Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

దిగుమతులతో అసలుకే ఎసరు

* ఆర్‌సీఈపీ కూటమిలో చేరితే రైతులకు చేటు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) కూటమిలోని 15 సభ్యదేశాల అధినేతలు నవంబరు నాలుగున బ్యాంకాక్‌లో సమావేశం కానున్నారు. 16వ సభ్యదేశంగా భారత్‌ ఈ కూటమిలో చేరాలా వద్దా అనేది ఆలోపే తేల్చుకోవలసి ఉంది. ఆర్‌సీఈపీలో 10 ఆగ్నేయాసియా దేశాల సంఘ సభ్యులు (బ్రూనై, కంబోడియా, ఇండొనేసియా, లావోస్‌, మలేసియా, మియన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం)లతోపాటు చైనా, భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియాలు భాగస్వాములుగా ఉన్నాయి.

భారత్‌ కనుక ఆర్‌సీఈపీలో చేరితే ఇతర సభ్య దేశాల నుంచి దిగుమతయ్యే సరకుల్లో 74-90 శాతంపై సుంకాలు తగ్గించాల్సి వస్తుంది. కొన్నింటిపై తొలగించాల్సి ఉంటుంది కూడా. ఆ పని చేస్తే ఆర్‌సీఈపీ దేశాల నుంచి భారత్‌కు పాలు, పాల ఉత్పత్తులు, సమాచార, కమ్యూనికేషన్‌ (ఐసీటీ) వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌, లోహాలు, రసాయనాలు చౌకగా వెల్లువెత్తి, స్వదేశీ పరిశ్రమలు దెబ్బతింటాయి. కాబట్టి, ఈ వస్తువులపై సుంకాలు తగ్గించడానికి అంగీకరించవద్దని రైతులు, పరిశ్రమాధిపతులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌సీఈపీ వంటి స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు రైతులు, రైతు కూలీలు, గ్రామీణ మహిళలు, యువతీయువకులు, గిరిజనుల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని అఖిల భారత రైతు ఉద్యమాల సమన్వయ సంఘం (ఐసీసీఎఫ్‌ఎం) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 13 రాష్ట్రాలకు చెందిన 40 రైతు సంఘాలు రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ (ఆర్‌కేఎమ్‌ఎస్‌) ఛత్రం కింద ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలకు సమాయత్తమైంది.

వ్యవసాయరంగానికి హాని
ఆర్‌సీఈపీ పరిధి నుంచి వ్యవసాయాన్ని మినహాయించాలని రైతు నాయకులు ప్రధానమంత్రిని కోరుతున్నారు. ఈ కూటమిలో చేరితే ఇతర సభ్య దేశాల నుంచి కారుచౌక వ్యవసాయ, పాడి ఉత్పత్తులు భారత్‌లోకి ప్రవహించి, మన వ్యవసాయం సర్వనాశనమైపోతుందని హెచ్చరిస్తున్నారు. 2018-19 నాటికే భారత్‌కు చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి 11 ఆర్‌సీఈపీ దేశాలతో భారీ వాణిజ్యలోటు ఉంది. అది మరింత కట్టుతప్పి స్వదేశీ వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతింటాయని అనుమానాలు, ఆందోళనలు రేగుతున్నాయి. ఈ సంకోచాలను, సందేహాలను తొలగించుకోవడానికి భారతదేశానికి అక్టోబరు 24 వరకు వ్యవధి ఉంది. జపాన్‌, దక్షిణ కొరియాలతో భారత్‌కు ఇప్పటికే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఆర్‌సీఈపీ అనేది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ). అందులో భారత్‌ చేరగానే చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కొత్త ఎఫ్‌టీఏ భాగస్వాములవుతాయి. చైనా నుంచి కారుచౌకగా పారిశ్రామిక, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కమ్యూనికేషన్‌ సామగ్రి వచ్చిపడితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు వరద గేట్లు ఎత్తేసినట్లవుతుంది. దీనివల్ల ఎనిమిది కోట్ల భారతీయ పాడి రైతులు రోడ్డున పడతారని ఆందోళన రేగుతోంది. భారత్‌లో పాల కొరత ఉందని, ఇక్కడి ప్రజలు కలుషితమైన పాలు తాగుతున్నారని తప్పుడు వార్తలు వ్యాపింపజేయడం ద్వారా విదేశీ పాడి ఉత్పత్తులకు మార్గం సుగమం చేయాలని చూస్తున్నారని రైతు నాయకులు ఆరోపించారు. కానీ, 2033కల్లా భారత్‌లో పాల ఉత్పత్తి 33 కోట్ల టన్నులు కానుండగా, గిరాకీ మాత్రం 29.2 కోట్ల టన్నులకే ఉంటుందని నీతి ఆయోగ్‌ నివేదించింది. అంటే పాల ఉత్పత్తిలో భారత్‌ మిగులు సాధిస్తుందన్నమాట. ఆసియాలో అతి పెద్ద వ్యావసాయిక బ్రాండ్‌ అయిన అమూల్‌ ప్రారంభించిన క్షీర విప్లవం నేడు భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి పాలఉత్పత్తిదారుగా నిలుపుతోంది. భారత్‌ వార్షిక వ్యవసాయోత్పత్తుల విలువ రూ.28 లక్షల కోట్లయితే అందులో నాలుగోవంతు ఏడు లక్షల కోట్ల రూపాయలు పాడి పరిశ్రమ ద్వారానే లభిస్తోంది. 1973లో భారత్‌లో రోజుకు 110 గ్రాములుగా ఉన్న తలసరి పాల వినియోగం క్షీర విప్లవం చలవతో నేడు 369 గ్రాములకు పెరిగింది.

