Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

జీవన్మరణ సంక్షోభమిది!

ప్రపంచ మానవాళిపై పర్యావరణం అక్షరాలా భీకర రణమే చేస్తోంది. అభివృద్ధి పేరిట శతాబ్దాలుగా మనిషి సాగించిన ప్రకృతి వనరుల విధ్వంసం అత్యంత ప్రమాదకరంగా భూతాపం పెరుగుదలకు, వాతావరణ మార్పులకు కారణభూతమై ప్రాణాంతక ఉత్పాతాల్ని సృష్టిస్తోంది. ఈ శతాబ్దాంతానికి భూతాపంలో పెరుగుదలను- పారిశ్రామికీకరణకు ముందునాటికన్నా రెండు డిగ్రీల సెల్సియస్‌ తక్కువకు పరిమితం చేసేలా ప్రపంచ దేశాల కార్యాచరణ ఉండాలని 2015నాటి చరిత్రాత్మక ప్యారిస్‌ ఒడంబడిక నిర్దేశిస్తోంది. ప్యారిస్‌ ఒడంబడిక అమలు తీరు ఎలా ఉందని ఆరా తీయబోతేనే తీవ్రాందోళన కమ్ముకొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలమంది పాఠశాల పిల్లలు వీధుల్లో కొచ్చి ‘మా తరాన్ని మీరు ఏం చేయబోతున్నా’రంటూ నిష్పూచీతనం వెలగబెడుతున్న నేతాగణాల్ని నిలదీసి ప్రశ్నించిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ నిర్వహించిన ప్రత్యేక సదస్సు కొంత కదలికను తీసుకురాగలిగిందనే చెప్పాలి. ‘ప్రసంగ పాఠాలతో కాదు, పక్కా కార్యాచరణ ఉంటేనే రండి’ అంటూ బ్రెజిల్‌, సౌదీ అరేబియా, అమెరికా, జపాన్‌, దక్షిణాఫ్రికాలకు ఉపన్యసించే అవకాశం తోసిపుచ్చిన గుటెరస్‌- నాలుగు అంశాలకు ప్రపంచ దేశాల కట్టుబాటును అభిలషించారు. 2020 తరవాత కొత్త బొగ్గు క్షేత్రాల్ని తెరవరాదని, శిలాజ ఇంధనాలకు రాయితీల రూపేణా ముట్టచెబుతున్న నాలుగు లక్షల 70వేల కోట్ల డాలర్ల వ్యయాన్ని నిలిపివేయాలని, 2050 నాటికి కర్బన ఉద్గారాల పరంగా సమతూక స్థాయి సాధించాలని, కాలుష్యకారకులపై సుంకాలు విధించాలన్న బృహత్‌ లక్ష్యాలతో నిర్వహించిన సదస్సు పరిమిత ఫలితాల్నే అందించిందని చెప్పాలి. జి-20 దేశాల్లో ఇండియా ఒక్కటే ప్యారిస్‌ ఒప్పంద స్ఫూర్తికి గొడుగుపడుతున్నట్లు నివేదికలు చాటుతున్నా శిలాజేతర ఇంధనం వాడకాన్ని 2022 నాటికే 450 గిగావాట్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తక్కిన దేశాల్లో ఆ తరహా చొరవ కొరవడబట్టే, ముమ్మరిస్తున్న ఉత్పాతాలతో మనిషి మనుగడే దుర్భరమవుతోందిప్పుడు!

