Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

వనరులపై వేటు పర్యావరణానికి చేటు

* ఇసుక అక్రమ తవ్వకాలతో అనర్థాలు

దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో సాగుతున్న విచ్చలవిడి ఇసుక తవ్వకాలు పర్యావరణ వ్యవస్థలకు, జీవవైవిధ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. పకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ అడ్డగోలు ప్రక్రియను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. తాజాగా గోదావరిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. చిన్నపాటి ఇంటి నుంచి స్థిరాస్తి సంస్థలు నిర్మించే భారీ బహుళ అంతస్తుల భవంతులకూ ఇసుక అవసరం. నదీ పరీవాహకాలు, సముద్ర తీరాలు, ఇతర జలాశయాల పరీవాహక ప్రదేశాల్లోని ఉపరితలంలో ఇసుక తవ్వకం రోజురోజుకూ ఎక్కువవుతోంది. సముద్రతీరాల్లోని ఇసుకలో జిర్కోనియం, టైటానియం, థోరియం వంటి పరిశ్రమల్లో వినియోగించే విలువైన ఖనిజ వనరులు ఉంటాయి. ఇసుకలో లభించే ‘సిలికా’ వంటి పదార్థాలు ‘గాజు’ తయారీలోనూ వినియోగిస్తారు. రాతి ఇసుక, పర్యావరణహితమైన నిర్మాణాలపై అవగాహన పెరగకపోవడం, ప్రస్తుత అవసరాలకు తగినట్లు ఇసుకకు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించకపోవడం మూలంగా ఈ వనరులపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఏళ్ల తరబడి చవగ్గా లభించడం, చిన్న నదుల పరీవాహకాల్లో తవ్వకాలపై ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణ కొరవడటం మూలంగా ఇసుక తవ్వకాలు పెచ్చరిల్లాయి.

జీవవైవిధ్యానికి హాని
అడ్డూఅదుపూ లేకుండా సహజ వనరులను తవ్వితే జీవవైవిధ్యానికి అంతులేని హాని కలుగుతుంది. పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిని వాతావరణ ప్రతికూల మార్పులకు దారితీయడం ద్వారా జీవన వ్యవస్థల మనుగడ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇసుక వంటి సహజ వనరుల విషయంలో పొదుపుగా తవ్వకాలు సాగించకపోతే, తలెత్తే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నదుల ప్రవాహ స్థితిగతులు మారిపోయి వరదలు జనావాసాలపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్ళలో తూర్పు, పశ్చిమ కనుమల్లో పట్టణాలు, నగరాలను వరదలు ముంచెత్తడానికి అక్కడ సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. తవ్వకాలతో తీవ్ర నష్టం ఉందని తెలిసీ, అధికార వ్యవస్థలు ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండటం విచారకరం. ఇసుక వంటి సహజవనరులను ఒకసారి తవ్వితీస్తే పునరుద్ధరించడం వీలుపడదు. ఇసుక తవ్వకాలు సముద్ర తీర పర్యావరణ వ్యవస్థనూ ఛిద్రం చేస్తున్నాయి. నీటిపై ఆధారపడిన జీవజాలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సముద్ర జీవసంపద వృద్ధికి, కాలుష్య నియంత్రణకు విశేషంగా దోహదపడే ‘ఆలివ్‌ రిడ్లే’ తాబేళ్ళు సముద్రపు ఒడ్డున గుడ్లు పెడతాయి. తీరంలో ఇసుక తవ్వకాలవల్ల ఈ తాబేళ్లతో పాటు ఎన్నో రకాల జీవజాలం, పగడపు దిబ్బలు, తీర సముద్ర వ్యవస్థల మనుగడ ప్రమాదంలో పడుతోంది. అందమైన పర్యాటక ప్రాంతాల రూపురేఖలను ఇసుక తవ్వకాలు దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో పర్యాటక ఆదాయం కోల్పోయే పరిస్థితి నెలకొంది.

గనులు, ఖనిజాల అభివృద్ధి (నియంత్రణ) చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఇసుకను చిన్నతరహా ఖనిజాల జాబితాలో చేర్చారు. ఇసుక అక్రమ మైనింగ్‌, రవాణా, నిల్వలను నిరోధించే నియమాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటంతో, దేశవ్యాప్తంగా ఒకే విధానం లేదు. యమున, గంగ, కావేరి, గోదావరి, కృష్ణలతో పాటు అనేక చిన్న, పెద్ద నదీ పరీవాహక ప్రాంతాల్లో పెద్దయెత్తున జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ కోసం సర్వోన్నత న్యాయస్థానం, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వ వ్యవస్థలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయి. దీపక్‌ కుమార్‌ వర్సెస్‌ హరియాణా రాష్ట్ర ప్రభుత్వం (2012) కేసులో సర్వోన్నత న్యాయస్థానం నదులకు ఎటు పక్కనైనా లేదా నదీ గర్భంలోనైనా చేపట్టే ఇసుక తవ్వకాలు జీవవైవిధ్యాన్ని నష్టపరచి, పర్యావరణాన్ని నాశనం చేస్తాయని పేర్కొంది. తవ్వకాలు అయిదు హెక్టార్ల విస్తీర్ణం దాటితే, జాతీయ, రాష్ట్రస్థాయిల్లో అనుమతులు తీసుకోవాలని నిర్దేశించింది. ఖనిజ వనరుల తవ్వకాలు, ‘క్వారీ’ల విషయంలో పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా అమలవుతున్న పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల మేరకు అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. నదీ గర్భాల్లో ఇసుక వెలికితీయడం, వాణిజ్యపరంగా విక్రయించడాన్ని మైనింగ్‌గానే పరిగణిస్తారు. దీనికి పర్యావరణ అనుమతులు అవసరమని మార్గదర్శకాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఈ మార్గదర్శకాలను గత మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో అమలుచేసిన దాఖలాలు లేవు. మార్గదర్శకాల ప్రకారం ఇసుక, ఖనిజాల తవ్వకాలు అయిదు హెక్టార్ల విస్తీర్ణానికి మించితే, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ నష్ట ప్రభావాన్ని మదింపు చేయాలి. తవ్వకాల అనంతరం నష్ట ప్రభావాన్ని తగ్గించే చర్యలు సూచిస్తూ లీజులు మంజూరు చేయాలి. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా వ్యవస్థలు ఏర్పాటైన దాఖలాల్లేవు.

హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలపై అలక్ష్యం
నదీ ప్రవాహ ప్రాంతాల్లో చేపడుతున్న తవ్వకాలు ప్రవాహ దిశను మార్చేస్తాయి. పద్ధతిలేని తవ్వకాలు నదుల ఎగువన, సమీప ప్రాంతాల్లో అడవుల క్షీణతకూ కారణమవుతున్నాయి. ఈ అంశాలు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం (2010) పరిధిలోని మొదటి షెడ్యూలు కిందకు వస్తాయి. 2015లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగపాల్‌ సస్పెన్షన్‌, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌ అశిష్‌ కుమార్‌ బదిలీ వంటి వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో అదుపులేని ఇసుక తవ్వకాలపై దాఖలైన వ్యాజ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సమగ్ర ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, లీజులు లేకుండా సాగుతున్న తవ్వకాలను నిలిపివేయాలని న్యాయస్థానం పర్యావరణ మంత్రిత్వశాఖను ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లాస్థాయి అధికారులు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సుస్థిర ఇసుక తవ్వకాలు, యాజమాన్య పద్ధతుల నిర్వహణ కోసం 2016లో వంద పేజీల స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వీటి సాయంతో రాష్ట్రాలు ప్రత్యేక ఇసుక విధానాల ద్వారా నదీ పరీవాహకాల్లో తవ్వకాలు సుస్థిర ప్రాతిపదికన సాగించే వీలుగా చర్యలు చేపట్టాలి. వీటిపై ప్రభుత్వాల్లో అలక్ష్యం నెలకొంది.

పౌర సమాజ భాగస్వామ్యం కీలకం
నేతల జోక్యం, ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా ఏళ్ల తరబడి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెద్దయెత్తున ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. చాలా రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త ఇసుక విధానాలను తీసుకురావడంలో జాప్యం చేశాయి. మార్గదర్శకాలు వచ్చాక కూడా గత మూడేళ్లలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇసుక తవ్వకాల విషయంలో పలు రాష్ట్రాల వైఖరిని ఆక్షేపించడం గమనార్హం. గోవాలో ఇసుక తవ్వకాల ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయకపోతే, నిర్ణీత కాలంలో 20 లక్షల రూపాయలను కేంద్ర కాలుష్య మండలికి చెల్లించాలని ట్రైబ్యునల్‌ హెచ్చరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయనే అంశంపై వంద కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించడం సంచలనం కలిగించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులను నిలిపివేసింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలు ఇసుక తవ్వకాల లీజులు, అనుమతుల మంజూరు, నియంత్రణ ప్రక్రియలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విధానాలను అమలులోకి తీసుకురావడంతో పాటు, ఆన్‌లైన్‌లో కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాయి. తెలంగాణలో ఏడాదిన్నర క్రితమే ఇసుక తవ్వకాలకు ప్రత్యేక విధానం తీసుకొచ్చినా తాజాగా జాతీయ ట్రైబ్యునల్‌ ఆక్షేపణలతో లోపభూయిష్ఠ విధానాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా, అవసరం మేరకు తవ్వకాలు సాగేవిధంగా నియంత్రించాల్సి ఉంది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ఇసుక తవ్వకాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలూ కఠినంగా వ్యవహరించాలి. క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ అవసరం. రెవిన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ విభాగాల సిబ్బందితో ముడిపడి ఉన్న ఇసుక తవ్వకాల్లో వారు జవాబుదారీగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించేవిధంగా చర్యలు చేపట్టాలి. లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజాలను శుద్ధి చేయడం ద్వారా వచ్చే రాతి ఇసుక, ఫ్లైయాష్‌ వంటి ప్రత్యామ్నాయ వనరుల వాడకాన్ని పెంచి, ఇసుకపై ఒత్తిడి తగ్గించాలి. ఇసుక తవ్వకాలతో దెబ్బతింటున్న నదీ పరీవాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల పరిరక్షణలో పౌరసమాజ భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలి!


Posted on 13-09-2019