Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

వృద్ధికి కొలమానం?

పేదరికం, ఆకలి, అనారోగ్యాలకు తావే లేని సమాజావిష్కరణకోసం ప్రతిన పూనిన స్వతంత్ర భారతావని ఏడు దశాబ్దాలకు పైగా స్వపరిపాలన తరవాతా- ఆ బృహత్తర లక్ష్యసాధనకు యోజనాల దూరాన నిలిచిపోయింది. ఇప్పటికీ కోట్లమంది ప్రజలు ఆకలి మంటల్లో కమిలిపోతున్న ఇండియా కన్నా ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్‌, శ్రీలంక ర్యాంకుల్లో ఎంతో మెరుగనిపించుకుంటున్నాయి. అంతర్జాతీయ ఆకలి సూచీ ప్రకారం 117 దేశాల తాజా జాబితాలో భారత్‌ 102వ స్థానానికి పరిమితమైంది. దక్షిణాసియాలో ఇదే అత్యల్ప ర్యాంకు. అటు ‘బ్రిక్స్‌’ దేశాల్లోనూ ఇండియాదే కడగొట్టు స్థానం! అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు లేని(వేస్టింగ్‌)వారు ప్రపంచంలోనే అత్యధికంగా 20.8శాతం మేర భారత్‌లో పోగుపడ్డారు. వయసుకు తగిన ఎత్తులేని (స్టంటింగ్‌) వారిక్కడ 37.9శాతమంటున్న క్షుద్బాధాసూచీ తీవ్ర ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఆరు మాసాల నుంచి 23 నెలలలోపు వయసు పసికందుల్లో 90శాతానికిపైగా సమతుల ఆహారానికి నోచుకోవడం లేదన్న యథార్థం, సమస్య మూలాల్ని స్పృశించేదే. పౌష్టికాహార-ఎదుగుదల లోపాలు, అయిదు సంవత్సరాల్లోపు శిశువుల మరణాలు తదితరాల ప్రాతిపదికన మదింపు వేసే ఆకలి సూచీలో భారత్‌ స్థానం తెగ్గోసుకుపోతుండటం దుర్భర వేదనామయ స్థితిగతుల్ని కళ్లకు కడుతోంది. అయిదేళ్లక్రితం 76దేశాల్లో 55వ స్థానాన నిలిచిన ఇండియా నేడింతగా వెలాతెలాపోవడం- పేదరికంపైన లక్షిత పోరు ఎంతగా చతికిలపడిందీ నిర్ధారిస్తోంది. పసికడుపుల ఆకలి తీరనప్పుడు పోషకాహార లోపాలు కమ్ముకుంటాయి. సరైన ఎదుగుదల లేనివారు చదువు కుంటువడి ఉపాధి వేటలో కుంగుబాటుకు గురైతే దెబ్బతినేది ఆ అభాగ్యుల భవిష్యత్తు ఒక్కటే కాదు; జాతి ప్రగతి మహాభారతంలోని కర్ణుడి రథచక్రమై దేశార్థికాన్నీ క్షీణింపజేస్తుంది!

మహిళ గర్భం దాల్చింది మొదలు వెయ్యి రోజుల వ్యవధిలో శిశువుల మెదడు 90శాతం మేర వికాస దశకు నోచుకుంటుందన్న అధ్యయనాలు- అటు చూలింతలు, ఇటు పసిబిడ్డల సంరక్షణ ఎంత కీలకమో చాటుతున్నాయి. ‘సమీకృత శిశు అభివృద్ధి పథకం’ (ఐసీడీఎస్‌) పేరిట ప్రపంచంలోనే అత్యంత భారీ మాతాశిశు పోషకాహార యోజన 1975 లగాయతు అమలవుతున్న దేశం మనది. తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని ప్రజానీకానికి సరసమైన ధరలకు అందించడమే లక్ష్యమంటూ మూడేళ్ల క్రితం జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పట్టాలకు ఎక్కించారు. దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలెన్ని పుట్టుకొచ్చాయో లెక్కేలేదు. వాటి రూపకల్పన, కార్యాచరణల్లో మౌలిక లోటుపాట్లు, అవినీతి, అవకతవకల మూలాన వేల కోట్ల రూపాయల మేర ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైందని వివిధ సూచీలు నిగ్గుతేలుస్తున్నాయి! 1997నాటికి బంగ్లాదేశ్‌లో వయసుకు తగ్గ ఎత్తులేని పిల్లల శాతం అధికంగా నమోదయ్యేది. దాన్ని గణనీయంగా కట్టడి చేయడంలో భాగంగా తల్లులకు చదువు చెప్పడం, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యాలకు పెద్దపీట వేయడం- బంగ్లా ముఖచిత్రాన్నే మార్చేసింది. పోషకాహార పథకాలు, బాలింతలు చూలింతలు నవజాత శిశువుల ఆరోగ్యంపట్ల కనబరచిన ప్రత్యేక శ్రద్ధే నేపాల్‌లో గుణాత్మక పరివర్తనకు దోహదపడింది. ఇక్కడికన్నా ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిన చిన్నా చితకా దేశాలూ సత్ఫలితాలు రాబడుతుండగా, భూరి వ్యయంతో చేపట్టిన విస్తృత స్థాయి ప్రణాళికలు దేశీయంగా ఎందుకు నీరుకారుతున్నట్లు? ఆరోగ్య పద్దు కింద పేలవ రికార్డు కారణంగానే అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో ఇండియా మూడేళ్ల వ్యవధిలోనే ముప్ఫై స్థానాలు కిందకు జారిపోయింది. ఈ దురవస్థను చెదరగొట్టేలా కర్తవ్య నిర్వహణ బాధ్యతను ప్రజాప్రభుత్వాలు చురుగ్గా అందిపుచ్చుకోవాలి!

