Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అపనమ్మకమే అసలు సమస్య

* ఆర్థిక మందగమనం పూర్వాపరాలు

ప్రస్తుతం దేశంలో అత్యధికుల నోటి నుంచి వినిపిస్తున్న మాట- ఆర్థిక మందగమనం. వాహనాలు, బంగారం, స్థిరాస్తి... ఇలా ఏ రంగం తీసుకున్నా అమ్మకాలు తగ్గాయనే చెబుతున్నారు. వ్యవస్థలో నగదు లేదా అంటే కావాల్సినంత ఉంది. తిరిగి వసూలవుతాయో లేదో అనే సందేహంతో రుణాల మంజూరుకు బ్యాంకర్లు వెనకాడుతున్నారు. చెల్లించగలమనే విశ్వాసం కొరవడి, ధరలు తగ్గుతాయనే ఆశతో కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. గిరాకీ లేనందున సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల నిర్వాహకులు వేచి చూస్తున్నారు. అపనమ్మకం, అభద్రతాభావం, అవిశ్వాసం... వెరసి పరిస్థితి అంతకంతకూ క్లిష్టంగా మారుతోంది. వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ఠస్థాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థలు 6.1 శాతానికి, ప్రపంచబ్యాంక్‌ ఆరు శాతానికి తగ్గిస్తే, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ 5.8 శాతానికి కుదించడం ఆందోళనను పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావంతో పాటు దేశీయంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లకు ద్రవ్యలభ్యత తగ్గడం, రుణాల మంజూరు నెమ్మదించడానికి కారణమంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నందువల్ల రుణ లభ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లను విలీనం చేసి, పెద్దబ్యాంకులుగా తీర్చిదిద్దుతుండటంతో పాటు వాటికి అదనపు మూలధన సాయం చేస్తోంది. ఆర్‌బీఐ సైతం కీలక రెపో, రివర్స్‌ రెపో రేట్లు గణనీయంగా తగ్గించి, రుణరేట్లు దిగివచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ ప్రయోజనాన్ని కొంతమేరకైనా బ్యాంకులు తమ ఖాతాదారులకు వేగంగానే బదిలీ చేస్తున్నాయి. అంటే రుణాలు తీసుకునేవారికి నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం గతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. అయినా రుణ వితరణ ఎన్నడూ లేనంతగా ఒక అంకె వృద్ధి (8.8 శాతం)కి పరిమితం కావడం ఆలోచించాల్సిన అంశం. వ్యవస్థలో ద్రవ్యలభ్యత పైస్థాయు ల్లోనే నిలిచిపోవడం సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. భారీమొత్తం నగదు వినియోగం గల మౌలిక వసతుల కల్పన, స్థిరాస్తి రంగాల్లో లావాదేవీలు మందగించడం ఇందుకు నేపథ్యంగా చెప్పొచ్చు.