ఆర్‌సీఈపీలో భారత్‌ చేరినట్లయితే న్యూజిలాండ్‌ నుంచి పాల తుపాను కమ్ముకొస్తుంది. న్యూజిలాండ్‌ జనాభా అతి స్వల్పం, పాల ఉత్పత్తి అత్యధికం. అందువల్ల ఆ దేశం పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మేటి. న్యూజిలాండ్‌ పాడి ఉత్పత్తుల్లో 93 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు భారతదేశ పాడి ఉత్పత్తుల్లో అత్యధికం స్థానికంగానే వినియోగమవుతోంది. మన జనాభా అధికం కావడం దీనికి ప్రధాన కారణం. 2033 వచ్చేసరికి పాల ఉత్పత్తిలో మిగులు సాధించనున్న భారత్‌ ఇప్పటి నుంచే కొంత పరిమాణాన్ని ఎగుమతి చేయనారంభించింది. ఈ స్థితిలో ఆర్‌సీఈపీ చర్చల్లో న్యూజిలాండ్‌ చేస్తున్న ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చర్చల్లో న్యూజిలాండ్‌ విలువ జోడించిన పాల ఉత్పత్తుల్లో అయిదు శాతాన్ని భారత్‌కు ఎగుమతి చేస్తానని ప్రతిపాదించింది. భారతీయ అధికారులకు ఈ ప్రతిపాదనలో హాని ఏదీ కనిపించలేదు. లోతులకు వెళ్తేకానీ అసలు విషయం తెలియదు. పాల దిగుబడి బాగా పెరిగిపోయినప్పుడు మిగులు పాలకు విలువ జోడించి పాల ఉత్పత్తులుగా తయారుచేయడం జరుగుతుంది. పాలను పాల పొడిగా, చీజ్‌, పన్నీర్‌లుగా మార్చే ప్రక్రియ ఇలాంటిదే. మిగులు పాలను ఈ విధంగా మార్చినప్పుడు ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు.

స్వావలంబనకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్‌ నుంచి పాల ఉత్పత్తులు వెల్లువెత్తితే, భారతీయ పాల ఉత్పత్తులకు గిరాకీ పడిపోతుంది. మన మిగులు పాలను పాల పొడిగా, పన్నీర్‌గా మార్చే వీలులేక పారబోసుకోవలసి వస్తుంది. దాంతో మన రైతులు తీవ్రంగా నష్టపోతారు. క్రమంగా పాల ఉత్పత్తిని తగ్గించుకొంటారు. అది పాడి పరిశ్రమలో ప్రస్తుతం భారత్‌ సాధించిన స్వావలంబనను దెబ్బతీస్తుంది. మన రైతుల దిగుబడి, ఆదాయాలు పడిపోయి, మళ్ళీ విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యం దాపురిస్తుంది. ఏతావతా న్యూజిలాండ్‌ ప్రతిపాదన ఆమోదిస్తే భారతదేశం ఏటా రూ.3.5 లక్షల కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తుంది. భారత్‌లో పాడి రైతుల సంఖ్య 15 కోట్లయితే, న్యూజిలాండ్‌లో కేవలం 12,000, ఆస్ట్రేలియాలో మరీ తక్కువగా 6,300. ఏటా 15.6 కోట్ల టన్నుల పాల ఉత్పత్తితో భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలుస్తున్నా, అందులో అత్యధికం స్వదేశంలోనే వినియోగమవుతోంది. ఎగుమతి అయ్యేది చాలా చాలా స్వల్పం. అదే ఏటా 2.2 కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేస్తున్న న్యూజిలాండ్‌, అందులో 1.9 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియా 1.5 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తూ 40 లక్షల టన్నులు ఎగుమతి చేస్తోంది. ఈ రెండు దేశాల వద్ద పోగుపడుతున్న అపార పాల ఉత్పత్తులను ఆర్‌సీఈపీ సభ్యదేశాల్లో గుమ్మరించే అవకాశముంది. ఆర్‌సీఈపీ కింద ఈ ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తే అమూల్‌ వంటి సహకార సంఘాలు, కోట్లాది పాడి రైతులు బజారున పడే ప్రమాదం ఉంది. ఆర్‌సీఈపీలో చేరే ముందు భారత్‌ తన రైతుల ప్రయోజనాల రక్షణకు గట్టి హామీలు పొందాలి. ఆర్‌సీఈపీలో చేరే విషయమై భారత్‌ ఆరేళ్ల నుంచి చర్చల్లో పాల్గొంటున్నా, ఈ ఒప్పందంపై ఇంతవరకు పార్లమెంటులో చర్చించనే లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్‌సీఈపీ చర్చల్లో పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి వస్తోంది. దీనిపై హామీలిచ్చేముందు పార్లమెంటు అనుమతి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భారత్‌లో పదేళ్లలో పశు గ్రాసానికి, నీటికీ కొరత ఏర్పడి పాల ఉత్పత్తి పడిపోతుందని కొన్ని ఆర్‌సీఈపీ దేశాలు తప్పుడు అంచనాలు వెలువరిస్తున్నాయి. వీటిని నమ్మకుండా సొంత రైతుల ప్రయోజనాల రక్షణకు భారత్‌ కట్టుబడి ఉండాలి.

