Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

నిలువెత్తు ‘చెత్త’ ప్రగతి

ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం వల్ల నేడు నేల, నదులు, భూగర్భ జలాలు, సాగరాలు చెత్తాచెదార కాసారాలుగా మారిపోతున్నాయి. కావాలంటే భారత రాజధాని దిల్లీ నగరంలో మేరు పర్వతంలా పెరిగిపోతున్న ఘాజీపూర్‌ చెత్త కొండను చూడండి. అంబరాన్ని చుంబించేట్లున్న ఆ కొండ విమానాలకు అడ్డువస్తుందేమోనని సుప్రీంకోర్టు దానిపై ఎర్ర దీపాలు పెట్టాలని గతేడాది ఆదేశించింది. 1984లో ఘాజీపూర్‌లో 40 ఫుట్‌బాల్‌ మైదానాలంత వెడల్పుగల గోతిని తవ్వి పాత దిల్లీ తోపాటు నగరంలోని తూర్పు, మధ్య ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి పోయసాగారు. ఆ గొయ్యి 2002లోనే పూడిపోయినా నగరం నుంచి రోజుకు రెండు వేల టన్నుల చెత్తను ట్రక్కుల్లో తీసుకొచ్చి పోస్తూనే ఉన్నారు. అందుకే అది ఏటా 33 అడుగుల చొప్పున ఎత్తు పెరుగుతోంది. 2002లో 67 అడుగుల ఎత్తును అందుకున్న ఘాజీపూర్‌ చెత్త కొండ ఇప్పుడు 213 అడుగులకు పెరిగింది. ఈ లెక్కన అది 239.5 అడుగుల ఎత్తయిన తాజ్‌మహల్‌ను వచ్చే ఏడాది మించిపోతుంది. ఇప్పటికే కుతుబ్‌ మినార్‌ కన్నా ఎత్తున్న ఆ చెత్త కొండను స్థానికులు ఎవరెస్ట్‌ శిఖరమని పిలుస్తున్నారు. దిల్లీకి ఉత్తరాన భల్స్వా ప్రాంతంలో మరో చెత్త కొండ వెలసింది. ఈ చెత్త కొండలపై ఎలుకలు, కాకులు, గద్దలు, ఈగలు, దోమలు మూగి పరిసర ప్రజలకు అనారోగ్య హేతువులవుతున్నాయి. 2018లో భారీ వర్షాలకు ఘాజీపూర్‌ చెత్త కొండలో కొంత భాగం విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు కూడా. దాంతో ఘాజీపూర్‌లో ఇక చెత్త పారేయకూడదని అధికారులు ఆదేశించినా, ప్రత్యామ్నాయ స్థలం లేకపోవడంతో వారం తరవాత పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఈ చెత్త కొండ నుంచి వెలువడే మీథేన్‌ వాయువుకు మండే స్వభావం ఉన్నందువల్ల తరచూ మంటలు రేగుతుంటాయి. ఈ ఏడాది మార్చి 31న భగ్గుమన్న మంటలను ఆర్పడానికి పది రోజులు పట్టింది. అన్ని రోజులూ పొగ మేఘం చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది.

మురుగు, చెత్త కుప్పల్లో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఒక్క దిల్లీ నగరం మాత్రమే కాదు- దేశమంతా అదే దుస్థితి ఉంది. చెత్త కుప్పల నుంచి స్రవించే లీచేట్‌ తదితర విషపూరిత రసాయనాలు నేలలోకి ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. దేశంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల్లో 70 శాతం ఘాజీపూర్, భల్స్వా వంటి చెత్త కొండల్లో పోగుపడుతోంది. నదుల్లో చేరి అక్కడి నుంచి సముద్రాల్లో కలిసిపోతోంది. నేడు ప్రపంచంలోని మహా సాగరాలకు అత్యధిక ప్లాస్టిక్‌ చెత్తను చేరవేస్తున్న నది చైనాలోని యాంగ్‌ ట్జే కాగా, తరవాతి స్థానాన్ని గంగా నది ఆక్రమిస్తోంది. నిజానికి భారత్‌లో ప్లాస్టిక్‌ వినియోగం తక్కువే. ఇక్కడ తలసరి వినియోగం ఏడాదికి 11 కిలోలైతే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంతకు పదిరెట్లు ఎక్కువ. చైనాలో ఏటా అయిదు కోట్ల టన్నులు, అమెరికాలో 3.45 కోట్ల టన్నుల చెత్త ఉత్పన్నమవుతున్నా- వాటిని చాలావరకు శుద్ధిచేసి పునర్వినియోగార్హంగా మారుస్తున్నారు. ఆ పని భారత్‌లో సక్రమంగా జరగడం లేదు. మధ్యతరగతి ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ల వినియోగం పెరిగిపోతోంది. దేశంలో ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమ విలువ 3,200 కోట్ల డాలర్లకు (రూ.2,20,000 కోట్ల పైచిలుకు) చేరి, 10 లక్షలమందికి ఉపాధి కల్పిస్తోంది. అందువల్ల ప్లాస్టిక్కులను ఉన్న పళాన నిషేధించడం అనుకున్నంత సులువు కాదు. తాజాగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణలో బాధ్యత తీసుకోని 52 సంస్థలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పతంజలి వంటి సంస్థలూ వీటిలో ఉన్నాయి. ఇటీవలి వరకు విదేశాల నుంచి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పారవేసేవారు. ఈ ఏడాది నుంచి విదేశీ చెత్త దిగుమతిని రద్దు చేసిన కేంద్రం, 2022కల్లా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌లను నిషేధిస్తామని ప్రకటించింది.

