Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

విపత్తు వ్యూహాలు మారాలి!

జలాశయాలు నిండుకున్నందున ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలకు కేంద్ర జలసంఘం ‘కరవు సలహా’ దయచేసి పట్టుమని మూణ్నెల్లు కాలేదు. ఒకవంక దుర్భర నీటి కటకటతో చెన్నై మహానగరం అలమటించిపోగా, మరోవంక భారీ వర్షాల తాకిడికి ముంబయి, నాసిక్‌ అతలాకుతలమైపోయాయప్పుడు! కేంద్ర జలసంఘం కరవు సలహా ఇచ్చినవాటిలో తెలంగాణ మినహా తక్కినవన్నీ నేడు భీకర వరద బీభత్సాన్ని ఎదుర్కొంటూ ‘కావవే వరదా’ అని అలమటిస్తున్నాయి. నిరుడు ఇవే రోజుల్లో కేరళ సౌభాగ్యాన్ని కసిగా కాలరాసిన భయానక వరదలు వేల గృహాలను నేలకూల్చి వందలమంది అభాగ్యుల్ని పొట్టన పెట్టుకొన్నాయి. ఇప్పుడు కూడా కేరళలో ఎనిమిది జిల్లాల్ని వణికిస్తున్న వరదలు, 80 చోట్ల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలు విపరీత ఆస్తి ప్రాణ నష్టాల్ని కళ్లకు కడుతున్నాయి. నావికా దళాన్ని రంగంలోకి దింపి వరద ముట్టడి నుంచి అభాగ్య జనాన్ని ఆదుకోవడానికి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ కిందుమీదులవుతున్నాయి. తమిళనాట నీలగిరి జిల్లాలో ఒక్కరోజులోనే ఏకంగా 91.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై దక్షిణ భారతావనిలోనే ‘రికార్డు’ సృష్టించింది. కొన్నాళ్ల క్రితం దాకా వానచుక్క జాడలేక అనావృష్టి ముష్టిఘాతాలకు సొమ్మసిల్లిన జనావళిపై అతివృష్టి ఝళిపించిన జలఖడ్గ ప్రహారాలివి! నాలుగున్నర దశాబ్దాల్లోనే అతి పెద్ద జలవిలయమంటూ ప్రాథమిక నష్టాలే రూ.6,000 కోట్లని కర్ణాటక అంచనా కడుతుంటే, ముమ్మర సహాయక చర్యల్లో మునిగితేలుతున్న రాష్ట్రాలన్నీ గుడ్లనీరు కుక్కుకొంటున్నాయి. వాతావరణ మార్పుల తాకిడి ఎంత భయవిహ్వలంగా ఉంటుందో ఏటికేడు పోటెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాల్లో ప్రస్ఫుటమవుతున్న నేపథ్యంలో- కష్టనష్టాల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త కార్యాచరణతో కదలాలి!

