Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ముద్రలో తడబాటు

* నిర్దేశిత లక్ష్యాలకు ఆమడ దూరం

‘సూక్ష్మ, కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉపాధి కల్పనలో భారీ పరిశ్రమల కంటే ఇవి ముందున్నాయి. వాటికి చేయూతనివ్వడం ప్రభుత్వాల బాధ్యత. చిన్న సహాయంతో చిరువ్యాపారాలు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా నిరుద్యోగులకు మేలు కలుగుతుంది. వారి తపన, నిజాయతీ, శ్రమకు కొంత మూలధనం తోడయితే అద్భుత విజయాలను సాధిస్తారు...’- 2015 ఏప్రిల్‌ 8న దిల్లీలో ‘ముద్ర’ యోజన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.

సూక్ష్మ, కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు రుణసాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ముద్ర’ పథకం నాలుగున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఆశించిన లక్ష్యం మాత్రం ఇంకా ఆమడ దూరంలోనే ఉంది. పథకం అమలులో అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపం, కాలానుగుణంగా పథకంలో చోటుచేసుకోని మార్పులు- ఇందుకు ప్రధాన కారణాలు.

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. స్వయం ఉపాధి ఒక్కటే దీనికి ప్రత్యామ్నాయ మార్గం. సూక్ష్మ, కుటీర పరిశ్రమల రంగం ఉపాధి కల్పనకు కీలకంగా ఉంది. భారీ పరిశ్రమల ద్వారా సుమారు 1.25 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా, చిన్న పరిశ్రమల్లో దాదాపు 12 కోట్ల మంది పనిచేస్తున్నారు. చిన్న పరిశ్రమల్లో రూ.17వేల పెట్టుబడికి ఒక ఉద్యోగం లభిస్తుందని అంచనా. స్వయం ఉపాధి కింద పరిశ్రమను, దుకాణాన్ని ప్రారంభించాలంటే మూలధనం సమస్యగా మారింది. ఔత్సాహికులకు బ్యాంకులు నేరుగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆస్తుల తనఖాలు, పూచీకత్తులు ఉంటేనే అవి వారి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. ప్రభుత్వపరంగా రుణాలు లభించకపోవడంతో నిరుద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను, రుణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. స్వయం ఉపాధి సంస్థల్లో 48 శాతం ప్రైవేటు రుణాలతోనే నడుస్తున్నాయి. చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో 96 శాతం వార్షిక ఆదాయం కోటి రూపాయల కన్నా తక్కువే.

బ్యాంకులే మూలాధారం
చిన్న పరిశ్రమల అవసరాలు, వాటికి ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలపై ప్రధాని మోదీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమస్యలను దగ్గరగా చూశారు. ఆ రాష్ట్రంలో గాలిపటాల తయారీ చిన్న పరిశ్రమగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చిరుసాయం అందించగా దాని వ్యాపార పరిమాణం తరవాత రూ.35 కోట్లకు చేరింది. ఇలాంటి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రధాని అయ్యాక చిన్నతరహా పారిశ్రామిక వేత్తలు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు ‘ముద్ర’ (మైక్రో యూనిట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ) యోజనను ప్రారంభించారు. ఆర్థిక అవకాశాలు కల్పించడం, పూచీకత్తు, ప్రాసెసింగు రుసుములు లేకుండా తక్కువ వడ్డీకి రుణ సాయం అందించడం ఈ పథకం లక్ష్యాలు. ఇందులో భాగంగా మూడు రకాల రుణాలు ఇవ్వాలి. శిశు విభాగంలో రూ.50వేల వరకు, కిశోర విభాగంలో రూ.50వేల నుంచి అయిదు లక్షల వరకు, తరుణ విభాగంలో అయిదు లక్షల రూపాయల నుంచి రూ.10లక్షల వరకు రుణం అందించాలి. ఈ పథకానికి ఆర్థికంగా పూర్తిగా వాణిజ్య బ్యాంకులే మూలాధారంగా ఉన్నాయి. కేంద్రం మరో ప్రత్నామ్యాయం గురించి ఆలోచించలేదు.

‘ముద్ర’ ప్రారంభమైన 2015 ఏప్రిల్‌ నుంచి 2017 డిసెంబరు వరకు నిర్వహించిన సర్వే ప్రకారం మంజూరైన రుణాల మొత్తం రూ.5.57 లక్షల కోట్లు. దీని వల్ల ఉపాధి పొందినవారి సంఖ్య 1.12 కోట్లు. ఇందులో 51.06 లక్షల మంది లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి లబ్ధిదారుల్లో 40 శాతం మహిళా పారిశ్రామికవేత్తలు, 33 శాతం ఇతరులు ఉన్నారు.

ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి ఇబ్బందులు పడుతున్నవారికి మొదట్లో ‘ముద్ర’ పథకం ఆసరాగా నిలిచింది. దీంతో నిరుద్యోగులు, చిరువ్యాపారుల్లో ఆశలు రేకెత్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్యలు వెలుగు చూశాయి. రుణాల పంపిణీకి సమీక్ష విధానం లేకపోవడం, బ్యాంకుల వెనకడుగు తదితర కారణాలతో మందగమనం మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు పంపిణీ అయిన రుణాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ అభిప్రాయం కలగక మానదు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా రుణాల మంజూరు జరగడంలేదు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదు. ఇది కేంద్రం, బ్యాంకుల మధ్య వ్యవహారంగా మారిపోయింది. తమిళనాడు 2.55 కోట్ల మంది (జనాభాలో 33.14 శాతం)తో మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక 2.07 కోట్ల మందికి రుణ వితరణ (31.05 శాతం)తో రెండో స్థానంలో నిలిచింది. జమ్ము- కశ్మీర్‌లో 4.52 లక్షల మందికి అంటే 3.29 శాతానికే రుణాలు అందాయి. దేశవ్యాప్తంగా ఇది అట్టడుగు స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.78 కోట్లు (7.63శాతం) మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. ప్రధాని సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో 61.41 లక్షల (9.48 శాతం) మందికి రుణ అవకాశం లభించింది. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం, కేరళ, పశ్చిమ్‌బంగ రాష్ట్రాల్లో 20 శాతం కంటే తక్కువ రుణాలు మంజూరు అయ్యాయి. చిన్న రాష్ట్రమైన త్రిపురలో 12.75 లక్షల మంది (31.02 శాతం) లబ్ధి పొందారు.

తెలుగు రాష్ట్రాల్లో తీరిదీ...
‘ముద్ర’ పథకం అమలులో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. రుణాల పంపిణీ జాబితాలో ఇవి చివరి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు రుణాలు సక్రమంగా అందలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 32,13,410 (6.01 శాతం), తెలంగాణలో 28,86,210 (7.42 శాతం) మంది లబ్ధిదారులకు మాత్రమే రుణాలు అందాయి. ఉభయ రాష్ట్రాల్లోని 25 లక్షల చేనేత కార్మికులకు రుణాలు ఇవ్వాలని ఆయా సంఘాలు కేంద్రాన్ని కోరినా ఫలితం లేదు. బ్యాంకులు రుణాల మంజూరుకు ఆసక్తి చూపడం లేదు.

సమస్యలు, సవాళ్ళు
‘ముద్ర’ రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంకుల నుంచి అంతగా సానుకూలత లభించడంలేదు. రుణ వితరణలో అవి ఉదారంగా వ్యవహరించడం లేదు. నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని బ్యాంకులు పూచీకత్తులు అడుగుతున్నాయి. పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం లేకపోవడం వల్ల పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ వంటి సహకారం లభించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు రుణాలు పొందడం కష్టతరమవుతోంది. కొన్ని చోట్ల దరఖాస్తుదారులు ఎలాంటి వ్యాపార ప్రణాళిక లేకుండా నేరుగా రుణాల కోసం వస్తున్నారని బ్యాంకులు చెబుతున్నాయి. తాజాగా బ్యాంకుల విలీన నిర్ణయం ఈ పథకాన్ని ప్రభావితం చేయనుంది. పథకానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో ఆర్‌బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇది బ్యాంకులపై ప్రభావం చూపింది. రుణాలు పొందిన వారిలో 10 శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల అవి నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మిగిలిపోతున్నాయి. రుణాలకు పూచీకత్తుగా కేంద్రం చిన్న పరిశ్రమలకు రుణ పరపతి నిధి (క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌)ని ఏర్పాటు చేసినా బ్యాంకులకు అది లాభదాయకంగా లేదు. దీంతో బ్యాంకులు కొత్తగా రుణాల మంజూరుకు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా చిరువ్యాపారులు, నిరుద్యోగులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం అనివార్యమవుతోంది.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణ సాయాన్ని అభివృద్ధి సాధనంగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుంది. రుణ పరిమితి తక్కువగా ఉన్నందువల్ల పరిశ్రమల స్థాపన, వ్యాపారాల నిర్వహణకు ఆశించిన ఊతం లభించడం లేదు. అందువల్ల రుణ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది. రుణాలను తిరిగి చెల్లించే విషయమై లబ్ధిదారుల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించాలి. సూక్ష్మ, కుటీర పరిశ్రమల వారికి, చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఆసరాగా ఉన్న ఈ పథకం సక్రమంగా అమలైతే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులు ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది!


- ఆకారపు మల్లేశం
Posted on 18-10-2019