Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

దిగుమతులతో దైన్యం

* పరిశోధనలు, నవకల్పనలపై నిర్లిప్తత

ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్‌ ప్రస్థానం ఆశించిన స్థాయిలో లేదు. ఇటీవలి అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) ర్యాంకుల్లో భారతావని 68వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదేమీ ఊహించని విషయం కాదు. నవకల్పనలు, ఆవిష్కరణల్ని పెంచి పోషించే దిశగా- ప్రభుత్వం, అధికార వ్యవస్థ, పారిశ్రామిక రంగం, పరిశోధక సంస్థల నుంచి పెద్దగా కృషి లేకపోవడం ఈ పరిస్థితికి కారణం.

స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు గడచినా- మనవైన ఉత్పత్తులు, ఆవిష్కరణలంటూ చెప్పుకొనేవి వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉన్నాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా వంటివన్నీ నినాదాలకే పరిమితమయ్యాయి. జీసీఐ వంటి సూచీల ర్యాంకుల్లో కిందికి జారిపోవడానికి ఇలాంటి అంశాలన్నీ కారణంగా నిలిచాయి. అంతర్జాతీయ నవకల్పనల సూచీ (జీఐఐ)లో సైతం మన దేశ పరిస్థితి దిగజారింది. పారిశ్రామిక రంగం ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తూ లేదా పొరుగుసేవలపై భారం వేస్తూ ఎప్పుడూ, ఓ సౌకర్యవంతమైన స్థితిలోనే ఉండాలని కోరుకుంటుంది. అరుదుగా మాత్రమే నవకల్పనల వైపు మొగ్గు చూపేందుకు యత్నిస్తుంటుంది. ఈ జాడ్యం పరిశోధన, అభివృద్ధి రంగాలకు సైతం వ్యాపించడం ఆవేదన కలిగిస్తోంది.

నవకల్పనల్లో అసమర్థత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. దిగుమతులకు ప్రత్యామ్నాయాల్ని సాధించలేని కారణంగా దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పర్యవసానంగా దిగుమతుల కోసం పెద్దయెత్తున వ్యయం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఏటికేడాది దిగుమతుల విలువ పెరుగుతూనే ఉంది. దిగుమతులు 2016లో సుమారు రూ.25 లక్షల కోట్ల నుంచి 2018 నాటికి సుమారు రూ.36 లక్షల కోట్లకు చేరాయి. భారత్‌ దిగుమతులకు చైనాయే అతిపెద్ద వనరు. ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా ఎలాంటి తేడాలు నెలకొన్నా, మన మార్కెట్లలో చైనా బ్రాండ్ల ఉనికిపై ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తూనే ఉంటుంది. రెండుదేశాల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నా, కఠినంగా ఉన్నా చైనా వస్తువులపట్ల మోజు మాత్రం తగ్గదు. ఇందులో సాధారణ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్లు మొదలు సంక్లిష్టమైన యంత్రాలు, పరికరాల వరకు మన మార్కెట్‌ను శాసిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- చైనా దిగుమతుల్లో ప్రతి భారతీయుడికి రూ.4 వేల విలువైన వస్తువులుంటాయనేది ఓ అంచనా. భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా 2018-19లో సుమారు రూ.4.5 లక్షల కోట్లు(12.5 శాతం)గా నమోదైంది. మనదేశానికి చైనా చేసే ఎగుమతుల్లో- విద్యుత్‌ యంత్రాలు, యంత్ర ఉపకరణాలు, సేంద్రియ రసాయనాలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, ఉపకరణాలు, వాహనాల విడిభాగాలు తదితర వస్తువులదే ప్రధాన భాగం. వీటి విలువ సుమారు రూ.3.7 లక్షల కోట్లుగా ఉంటుంది. వీటికి అదనంగా 2018-19లో సుమారు రూ.21 వేల కోట్ల దిగుమతుల్లో టెలికమ్యూనికేషన్‌ ఉపకరణాలు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, వాటికి సంబంధించిన అనుబంధ సామగ్రి ఉన్నాయి.

దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం దేశ ఆర్థికాభివృద్ధికి శాపంగా మారడమే కాకుండా, ఆర్థిక అవకాశాలపై ఒత్తిడి, భారం పెరిగింది. నవకల్పనలు, సరికొత్త వస్తు శ్రేణిని పెంచని ఫలితంగా- భారత ఎగుమతులు వాణిజ్య సమతౌల్య సాధనలో విఫలమయ్యాయి. ఎగుమతుల మదింపు ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. దీనివల్లే 2014 నుంచి 2018 మధ్య ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా 1.7 శాతంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచానికి భారత్‌ మొత్తం ఎగుమతులు సుమారు రూ.22 లక్షల కోట్లు కాగా, 2018లో మొత్తం సుమారు రూ.36 లక్షల కోట్లు దిగుమతులు ఉండటంతో, దాదాపు రూ.14 లక్షల కోట్ల వాణిజ్య లోటు తేలుతోంది. చైనాకు భారత ఎగుమతుల విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలు ఉంటుంది. ఫలితంగా చైనా-భారత్‌ వాణిజ్య లోటు ఏకంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఉంది.

భారీ వాణిజ్య లోటు అంచనాలకు తోడు అన్ని రంగాల్లో ఎగుమతులు నిలిచిపోవడం, దిగుమతులు పెరిగిపోతుండటం వంటివి- పరిశోధన, నవకల్పనలు, ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే అంశాల్లో భారత్‌ లోపాల్ని ఎత్తిచూపుతున్నాయి. దేశ అవసరాలను తీర్చడంతోపాటు, ప్రపంచస్థాయిలో పోటీ పడగలిగే, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించాల్సి ఉంది. భారత్‌ ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న ఔషధ రంగం తప్పించి, ఇతర ఉత్పత్తి రంగాలు- నాణ్యత, పనితీరు, ఉత్పాదకత, మార్కెటింగ్‌ సామర్థ్యం వంటి అంశాల్లో వెనకబడిఉంది. పోటీతత్వం, నవకల్పనల సంస్కృతి లోపించడం వంటి సమస్యల్ని- ఉత్పత్తి ప్రమాణాల్లో మార్పులు తీసుకురాని పరిశ్రమ యజమానులకు ఆపాదించడం పరిపాటిగా మారింది. పరిశోధన, నవకల్పనలను ప్రోత్సహించడంలో మందకొడిగా వ్యవహరించే ప్రభుత్వాలే ఇలాంటి రుగ్మతలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిశోధన, అభివృద్ధి కోసం జరుగుతున్న వ్యయం కేవలం ఒక శాతంగా ఉండటం గమనార్హం. జపాన్‌, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు నవకల్పనలు, పోటీతత్వ సూచీలో, ఎగుమతుల జాబితాలో ఉన్నత స్థానాల్లో నిలిచాయంటే- పరిశోధన, అభివృద్ధి రంగాలకు అవి ఇచ్చే ప్రాధాన్యమే కారణం. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించి, ఎగుమతుల్ని పెంచగలగాలి. లోపాలపై ఆత్మవిమర్శ చేసుకుంటూ, నిర్దిష్టంగా రంగాలవారీగా పరిశోధన, అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, తగినన్ని నిధుల్ని సమకూర్చాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది!

- సత్యపాల్‌ మేనన్‌
Posted on 18-10-2019