రుణాల మంజూరు తగ్గుదల
నిధుల సమస్య ఎదురవుతున్నందువల్ల కొన్ని రంగాలకు రుణాలు ఇవ్వడాన్ని ఆర్థిక సంస్థలు నిలిపేశాయి. బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి విపణికి రుణాల మంజూరు తగ్గింది. బ్యాంకులు సైతం వేగంగా రిటైల్‌ రుణాలు మంజూరు చేయడం లేదు. కోట్ల రూపాయల్లో ఉండే పెద్ద రుణాలతో ఇబ్బందుల వల్ల రిటైల్‌లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తయారీ సంస్థలు సైతం సామర్థ్య విస్తరణకు పెట్టుబడులు పెట్టడం లేదు. బ్యాంకులూ రుణాలు ఇవ్వడానికి దూకుడుగా రావడం లేదు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలే వేగంగా మంజూరు చేయడం లేదు. నష్టభయమే ఇందుకు కారణం. మౌలిక వసతులు, స్థిరాస్తి రంగాలకు రుణాలిచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇబ్బందులు తప్పడం లేదు. మౌలిక వసతుల రంగం పునరుత్తేజం అయితేనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ వంటి దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంకుతో పాటు ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్‌ రుణాల మంజూరులో ముందుంటున్నాయి. మిగిలిన బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల దగ్గర ఇలాంటి రుణ ఆస్తులు కొనుగోలు చేస్తుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు బ్యాంక్‌ వద్ద రుణం తీసుకుని చిరు వ్యాపారులు, చేతి పనివారు, కనీస సంపాదన గల కార్మికులకు దినసరి ఆదాయానికి పనికొచ్చే అవసరాల కోసం రుణాలిస్తుంటాయి. స్థానికులనే ఉద్యోగులుగా నియమించుకునే ఎన్‌బీఎఫ్‌సీలు రుణం తీసుకునేవారి ఆనుపానులు సులభంగా పసిగట్టగలుగుతున్నాయి. అందుకే వీటి వద్ద భద్రమైన రిటైల్‌ రుణాలను కొనుగోలు చేస్తూ, తమ రుణ విస్తృతిని బ్యాంకులు పెంచుకుంటున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఉదంతం అనంతరం ఎన్‌బీఎఫ్‌సీలకూ రుణాలివ్వడాన్ని బ్యాంకులు తగ్గించేశాయి. రెండు మూడు నెలల నుంచి పరిస్థితి కొంత మారింది. బ్యాంకులు ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలివ్వడానికి కాస్త సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన పాక్షిక హామీ పథకం ఇందుకు దోహదపడుతోంది. ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన రుణాల్లో భద్రమైనవాటిని కొనుగోలు చేసుకుని, వాటికి నిధులను బ్యాంకులు ఇస్తుంటే, ఆ నిధులను తదుపరి రుణాల కోసం ఎన్‌బీఎఫ్‌సీలు వినియోగించుకుంటున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల ఆమోదిత రుణాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరడాన్ని ‘డైరెక్ట్‌ అసెస్‌మెంట్‌’గా వ్యవహరిస్తారు. వాహన, గృహ కొనుగోళ్లకు ఇచ్చే రుణాలు, వ్యాపార రుణాలూ ఈ కోవలోకి వస్తాయి. ఉదాహరణకు ఒక ఎన్‌బీఎఫ్‌సీ వెయ్యి రుణాలిచ్చి, అందులో చెల్లింపులు బాగా ఉన్న 700 రుణాలను బ్యాంకులు కొనుగోలు చేస్తే ఇవి బ్యాంకులకూ రిటైల్‌ రుణాలుగానే నమోదవుతాయి. బ్యాంకులకు రిటైల్‌ రుణ విభాగం తక్కువగా ఉంటుంది కనుక, ఇలాంటి రుణాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ 700 రుణాలను ఒకటిగా చేసి బ్యాంకుకు విక్రయిస్తే, ఇది టోకు రుణంగా బ్యాంకుకు నమోదవుతుంది. ఇవి కోట్ల రూపాయల్లో ఉంటాయి. సెక్యూరిటైజేషన్‌ లేదా పెట్టుబడి కింద ఈ రుణాలను పరిగణిస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రుణాలూ ఈ పరిధిలోకే వస్తాయి. కానీ, వీటిల్లో పూచీకత్తు లేనివాటికి బ్యాంకులు రుణాలిచ్చే సాహసం చేయడం లేదు. అందువల్ల బ్యాంకు నిధులపైనే ఆధారపడి లావాదేవీలు నిర్వహించే ఎన్‌బీఎఫ్‌సీలూ వీటికి రుణాలివ్వడం లేదు. ఒక పూచీకత్తు లేకుండా రుణం ఇచ్చి, వసూలు చేసుకోవడంలో విఫలమైతే, ద్రవ్య లభ్యత తగ్గుతుందనే బెంగే అసలు కారణం. చాలావరకు ఎన్‌బీఎఫ్‌సీలు పూచీకత్తు లేని రుణాలు ఇవ్వడం నిలిపేశాయి. నగదు అవసరమైనప్పుడు తీసుకుని, షరతు ప్రకారం వెంటనే చెల్లిస్తుండే క్యాష్‌ క్రెడిట్‌, కాలావధి రుణాలు మాత్రమే మంజూరు చేస్తున్నాయి.

