Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

బీదజనోద్ధరణకు కొత్త బాటలు

* అభిజిత్‌ - డఫ్లో పరిశోధనలు - ఆచరణీయ విధానాలు

పురోభివృద్ధి పథంలో పడుతూ లేస్తున్న వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులకు రోగ నిరోధక టీకాలు వేయించడం ఎలా, పసిబిడ్డలను దోమల బారినుంచి రక్షించడమెలా, వారిని రోజూ బడికి హాజరయ్యే విధంగా చేయడమెలా, చిన్నారులకు చదువులపట్ల ఆసక్తి పెంపొందించడమెలా... వంటివన్నీ ఈ దేశాలను దశాబ్దాలుగా వేధిస్తున్న గడ్డు ప్రశ్నలు. ఈ ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలినంతకాలం ఈ దేశాల్లో ఏటా లక్షలమంది చిన్నారులు రోగాల బారిన పడటం, చనిపోవడం, పాఠశాల విద్యకు దూరం కావడం... వంటి సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. మానవ పురోభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఈ ప్రశ్నలకు నిర్దిష్ట సమాధానాలు కనుక్కొని ప్రపంచ పేదరికాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ముగ్గురు శాస్త్రవేత్తలకు అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి వరించడం ముదావహం. ఆ ముగ్గురిలో ఒకరైన అభిజిత్‌ బెనర్జీ భారతి సంతతికి చెందినవారు. ఈయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో, దిల్లీలోని జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి క్రమేణా ప్రపంచ పేదరికానికి పరిష్కారాలు ప్రతిపాదించే స్థాయికి ఎదగడం భారతీయులందరికీ గర్వకారణం. ప్రపంచ దేశాలన్నీ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల హోరులో కొట్టుకుపోతున్న తరుణమిది. పేదలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలనుంచి వివిధ దేశాల్లో ప్రభుత్వాలు క్రమంగా దూరమవుతున్న కాలంలో- పేదల జీవితాలను మార్చే కొత్త ప్రయోగ పద్ధతులు సూచించిన పరిశోధనకు ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం లభించడం అభినందనీయం.

పరిష్కార వ్యూహాలు
పేదల జీవితాలను, దారిద్య్రానికి సంబంధించిన భిన్న కోణాలను సమగ్రంగా విశ్లేషించడంలో సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలు విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అభిజిత్‌ బృందం సైద్ధాంతిక వాదనలకు అతీతంగా, వాస్తవిక దృక్పథంతో పేదల నిజ జీవితాలను అధ్యయనం చేసి ఆరోగ్యం, విద్య, ఆదాయం, వినియోగం వంటి సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలను- తక్కువ వ్యయంతో, రుజువుల ఆధారంగా కనుక్కొని, సామాజిక విధానాలు రూపొందించి అమలుపరచడంలో సఫలీకృతం అవుతుండటం కొనియాడదగినది. అభిజిత్‌, డఫ్లో రచించిన ‘పేదల అర్థశాస్త్రం’ (పూర్‌ ఎకనమిక్స్‌) దారిద్య్రాన్ని, పేదల జీవితాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడంలో ప్రామాణికంగా ఉంటోంది. స్వల్పకాలంలో ఆదాయం పెరిగినప్పుడు పౌష్టికాహారం, ఆరోగ్య బీమాలపై ఖర్చుచేయకుండా పేద ప్రజలు ఎందుకు మొదట టెలివిజన్‌ వంటి వినోద సాధనాలవైపు మొగ్గుచూపుతారన్న విషయాన్ని అట్టడుగు ప్రజల జీవిత అవగాహన కోణంలోంచి వివరించారు. కిలో పప్పులు ఇవ్వడం, శిశువులకు రోగనిరోధక టీకాలు పెంచడం వంటివి పేదల జీవితాలను ఏ రకంగా ఆదుకుంటాయో కూడా అందులో స్పష్టంగా వివరించారు. పాలన పథంలోని చిన్నపాటి అడ్డంకులు, పాలకుల్లోని అపోహలు పేదలను ఏ విధంగా మరింత దుర్భర స్థితిలోకి నెడుతున్నాయో అందులో వివరించారు. అవసరమైన సమాచారం, చిన్నపాటి సాంకేతికత, కాసింత సహాయ ప్రోత్సాహం పేదల జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురాగలవన్నది నోబెల్‌ పురస్కార గ్రహీతల నమ్మకం.

