Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ప‌ర్యావ‌ర‌ణం

కృతి వైపరీత్యం... ప్రగతికి విఘాతం

* వాతావరణ మార్పుల ఫలితం

ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు- ఇటీవల కాలంలో ఇలా పరస్పర విరుద్ధ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. భారత్‌లోనే కాకుండా, పలు దేశాల్లో ఈ వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసం భూతాపానికి సంబంధించిన దుష్పరిణామాలకు సంకేతమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హిందూకుష్‌ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని 64 శాతం వరకు హిమానీ నదాలు భూతాపం ప్రభావంతో కరగిపోనున్నాయని ‘వాతావరణ మార్పులపై అంతర్‌ ప్రభుత్వ నిపుణుల సంఘం (ఐపీసీసీ)’ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. సముద్రనీటి మట్టాలు అంచనాలకు మించిన వేగంతో పెరుగుతున్నాయని పేర్కొంది. కర్బన ఉద్గారాలను వేగంగా నియంత్రించి, భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించినప్పటికీ, 2100 సంవత్సరంనాటికి సముద్ర మట్టాలు 30 నుంచి 50 సెంటీమీటర్ల మేర పెరుగుతాయని తెలిపింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 45 నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. వీటిల్లో కోల్‌కతా, ముంబయి, సూరత్‌, చెన్నై ఉన్నాయని పేర్కొనడం రానున్న విపత్తు తీవ్రతను చెప్పకనే చెబుతోంది. భూతాపంతో ఉపాధికీ పెనుముప్పు ముంచుకొస్తోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా సాగుతున్న దశలో భూతాపంవల్ల సంభవిస్తున్న అనూహ్య వాతావరణ మార్పులు ఆర్థికంగా దేశాన్ని మరింత కుంగదీయనున్నాయి. భూతాపం, వాతావరణ మార్పులతో భారత్‌ తీవ్ర నష్టాన్ని భరించాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి కార్మిక విభాగం ఇటీవలే హెచ్చరించింది. దీనివల్ల వ్యవసాయ, నిర్మాణ రంగాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. భారత్‌ ఉత్పాదకతపరంగా 2030 నాటికి 5.8 శాతం పని గంటలను కోల్పోతుందని, ఫలితంగా 3.40 కోట్ల ఉద్యోగాలకు కోత పడనుందని పేర్కొంది. అత్యధిక శాతం వ్యవసాయం మీదే ఆధారపడిన భారత్‌ వంటి దేశాల్లో ఈ విపరిణామాలు ఆర్థికంగా చితికిపోవడానికి దోహదం చేస్తాయి. ఇప్పటికే దేశంలో మోటారు వాహనాల రంగం తిరోగమనం పాలై, వేలాది ఉద్యోగాలకు కోత పడగా, అంతంత మాత్రంగానే ఉన్న వ్యవసాయ రంగం వాతావరణ మార్పుల తీవ్రతకు తట్టుకోలేకపోతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే పెరుగుతున్న భూతాపాన్ని కట్టడి చేయాల్సిందే.

కార్మికులకు కష్టకాలం
తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయ, నిర్మాణ రంగ కార్మికులు ఆరుబయట పనిచేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి వాతావరణంలో పనిచేయడం వల్ల కార్మికులు హృదయ సంబంధ వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు శాతానికి పైగా పని గంటలను నష్టపోతారు. ఎనిమిది కోట్ల కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఐరాస నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్‌ దాటితే బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. 2030 నాటికి నిర్మాణ రంగంలో ఏటా 19 శాతం పనిగంటలు కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. దీంతో ప్రపంచ దేశాలు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా చతికిలపడే ప్రమాదం ఉంది.

అనూహ్య వాతావరణ మార్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల మూలంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలే. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. థాయ్‌లాండ్‌, కంబోడియా, భారత్‌, పాకిస్థాన్‌ల స్థూల దేశీయోత్పత్తి అయిదు శాతం మేర తగ్గిపోయే అవకాశం ఉంది. భూతాప ప్రభావం వ్యవసాయ రంగం మీదే ఎక్కువగా ఉండటం వల్ల 2030 నాటికి ఏటా 60 శాతం పని గంటలు నష్టపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం హెచ్చరించింది. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితేే 2030 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా కలిగే ఆర్థిక నష్టం 2,400 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.166 లక్షల కోట్ల) మేర ఉంటుందన్నది ఐరాస అంచనా. 2019 ఏప్రిల్‌లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం భూతాపం-వాతావరణ మార్పులు ఆర్థికరంగాన్ని ప్రభావితంచేసే తీరును కళ్ళకు కట్టింది. 1960 నుంచి విడుదలవుతున్న హరితగృహ వాయు ఉద్గారాలు శీతల దేశాలైన నార్వే, స్వీడన్‌లను ఆర్థికంగా పరిపుష్టం కావిస్తే, భారత్‌, నైజీరియా వంటి దేశాల్ని ఆర్థికంగా కుంగదీశాయి. సంపన్న దేశాలు మరింత సుసంపన్నం కాగా, పేదదేశాలు మరింత పేదరికంలోకి కూరుకుపోయాయి. 1961 నుంచి 2010 వరకు భూతాపం ప్రభావం పరిస్థితులను పరిశీలిస్తే, ప్రపంచంలోని అతిపేద దేశాల్లోని పౌరుల సగటు తలసరి ఆదాయంలో 17 నుంచి 30 శాతం వరకు కోతపడింది.

