Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ప్రణాళికల పునశ్శుద్ధి

కూర్చుని తింటే ఎంత పెద్దకొండలైనా కరిగిపోతాయన్నది జీవన సత్యాన్ని చాటే సామెత. ఎడాపెడా వాడకం పెచ్చరిల్లి అంతకంతకు నిల్వలు తరిగిపోతున్న సంప్రదాయ ఇంధన వనరుల ఉదంతమే అందుకు గొప్ప ఉదాహరణ. భారత్‌ సహా ఎన్నో దేశాలు దశాబ్దాలుగా శిలాజ ఇంధనాలు, లోహఖనిజాలను విపరీతంగా వాడుతుండటం తెలిసిందే. దేశంలోనే వాటి వినియోగం నాలుగున్నర దశాబ్దాల వ్యవధిలో ఆరు రెట్లయింది. 1970నాటికి 118 కోట్ల టన్నుల మేర నమోదైన సంప్రదాయ ఇంధన వనరుల వినిమయం 2015నాటికే 740 కోట్ల టన్నులకు ఎగబాకింది. 2030 సంవత్సరానికల్లా అంతకు రెండింతలు కానుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా సగటున ఎకరం నేలనుంచి 450 టన్నులదాకా వనరులు వెలికితీస్తుండగా, దేశీయంగా అలా తోడేస్తున్న రాశి ఎకాయెకి 1,580 టన్నులు. కోబాల్ట్‌, రాగి, లిథియం వంటివి నూరుశాతం దిగుమతి చేసుకుంటున్న భారత్‌, ముడిచమురు అవసరాల్లో 80 శాతం దాకా విదేశాలపైనే ఆధారపడుతోంది. ఈ పరాధీనత కొనసాగినన్నాళ్లు దిగుమతుల బిల్లు ఏటేటా తడిసి మోపెడు కాక తప్పదు. చమురు, బొగ్గు అనేముంది- వివిధ శిలాజ ఇంధనాలు, లోహఖనిజాల విచ్చలవిడి వినియోగంతో పర్యావరణ విధ్వంస తీవ్రతను గుర్తెరిగిన ఎన్నో దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంచుకుంటున్నాయి. సొంత అవసరాల్లో 85శాతం మేర సౌర, పవన విద్యుత్తుపైనే జర్మనీ ఆధారపడుతుండగా- చమురు నిల్వలకు పేరుపడ్డ యూఏఈ, బహ్రెయిన్‌ వంటి గల్ఫ్‌ దేశాలు సైతం పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మొగ్గుతున్నాయి. 2022 నాటికి పునర్వినియోగ ఇంధన వనరులతో 175 గిగావాట్ల (ఒక గిగావాట్‌ లక్ష మెగావాట్లకు సమానం) ఉత్పత్తిపై గురిపెట్టిన భారత ప్రభుత్వం తాజాగా జాతీయ ఇంధన సామర్థ్య విధాన ముసాయిదా విడుదల చేసింది. జాతీయాదాయంలో నాలుగోవంతుకు దోహదపడే ఏడు రంగాల్లో ఆరు సూత్రాల(తగ్గింపు, పునర్వినియోగం, రీసైక్లింగ్‌, డిజైన్‌ మార్పు, పునరుత్పత్తి, పునరుద్ధరణ)తో మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను అది ప్రతిపాదిస్తోంది!