పేదరికం ఒక సామాజిక రోగం. ఏ వ్యాధికి ఏ మందు పనిచేస్తుందో ప్రయోగాల ద్వారా ముందుగానే గుర్తించి చికిత్స చేసినట్లే- పేదరికం వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి ఏ చర్యలు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ నమ్మకంతోనే నోబెల్‌ పురస్కార గ్రహీతలు విస్తృత ప్రాతిపదికన భిన్నమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఇందుకోసం వైద్య, ఔషధ నిర్ధారణ క్రమంలో విరివిగా ఉపయోగించే తరహాలో ‘యాదృచ్ఛిక నియంత్రిత ప్రయోగా’(ఆర్‌సీటీ)న్ని ఉపయోగించారు. దాని ప్రకారం దారిద్య్రం ముడివడిన సమస్యలను పరిష్కారం కనుక్కోగలిగిన చిన్న ప్రశ్నలుగా విభజిస్తారు. ఆ తరవాత ఒకే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్లో జీవించేవారిలో కొందరు వ్యక్తులు, కుటుంబాలను యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకుంటారు. వారికి మాత్రమే కొన్ని నిర్దేశించిన అదనపు వస్తువులు, సేవలు, సౌకర్యాలు కల్పించి పేదరికంతో ముడివడిన వివిధ అంశాలపై ఆ ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఈ ప్రభావాలను మిగిలిన వ్యక్తులు, కుటుంబాలతో పోల్చి పరిశీలిస్తారు. ఈ క్రమంలో ప్రవర్తన ఆర్థిక శాస్త్ర (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) సూత్రాలనూ విరివిగా ఉపయోగిస్తారు. ఆపై ఆయా సమస్యలకు కచ్చితమైన పరిష్కారాలు సూచించి, వాటిని సమాజంలోని అందరికీ వర్తింపజేసి మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. దీన్నే ‘రుజువు ఆధారిత’ విధాన రూపకల్పన అనీ అంటారు. ఈ పద్ధతి అభివృద్ధి తీరుతెన్నులను ప్రశ్నించకుండా- నిర్మాణాత్మక, విస్తృత స్థాయి, వ్యవస్థాపర సమస్యలను వాటి వాదనలను పక్కదోవ పట్టిస్తోందనీ కొందరు విఖ్యాత ఆర్థికవేత్తలు విమర్శించారు. ఏదిఏమైనా ధరిత్రినుంచి పేదరికాన్ని రూపుమాపేందుకు నిర్దిష్ట పరిశోధనలు చేసి; సరైన పరిష్కారాలను అన్వేషించడం నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. ఇందుకోసమే అభిజిత్‌ బెనర్జీ తన సహచరి డఫ్లోతో కలిసి ‘ఎమ్‌ఐటీ’లో స్థాపించిన అబ్దుల్‌ జమీల్‌ పేదరిక నిర్మూలన విభాగం (జే-పాల్‌) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ‘ఆర్‌సీటీ’ పద్ధతి ద్వారా దారిద్య్ర నిర్మూలనకు విస్తృత కృషి సాగిస్తుండటం విశేషం. ఆఫ్రికా దేశాల్లో దోమతెరల వాడకంపై అవగాహన పెంచడంతోపాటు, వాటిని ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా 45 కోట్లమందిని మలేరియా బారినుంచి కాపాడటం చెప్పుకోదగిన విషయం. మరోవంక ఆఫ్రికన్‌ పాఠశాలల్లో పేగుశుద్ధి గోళీ మందులను (డీవార్మింగ్‌ ట్యాబ్లెట్స్‌) ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా అంటురోగాలను కట్టడి చేయడంతోపాటు- విద్యార్థుల పాఠశాల హాజరునూ అనూహ్యంగా పెంచారు.

ఇండొనేసియాలో ఆహార హక్కు గుర్తింపు పత్రాలపై లబ్ధిదారులకు కచ్చితంగా అందాల్సిన ధాన్యం రకాలు, పరిమాణం వంటి సమాచారాన్ని ముద్రించి ఇవ్వడం ద్వారా- ఆహార పంపిణీ వ్యవస్థలో అవినీతిని గణనీయంగా కట్టడి చేయగలిగారు. తద్వారా ఆహార పంపిణీ, వినియోగాన్ని మెరుగుపరచగలిగారు. మరోవంక విద్యాభ్యాస క్రమంలో కొన్ని అంశాల్లో వెనకబడిన పిల్లలకోసం ప్రత్యేక బోధన పథకం (రెమెడియల్‌ ట్యూటరింగ్‌ ప్రోగ్రామ్‌) ద్వారా 50 లక్షలకుపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చారు. రాజస్థాన్‌లో పసిబిడ్డలకు రోగ నిరోధక టీకాలు వేయించిన వారందరికీ ఒక కిలో పప్పు ధాన్యాలు ఉచితంగా ఇచ్చారు. తద్వారా టీకాలు వేయించుకునే శిశువులు అయిదు శాతంనుంచి 40శాతానికి పెరిగారు. ఇనుము పాళ్లు ఎక్కువగా ఉన్న ఉప్పునకు బిహార్‌లో రాయితీ ఇచ్చి, తక్కువ ధరకు అందజేశారు. తద్వారా ఆ ఉప్పును మధ్యాహ్న భోజన పథకంలో విరివిగా ఉపయోగించడం ప్రారంభించారు. ఫలితంగా రక్తహీనత సమస్యలను చాలావరకు నివారించగలిగారు. ‘నగదు బదిలీ’ వంటి కార్యక్రమాల ద్వారా శిశువుల్లో పోషకాహార వినియోగం పెరగడంతోపాటు; వారి ఎత్తు, బరువుల్లోనూ గుణాత్మక మార్పులు వస్తాయని రుజువు చేశారు. ఈ పథకాలవల్ల సమాజంలో అనుత్పాదక వినియోగం అధికమవుతుందని, శ్రామికుల్లో సోమరితనం పెరిగి, పనిచేసేవారు తగ్గిపోతారన్న వాదనలకు ప్రపంచ దేశాల్లో సరైన సాక్ష్యాలు లేవనీ తేల్చారు. అంతేకాక దీనివల్ల దీర్ఘకాలంలో శ్రామికుల లభ్యత పెరుగుతుందని, వారి ఉత్పాదకత ఇనుమడిస్తుందని నోబెల్‌ పురస్కార గ్రహీతల అభిప్రాయం. పేదలకు అందే ప్రతి అదనపు రూపాయివల్ల ఆర్థిక వ్యవస్థలో సమష్టి డిమాండ్‌ ఇనుమడిస్తుందని; దాని ద్వారా ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ఊర్ధ్వముఖలో సాగుతాయన్న వారి విశ్లేషణ బహుధా ఆచరణీయం.