భూతాపం - ప్రభావాలు
ఆరోగ్యం: మలేరియా, డయేరియా, ప్లేగు, ఫ్లూ తదితర వ్యాధులు ప్రబలుతాయి.
విపత్తులు: సముద్ర జలాలు వేడెక్కేకొద్దీ తుపాన్లు, ఇతర వైపరీత్యాలు తీవ్రమవుతాయి. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
సముద్ర మట్టాలు: భూతాపం వల్ల మంచు ఫలకాలు, హిమానీ నదాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతాయి. నగరాలు, దీవులు పల్లపు ప్రాంతాలు జలమయమవుతాయి. హిమానీ నదాలు కరగడంవల్ల మంచినీటి కొరత తీవ్రమవుతుంది.
జీవుల మనుగడ ప్రశ్నార్థకం: జీవులు, ముఖ్యంగా సముద్రజీవుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. సముద్ర జీవుల ఆహారానికీ కొరత ఏర్పడుతుంది.
నేలలు: నేలలు ఎండిపోయి, కరవులు-కాటకాలు తాండవిస్తాయి. ఆహార భద్రత, ఉపాధి కరవై ప్రజలు వలస వెళతారు.
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం: తరచూ తలెత్తే ప్రకృతి విపత్తులు, వరదలు, కరవు కాటకాలు, వ్యాధుల విజృంభణ, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు దేశాన్ని ఆర్థికంగా కుంగదీస్తాయి.

ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం, మలేరియా, డయేరియా వంటి జబ్బులతో ఏటా చోటు చేసుకునే సాధారణ మరణాలకంటే అదనంగా 2.50 లక్షల మరణాలు వాతావరణ మార్పులవల్ల సంభవించనున్నాయి. ప్రత్యేకించి మహిళలు, బాలికలు భూతాపం ప్రతికూల పరిణామాల బారిన పడతారు. గడచిన 40 ఏళ్లలో ప్రపంచంలో సేద్యయోగ్యమైన భూవిస్తీర్ణంలో మూడింట ఒక వంతు భూతాపంవల్ల కోల్పోవలసి వచ్చింది. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కరవుకాటకాలవల్ల వంద కోటక్లు పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగం భారీగా నష్టపోయింది. 2006- 2016 మధ్య కాలంలో 80 శాతం సాగును కరవు కాటేసింది. ప్రకృతి విపత్తులు, కరవు-కాటకాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ప్రజల ఆహార భద్రతకు సమస్యగా పరిణమించి, వలసలకు దారితీశాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఇతర సహజవనరులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురి పరిస్థితి జీవన్మరణ సమస్యగా మారడానికి భూతాపం, వాతావరణ మార్పులే కారణమన్నది చేదు నిజం.

ఉద్గారాల తగ్గింపుతో ఉపశమనం
భూతాపం భవిష్యత్తులోనూ ఇదేరీతిలో కొనసాగినట్లయితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయి. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటి సదుపాయం సైతం కరవైపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితితో పోలిస్తే 2050 నాటికల్లా ఆకలి బాధతో అలమటించిపోయే వారు 20 శాతం వరకూ పెరిగే ప్రమాదం ఉంది. వచ్చే దశాబ్దకాలంలో వాతావరణ మార్పులతో దాదాపు కోటికి పైగా ప్రజలు నిరాశ్రయులవుతారని, ప్రపంచం చూసే అతి పెద్ద శరణార్థుల సంక్షోభం ఇదే అవుతుందని అంచనా. భూఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంవల్ల వాతావరణ సమతుల్యత లోపిస్తుంది. రుతుపవనాల వ్యవస్థ, వర్షపాతంలో స్థిరత్వం దెబ్బతిని అనూహ్య పరిస్థితులు తలెత్తుతాయి. ఆకస్మికంగా కుంభవృష్టి కురిసి, నదులు పొంగిపొర్లి జనజీవనం అతలాకుతలమవుతుంది. లేదంటే అనావృష్టితో కరవు-కాటకాలు సంభవిస్తాయి. వాతావరణ మార్పులు-భూతాపాన్ని కట్టడి చేయాలంటే పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు నిబద్ధతతో కృషి చేయాలి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే ప్రకృతి విపత్తులను అరికట్టాలి. వాతావరణ మార్పులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. అత్యాధునిక పరిశోధనలకు నిధులు కేటాయించాలి. తద్వారా కరవు-వరదల వంటి పరిస్థితులను ఎదుర్కోవచ్ఛు కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యలను చేపట్టడం, వర్షపునీటిని వృథా చేయకుండా చెరువులు, కుంటల్లోకి మళ్ళించడం ద్వారా సాగునీటిి, తాగునీటి ఇబ్బందిని అధిగమించవచ్ఛు భూతాపాన్ని కట్టడి చేయడం వల్ల దేశంలో అత్యధిక శాతం ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగమూ గాడిన పడుతుంది!


Posted on 27-09-2019