లక్షల సంవత్సరాలుగా భూగర్భంలో నిక్షిప్తమైన బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల్ని వెలికితీసి మండిస్తుండటంతో వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల పరిమాణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకసారి విడుదలైన బొగ్గుపులుసు వాయువు, నైట్రేట్‌ ఆక్సైడ్‌ వంటివి వందేళ్లపాటు వాతావరణంలో నిక్షేపంగా నిలిచి ఉండి విధ్వంసకర శక్తులవుతాయన్న వాస్తవాల వెలుగులో- భూతాప నివారణకు దేశ దేశాల బాధ్యతాయుత స్పందన ఏ రీతిగా ఉండాలో ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రాకతో ఆ ఒడంబడిక నీరుగారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల్లో 15శాతానికి పుణ్యం కట్టుకొంటున్న అమెరికా నిష్పూచీగా ఆ ఒప్పందాన్ని కాలదన్నడంతో- భూతాప కట్టడి లక్ష్యాల్ని సాధించాలంటే తక్కిన దేశాలు తమ వాగ్దానాలకు మించి పరిశ్రమించాల్సి ఉంది. దురదృష్టం ఏమిటంటే, ఆమోదిత అజెండాకు మిగతా దేశాలూ దూరం జరుగుతుండబట్టే పెను ముప్పు తరుముకొస్తోంది. 2030నాటికి భూతాపంలో వృద్ధిని ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చెయ్యాలంటే, ప్రస్తుత ఉద్గారాలను దాదాపు సగానికి తెగ్గోయాల్సి ఉంటుంది. ఆర్థికంగా వెనకబడిన దేశాలు ఉమ్మడి బాధ్యతను నెరవేర్చేలా చూడటానికి 2020నాటికి ఏటా పదివేల కోట్ల డాలర్ల హరిత నిధిని అందుబాటులో ఉంచాలి. ప్రపంచ దేశాలపై అలుముకొన్న స్తబ్ధతను చెదరగొట్టి గట్టిమేలు తలపెట్టేలా విస్పష్ట హామీలు రాబట్టడంలోనైతే సమితి సదస్సు ఫలప్రదమైంది. పారిశ్రామిక ప్రపంచానికే చెందిన 77 దేశాలు కర్బన ఉద్గారాల కట్టడికి కట్టుబాటు చాటాయంటున్నా, ప్రస్తుతం ఉన్నదాంట్లో వాటన్నింటి వాటా సగానికన్నా తక్కువే. కర్బన ఉద్గారాల్లో ఏటా రెండుశాతం పెరుగుదల - ఆశయాలకు ఆచరణకు మధ్య అగాధాన్ని ఎలుగెత్తి చాటేదే!

వాతావరణ మార్పుల తాలూకు దుష్ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది జనావళికి జీవన్మరణ సమస్యగా మారాయన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. గతి తప్పుతున్న రుతువులు, అతివృష్టి అనావృష్టి వైపరీత్యాలు, తగలబడుతున్న అడవులు, అడుగంటుతున్న భూగర్భ జల సూచీలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, భీకర వరదలు, భయానక తుపాన్లు... ఇలాంటి ఉపద్రవాలన్నింటికీ భూతాప సంక్షోభమే తల్లివేరు అన్నది నిజం. ప్యారిస్‌ ఒప్పందానుసారం ఆయా దేశాలు నిర్దేశించుకొన్న జాతీయ లక్ష్యాల మేరకు కర్బన ఉద్గారాల్ని నియంత్రించినా, 2100నాటికి భూతాపం మూడు డిగ్రీల సెంటీగ్రేడుకు పెరుగుతుందని సమితి ప్రధాన కార్యదర్శి వాపోతున్నారు. 2030నాటికి గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాల పరిమాణాన్ని 2010 స్థాయి కంటే 45శాతం తగ్గించగలిగితేనే మానవాళికి మనుగడ ఉంటుందని ఎవరెంతగా మొత్తుకొంటున్నా చెవినపెడుతున్న నాథుడు లేడు! ఇప్పటికీ జి-20 దేశాల ఇంధన అవసరాల్లో 82శాతానికి శిలాజ ఇంధన వనరులే ఆధార భూతంగా నిలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అంతర్జాతీయ శాంతి భద్రతలపైనా దుష్ప్రభావం ప్రసరిస్తాయంటూ మాల్దీవులు మటుమాయమయ్యే ప్రమాదాన్ని ఆ దేశమే ప్రస్తావిస్తుంటే, ఇండొనేసియా తన రాజధానిని జకార్తానుంచి వేరే చోటికి తరలిస్తోంది. తామరతంపరగా పెరుగుతున్న పట్టణాలే 78శాతం ఇంధనాన్ని వినియోగించుకొంటూ 60శాతం కర్బన ఉద్గారాల్ని వెదజల్లుతున్నందున హరిత పరివర్తన అక్కడినుంచే మొదలు కావాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ద్వారా భూతాప నివారణ, సరికొత్త ఉపాధి అవకాశాల విస్తరణ సాధ్యపడేలా శాస్త్రీయ విధానాల్ని రూపొందించి అమలు చేసినప్పుడే యావత్‌ ప్రపంచం తెరిపినపడేది!


Posted on 25-09-2019