సూచీల్లో వెనకంజ
ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు ఆర్థిక వృద్ధిలో భారత్‌ కొన్నేళ్లుగా వేగంగా దూసుకుపోతోంది. అయితే సిసలైన ఆర్థికాభివృద్ధి సూచీలకు సంబంధించి మాత్రం మన దేశం వెనక వరసల్లో మగ్గుతోంది. మానవాభివృద్ధి సూచీలో 189 దేశాల జాబితాలో 130వ స్థానంలో; ప్రపంచ ఆకలి సూచీలో 117 దేశాల క్రమంలో 102వ స్థానంలో, ప్రపంచ సంతోష సూచీలో 156 దేశాలకుగాను 140వ స్థానంలో నిలుస్తోంది. భారతావనిలో ఇప్పటికీ 20శాతానికిపైగా ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రపంచ బ్యాంకు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ‘యునిసెఫ్‌’ విడుదల చేసిన తాజా వార్షిక బాలల నివేదిక-భారత్‌లో పసిబిడ్డల మరణాల్లో 69శాతానికి పోషకాహార లోపమే కారణమని వెల్లడిస్తోంది. దేశంలోని బాలల్లో 17శాతం ఎత్తుకు తగిన బరువులేరని; 33శాతం తక్కువ బరువుతో సతమతమవుతున్నారని స్పష్టం చేసింది. అఖిల భారత పాఠశాల విద్యా నివేదిక 2018 ప్రకారం- 30 శాతం ప్రాథమిక స్థాయి విద్యార్థులు బడికి సరిగ్గా హాజరుకావడం లేదు. ప్రాథమిక తరగతి విద్యార్థుల్లో సగానికి కనీసం చదవడం రాదు. ప్రాథమిక గణాంకాలు సైతం వీరికి తెలియవు.

మరోవంక పాఠశాలల్లో చేరుతున్న ప్రతి నలుగురిలో ఒకరు ప్రాథమిక తరగతుల అనంతరం బడి మానేస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ నివేదిక-2018 ప్రకారం ప్రస్తుతం భారత్‌లో ఆదాయ అసమానతలు తారస్థాయికి చేరాయి. దేశంలోని 73 శాతం సంపద కేవలం ఒక శాతం జనాభా అధీనంలో ఉండగా, దిగువనున్న 50శాతం, ఒక శాతం సంపదను మాత్రమే పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో పేదరిక నిర్మూలన సాకారం కావాలంటే వినూత్న సామాజిక విధానాల అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకూ సృజనాత్మక ఆర్థిక విధానాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల ప్రయోగాలు, ఫలితాల ప్రాతిపదికన అమలులోకి తీసుకువస్తున్న విధానాలు శిరోధార్యం కాగలవు. ‘ఆర్‌సీటీ’ పద్ధతి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న రూపాల్లో విస్తరించిన పేదరిక సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. తక్కువ వ్యయంతో దారిద్య్ర నిర్మూలన పథకాలు రూపొందించి, వాటిని అమలు చేయాలి. మరోవంక ఉభయ తెలుగు రాష్ట్రాలూ వివిధ పథకాల రూపంలో నిధులు కేటాయిస్తున్నాయి. ఫలితాలు క్షేత్రస్థాయికి ఎంతమేరకు సవ్యంగా చేరుతున్నాయన్న విషయంలో నిర్దిష్ట అధ్యయనం అవసరం. నిధులను సమర్థంగా వినియోగించి మెరుగైన ఫలితాలను సాధించాలంటే ‘నోబెల్‌’ విజేతలు సూచించిన విధానాలను అమలులో పెట్టాలి. భారతావనిని పేదరిక రహితం చేసేందుకు కొత్త పరిష్కారాలను ఆచరణలోకి తీసుకురావాల్సిన సందర్భమిది.

- డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు
(రచయిత- ఆర్థిక రంగ నిపుణులు)
Posted on 23-10-2019