Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

ఏ చీకట్లకీ ప్రస్థానం?

‘మనిషి మనుగడకు ఆధారమైన అడవులపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది... ఇదే పరిస్థితి కొనసాగితే వన్యప్రాణులతోపాటు మనుషులకూ తీవ్రనష్టం వాటిల్లుతుంది’ అని వివిధ రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధానాధికారులు ఆందోళన వ్యక్తీకరించిన నేపథ్యంలో- నల్లమలపై యురేనియం తవ్వకాల క్రీనీడలు కమ్ముకొస్తున్నాయి. అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యంలో యురేనియం నిల్వల్ని అన్వేషించేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిధిలోని అటవీ సలహా మండలి- ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు సూత్రప్రాయ అనుమతి దయచేయడం కలకలం రేపుతోంది. యురేనియం అన్వేషణ ప్రాంతం ఇప్పుడు 20 వేల ఎకరాలున్నా, అది పోనుపోను లక్ష ఎకరాలకు విస్తరించగల వీలుందన్న హెచ్చరికలు చెవిన పడుతుంటే- తవ్వకాలతో కలిగే ముప్పు తీవ్రతను అంచనా వెయ్యలేకపోయామని తెలంగాణ అటవీశాఖ ఆందోళన చెందుతోంది. నిజానికి నల్లమలలో 2008 నుంచే మొదలైన ఖనిజాన్వేషణ 2009, 2012లోనూ కొనసాగింది. నాగర్‌ కర్నూలు, నల్గొండ జిల్లాల పరిధిలో 1.95 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని అడవుల్లో వేలకోట్ల రూపాయల విలువ చేసే యురేనియం నిల్వలున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో రెండేళ్ల క్రితమే ఖనిజ తవ్వకాలకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ మండలి స్థాయీసంఘం ఆమోదం తెలిపింది. అత్యంత అరుదైన వృక్షరాశులు, అంతరించిపోనున్న వన్యప్రాణులకు అరుదైన ఆవాసంగా, మొత్తం 110 గూడేల్లో 10వేల మందికి పైగా చెంచులకు నివాసంగా ఉన్న అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు- పర్యావరణానికి, వన్యప్రాణులకే కాదు- సాధారణ జనజీవనానికీ ఎనలేని చెరుపు చేస్తుందని ఎంతోమంది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు శ్రీశైలం, మరోపక్క నాగార్జునసాగర్‌ జలాశయాలపై యురేనియం దుష్ప్రభావం ప్రసరిస్తే మహోపద్రవం తథ్యమనీ హెచ్చరిస్తున్నారు. కాలుష్య రహితమంటూ అణువిద్యుత్‌ ప్రాజెక్టుల్ని నెత్తినమోస్తూ, యురేనియం తవ్వకాలతో ప్రజారోగ్యాన్ని, ప్రకృతినీ ధ్వంసం చేస్తూ ప్రభుత్వాలు ఏ చీకట్లలోకి దేశాన్ని తోడ్కొనిపోతున్నట్లు?