సమాచార, కమ్యూనికేషన్‌ రంగానికి (ఐసీటీ) సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను కారుచౌకగా ఎగుమతి చేస్తూ చైనా తమ పరిశ్రమలను దెబ్బతీస్తోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చైనా ఈ విమర్శల బారి నుంచి తప్పించుకోవడానికి వియత్నాం, హాంకాంగ్‌, మలేసియా వంటి దేశాల గుండా ఐసీటీ పరికరాలను ఎగుమతి చేస్తోంది. భారత్‌ ఈ విషయం గుర్తుపెట్టుకుని ఆర్‌సీఈపీ చర్చల్లో తగు రక్షణలు పొందాలి. మున్ముందు డిజిటల్‌ ఇండియా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ యుగం వస్తోంది కాబట్టి, మనకు ఐసీటీ పరికరాల అవసరం ఎన్నెన్నో రెట్లు పెరిగిపోతుంది. దాన్ని తీర్చుకోవడానికి చైనా మీద అతిగా ఆధారపడితే మన స్వదేశీ ఉత్పత్తి సత్తా దెబ్బతినిపోతుంది. ఈ పరికరాలను స్వదేశీ పరిశ్రమలే అధికంగా ఉత్పత్తి చేయాల్సి ఉంది. 2022కల్లా ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులను నిలిపేయాలని లక్షిస్తున్న భారత్‌, తన పరిశ్రమలను కాపాడుకోవాలి. ఆర్‌సీఈపీ వల్ల మన వ్యవసాయం, పాడి, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

శ్రీలంక చేదు అనుభవాలు
పాల ఉత్పత్తుల విదేశీ దిగుమతుల విషయంలో శ్రీలంక నష్టాల నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలి. 1977లో స్వేచ్ఛా విపణికి మళ్లక ముందు శ్రీలంక తన పాడి అవసరాల్లో 80 శాతాన్ని స్వదేశీ ఉత్పత్తితోనే తీర్చుకునేది. 2018కి వచ్చేసరికి అది 40 శాతానికి పడిపోయింది. దీంతో 40 కోట్ల డాలర్లు వెచ్చించి 10 కోట్ల టన్నుల పాలపొడిని దిగుమతి చేసుకుంటే కానీ, దేశీయ అవసరాలు తీరలేదు. స్వేచ్ఛా విపణి పేరిట శ్రీలంక మొదట్లో అనేక విదేశీ సంస్థలకు ద్వారాలు తెరచింది. దానివల్ల స్వల్పకాలిక లాభాలు కలిగినా దీర్ఘకాలంలో స్వదేశీ పాడి పరిశ్రమ దెబ్బతిని పాల ఉత్పత్తుల దిగుమతికి కోట్లాది డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. రానురానూ విదేశీ ఉత్పత్తుల దెబ్బకు నిలవలేక రైతులు వేల లీటర్ల పాలను పారబోసుకోవలసి వచ్చింది. ప్రభుత్వ సంస్థ అయిన మిల్కో నష్టాల పాలైంది. ప్రపంచంలో నేడు పాలపొడిని వినియోగిస్తున్న అతి కొద్ది దేశాల్లో శ్రీలంక ఒకటి. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా దేశాల చిల్లర దుకాణాలలో పాలపొడిని అమ్మనే అమ్మరు.


Posted on 19-10-2019