కేవలం విధాన ప్రకటనలతోనే పని జరగదు. ప్రజలు, పరిశ్రమల దృక్పథంలో సమూల మార్పు రావాలి. ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరుచేయాలన్న చైతన్యం పెరగాలి. వాటిని శుద్ధి చేసి సాధ్యమైనంతవరకు పునర్వినియోగార్హంగా మార్చాలి. భారతదేశంలోని 7,936 నగరాలు, పట్టణాలు ఏటా 6.2 కోట్ల టన్నుల చెత్తను పుట్టిస్తున్నాయి. అందులో 4.3 కోట్ల టన్నుల చెత్తను మాత్రమే సేకరించి, 1.19 కోట్ల టన్నులను శుద్ధి చేసి, మిగిలిన 3.1 కోట్ల టన్నుల చెత్తను గుంతల్లో పారేస్తున్నారు. 2030కల్లా మొత్తం వ్యర్థాల పరిమాణం 16.5 కోట్ల టన్నులకు పెరగనుంది. దీన్ని ఉపయోగకరంగా, ప్రమాదరహితంగా మార్చే ప్రయత్నాలు జరగడం లేదు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను కరిగించి చెప్పులుగా, సంచులుగా మార్చే కర్మాగారాలు కొన్ని ఉన్నా, వాటి నుంచి వెలువడే వాయు కాలుష్య మేఘాలు జనారోగ్యానికి ఎసరు పెడుతున్నాయి. అధునాతన సాంకేతికతలను వినియోగించి ప్లాస్టిక్‌ వ్యర్థాలను భద్రంగా పునరుపయోగకరంగా మార్చాలి. ప్రతిరోజూ పుట్టుకొస్తున్న చెత్తలో 15 శాతం పునర్వినియోగార్హంగా మార్చడానికి అనువైనదని ఐఐటీ-కాన్పూర్‌ అధ్యయనం తెలిపింది. దాన్ని ఏరే పనిలో అయిదు లక్షల మందికి జీవనోపాధి కల్పించవచ్చనీ వివరించింది. ఘన వ్యర్థాలను ఇంధనంగా ఉపయోగించి విద్యుదుత్పాదన చేయవచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా వినియోగించవచ్చు. సాంకేతికత, నిధుల కొరత వల్ల ఈ పని సక్రమంగా జరగడం లేదు. దేశంలో ప్రతి 150 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆసుపత్రి వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అవి కొన్ని నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితి మారాలి. మున్ముందు 100 స్మార్ట్‌ నగరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పట్టుదలగా వ్యర్థాల నివారణకు కృషిచేయాలి. దేశంలో 20 నగరాల్లో చెత్త పారేయడానికి గోతులు తవ్వి కొండల్లా పేర్చే పద్ధతికి స్వస్తి చెప్పాలని కేంద్రం ఆశిస్తోంది. దిల్లీ గోతుల్లో 80 శాతం చెత్తను పునర్వినియోగార్హంగా మార్చవచ్చని ఒక పరిశోధనలో తేలింది. అంతా ప్రభుత్వానికే వదిలి తమ మానాన తాము చెత్త పారేసే అలవాటును ప్రజలు, పరిశ్రమలు మానుకోవాలి. కుటుంబాలు, పురపాలక సంఘాలు ఇందుకు నడుంకట్టాలి.


- ఆర్య
Posted on 13-07-2019