ఇప్పటిదాకా ఇండియాలో కనుగొన్న యురేనియం నిక్షేపాలు తక్కువ నాణ్యత లేదా కొద్ది పరిమాణంలో మాత్రమే లభ్యమయ్యాయి. తెలంగాణలోని అమ్రాబాద్‌ అభయారణ్యంలో చేపట్టిన పరిశోధనలు అత్యంత నాణ్యమైన భారీ నిక్షేపాల ఆనవాళ్లను పట్టిస్తున్నాయన్న అణుఇంధన విభాగం తన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. 2020నాటికి 20 వేల మెగావాట్ల అణువిద్యుత్‌ ఉత్పాదన లక్ష్యం దశాబ్దాలుగా మోతెక్కిపోయినా ఇప్పటికి 6,780 మెగావాట్ల స్థాపిత సామర్థ్యమే సాధ్యపడింది. 2030నాటికి ఎకాయెకి 40వేల మెగావాట్ల అణువిద్యుత్‌ ఉత్పాదనను కొత్తగా లక్షించి సరికొత్త ప్రాజెక్టులకు నిర్నిరోధంగా యురేనియం సరఫరాలు సాగించే ఉద్దేశంతో కొత్త క్షేత్రాల్లో తవ్వకాల ప్రతిపాదనల అమలు జోరందుకొంటోంది! నల్లమలలో తవ్వకాలపై స్థానికుల అభ్యంతరాలను ప్రస్తావిస్తూ 2017 జులైలో రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు- సర్వేకు ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తమైనట్లు అణుఇంధన విభాగం దృష్టికి రాలేదని కేంద్రం స్పష్టీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొవ్వాడ, మహారాష్ట్రలోని జైతాపూర్, తమిళనాడులోని కుడంకుళం, హరియాణాలో గోరఖ్‌పూర్, గుజరాత్‌కు చెందిన మిత్తీవిర్థి, కాక్రపార్, పశ్చిమ్‌ బంగలోని హరిపూర్‌లలో అణువిద్యుత్‌ ప్రాజెక్టులు మాకొద్దు మహాప్రభో... అని స్థానికులు తీవ్రాందోళన వ్యక్తీకరించినా- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బధిరాంధక పాత్రను సమర్థంగా పోషించాయి. దేశంలో ఎక్కడైనా యురేనియం తవ్వకాలు, శుద్ధి చేపట్టాలనుకొంటే స్థానిక జనాభిప్రాయాన్ని కోరాలని గతంలోనే సుప్రీంకోర్టు లక్ష్మణరేఖలు గీసింది. కడప జిల్లా ఎం.తుమ్మలపల్లె వద్ద యురేనియం కర్మాగారం నిమిత్తం జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ 2006లో నాటి కాంగ్రెస్‌ ఎంపీ కనుసన్నల్లో ఎంత ఫార్సుగా తెమిలిపోయిందో అందరికీ తెలిసిందే. ఝార్ఖండ్‌లోని జాదూగోడా గ్రామంలో యురేనియం తవ్వకాల తాలూకు దుష్ప్రభావాలతో జనం దురవస్థల పాలవుతున్నా పట్టించుకోని పాలక శ్రేణులు అదే ముప్పును మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోవడం- క్షమార్హం కాని నేరమే!

పారిస్‌ ఒప్పందానికి లోబడి 2030నాటికి ఇండియా కనీసం 40 శాతం శిలాజేతర ఇంధన వినియోగానికి కట్టుబడుతుందని ప్రధాని మోదీ ఘనంగా చాటారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 అణు రియాక్టర్లు ఉంటే, వాటిలో 14 యురేనియం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. 2025నాటికల్లా పూర్తి అయ్యేలా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణాల్లో మరో పది రియాక్టర్ల ఏర్పాటుకు సంకల్పించిన మోదీ ప్రభుత్వం- కొత్త అణువిద్యుత్‌ కేంద్రాలకు సంబంధించిన విడి భాగాల దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాల్ని ఎత్తేసింది. పెరుగుతున్న అణువిద్యుత్‌ కేంద్రాల అవసరాలకు యురేనియం తవ్వకాలు జరిపి తీరాల్సిందేనన్నది ప్రభుత్వ విధాన ప్రకటనల సారాంశం. దురదృష్టం ఏమిటంటే, ప్రగతి లక్ష్యాల పేరిట పర్యావరణాన్ని, భవిష్యత్‌ తరాల బాగును పణం పెట్టాలా అన్నదే ప్రశ్నార్థకం! గతంలో ఛెర్నోబిల్, ఎనిమిదేళ్ల క్రితం జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రాల్లో సంభవించిన దారుణ ప్రమాదాలు ఎంతటి ఘోరకలికి కారణమయ్యాయో తెలిశాక అభివృద్ధి చెందిన దేశాలే తమ దృక్కోణాల్ని మార్చుకొంటున్నాయి. అణువిద్యుత్‌ కేంద్రాల భద్రతపై ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి కిందుమీదులవుతున్న జపాన్‌- 14వేల టన్నుల అణుఇంధన వ్యర్థాల సమస్యను ఎదుర్కొంటోంది. అసలు ఇండియా లాంటి దేశాలకు పవన, సౌరశక్తి కొండంత అండగా నిలుస్తున్నప్పుడు, ఆయా ప్రాజెక్టుల స్థాపక వ్యయం సైతం భారీగా తగ్గి సరసమైన రేట్లకే విద్యుత్‌ అందుబాటులోకొస్తున్నప్పుడు- అన్ని విధాలుగా ఆందోళనకరమైన అణువిద్యుత్‌ కోసం వెంపర్లాట ఎందుకు? జనం గుండెలపై అణుకుంపట్లు కాదు, వారి ఇళ్లలో దీపాలు వెలిగించేలా సౌరశక్తిని సంపూర్ణంగా నమ్ముకొని ముందడుగేయడం అన్ని రకాలుగా మేలు!


Posted on 16-07-2019