ఇంధన రంగానికి సంబంధించి ఇండియాను ఇప్పుడు జంట సవాళ్లు పట్టి పీడిస్తున్నాయి. ఒకవైపు హరాయించుకుపోతున్న సహజ వనరులు సంక్లిష్ట భవిష్యత్తును సూచిస్తుండగా- భూక్షయం, వాయుకాలుష్యం, జలసంక్షోభాలకు దీటుగా వ్యర్థాల సమస్య పర్యావరణ సవాళ్లు విసరుతూ తీవ్రంగా ఆందోళనపరుస్తోంది. భారత్‌లో 2025నాటికి ప్రతి రోజూ 3.77 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతాయని ఆ మధ్య ప్రపంచబ్యాంకు మదింపు వేసింది. దేశవ్యాప్తంగా పురపాలక సంస్థలు సేకరిస్తున్న వివిధ రకాల చెత్తలో పరిశుద్ధీకరణ, పునర్వినియోగ ప్రక్రియలకు నోచుకుంటున్నది 22-28 శాతమేనని లోగడ అంగీకరించిన కేంద్రం, వ్యర్థాల నిర్వహణను జాతి శ్రేయస్సాధకంగా మలచాలని తలపోస్తోంది. వాస్తవానికి నాలుగు వేలకుపైగా నగరాలు, పట్టణాల్లో ఘనవ్యర్థాల శుద్ధికి సదుపాయాలు ఏర్పరచి చెత్తనుంచి విద్యుత్‌, ఎరువుల ఉత్పత్తి చేపట్టాలని సుమారు మూడేళ్ల క్రితమే ప్రణాళికలు రచించినా- అవి బాలారిష్టాల దశ దాటనేలేదు. మిథనాల్‌ దన్నుతో చైనా, బ్రెజిల్‌ వంటివి పెట్రో దిగుమతుల భారం నుంచి భారీ ఉపశమనం పొందగలుగుతున్నాయి. దేశంలో తడిచెత్త- వ్యర్థ జలాల నుంచి బయోగ్యాస్‌, బొగ్గు నుంచి మిథనాల్‌, పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తయ్యే ఉదజని (హైడ్రోజన్‌)తో నడిచే కారు... తదితరాలపై అడపాదడపా కథనాలు వెలువడుతున్నా- విస్తృత సమర్థ కార్యాచరణ ఎండమావినే తలపిస్తోంది. ఉక్కు, అల్యూమినియం, సోలార్‌, మోటార్‌, ప్లాస్టిక్‌, విద్యుత్‌-ఎలెక్ట్రానిక్‌, నిర్మాణ రంగాలవారీగా వ్యర్థాల నిర్వహణలో నిర్ణీత కాలావధిలో నిర్దిష్ట మార్పును లక్షిస్తున్న నూతన ముసాయిదా వ్యూహాలు వినసొంపుగా ఉన్నాయి. మునుపటి వైఫల్యాలు పునరావృతం కాకుండా తీసుకుంటామంటున్న జాగ్రత్త చర్యల మాటున ధ్వనిస్తున్న రుసుముల వడ్డన యోచన- సర్కారీ బాణీలో మార్పును ప్రస్ఫుటీకరిస్తోంది.

తుక్కు, చెత్త, వ్యర్థాలు- పేరు ఏదైనా వాటిని ఉపయోగించి పునర్వినియోగార్హ వస్తువుల తయారీలో స్వీడన్‌, పోలాండ్‌, ఎస్తోనియా ప్రభృత దేశాలు సమున్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. జర్మనీ, జపాన్‌ వంటివి సాంకేతిక ప్రజ్ఞతో రీసైక్లింగ్‌ అద్భుతాలు సృష్టిస్తుండగా- పురపాలక ఘనవ్యర్థాల నిర్వహణలో ఆస్ట్రియా, తైవాన్‌, సింగపూర్‌ లాంటివి విశేషంగా రాణిస్తున్నాయి. యూకేలో ఓ అంకుర సంస్థ ప్లాస్టిక్‌ రహదారుల నిర్మాణంతో అబ్బురపరుస్తోంది. ప్రతిపాదిత ఎన్‌ఆర్‌ఈఏ (జాతీయ వనరుల సామర్థ్య సంస్థ), తోడుగా వ్యవహరిస్తుందంటున్న వివిధ మంత్రిత్వశాఖల సంఘం- ఇతర దేశాల అనుభవాల నుంచి స్వీకరించదగ్గ పాఠాలెన్నో ఉన్నాయి. వ్యర్థాల నిర్వహణకు సంబంధించి 2000 సంవత్సరంలో రూపొందించిన నిబంధనల్ని, 2016లో క్రోడీకరించిన విధివిధానాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్థానం నిరుడు ధర్మాగ్రహం వెలిగక్కింది. కొత్త ముసాయిదాలో పొందుపరచిన సూత్రావళికీ అటువంటి దుర్గతి దాపురించనివ్వని పటిష్ఠ యంత్రాంగాన్ని తీర్చిదిద్ది, అన్ని అంచెల్లో జవాబుదారీతనం మప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం భుజస్కంధాలపై ఉంది. ఎన్నో దేశాలు చెత్తనుంచి కాసులు పిండుకుంటూ, ఇంధనావసరాలూ తీర్చుకొంటుండగా- పునశ్శుద్ధి, నిర్వహణ గాడితప్పి ఇండియాలో క్యాన్సర్‌, ఉబ్బసం లాంటి 22 రకాల వ్యాధులు కోరచాస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థే ఆక్షేపించింది. ఆ అప్రతిష్ఠను తుడిచిపెట్టేందుకు మూడేళ్ల ప్రణాళికను ప్రతిపాదిస్తున్న ముసాయిదా, పదేళ్ల దరిమిలా సాఫల్య వైఫల్యాల్ని గణించి పరిస్థితిని సమీక్షించాలంటోంది. ఇంధన భద్రతను పెంపొందించే పరిశోధనలు, వ్యర్థాలపై సమర్థ వ్యూహాల అమలు నిరంతర చైతన్య స్రవంతిగా సాగే వాతావరణమే- హరిత భారతావనిని ఆవిష్కరించగలిగేది!


Posted on 09-08-2019