్లో కనీసం ఒక్కదాన్నయినా సాధించే దిశగా సగంకన్నా తక్కువ దేశాలు ఉన్నట్లు తాజా అంచనా ఒకటి స్పష్టీకరించింది. తొమ్మిది లక్ష్యాల్లో అన్నింటినీ సాధించడం ఏ దేశానికీ సాధ్యం కావడం లేదు. కనీసం నాలుగు లక్ష్యాల్ని సాధించే దిశగా అయిదు దేశాలే ఉన్నాయి. వయోజనుల్లో ఊబకాయానికి సంబంధించిన లక్ష్యాల విషయంలో ఏ దేశమూ సరైన దిశగా నడవడం లేదని తెలుస్తోంది. పోషణ విషయంలో చాలా దేశాల ప్రస్థానం ఏమంత ఆశాజనకంగా లేదు.


Posted on 17-10-2019