Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

నల్లమల నిర్వీర్యం!

* యురేనియం అన్వేషణ ప్రయత్నాలు

పచ్చని పొలాలు విషతుల్యమయ్యే, కాలుష్యాన్ని పెంచే, సహజ వనరులను నిర్వీర్యం చేసే విధానాలు ప్రజల జీవితాలనూ ఛిన్నాభిన్నం చేస్తాయి. ప్రకృతి సిద్ధమైన అడవులు, వన్యప్రాణులు, నీటి వనరుల విధ్వంసానికి దారితీసే నిర్ణయాలు అభివృద్ధిని దెబ్బతీస్తాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలోని నల్లమలలో యురేనియం అన్వేషణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా సర్కారులో స్పందన కొరవడింది. దేశవ్యాప్తంగా 2,32,315 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధికంగా 52.75 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. 24.72 శాతం ఝార్ఖండ్‌లో, 8.41 మేఘాలయలో, 6.77 తెలంగాణలో, 3.44 రాజస్థాన్‌లో, 1.71 కర్ణాటకలో, 1.45 ఛత్తీస్‌గఢ్‌లో, 0.29 ఉత్తర్‌ప్రదేశ్‌లో, 0.29 హిమాచల్‌ప్రదేశ్‌లో, 0.13 మహారాష్ట్రలో, 0.04 శాతం ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.

ప్రభుత్వ సంస్థలే కాలుష్య నియంత్రణ చట్టాలను అతిక్రమించడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ భారత్‌ యురేనియం సంస్థ జరుపుతున్న తవ్వకాలు, ఉత్పత్తి ప్రక్రియ, కర్మాగార కార్యక్రమాలు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు భిన్నంగా ఉన్నాయి. కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలను సమీప చెరువులోకి వదులుతుండటంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ వ్యర్థాలు చెరువు చుట్టుపక్కల గల భూములలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు విషపూరితమవుతున్నాయి. యురేనియం వెలికి తీయడంలో కనబరిచే శ్రద్ధ, ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణ విషయంలో చూపితే ప్రజల జీవితానికి ముప్పు తప్పుతుంది. కానీ, ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషించిన నీటి రసాయనిక పరీక్ష ప్రకారం ఈ ప్రాంతంలో మొత్తం నీటిలో కరిగిఉన్న లవణాలు, నీటి క్షారత్వం, నీటి కాఠిన్యత, సల్ఫేట్‌, యురేనియం, క్రోమియం, నికెల్‌... అధిక మోతాదులో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ తాగునీటి ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నీటిలో అధిక లవణాల ఫలితంగా మూత్రపిండాలు, ఉదర బాధలు కలుగుతాయి. సల్ఫేటు కారణంగా నీరు చేదుగా మారుతుంది. యురేనియంతో మూత్రపిండాలు, క్యాన్సరు, చర్మవ్యాధులు ఏర్పడతాయి. క్రోమియం వల్ల క్యాన్సరు, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమవుతాయి. నికెల్‌తో ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. అధిక క్షారత్వం ఫలితంగా వ్యవసాయ భూములు గట్టిపడి, మొక్కలు భూమి నుంచి పోషకాలను సరిగా తీసుకోలేవు. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది.

పర్యావరణ నిబంధనల ప్రకారం వ్యర్థాలను నిల్వచేసే చెరువు లోపల బెన్‌టోనైట్‌ అనే మట్టితో 500 మి.మీ.మందంతో పొరను ఏర్పాటు చేయాలి. దీనిపై 250 మైక్రాన్‌ మందంతో ఉండే పాలియాథిలిన్‌ పొరను, తరవాత మళ్లీ 250 మి.మీ.మందంతో ఇసుక లేదా మట్టిపొరను రక్షణ కవచంగా నిర్మించాలి. అయితే చెరువులో ఇంతవరకు పాలియాథిలిన్‌ పొరను అమర్చలేదు. గత ఏడాది విడుదలైన మార్గదర్శకాల ప్రకారం చెరువు నుంచి భూగర్భంలోకి ఎలాంటి వ్యర్థాలూ ఇంకకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం కాలవ్యవధితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నా ఫలితం లేదు. తెలంగాణలోని నల్లమల... ఆమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలోగల పెద్దగట్టు, లంబాపూర్‌లో 2003-05 మధ్యకాలంలో యురేనియం అన్వేషణకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆపివేశారు. తాజాగా మళ్లీ యురేనియం అన్వేషణ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం 83 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో బోర్లు వేయనున్నారు.

నల్లమల అడవులు ప్రకృతి సంపదకు, ఆదిమ చెంచు, బంజారా తెగలకు నిలయం. జీవవైవిధ్యానికి ఆయువు పట్టు. యురేనియం తవ్వకాల వల్ల సమీపంలోని కృష్ణానదీ జలాలు కలుషితం అవుతాయి. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ విషయమై వివిధ రాజకీయ పార్టీలతోపాటు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా యురేనియం అన్వేషణ ప్రయత్నాలకు ముందు తప్పనిసరిగా స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. వీటిని సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థలే లెక్కచేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పవన, సౌరశక్తి అందుబాటులోకి వచ్చాయి. వీటిని చౌకగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచంలో పవన విద్యుత్‌ ఉత్పాదన 17 శాతం, సౌర విద్యుత్‌ ఉత్పాదన 35 శాతం పెరగగా, అణు విద్యుత్‌ 25 శాతం మాత్రమే పెరిగింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఖనిజాల తవ్వకాల వల్ల కలిగే ప్రభావాలు, ప్రమాదాలను మదింపు చేయడానికి భూగర్భ సాంకేతిక నిపుణులతో ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. యురేనియం తవ్వకాల వల్ల రైతులకు కలిగే నష్టాలను అంచనా వేయడానికి అమెరికాలో ప్రత్యేకంగా ఓ సంస్థ ఉంది. జర్మనీ లాంటి దేశాలు యురేనియం పీడ నుంచి ప్రజల్ని, పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌ సైతం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారత్‌లోనే భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో యురేనియం అన్వేషణకు జరుగుతున్న ప్రయత్నాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనిని వికాసమంటారా, వినాశనమంటారా అనే విషయమై అందరూ ఆలోచించాలి!


- ఆచార్య నందిపాటి సుబ్బారావు
(రచయిత- భూవిజ్ఞానశాస్త్ర రంగ నిపుణులు)
Posted on 24-09-2019