Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మాంద్యానికి ఈ-కామర్స్‌ మందు!

* ఆన్‌లైన్‌ వ్యాపారంపై పడని ప్రభావం

ప్రపంచం ఎదుట ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు- ఆర్థిక మాంద్యం. దేశీయంగా అమ్మకాలు నెమ్మదించినా తొలుత పెద్దగా ఎవరి దృష్టీ పడలేదు. ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గడం ద్వారా మొదలైన మాంద్యం ప్రభావం తరవాత వాణిజ్య వాహనాలకూ పాకింది. ద్విచక్ర వాహనాలతోపాటు ఇతరత్రా దేశీయ కంపెనీల వాహన అమ్మకాలు 36 శాతందాకా తగ్గాయి. తాము అమ్మే అయిదు రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్లకు గిరాకీ తగ్గిందని పార్లే సంస్థ ప్రకటించింది. ఎలాంటి ఆర్థిక ఒడుదొడుకుల్లోనైనా వేగంగా అమ్ముడుపోయే నిత్యావసర వస్తువు(ఎఫ్‌ఎమ్‌సీజీ)ల రంగం స్థిరంగా ఉంటుందంటారు. మందగమనం ప్రభావం ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంపైనా పడటంతో మన ఆర్థిక వ్యవస్థలో ఏదో జరుగుతోందన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రజలు సైతం పరిమితంగానే నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిణామాలు దేశానికి శుభసూచకం కాదు.

విపణి సానుకూలతలు
మందగమనంలో సైతం ఒక రంగం మాత్రం చెక్కుచెదరలేదు. అదే, ఈ-కామర్స్‌ లేదా ఆన్‌లైన్‌ అమ్మకాల వ్యాపారం. ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలపై మందగమనం ప్రభావమే కనిపించలేదు. పైగా అమ్మకందారుల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ క్రమంలో కార్లు, ద్విచక్ర వాహనాలు తదితర ఉత్పత్తి రంగానికీ ఆన్‌లైన్‌ నమూనాను వర్తింపజేయడం ద్వారా మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చా అనేది పరిశీలించాల్సిన అంశం. సామాన్య ప్రజల్లోకి స్మార్ట్‌ఫోన్లు చొచ్చుకెళ్లాయి. రిలయన్స్‌ జియో ప్రవేశంతో డేటా ధరలు దిగివచ్చాయి. ఫలితంగా అంతర్జాల రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. అంతర్జాల ఆధారిత ఆర్థిక వ్యవస్థా పుంజుకొంది. 2014తో పోలిస్తే, 2018 నాటికి వైర్‌లెస్‌, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు రెట్టింపై 56.8 కోట్లకు చేరారు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం అయిదేళ్ల కాలవ్యవధిలో 56 రెట్లు పెరిగి, 4,640 కోట్ల జీబీ వినియోగానికి చేరుకుంది. ఈ స్థాయి పెరుగుదల అంతర్జాల ఆర్థిక వ్యవస్థను లాభదాయకంగా మార్చేసింది. పైగా సంప్రదాయ దుకాణాలతో పోలిస్తే, ఈ-కామర్స్‌/ఆన్‌లైన్‌ వ్యాపారంలో అందించే భారీ రాయితీలు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలు సౌకర్యంగా ఉండటంతోపాటు, విస్తృతశ్రేణిలో కొనుగోలు ఐచ్ఛికాలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల వ్యాపారాలు ఆన్‌లైన్‌లోకి ప్రవేశించాయి. కొన్ని ప్రస్తుతమున్న ఆన్‌లైన్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోగా, మరికొన్ని సొంతంగా ఆన్‌లైన్‌ విపణి వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ పరిణామాలన్నీ సంప్రదాయ వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. సంప్రదాయ వ్యాపార రంగ క్షీణతకు ఇతర కారణాలూ తోడయ్యాయి. ఉత్పత్తులపై డిస్కౌంట్లను తగ్గించడం ఇందులో ఒకటి. సాధారణ చిల్లర దుకాణాల నుంచి నెల వాయిదాలతో కొనుగోలు చేసే వినియోగదారులకు రుణాల మంజూరులో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు తాత్సారం చేస్తుండటమూ ప్రభావం చూపింది. సాధారణ రోజులతో పోలిస్తే తమ అమ్మకాలు పండగల సీజన్‌లో కనీసం 15 నుంచి 20 రెట్లు పెరుగుతాయన్నది అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అధికారులు ఇటీవల చేసిన ప్రకటనే. రాయితీలు, సులభతర చెల్లింపు విధానాల కోసం ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ వివరించారు. వాస్తవానికి ఈ-కామర్స్‌లో సైతం కొంతమేర క్షీణత కనిపించింది. ఈ రంగంలో వృద్ధిని 36 శాతందాకా విశ్లేషకులు అంచనా వేయగా, అది 27 శాతానికే పరిమితమైంది.