నేల నీటి వనరుల్ని మున్నెన్నడూ లేని స్థాయిలో మానవాళి దుర్వినియోగం చేస్తుంటే, దానికి వాతావరణ మార్పు దుష్ప్రభావాలు జతపడి ఆహార స్వావలంబన కష్టసాధ్యమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి మూన్నాళ్ల క్రితం హెచ్చరించింది. 52 దేశాలకు చెందిన వందమంది నిపుణులు రూపొందించిన నివేదిక- వరదలు, కరవులు, తుపానుల వంటి వైపరీత్యాలను ఎగదోస్తున్న వాతావరణ మార్పులతో ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థే దెబ్బతినిపోతోందని, పలు ఖండాల్లో ఒకేసారి ఆహార సంక్షోభం ఉత్పన్నమయ్యే ముప్పు పొంచి ఉందని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వాతావరణ మార్పులకు అత్యధికంగా గురయ్యే దేశాల జాబితాలో ఇండియా ఇప్పటికే ఆరో స్థానంలో ఉంది. 1998-2017 మధ్య వాతావరణ మార్పుల పర్యవసానంగా తలెత్తిన 11,500 ప్రకృతి వైపరీత్యాల్లో ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల 26 వేలమంది బలైపోయారని, మూడు లక్షల 47 వేలకోట్ల డాలర్ల ఆస్తినష్టం సంభవించిందని, 2030 నాటికి ఆస్తి ప్రాణనష్టాలు రెండు మూడు రెట్లు పెరగనున్నాయని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆ అంచనాల్ని కొట్టిపారేసే వీల్లేదని భారతీయ వాతావరణ శాఖ గణాంకాలు సాక్ష్యం పలుకుతున్నాయి. 1901 లగాయతూ ఇండియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఆరేళ్లలో నమోదైతే, ఆ ఆరూ గత పదేళ్లలోపే ఉన్నాయన్న వాతావరణ శాఖ- భూతాపం సత్యం, వాతావరణ మార్పు నిత్యం అని నిర్ధారిస్తోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని కాచుకోవడానికి తక్షణ, మధ్య, దీర్ఘకాలిక సన్నద్ధతలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి. చేతులు కాలాక ఆకుల కోసం వెంపర్లాట చందంగా కాకుండా, ప్రకృతి విపత్తుల నిభాయక యంత్రాంగాల్ని అన్ని స్థాయుల్లోనూ పరిపుష్టం చేసుకోవడం మొదలు ఆహార భద్రతకు లోటు రాకుండా కాచుకోవడానికీ యుద్ధప్రాతిపదికన కదలాలి!

నూట పాతికకు పైగా భిన్న వాతావరణ జోన్లు ఉన్న ఇండియాలోని సేద్యయోగ్య భూమిలో 68 శాతానికి కరవు ముప్పు, అయిదు కోట్ల హెక్టార్లకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉందన్న సంగతి నేతాగణాలకు తెలుసు. అంతర్జాతీయ విపత్తుల సమాచార నిధి గణాంకాల ప్రకారం, 1950-2015 మధ్యకాలంలో ఇండియాలో 268 భారీ వరదలు సంభవించగా 82.5 కోట్ల మంది దురవస్థల పాలయ్యారని, కోటీ 70 లక్షలమంది నిర్వాసితులు కాగా, 69 వేలమంది మృత్యువాత పడ్డారని నిపుణులు మొత్తుకొన్నారు! రుతువులు గతి తప్పి వ్యవసాయాన్ని, దేశ ఆహార భద్రతను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టేస్తున్న వేళ, జోన్లవారీగా సేద్యవ్యూహాల్ని పునస్సమీక్షించుకొని ముందడుగేయాలి. ప్రణాళికల రచన, అమలులో స్థానిక సంస్థలకు చోటుపెట్టి, ఆయా పరగణాల భౌగోళిక స్థితిగతుల్ని బట్టి ముంచుకువచ్చే ముప్పును సమర్థంగా కాచుకొనే సరికొత్త జీవన సంస్కృతికి పాదుచెయ్యాలని 2015నాటి ‘విశాఖ ప్రకటన’ ఉద్బోధించింది. అంటే, భూకంపాల విలయాన్ని ఎదుర్కోవడంలో జపాన్‌ ఎంత అప్రమత్తంగా ఉంటోందో... అలాగన్న మాట! వాతావరణ మార్పుల్ని తట్టుకోగల వరి వంగడాల్ని సత్వరం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి, రైతుకు అవి ఆర్థికంగా లాయకీ అయ్యేలా చూడటం- భారతావనికి మేలుబాట! దేశీయంగా వాతావరణ విపత్తులకు లోనుకాగల 151 జిల్లాల్ని గుర్తించామన్న కేంద్రప్రభుత్వం, వాటిని కాచుకొనే కార్యాచరణ ప్రణాళికను 33 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధం చేశాయని గత నెలలో రాజ్యసభాముఖంగా ప్రకటించింది. ఆయా ప్రణాళికలు కాగితాల్లోనే కొడిగట్టకుండా, సామాజిక చేతన పెంచి, పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాల నుంచి దేశం బయటపడగలిగేది!


Posted on 12-08-2019