Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

రావమ్మా జల లక్ష్మీ రావమ్మా...

* నీటి సంరక్షణ అందరి కర్తవ్యం

నిన్నమొన్నటి వరకు యావత్‌ భారతావని కరవు పరిస్థితులతో తల్లడిల్లింది. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరైనా లేక సతమతమైంది. రుతుపవనాలరాకలో జాప్యంవల్ల ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా వరదలు విలయతాండవం చేస్తున్నాయి. ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలు అనే తేడా లేకుండా అనేక రాష్ట్రాలను వరదలు చుట్టుముట్టాయి. పలు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. వేల టీఎమ్‌సీల నీరు వృథాగా సముద్రాల పాలవుతోంది. వరద నీటిని సంరక్షించుకునే ప్రయత్నాలు చేపట్టకపోవడమే ఈ దుస్థితికి కారణం. దీంతో మళ్ళీ కొద్దిరోజుల్లో తాగు, సాగునీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ పరిస్థితిని అధిగమించి వాననీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టడం తక్షణావసరం. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు- ఈ ప్రక్రియలో అందరూ బాధ్యతగా పాల్గొనాలి. అప్పుడే వాననీటిని సంరక్షించుకోగలం. భవిష్యత్‌ అవసరాలను తీర్చుకోగలం! కరవు పరిస్థితులు, తాగు సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘జలశక్తి అభియాన్‌’ను ప్రారంభించింది. దేశంలో నానాటికీ తరిగిపోతున్న జలవనరులను సంరక్షించుకోవడం, కురిసే ప్రతి వాన నీటి బొట్టునూ ఒడిసి పట్టుకునేలా ప్రజల్లో చైతన్యం తేవడమే లక్ష్యాలుగా జులై ఒకటి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి పొదుపు, సంరక్షణ, పునర్వినియోగాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

దేశవ్యాప్త చైతన్యం
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో నీటికి ఇబ్బంది పడుతున్న 256 జిల్లాలు, 1,592 ప్రాంతాల్లో జలసంరక్షణ కోసం ఉద్దేశించిన ‘జలశక్తి అభియాన్‌’ ప్రచార చైతన్యోద్యమాన్ని రెండు విడతలుగా చేపడుతున్నారు. జులై ఒకటిన ప్రారంభమైన తొలివిడత కార్యక్రమం సెప్టెంబరు 15 వరకు కొనసాగుతుంది. రెండో విడత అక్టోబరు ఒకటిన మొదలై నవంబరు 30న ముగుస్తుంది. తొలిదశలో కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ; మలిదశ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ఉన్నాయి. జలశక్తి అభియాన్‌ కార్యక్రమానికి తెలంగాణలో 24 జిల్లాల్లోని 137 బ్లాకులను, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాల్లోని 64 బ్లాకులను ఎంపిక చేశారు. తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలకూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించారు. 2024 నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు కుళాయి నీటిని అందించే దిశగా కృషి సాగుతోంది. ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపుల్లో జల మంత్రిత్వశాఖకు ప్రాధాన్యం దక్కింది. 2019-20 బడ్జెట్‌లో రూ.28,261.59 కోట్లు కేటాయించారు. నిరుటికన్నా ఇది వెయ్యికోట్ల రూపాయలు అధికం.

వాననీరు భూమిలోకి ఇంకిపోయేలా జాగ్రత్తలు తీసుకోవడంద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించవచ్చు. గృహాల్లోని వ్యర్థ జలాలను వ్యవసాయానికి తిరిగి ఉపయోగించవచ్చు. వీటిపైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. జలశక్తి అభియాన్‌లో ప్రధానంగా అయిదు అంశాలమీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటిలో జల వనరుల పరిరక్షణ, వాన నీటి సంరక్షణ మొదటిది. సంప్రదాయ జల వనరులైన కుంటలు, చెరువుల పునరుద్ధరణ రెండోది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ఉద్దేశమిదే. మూడోది- నీటి పునర్వినియోగానికి, పునరుద్ధరణకు వీలు కల్పించే నిర్మాణాలను చేపట్టడం. నీటి కుంట(వాటర్‌షెడ్‌)లను అభివృద్ధి చేయడం నాలుగోది. భారీయెత్తున మొక్కలు నాటడం అయిదో కార్యక్రమం. వీటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా జల సంరక్షణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం. పంచాయతీరాజ్‌, పురపాలక, నగరపాలక సంస్థలు ఈ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించాల్సి ఉంది. వాననీటి పరిరక్షణ విభాగాలను ఏర్పాటు చేయాలి. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసే విభాగాలు తమ పరిధిలోని ప్రాంతాల్లో భూగర్భ జలాల వెలికితీత, పునరుద్ధరణ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రజల అవగాహన కోసం ఈ వివరాలను ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలి. భవన నిర్మాణ అనుమతులకు వాననీటి పరిరక్షణ నిర్మాణాలను తప్పనిసరి చేయాలి. అవి పూర్తయ్యాక తనిఖీలు చేపట్టి, అన్నీ నిర్దేశించినట్లు ఉంటేనే అనుమతులివ్వాలి.

దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో తాగేందుకూ నీళ్లు లేక ప్రజలు కటకటలాడుతున్నారు. రుతుపవనాల రాకలో జాప్యం, వచ్చినా ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో సామాన్య ప్రజలతోపాటు రైతులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా సుమారు 256 జిల్లాల్లోని ప్రజలు తీవ్ర నీటిఎద్దడి బారినపడ్డారు. ప్రభుత్వ తాజా గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ సహా 21 ప్రధాన నగరాల్లో 2020 నాటికల్లా భూగర్భజలాలు సున్నా స్థాయికి చేరుకుంటాయని సాక్షాత్తూ నీతిఆయోగ్‌ నివేదిక హెచ్చరించింది. గతేడాది నీతి ఆయోగ్‌ దీన్ని విడుదల చేసింది. ‘మిశ్రమ నీటి యాజమాన్య సూచిక’ మున్ముందు ఎదురవనున్న సంక్షోభాన్ని హెచ్చరించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల లభ్యతతో పోలిస్తే ఇప్పుడున్న అవసరాలు రెండింతలు పెరుగుతాయన్నది అంచనా. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నాయి. నీటి వనరులను పూడ్చివేసి వాటిపైనే భవనాలు నిర్మిస్తున్నారు. ఫలితంగా వాననీటి సంరక్షణకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. నీటి ఎద్దడి ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాలేదు. ఇతర రంగాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చేకొద్దీ బాలికా విద్యపై ప్రభావం పడుతుందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తీకరిస్తున్నారు. బాలికలు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో బడి మానేసే ప్రమాదం ఉంది. తమిళనాడులో నీటిఎద్దడి తీవ్రంగా ఉందనడానికి ‘ఇడ్లీ పిండి కొంటే బకెట్‌ నీళ్ళు ఉచితం’ అనే ఓ వ్యాపార ప్రకటనే నిదర్శనం. కర్ణాటకలో ముదురుతున్న నీటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుమతులే నిలిపేయాలన్న దిశగా ఆలోచిస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో నీటికొరత తీవ్రంగా ఉంది. వరదలతో ప్రస్తుతం సతమతమవుతున్న మహారాష్ట్రలో రెండు నెలల క్రితం నీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. గొంతు తడుపుకోవడానికి చుక్కనీరు లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 4,331 పల్లెలు, 9,470 శివారు ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటికి అల్లాడిపోయారు. ఆ ప్రాంతాల్లో నిత్యం 5,493 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ప్రజల దాహార్తిని తీర్చలేకపోయింది.

పౌరబాధ్యతగా...
చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తే అక్కడ నీటి నిల్వతో పాటు, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలూ పెరుగుతాయి. రోడ్ల పక్కన, పార్కుల్లో పాదచారుల మార్గాల వంటిచోట్ల కాంక్రీటు నిర్మాణాలు చేపట్టకుండా, కురిసిన వాననీరు భూమిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టడం ద్వారా జల సంరక్షణ సాధ్యమవుతుంది. పరిమితంగా ఉన్న జల వనరులు- పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా అవసరాలను తీర్చలేవు కాబట్టి, వాటిని విచక్షణాయుతంగా వినియోగించుకోవాలి. భూగర్భ జలాలను పొదుపుగా వాడుకోవాలి. ప్రజలందరూ పౌరబాధ్యతగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించాలి. వాననీటిని వృథాగా పోనీయకుండా ప్రతి నీటి బిందువును జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటేనే రానున్న నీటిఎద్దడి నుంచి తప్పించుకోవచ్చు.

బహుముఖ నష్టాలు
కొన్నేళ్లుగా సకాలంలో వానలు కురవకపోవడం, రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ కురవడంతో, నీటిఎద్దడి నానాటికీ జటిలమవుతోంది. నీటి ఎద్దడి వల్ల రైతాంగం సేద్యంపై పెడుతున్న పెట్టుబడులు వృథా అవుతున్నాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 15 శాతాన్ని మించడంలేదు. వర్షాభావ పరిస్థితులు, కరవు తీవ్రత కొనసాగినట్లయితే సేద్యం కుదేలవడం ఖాయమని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే దేశప్రజల ఆహార భద్రతకు ముప్పు తప్పదు. పోషకాహార లోపం పేదప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వారిని మరింత పేదరికంలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. క్రమంగా నీటి ఎద్దడి ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రతికూల ప్రభావంతో నిరంతరం నిత్యావసరాల ధరలు పెరిగి, ప్రజల కొనుగోలుశక్తి పడిపోయే అవకాశమూ ఉంది.

దేశవ్యాప్తంగా 2000-01లో ఉన్న జలవనరుల సంఖ్య 5,56,601. 2006-07 నాటికి మిగిలినవి 5,23,816. ప్రస్తుతం పనికిరాకుండా పోయినవి 80,128. నిరుపయోగమైన జలవనరులు కర్ణాటకలో అత్యధికంగా 51 శాతం ఉన్నాయి. రాజస్థాన్‌లో 40 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం, తమిళనాడులో 30 శాతం, ఉత్తరాఖండ్‌లో 29 శాతం, గుజరాత్‌లో 23 శాతం జలవనరులు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లుగా తోడేస్తున్నాం తప్ప, అంతే స్థాయిలో వాటిని పునరుద్ధరించే మార్గాల గురించి ఆలోచించడం లేదు. కురిసే కొద్దిపాటి వాననీటినీ భూగర్భంలోకి మళ్ళించే ప్రయత్నాలు లోపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది!


Posted on 11-08-2019