బ్యాంకుల తర్జనభర్జన
వ్యవస్థలో నగదు లభ్యత చాలా ఎక్కువగా ఉంది. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ (ఎమ్‌ఎఫ్‌)సంస్థల వద్ద నిధులున్నాయి. ఎమ్‌ఎఫ్‌లోకి కొత్తగా చేరుతున్న పెట్టుబడులూ అధికంగానే ఉంటున్నాయి. బ్యాంకులు, ఎమ్‌ఎఫ్‌లలో నిధులు ఉపసంహరిస్తే, వేరే రంగాలపై పెట్టాలి. అయితే బంగారం, స్థిరాస్తి కొనుగోళ్ల జోరు కనపడటం లేదు. అంటే డిపాజిట్ల నుంచి ఎమ్‌ఎఫ్‌లకు, ఎమ్‌ఎఫ్‌ల నుంచి డిపాజిట్లకు నిధులు మళ్ళాలి. ఇళ్లలో నగదు రూపంలో ఎక్కువగా పెట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. సరిపడా ఉన్న నగదును వాడుకోవాలంటే మౌలిక, స్థిరాస్తి రంగాలే దిక్కు. లేకపోతే అదనంగా ఉన్న నగదు చలామణీలోకి రాదు. నగదును బ్యాంకులు వృథాగా అట్టే పెట్టుకుని ఉంటే, వ్యతిరేక ప్రభావం పడుతుంది. వాటికి భారమవుతుంది. పొదుపు ఖాతాపై 3-3.5, డిపాజిట్లపై 6-7 శాతం వడ్డీ ఇస్తున్నారు. వీటిని ఎంతకాలం బ్యాంకులు అట్టిపెట్టుకుంటాయి, ఇది ఎప్పుడు వినియోగదారులకు చేరుతుందనేది ప్రశ్న. ఒక వ్యాపారం ఎలా ఉంటుందో అంచనా వేసి, దానికి రుణం ఇవ్వడమే బ్యాంకర్‌ బాధ్యత. వంద వ్యాపారాలను తీసుకుంటే, వాటిల్లో 60-70 విఫలం కావడమనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోకడే. రుణం ఇచ్చిన వ్యాపారం విఫలమైతే, బ్యాంకుపై ఒత్తిడి పడుతుంది. అందుకు బ్యాంకర్‌ను బాధ్యత వహించడమనడం సరికాదు. వ్యాపార వైఫల్యానికి మానవ తప్పిదానికి మించి ఎన్నో అంశాలు కారణమవుతుంటాయి. అందువల్ల బ్యాంకర్‌ రుణం ఇవ్వడమే మానేస్తున్నారు. ఇది అసలుకే ప్రమాదం. ఈ భయం వల్లే మొత్తం ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ భయం పోతేనే ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుంది.

కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం వాహన రంగంలో అమ్మకాలు తగ్గడానికి కారణం. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో వరదల ధాటికి రెండు నెలలుగా పనులు, కొనుగోళ్ళే లేవు. దసరా, దీపావళి సీజన్లలో దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వాహన విక్రయాలు సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయి. దసరా ముగిసి దీపావళి వస్తున్నా అమ్మకాలు సాధారణ స్థాయిలోనూ జరగడం లేదు.

ఇసుక కొరతతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడంలేదు. సిమెంటు, ఇటుక, స్టీల్‌, రంగుల విక్రయాలు తగ్గాయి. కార్మికులకు ఉపాధి లేదు. పింఛన్ల వంటివి బతకడానికే సరిపోతాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగా తగ్గాయి. దీపావళి అనంతరం పలువురు వాహనాల డీలర్లు కొనసాగడమో, వైదొలగడమే తేల్చుకునే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. ఇక బీఎస్‌-6కు మారాల్సి వస్తుంది కనుక వాహన సంస్థలు భారీ రాయితీలతో బీఎస్‌-4 వాహనాలు విక్రయిస్తాయని, జీఎస్‌టీ భారం తగ్గుతుందని ప్రజలు ఎదురు చూస్తుండటమూ కారణమే. దీపావళికీ అమ్మకాల పరిస్థితి ఇదేలా కొనసాగితే కష్టాలు మరింత పెరుగుతాయి. ప్రజలు సైతం ఆదాయంపై అభద్రతా భావంతో, ఇప్పటికి రోజులు ఇలా గడిస్తే చాలన్న భావనలో ఉండటం ఈ స్థితికి కారణంగా విశ్లేషిస్తున్నారు. కాలచక్ర పరిణామంలో సంభవించే ఈ పరిస్థితులు త్వరగా మారితేనే వృద్ధి పరుగెడుతుంది!

ఎన్‌బీఎఫ్‌సీల దగ్గర బ్యాంకులు రుణ కొనుగోలు విధానం
* 36 నెలల కాలావధి వరకు తీసుకున్న రుణాలకు మూడు నెలల పాటు వినియోగదారుడి చెల్లింపులు పరిశీలించాక...
* 60 నెలల కాలావధి రుణాలకు ఆరు నెలలు గడిచాక...
* 61-84 నెలల రుణాలను ఏడాది గడిచాక బ్యాంకులు కొనుగోలు చేస్తుంటాయి. వీటి రేటింగ్‌ ఆధారంగా తీసుకుంటాయి.


- కాకుమాను అమర్‌కుమార్‌
Posted on 22-10-2019