విశ్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనత మనదేనని మూడు నెలలనాటి ఆర్థిక సర్వే ధీమాగా ప్రకటించింది. దేశదేశాల్ని ఆవరిస్తున్న మాంద్యం మూలాన ప్రగతి అంచనాల జోరు కొంత తగ్గినా- ఆరుశాతం అంతకుమించిన వృద్ధిరేటు సాధన బరిలో ఇప్పటికీ ముందున్నవి భారత్‌, చైనాలే! 2020తో పేదరికానికి చరమగీతం పాడేస్తామంటున్న జన చైనా- ప్రతి పౌరుణ్నీ సమర్థ నిపుణ మానవ వనరుగా మలచే వ్యూహాలకు విశేష ప్రాముఖ్యమిస్తోంది. వృద్ధిరేటు కొంత సడలినా దేశంనుంచి దారిద్య్రాన్ని తరిమికొట్టాలన్న పట్టుదల బీజింగ్‌లో ప్రస్ఫుటమవుతోంది. పౌరుల స్వస్థతే జాతికి మహాభాగ్యమన్న వివేచనతో స్విట్జర్లాండ్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా వంటివి ప్రపంచ ఆరోగ్య ర్యాంకుల్లో తొలి వరస స్థానాలకు పోటీపడుతున్నాయి. 2022-23 నాటికి రెండంకెల వార్షిక వృద్ధిరేటు సాధించడమే లక్ష్యమని ‘నీతి ఆయోగ్‌’ ఘనంగా చాటిన చోట- పోషకాహార లోపాలు, శిశుమరణాలు, నాసి చదువులు, అంటురోగాలు అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి! సామాన్యులు ఆరోగ్యంగా ప్రశాంతంగా బతకడానికి అనువైన వాతావరణం ఎండమావిని తలపిస్తున్నప్పుడు- వృద్ధిరేటు గొప్పలు ఎవరికోసం? ఇండియాలోని ఒక్కశాతం అపర కుబేరుల చెంత అపార సంపద కళ్లు జిగేల్మనిపిస్తోందని, ఒక్క ఏడాదిలోనే వారి ఆస్తిపాస్తులు రూ.20 లక్షల కోట్లకుపైగా విస్తరించాయన్న కథనాలు ఆ మధ్య వెలుగు చూశాయి. దేశ సంపన్నత, వృద్ధిరేటు వంటివి సామాన్యులకు ఏమాత్రం కొరుకుడుపడని పదజాలం. దేశ సుస్థిరాభివృద్ధి అన్నది పౌరుల జీవన ప్రమాణాలూ ఆరోగ్య సేవల మెరుగుదలలో, నాణ్యమైన విద్యలో ప్రతిఫలించాలి. అంగన్‌వాడీ కేంద్రాల పరిపుష్టీకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థకు మూలకణ చికిత్స, విద్య వైద్య ఆరోగ్య వ్యవస్థల సమగ్ర క్షాళన- ఇవే, జాతి నిర్మాణ క్రతువును పునరుత్తేజపరచగలిగేది; దేశానికి అంతర్జాతీయంగా గౌరవ మర్యాదల్ని పెంపొందించగలిగేది!


Posted on 18-10-2019