ఈ-కామర్స్‌లో వినియోగదారుల సమాచారం నిక్షిప్తమవుతోంది. దీంతో ఆయా సంస్థలు అమ్మకాలపై రాయితీల ప్రభావం వంటి అంశాలను విశ్లేషించుకునే అవకాశం కలుగుతోంది. ఇలాంటి ప్రత్యేకతల వల్ల ఈ-కామర్స్‌ రంగం మాంద్యంలోనూ నిలదొక్కుకుంటోంది. సంప్రదాయ రిటైల్‌ దుకాణదారులకు వినియోగదారుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన సమాచారాన్ని పసిగట్టలేక వెనకంజ వేస్తున్నాయి. ఆర్థిక మందగమనం వంటి గడ్డుకాలంలో వ్యాపారాల్ని రక్షించుకునేందుకు ఈ-కామర్స్‌ వ్యాపార నమూనాను తయారీ రంగానికి వర్తింపజేయవచ్చు. మందగమనం ప్రభావాన్ని అది ఎంతోకొంత తగ్గించగలదని భావించవచ్చు. కార్ల అమ్మకాల విషయంలో పంపిణీ వ్యవస్థకు భారీగా ఖర్చవుతోంది. దీనికితోడు అమ్మకాలు తగ్గిపోవడంతో రిటైల్‌ అమ్మకందారులు దుకాణాల నిర్వహణ అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించే విషయంలో సతమతమవుతున్నారు. దీనివల్ల కార్ల ఉత్పత్తిదారులు ఆన్‌లైన్‌ మార్కెట్‌ వైపు దృష్టి సారించవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దిగ్గజ ఆన్‌లైన్‌ సంస్థలతో ఒప్పందాలకు ముందుకురావచ్చు. పాత కార్ల క్రయవిక్రయాలకు చలామణీలో ఉన్న వ్యాపార నమూనాయే ఇది. ఇదే సూత్రాన్ని కొత్తకార్లకు వర్తింపజేయాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబా ఈ తరహా మార్కెటింగ్‌ ప్రక్రియకు జీవం పోసి, చైనా విపణిలో అమలు చేసేందుకు యత్నించింది. వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునేవారు అలీబాబా యాప్‌ ద్వారా కార్లను పరిశీలించి, అవసరమైన సమాచారం పొందవచ్చు. ఆన్‌లైన్‌ స్టోర్‌లో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. అందులో నుంచి వినియోగదారులు కారును ఎంపిక చేసుకుని, నగరంలోని షోరూమ్‌ వద్ద ‘టెస్ట్‌డ్రైవ్‌’ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న ఈ వ్యాపార నమూనా- తయారీ రంగంతోపాటు ఇతర ప్రధాన రంగాలకూ కలిసివస్తుందని భావిస్తున్నారు.

ఆర్థిక మాంద్యంలో వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడం కనిపిస్తుంది. అప్పుడు ఆదాయ సృష్టి మందగిస్తుంది. ఇలాంటి సమయాల్లో అందించే తాయిలాలు/రాయితీలు వినియోగదారుల్లో ధరలకు సంబంధించి ఆందోళనల్ని తగ్గిస్తాయి. ఖర్చు పెట్టేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. వినియోగదారుల జీవితకాల విలువ(సీఎల్‌వీ)ను ఈ-కామర్స్‌ పెంచుతుంది. కొంత కాలవ్యవధిలో వినియోగదారుల నుంచి ఎంతమేర డబ్బుల్ని తాము సముపార్జించగలమనే అంశాన్ని కంపెనీలు అర్థం చేసుకునేందుకు సీఎల్‌వీలు తోడ్పడతాయి. ఇలాంటి సీఎల్‌వీ డేటాతో కంపెనీలు వినియోగదారుల సమస్యల్ని అర్థం చేసుకొని, వారికి ప్రోత్సాహకాల్ని అందజేయడం ద్వారా కొనుగోళ్ల దిశగా ప్రోత్సహించే వీలుంటుంది.

కాలానుగుణ మార్పులు
ఎప్పటికప్పుడు మారే వినియోగదారుల ప్రవర్తనను అనుసరించి వ్యాపారాల నమూనా మార్చుకోవాలి. సంప్రదాయంగా ప్రజలు అన్నీ సొంత వస్తువులనే ఉపయోగించడం పరిపాటి. ఇప్పుడా ధోరణి మారింది. అద్దె లేదా చందా తరహా నమూనాలో వస్తువుల్ని వాడుకుంటున్నారు. ఒక వస్తువును ఇష్టమున్నంత కాలమే ఉపయోగించుకుని, అది అందించే సేవలతో సంతృప్తి చెందకపోతే మరోదానికి మారిపోవడమనే పద్ధతి ఎక్కువగా చలామణీలో ఉంది. దీనివల్ల ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులను ముందుకు తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, ఇటీవల మహీంద్ర కంపెనీ చందా ఆధారిత కారు యాజమాన్య నమూనాను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా కొత్త పద్ధతేమీ కాదు. ఇలాంటి నమూనా కెనడా, అమెరికా తదితర దేశాల్లో అమలులో ఉంది. ఫోర్డ్‌, వోల్వో తదితర కంపెనీలు దీన్ని అనుసరిస్తున్నాయి. ఇదే తరహాలో ఈ-కామర్స్‌ రంగం వాహన ఉత్పత్తిదారులకు ఉపయోగపడుతుంది. ఇది వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఇద్దరికీ ప్రయోజనం అందించే పద్ధతి. సంప్రదాయ పద్ధతుల నుంచి వాణిజ్యాన్ని ఆన్‌లైన్‌ వంటి కొత్త బాటలు పట్టించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించే అవకాశం ఉంటుంది.


- ఎం. చంద్రశేఖర్‌
Posted on 19-10-2019